‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రంలో అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే
మహిళలకు మానవజాతి ప్రణమిల్లవలసిన కారణాల్లో ప్రధానమైనది మానవ మనుగడ కోసం ఆమె రక్తాన్ని స్రవించడం! రుతుస్రావం వల్ల ప్రతినెలా ఆమె రక్తాన్ని కోల్పోతుంటుంది. కొంత మందిలో ఆ కోల్పోవడం పరిమితికి మించి ఉంటుంది. అప్పుడు వారు పడే అవస్థ అంతా ఇంతా కాదు. ‘ప్యాడ్‌మాన్’ సినిమా ట్రైలర్‌లో అక్షయ్ కుమార్ ఒక మాట అంటాడు. ‘ఇదే పరిస్థితి మగాళ్లకు ఉంటే చచ్చిపోతారు’ అని! ఆలోచిస్తే నిజమేననిపిస్తుంది. గర్భాశయం లోపల ఎండోమెట్రియమ్ అనే పొర ఉంటుంది. ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రుతుచక్రంలో ఈ ఎండోమెట్రియమ్ పొర అనేక మార్పులకు లోనవుతుంది. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడం వల్ల అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి పద్నాలుగు రోజులు వృద్ధి చెందుతూ ఉంటుంది. పదిహేనవ రోజు నుంచి విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల పొర మరింత వృద్ధి చెందుతుంది. దానికి సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మహిళలోని అండం, పురుష శుక్రకణంతో కలిసి పిండంగా మారనంత వరకు ప్రతి నెలా.. పద్నాల్గవ రోజు తర్వాత ప్రోజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే రుతుస్రావం.
అధికంగా ఎందుకవుతుంది?
మహిళల్లో ఆక్సిజన్ తగ్గినప్పుడు వారి ఒంట్లో హెచ్‌ఐఎఫ్–1 (హైపాక్సియా ఇండ్యూసిబుల్ ఫ్యాక్టర్–1) అనే ప్రొటీన్ తయారవుతుంది. ఇది గర్భాశయంలోని పొర ఊడిపోయాక అయ్యే గాయాన్ని త్వరగా మానేలా చేస్తుంది. కొన్ని కారణాల వల్ల కొందరు మహిళల్లో ఈ హెచ్‌ఐఎఫ్–1 చాలా తక్కువగా తయారవుతుంది. అలాంటివాళ్ల లోనే రుతుస్రావం సమయంలో చాలా ఎక్కువగా రక్తం పోతుంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయింది. ఈ హెచ్‌ఐఎఫ్–1ను ఎక్కువగా తయారయ్యేలా చేస్తే... ఆటోమేటిగ్గా రక్తం పోవడం కూడా తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు! రుతు సమయంలో ఎక్కువ రక్తం కోల్పోయే మహిళలు మిగతా వారిలా ఆ రోజుల్లో స్వేచ్ఛగా బయటకు రావాలంటే బిడియపడుతుంటారు. పదిమంది దృష్టిలో పడతామేమోనంటూ ఆందోళనగా ఉంటారు. ఇప్పుడిక వారి దేహంలో హెచ్‌ఐఎఫ్–1 ప్రొటీన్‌ను ఎక్కువ స్రవించేలా చేయడం ద్వారా వారి ఆందోళనను దూరం చేయవచ్చునని భావిస్తున్నారు. దీని నిర్ధా్థరణకు ప్రయోగాలు కూడా మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment