ఉపరాష్ట్రపతి వెంకయ్య నుంచి అవార్డు అందుకుంటున్న నాగ్ అశ్విన్, అక్షయ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: సినిమాల్లో అశ్లీలత, అసభ్యత, హింసకు తావివ్వరాదని, ప్రజలపై సినిమా చూపే ప్రభావాన్ని దర్శక నిర్మాతలు తెలుసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్రరంగానికి పిలుపునిచ్చారు. 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఉపరాష్ట్రపతి సోమవారం ఇక్కడ ప్రదానం చేసి ప్రసంగించారు. ‘సినిమా శక్తిమంతమైన మాధ్యమం. సామాజిక మార్పునకు సాధనంగా వినియోగించాలి.
ముఖ్యంగా యువత మనసుపై సినిమా ప్రభావం చూపుతుంది. అందువల్ల విలువలను పెంచేదిగా సినిమా ఉండాలి’ అని పేర్కొన్నారు. ‘మహిళలపై అత్యాచారం, హింస ప్రబలుతోంది. ఈ ధోరణిని ఎదుర్కోవడానికి సామాజిక సందేశం సినిమాల ద్వారా ప్రజలకు చేరాలి’ అని పిలుపునిచ్చారు. మన సినిమాలు భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పా లని సందేశం ఇస్తూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఇతర సామాజిక అంశాల కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన హిందీ చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’కుగాను అక్షయ్‌కుమార్ అవార్డును స్వీకరించారు.
అవార్డులు అందుకున్న తెలుగు సినీ ప్రముఖులు..
మహానటి చిత్రంలో అత్యుత్తమ అభినయానికి కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కింద ఆమె రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’ ఎంపికైనందుకు ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పురస్కారాన్ని అందుకున్నారు. రూ. లక్ష నగదు పురస్కారాన్ని ఈ అవార్డుతోపాటు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుకు ‘చి.ల.సౌ’ చిత్రం ఎంపికైనందున చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రజత కమలం, రూ. 50 వేల పురస్కారం అందుకున్నారు. ఉత్తమ ఆడియోగ్రఫీ అవార్డు రంగస్థలం చిత్రానికిగాను ఎం.ఆర్.రాజాకృష్ణన్ అందుకున్నారు.
ఈ అవార్డుతోపాటు ఆయన రజత కమలం, రూ. 50 వేల నగదు పురస్కారం అందుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును మహానటి చిత్రానికిగాను ఇంద్రాణీ పట్నాయక్, గౌరవ్‌షా, అర్చనా రావ్ అందుకున్నారు. ఈ పురస్కారంతోపాటు రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ‘అ’ చిత్ర మేకప్ ఆర్టిస్ట్ రంజిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు స్వీకరించారు. రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ‘అ’ చిత్రానికిగాను సృష్టి క్రియేటివ్ స్టూడియో, యునిఫై మీడియా స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం కింద రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment