‘‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక పాత్ర చేయమని నన్ను కోరారు నాగ్ అశ్విన్. అయితే ఆ పాత్ర నాకు అంత ఆసక్తిగా అనిపించలేదు.. అందుకే సున్నితంగా తిరస్కరించాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేష్ అన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) వేడుకల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి పాల్గొన్నారు కీర్తీ సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో నన్ను అడిగిన పాత్రను నేను తిరస్కరించినప్పటికీ నాగ్ అశ్విన్ ఏదో ఒక రకంగా ఆ సినిమాలో నన్ను భాగస్వామ్యం చేస్తాడని నమ్మాను. నేను అనుకున్నట్లుగానే బుజ్జి పాత్రకు (ప్రభాస్ వాడిన కారు పేరు) నాతో డబ్బింగ్ చెప్పించాడు.
బుజ్జికి వాయిస్ ఓవర్ చెప్పడం వల్ల ప్రేక్షకులకు ఎలా చేరువ అవుతావు? అని కొందరు నన్ను ప్రశ్నించారు. కానీ, చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావించి, నాగి అశ్విన్ అడిగిన వెంటనే ఓకే చెప్పాను. సినిమా విడుదల తర్వాత చాలా మంది.. ‘బుజ్జి కారుకు నీ డబ్బింగ్ ప్లస్ అయింది’ అని నాతో అనడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు.
ఇదిలా ఉంటే... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘మహానటి’ (2018). సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో సావిత్రిగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కీర్తి. ఈ సినిమాకి జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తీ సురేష్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక కీర్తి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.... తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ని డిసెంబరులో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారామె.
Comments
Please login to add a commentAdd a comment