ఆయుర్వేద కౌన్సెలింగ్
మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. చాలా సన్నగా, బక్కగా ఉంటుంది. ఇంకా పెద్దమనిషి కాలేదు (రుతుస్రావం రాలేదు). పొడవు ఐదు అడుగుల మూడు అంగుళాలు. బరువు 41 కిలోలు మాత్రమే. ఆమె విషయంలో వాడాల్సిన ఆయుర్వేద మందులు, ఆహారం సూచించండి.
- అరుంధతి, కాజీపేట
ఆడపిల్లలు ఏ వయసులో రజస్వల అవుతారన్నది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రాథమికంగా, స్త్రీలకు ఉండాల్సిన ప్రత్యేక బాహ్య, అభ్యంతర జననాంగాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేక నిర్మాణ లోపాలున్నాయా అని నిర్ధారించుకోవాలి. ఈ వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడు ఇతర అంశాలను గురించి విశ్లేషించాలి. తల్లి, అమ్మమ్మల రుతుక్రమ చర్యలు, రజస్వల అయిన వయసులు కూడా పరిగణనలోకి వస్తాయి. రజస్వలావస్థ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. పెరుగుతున్న వయసులో కావాల్సిన ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెర, విటమిన్లు, ఖనిజలవణాలు ఒక రీతిలో క్రమబద్ధంగా శరీరానికి లభించడం లేదు. కాబట్టి ఈ కింద పేర్కొన్న ఆహార విహారాలను పాటిస్తూ, సూచించిన మందులు వాడుతూ రెండు నెలలు వేచి చూడండి. ఫలితం రావడానికి అవకాశాలు ఎక్కువ. ఆ తర్వాత పరీస్థితిని సమీక్షించుకోవచ్చు.
ఆహారం : పూర్తిగా నిషేధించాల్సినవి : ఐస్‌క్రీములు, చాక్లెట్లు, శీతల పానీయాలు, పిజ్జాలు, ఫాస్ట్‌ఫుడ్స్, నిల్వ చేసి అమ్మే డబ్బాలలోని తినుబండారాలు, కల్తీ సరుకులతో చేసిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా బయట బజారులో తయారు చేసి అమ్మే పదార్థాలు పూర్తిగా నిషేధించండి. ఉప్పు, కారం, నూనె పదార్థాలను 90 శాతం వదిలేయండి. కేవలం 10 శాతం మాత్రమే తినండి.
తినాల్సినవి : ప్రతిరోజూ ఆకుకూరలు, పప్పు, శాకాహారం, పచ్చికొబ్బరి, మొలకెత్తే తృణధాన్యాలు, ముడిబియ్యపు అన్నం, గోధుమరొట్టెలు పండ్లరసాలు, కొబ్బరినీళ్లు, స్వచ్ఛమైన చెరుకురసం, మజ్జిగ, బార్లీ జావలు తీసుకోవాలి తాజా ఫలాలు, శుష్కఫలాలు విధిగా ప్రతినిత్యం తినాలి ఆకుకూరలు ప్రతిరోజూ వండుకొని తినాలి పొట్టుతీయని మినపపప్పు, పెసరపప్పు, కందిపప్పు వంటకాల్లో వాడాలి. గారెలు, పెరుగు గారెలు, మినపసున్ని, పచ్చిఖర్జూరంతో చేసిన నవ్వుల ఉండలు, వేరుశనగ పలుకు ఉండలు, తేనెతో చేసిన పాయసం తినాలి. ఆవునెయ్యి, ఆవువెన్న, ఆవుపెరుగు, ఆవుమజ్జిగ, నువ్వుల నూనె విధిగా ఉపయోగించండి.
విహారం : రోజూ తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం, పదినిమిషాలు ప్రాణాయామం చేయాలి. మందులు : పునర్నవాది మండూర (మాత్రలు) : ఉదయం 1 రాత్రి 1 శతావరీ కల్ప (గ్రాన్యూల్స్) : రెండు పూటలా ఒక్కొక్క చెంచా పాలతో. కూష్మాండ లేహ్యం : రెండు పూటలా ఒక్కొక్క చెంచా చప్పరించాలి. కుమార్యాసవ (ద్రావకం) : మూడు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి, రెండుపూటలా తాగాలి.
గమనిక : లభిస్తే ఉసిరికాయ (ఆమలకీ) రసం రోజూ ఒక చెంచా తేనెతో సేవించాలి.
- డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
ఇంకా పెద్దమనిషి కాలేదు
Published Fri, Sep 16 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
Advertisement
Advertisement