Ayurvedic counseling
-
గుండెజబ్బుల నివారణకోసం...
ఆయుర్వేద కౌన్సెలింగ్ ఆయుర్వేద మార్గంలో గుండె జబ్బుల నివారణ ఎలాగో సూచించగలరు. - సంకా పవన్‌కుమార్, తెనాలి ఆయుర్వేద శాస్త్ర ప్రాథమిక సిద్ధాంతాలలో శరీర నిర్మాణం, శరీర క్రియ అత్యంత ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వివిధ అంగప్రత్యంగాలను విశదీకరించడంలో సుశ్రుతాచార్యులు అగ్రగామి. హృదయం ఆకారాన్ని ‘అధోముఖపుండరీకం’ (తామరపువ్వుని తలకిందులుగా చేస్తే కనపడే రూపం)తో పోల్చిచెప్పాడు. సంస్కృత శబ్ద నిరుక్తుల విశిష్టత ప్రకారం ‘హృ’ అంటే పుచ్చుకునేది (రక్తాన్ని) ‘ద’ అంటే ఇచ్చేది (రక్తాసరఫరా), ‘య’ అంటే నిలిపేది (రక్తాగారం). ఆ విధంగా ఆ భాగం క్రియావిశేషం ద్యోతకమవుతోంది. ఆయుర్వేద పరిభాషలో ‘మర్మ’ అంటే అత్యంత కీలకమైన ప్రాంతం అని అర్థం. చరకాచార్యులవారు ‘త్రిమర్మలు’ వివరించారు. అవి ‘శిరస్సు, హృదయం, వస్తి’ (మూత్రాశయం). ఆ విధంగా గుండెకు ఎంతో ప్రాధాన్యముంది. గుండెకండరం పోషణ కోసం రక్తం కావాలి. అది, గుండె సంకోచించినప్పుడు, మొదటి శాఖ అయిన ‘కరొనరీ’ ధమని ద్వారా చేరవలసిందే. గుండె పొరలు, కవాటాలు, నాడులు, సిరాధమనుల కార్యక్రమం చక్కగా ఉండటానికి ‘రస’ధాతువు ఉపకరిస్తుంది. దీని ద్వారా పోషకాలు, అంబరపీయూషం (ఆక్సిజన్) అందుతాయి. అలాంటి సరధాతువు ‘సారం’ మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. గుండెజబ్బుల నివారణకు ఈ కింద సూచించిన ఆహార, విహారాలు, ఔషధాలు అత్యంత ప్రధానమైనవి. ఆహారం : సాత్వికాహారమైన శాకాహారం మంచిది. ఉప్పు, పులుపు, కారాలు చాలా మితంగా తినాలి. తగినంత ద్రవాహారం (కొబ్బరినీళ్లు, చెరకురసం, బార్లీ జావ మొదలైనవి) సేవించాలి. మొలకలు, ఆకుకూరలు, ఇతర కందమూలాలు, తాజాపండ్లు, శుష్కఫలాలు అనునిత్యం తగుప్రమాణంలో తినాలి. అప్పుడే సమీకృత పోషకాలు లభిస్తాయి. పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, మజ్జిగలు ‘ఆవు’ నుంచి లభించేవి చాలా బలకరం. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే బయటి పదార్థాల జోలికి వెళ్లకండి. విహారం : రాత్రి నిద్ర కనీసం ఎనిమిది గంటలుండాలి. వయసు, వృత్తిని బట్టి తగురీతిని వ్యాయామం చేయాలి. పొగతాగడం, మద్యపానాల వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మానసిక ఉల్లాసం, ప్రశాంతత, సానుకూల ఆశావహ దృక్పథం చాలా అవసరం. శోక చింతా భయ రాగ ద్వేషాలకు దూరంగా ఉండాలి. ఔషధాలు : నిత్య దైనందిన కార్యక్రమాలలో భాగంగా సూర్యదర్శనం చేసుకోవాలి. లేత సూర్యకిరణాల వల్ల మనకెంతో ఆరోగ్యమని శాస్త్రం చెప్పింది. రోజూ ఐదు తులసి ఆకులు నమిలి మింగాలి. దీనికి రక్తం గడ్డకట్టకుండా ఉంచే శక్తి ఉంది. క్రిమిహరం, కఫహరం కూడా. సూర్యనమస్కార యోగ క్రియల వల్ల, వ్యాయామం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అల్లం, వెల్లుల్లి కషాయం : 5 చెంచాలు రోజు విడిచి రోజు తాగితే కొలెస్త్రాల్, ఇతర కొవ్వులు రక్తాన్ని పాడుచేయవు. బీపీ ఎక్కువ కాకుండా నివారితమవుతుంది. త్రిఫలా చూర్ణం : ఒక చెంచా ప్రతి రాత్రి నీటితో సేవిస్తే సప్త ధాతువులకు బలం. మహాకోష్ఠం శుద్ధి అవుతుంది. రోజూ విరేచనం సాఫీగా అవుతుంది. అర్జున (తెల్లమద్ది) వృక్షపు కాండం మీది పట్టను (బెరడు) ఎండబెట్టి, చూర్ణం చేసి, ఒక చెంచా చూర్ణాన్ని ఆవుపాలలో మరిగించి, వడగట్టి ప్రతిరోజూ తాగితే గుండె ధమనుల్లో రక్తప్రసరణ బహుచక్కగా ఉండి, గుండె కండరానికి బలం పెంపొంది గుండెజబ్బులు దరిచేరవు. దీన్ని ‘అర్జున క్షీరపాకం’ అంటారు. అత్యవసర పరిస్థితి లేనప్పుడు స్టెంట్స్ వేయించుకున్న వారు దీన్ని ఆరుమాసాలు సేవించి, పరిస్థితిని సమీక్షించుకుంటే చక్కటి మార్పు కనిపిస్తుంది. పుష్కర మూల చూర్ణాన్ని (ఒక చెంచా) నీళ్లతో సేవిస్తే దాదాపు పైన చెప్పిన ఫలితం కనిపిస్తుంది. ఇతర ఔషధాలు : హృదయార్ణవరస (మాత్రలు) నాగార్జునాభ్రరస (మాత్రలు) ప్రభాకరవటి (మాత్రలు) గమనిక : ఈ మందుల గురించి ఆయుర్వేద వైద్యుని సంప్రదించాకే వాడాలి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
వానల్లో ఆరోగ్యం కోసం...
ఆయుర్వేద కౌన్సెలింగ్ వానాకాలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. అంతా తేమ, జలమయం. సూర్యకాంతి కనబడటం లేదు. ఇలాంటప్పుడు పెద్దలుగానీ, పిల్లలుగానీ రోగాల బారిన పడకుండా ఉండటంతో తీసుకోవాల్సిన నివారణలతో పాటు... అవి తగ్గడానికి ఆయుర్వేద చికిత్స సూచించప్రార్థన. - అయలసోమయాజుల మీనాక్షి, బీహెచ్ఈఎల్, హైదరాబాద్ శ్రావణ భాద్రపద మాసాలు వర్షరుతువులోకి వస్తాయి. దీన్నే మనం వానాకాలం అంటాం. వర్షాలు అధికంగా కురుస్తున్నప్పుడు వాతావరణంలో తేమ ఎక్కువవుతంది. ఇంటాబయటా తడితడిగా ఉంటుంది. వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో కూడిన వ్యాధులు ప్రబలుతుంటాయి. వీటికి కారణం అసాత్మ్యత (అలర్జీ), సూక్ష్మజీవులు (ఇన్ఫెక్షన్లు). వీటి నివారణ, చికిత్స కోసం ఈ కింది జాగ్రత్తలు పాటించండి. శుచి, శుద్ధి : ఇంటిలోపల, ఇంటిముందు రోజుకు రెండుసార్లు గుగ్గిలం ధూపం వేయండి. బయట అమ్మే ఆహార పదార్థాలు, ఇతర తినుబండారాలు తినవద్దు. ఇంట్లో తయారు చేసుకున్న తాజా ఆహారపదార్థాలను వేడివేడిగా తినండి. నూనె వంటకాలు, కారం ఎక్కువగా ఉండే టిఫిన్లు తినవద్దు. మరిగించి చల్లార్చిన నీటిని తాగండి. అల్లం, కరివేపాకు వేసిన పలుచని మజ్జిగ, శొంఠితో తయారు చేసిన ‘టీ’ తాగండి. బాగా ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి. అంతటా పరిశుభ్రత ముఖ్యం. బయట వర్షంతో తడిసిన బట్టల్ని వేరే పెట్టి, ఇంటికి రాగానే వేడినీటితో స్నానం చేయడం అవసరం. అల్లం, వెల్లుల్లి ఐదేసి గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం ఒక చెంచా (5 గ్రాములు), పసుపు ఐదు చిటికెలు వేసి పావు లీటరు నీళ్లు కలిపి ‘కషాయం’ కాచుకోండి. మూడువంతులు ఇగరగొట్టి, ఒక వంతు మిగలాలి. రెండుపూటలా ఈ కషాయం... గోరువెచ్చగా తాగండి. మోతాదు : పెద్దలకు 5 చెంచాలు; పిల్లలకు రెండు చెంచాలు (అవసరమైతే తేనె కలుపుకోవచ్చు). ఇది ప్రతిరోజూ రెండు వారాలపాటు సేవించినా పరవాలేదు. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసాల నివారణకూ పనికి వస్తుంది. చికిత్సగానూ పని చేస్తుంది. జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. రోగనిరోధకశక్తిని ఉత్తేజపరుస్తుంది. వామును నూనె లేకుండా పొడిగా కొద్దిగా వేయించి, నీళ్లు పోసి మరిగిస్తే దాన్ని ‘వాము’ కషాయం అంటారు. మోతాదు : 5 చెంచాలు... రెండుపూటలా సేవిస్తే అజీర్ణం దూరమవుతుంది. నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి. శొంఠి చూర్ణం రెండు గ్రాములు, మిరియాల చూర్ణం ఒక గ్రాము కలిపి తేనెతో రెండుపూటలా సేవిస్తే కఫంతో కూడిన దగ్గు, ఆయాసం తగ్గుతాయి. పేలాలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఐదేసి చెంచాల చొప్పున మూడుపూటలా తాగితే వాంతి, వికారం తగ్గుతాయి. ఏలకుల పొడి (మూడు చిటికెలు) ప్లస్ జీలకర్రపొడి (ఒకగ్రాము) కలిపి తేనెతో రెండు పూటలా సేవిస్తే వాంతులు తగ్గుతాయి. శొంఠి, ఇంగువ, జీలకర్ర వేసిన పలుచని మజ్జిగను రెండుపూటలా సేవిస్తే కడుపునొప్పి దూరమవుతుంది. అజీర్ణం ఉండదు. పొట్టలో వాయువు తగ్గి, రోజూ అయ్యే విరేచనం సాఫీగా అవుతుంది. వ్యాయామం : ఇంటిపట్టున ఉన్నప్పటికీ, అన్ని వయసుల వారూ ఇంట్లోనే ఒక అరగంట తేలికపాటి వ్యాయామం విధిగా చేస్తే, శరీరం తేలిక పడి, కీళ్లు-కండరాల నొప్పులు దరిచేరవు. బజారులో లభించే ఔషధం : అరవిందాసవతోపాటు పిప్పల్యాసవ ద్రావకాలను, వానాకాలంలో ఇంట్లో ఉంచుకోవాలి. ఒక్కొక్కటి రెండేసి చెంచాలు, కొద్దిగా నీళ్లలో కలుపుకొని రెండుపూటలా వానాకాలమంతా సేవిస్తే చాలా వ్యాధులు దరిచేరవు. వంటింట్లో ఉండే ఈ పదార్థాలతోనే వానల వల్ల వచ్చే ఆరోగ్య సంబంధిత అనర్థాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు,సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
ఇంకా పెద్దమనిషి కాలేదు
ఆయుర్వేద కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. చాలా సన్నగా, బక్కగా ఉంటుంది. ఇంకా పెద్దమనిషి కాలేదు (రుతుస్రావం రాలేదు). పొడవు ఐదు అడుగుల మూడు అంగుళాలు. బరువు 41 కిలోలు మాత్రమే. ఆమె విషయంలో వాడాల్సిన ఆయుర్వేద మందులు, ఆహారం సూచించండి. - అరుంధతి, కాజీపేట ఆడపిల్లలు ఏ వయసులో రజస్వల అవుతారన్నది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రాథమికంగా, స్త్రీలకు ఉండాల్సిన ప్రత్యేక బాహ్య, అభ్యంతర జననాంగాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేక నిర్మాణ లోపాలున్నాయా అని నిర్ధారించుకోవాలి. ఈ వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడు ఇతర అంశాలను గురించి విశ్లేషించాలి. తల్లి, అమ్మమ్మల రుతుక్రమ చర్యలు, రజస్వల అయిన వయసులు కూడా పరిగణనలోకి వస్తాయి. రజస్వలావస్థ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. పెరుగుతున్న వయసులో కావాల్సిన ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెర, విటమిన్లు, ఖనిజలవణాలు ఒక రీతిలో క్రమబద్ధంగా శరీరానికి లభించడం లేదు. కాబట్టి ఈ కింద పేర్కొన్న ఆహార విహారాలను పాటిస్తూ, సూచించిన మందులు వాడుతూ రెండు నెలలు వేచి చూడండి. ఫలితం రావడానికి అవకాశాలు ఎక్కువ. ఆ తర్వాత పరీస్థితిని సమీక్షించుకోవచ్చు. ఆహారం : పూర్తిగా నిషేధించాల్సినవి : ఐస్‌క్రీములు, చాక్లెట్లు, శీతల పానీయాలు, పిజ్జాలు, ఫాస్ట్ఫుడ్స్, నిల్వ చేసి అమ్మే డబ్బాలలోని తినుబండారాలు, కల్తీ సరుకులతో చేసిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా బయట బజారులో తయారు చేసి అమ్మే పదార్థాలు పూర్తిగా నిషేధించండి. ఉప్పు, కారం, నూనె పదార్థాలను 90 శాతం వదిలేయండి. కేవలం 10 శాతం మాత్రమే తినండి. తినాల్సినవి : ప్రతిరోజూ ఆకుకూరలు, పప్పు, శాకాహారం, పచ్చికొబ్బరి, మొలకెత్తే తృణధాన్యాలు, ముడిబియ్యపు అన్నం, గోధుమరొట్టెలు పండ్లరసాలు, కొబ్బరినీళ్లు, స్వచ్ఛమైన చెరుకురసం, మజ్జిగ, బార్లీ జావలు తీసుకోవాలి తాజా ఫలాలు, శుష్కఫలాలు విధిగా ప్రతినిత్యం తినాలి ఆకుకూరలు ప్రతిరోజూ వండుకొని తినాలి పొట్టుతీయని మినపపప్పు, పెసరపప్పు, కందిపప్పు వంటకాల్లో వాడాలి. గారెలు, పెరుగు గారెలు, మినపసున్ని, పచ్చిఖర్జూరంతో చేసిన నవ్వుల ఉండలు, వేరుశనగ పలుకు ఉండలు, తేనెతో చేసిన పాయసం తినాలి. ఆవునెయ్యి, ఆవువెన్న, ఆవుపెరుగు, ఆవుమజ్జిగ, నువ్వుల నూనె విధిగా ఉపయోగించండి. విహారం : రోజూ తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం, పదినిమిషాలు ప్రాణాయామం చేయాలి. మందులు : పునర్నవాది మండూర (మాత్రలు) : ఉదయం 1 రాత్రి 1 శతావరీ కల్ప (గ్రాన్యూల్స్) : రెండు పూటలా ఒక్కొక్క చెంచా పాలతో. కూష్మాండ లేహ్యం : రెండు పూటలా ఒక్కొక్క చెంచా చప్పరించాలి. కుమార్యాసవ (ద్రావకం) : మూడు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి, రెండుపూటలా తాగాలి. గమనిక : లభిస్తే ఉసిరికాయ (ఆమలకీ) రసం రోజూ ఒక చెంచా తేనెతో సేవించాలి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
ఈ పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ సురక్షితమేనా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 55 ఏళ్లు. ఏడాది కిందట ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి ఒక స్టెంట్ వేశారు. కొన్ని నెలల పాటు బాగానే ఉన్నారు. సాయంత్రాల పూట అలా వాకింగ్‌కు కూడా వెళ్లి వచ్చేవారు. కానీ కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్రమైన ఆయాసానికి గురవుతున్నారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే గుండెకు సంబంధించిన మూడు వాల్వ్స్ లో పూడికలు ఏర్పడ్డాయని, వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు, షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? రిస్కేమైనా ఉంటుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వగలరు. - సురేశ్, హైదరాబాద్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) వస్తే బైపాస్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకటి లేదా రెండు బ్లాక్స్ ఏర్పడితే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్లు వేయవచ్చు. మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే మొదట్లో మీ నాన్నగారికి అలానే వేశారు. అయితే ఈసారి మీ నాన్నగారి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడినట్లు పరీక్షల ద్వారా తేలి ఉండవచ్చు. అందుకే డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని సూచించి ఉంటారు. ఇక మీ సందేహాల విషయానికి వస్తే మీరు మీ నాన్నగారి విషయంలో ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా బైపాస్ సర్జరీ 50 ఏళ్లు దాటిన వాళ్లకి, అది కూడా గుండె స్థితిని బట్టి డాక్టర్లు నిర్వహిస్తుంటారు. ఒకప్పటిలాగా ఇప్పుడు గుండెకు సంబంధించిన ఆపరేషన్ అంటే కలవరడాల్సిన అవసరం లేదు. వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే నిపుణులైన డాక్టర్లు కూడా ఉన్నారు. అందులో భాగంగానే ‘మినిమల్లీ ఇన్వేజివ్’ అనే అత్యాధునిక పద్ధతి ద్వారా ఛాతీ ఎముకలను కట్ చేయకుండానే కేవలం చిన్నకోత ద్వారా గుండె బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించవచ్చు. ఈ పద్ధతిలో వైద్యులు కొన్ని ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించి శస్త్రచికిత్సలను సులువుగా, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సర్జరీ సమయంలో గుండెను బయటకు తీసి దానికి బదులుగా ఒక మెషిన్‌ను కొన్ని గంటల పాటు రక్తం పంపింగ్ కోసం సపోర్టుగా వాడుకుంటారు. వాల్వ్‌లలో ఏర్పడిన పూడికలను తీసివేసిన అనంతరం మళ్లీ గుండెను యధాస్థానంలో విజయవంతంగా అమర్చి ఆపరేషన్‌ను పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా కోత చిన్నగా, రక్తస్రావం తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా పెద్దగా ఉండదు. ఇన్ఫెక్షన్ కూడా సోకదు. 3 - 4 రోజుల్లో పేషెంట్‌ని డిశ్చార్జ్ చేస్తారు. ఇక మీ నాన్నగారి బీపీ, షుగర్ లెవల్స్ విషయానికి వస్తే... సర్జరీకి ముందే డాక్టర్లు అన్ని పరీక్షలను నిర్వహిస్తారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకునే ఆపరేషన్‌కు ఉపక్రమించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా మీ నాన్నగారికి మంచి ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్సను అందించండి. - డాక్టర్ ఆరుముగమ్ సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రోటిక్ సిండ్రోమ్‌కు మందులు చెప్పండి... ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత 20 ఏళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. మందులు వాడతున్నాను. అదుపులో ఉంది. ప్రస్తుతం వారం రోజుల క్రితం జ్వరం వచ్చి మూడు రోజులుగా బాధపడ్డాను. అది తగ్గి ఒళ్లంతా వాపులు, ముఖం ఉబ్బిపోవడం జరిగింది. అన్ని పరీక్షలూ చేసి డాక్టర్లు ‘నెఫ్రోటిక్ సిండ్రోమ్’ అన్నారు. దీన్ని సంపూర్ణంగా పోగొట్టడానికి ఆయుర్వేద చికిత్స తెలపండి. - యు.వి. కృష్ణమూర్తి, బెంగళూరు ఆయుర్వేద పరిభోషలో వాపుని ‘శోథ’ అంటారు. మీకు సర్వాంగశోథ వచ్చింది. మూత్రాపిండాలు ‘నెఫ్రానులు’ అనే అతిన్న పరికరాల సముదాయంతో తయారవుతాయి. ఇవి రక్తాన్ని వడగట్టడం ద్వారా మూత్రాన్ని తయారు చేసి, శరీరానికి అవసరం లేని వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు విసర్జిస్తాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కారణాల వల్ల నెఫ్రానుల్లో గొట్టాలు బలహీనపడి, అతి ముఖ్యమైన, శరీరానికి బలాన్ని సమకూర్చే ప్రోటీన్లను మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. దీనివల్ల ఒళ్లంతా వాపు, రక్తహీనత, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రుగ్మతకు కొన్ని తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, విషాలు, హెవీమెటల్స్, అలర్జీ కలిగించే పదార్థాలు, కొన్ని మందుల దుష్ర్పభావాలు కారణమవుతాయి. ఈ కింద వివరించిన విధంగా ఆహార విహారాలు పాటించి, మందులను క్రమం తప్పకుండా వాడితే ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు, రెండు వారాల పాటు పాటించాల్సినవి... ఆహారం : ఉప్పుని 95 శాతం తగ్గించి, నామమాత్రంగా వేసి, జావలు (బార్లీ జావ, బొంబే రవ్వ జావ మొదలైనవి) తయారు చేసుకొని మూడుపూటలా తాగాలి. కేవలం మెత్తగా చేసిన పెరుగన్నం తినండి. నిమ్మరసం పిండిన మజ్జిగను పుష్కలంగా తాగండి. ఇడ్లీని తేనెతో రోజూ తినండి. పెసరకట్టు, కందికట్టు పలచగా చేసుకొని, పుల్కాలను వాటిలో నానబెట్టి తినండి. ఖర్జూరం తినండి, (డయాబెటిస్, రక్తపోటులను మాత్రం నియంత్రించుకోవాలి). విహారం : పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఇంట్లోనే అటు ఇటు తిరుగుతుండండి. భారీ పనులు చేయవద్దు. తగినంత నిద్ర, మానసిక స్థైర్యం ఉండాలి. మందులు : కోక్షురాది గుగ్గులు (మాత్రలు) ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ( వారం రోజులు); వారం తర్వాత ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 చంద్రప్రభావటి (మాత్రలు) ఉదయం 1, మధ్యాహ్నం 2, రాత్రి 1 (వారం రోజులు); వారం తర్వాత ఉదయం 1, రాత్రి 1 యష్టిమధు (మాత్రలు) ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 (మొదటి వారం); వారం తర్వాత ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 పునర్నవాది మండూర (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 (రెండు వారాలు) వరుణాది క్వాధ (ద్రావకం) : 4 చెంచాలు రెండుపూటలా సమానంగా నీళ్లు కలిపి. రెండు వారాల తర్వాత : యష్టిమధుచూర్ణ 2 గ్రాములు + గోక్షురాది చూర్ణం 3 గ్రాములు - కలిపి ఒక మోతాదుగా తేనెతో తీసుకోవాలి. రోజూ రెండు మోతాదులు మూడు నెలల పాటు వాడండి. రోజూ ఒక ఉసిరికాయ తినండి లేదా ఆమలకీ స్వరసం రెండు చెంచాలు సేవించండి. గమనిక : వ్యాధి కారణాలను గుర్తుంచుకొని జాగ్రత్త వహించండి. బలకరమైన, మూత్రం సాఫీగా వెళ్లడానికి ఉపకరించే ఆహారాన్ని తీసుకోండి. సహజసిద్ధమైన పానీయాలను (మజ్జిగ, నీరు, బార్లీజావ, అప్పుడప్పుడు చెరకురసం, కొబ్బరినీళ్లు సముచితమైన పరిమాణంలో సేవించండి. నెఫ్రానులకు సంబంధించిన గొట్టాలు తిరిగి ప్రాకృతావస్థకు వస్తాయి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
పదే పదే నోటి పూత... తగ్గేదెలా?
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. అతి తరచుగా ‘నోటిపూత’ వస్తోంది. మందులు వాడినా తగ్గడం లేదు. నోట్లో చిన్న చిన్న కురుపుల్లా వస్తున్నాయి. నీళ్లు తాగడం కూడా కష్టంగా ఉంటోంది. ఇది పూర్తిగా నయమవడానికి ఆయుర్వేదం మందులు తెలియజేయగలరు. - భానుమతి, కరీంనగర్ నోటిపూత వ్యాధిని ఆయుర్వేదంలో ‘ఆస్యాపాకం’ అంటారు. ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం, బీ-కాంప్లెక్సు వంటి కొన్ని పోషకపదార్థాలు లోపించడం, నోటిలో స్థానికంగా కలిగే కొన్ని క్రిమిరోగాలు (ఇన్ఫెక్షన్లు), మానసిక ఒత్తిడి వల్ల కలిగే ఆందోళన, భయం, అభద్రతాభావం మొదలైనవి ఆస్యాపాకానికి ప్రధాన కారణాలు. చికిత్స : కారణాన్ని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. దీన్నే ‘నిదాన పరివర్జనం’గా ఆయుర్వేదం చెప్పింది. ఆహారం : తేలికగా జీర్ణమయ్యే లఘ్వాహారం (బార్లీ జావ, గోధుమజావ, మెత్తటి మజ్జిగ అన్నం మొదలైనవి) తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం, మసాలాలు దగ్గరికి రానివ్వకండి. అరటిపండు రోజూ తినండి. గోధుమరొట్టె (పుల్కా)ను పెరుగులో నానబెట్టి మెత్తగా చేసి తినండి, నీళ్లు ఎక్కువగా తాగండి. విహారం : మానసిక ఒత్తిడి లేకుండా ఉండేలా చూసుకోండి. రాత్రివేళ కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. పడుకునే ముందు ఒక గ్లాసెడు పాలు తాగండి. రోజూ తేలికపాటి వ్యాయామం చెయ్యండి. రోజూ రెండుపూటలా ఖాళీ కడుపున పదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ఔషధం : {తిఫలాచూర్ణంతో కషాయం కాచుకుని, చల్లారిన తర్వాత నోటిలో పుక్కిలిపట్టి శుభ్రపరచుకోవాలి (ఉదయం, రాత్రి) లఘుసూతశేఖర రస (మాత్రలు) ఉదయం 2, రాత్రి 2 ఆమలకీ స్వరసం (ఉసిరికాయ రసం) : ఒక చెంచా తేనెతో రెండుపూటలా సేవించాలి. అల్లం, జీలకర్ర కషాయం : 20 మి.గ్రా. రోజూ ఉదయం పరగడపున తాగాలి. గమనిక : ఇవి వ్యాధి తగ్గేవరకు మాత్రమే గాక... ఎంత కాలమైనా సేవించవచ్చు. ఇంకా తగ్గకపోతే... జాజి ఆకు ముద్దను పలుచగా చేసి నోటిలో ఉంచుకొని, అనంతరం, నీటితో శుభ్రం చేసుకోవాలి లేదా చందనం (మంచిగంధం), పచ్చకర్పూరం కలిపి నేతితో నోటిలో పూతగా వాడవచ్చు. ఈ ముద్దను అరచెంచా, రెండుపూటలా కడుపులోకి సేవించవచ్చు. నా వయసు 44. షుగరు, బీపీవ్యాధులు లేవు. మూడునెలలనుండి మూత్రవిసర్జన చేసినప్పడు మంట, మూత్రం కొంచెం కొంచెంగా అవటం, చాలామార్లు రావటం జరుగుతోంది. డాక్టర్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనిచెప్పి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఆయుర్వేదంలో మంచిమందులుంటే చెప్పగలరు. పథ్యం తెలుపగలరు. - రాధాబాయి, తెల్కపల్లి మీరు ద్రపదార్థాలు పుష్కలంగా తాగండి. అంటే బార్లీనీరు, పులుపులేని మజ్జిగ, పుచ్చకాయ రసం మొదలైనవి. ఆహారంలో కారం, పులుపు తాత్కాలికంగా మానేయండి. ఉప్పు బాగా తగ్గించండి. పరిశుభ్రంగా ఉండే చెరుకు రసం తీసుకోండి. ఈ కింది మందులు ఒక నెలరోజులపాటు వాడండి. చంద్రప్రభావటి మాత్రలు ఉదయం 1, రాత్రి 1 గోక్షురాది గుగ్గులు మాత్రలు ఉదయం 1, రాత్రి 1 చందనాసవ ద్రావకం నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలుపుకుని రోజూ రెండుపూటలా తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
నెయ్యి... తినాలా, వద్దా?
ఆయుర్వేద కౌన్సెలింగ్ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నెయ్యి శరీరానికి అవసరమా, కాదా? సేవించవచ్చా, సేవించకూడదా? అవసరమైతే ఏ నేతిని వాడాలి? వివరాలు తెలియజేయండి. - ఎ. కామాక్షి, హైదరాబాద్ మనిషి ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే, పోషకవిలువలు ఉన్న ఆహారం, తగురీతిలో వ్యాయామం అత్యంతావశ్యకం. కాలమాన పరిస్థితుల ఎలా ఉన్నా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి హానికరమైన జీవనశైలికి దాసోహం అనడం సరికాదు. నెయ్యి శరీరానికి చాలా అవసరం. నెయ్యికి సంస్కృతంలో ఇతర పర్యాయ పదాలు... ఘృతం, ఆజ్యం, సర్పిః, హవిః, పవిత్ర మొదలగునవి. ఏ జంతువుకి సబంధించిన నేతికైనా సాధారణ గుణధర్మాలు ఈ కింది విధంగా ఉంటాయి. * సప్తధాతువులకు పుష్టిని కలిగిస్తూ, ఓజస్సును వృద్ధి చేస్తుంది. దేహకాంతి, తేజస్సు, లావణ్యాలను పెంపొందిస్తుంది. కంఠస్వరాన్ని మెరుగుపరుస్తుంది. మేధావర్ధకమై ధారణశక్తిని పెంచుతుంది. ఆయుష్కరం. * స్నిగ్ధం (జిడ్డుగా ఉంటంది), గురువు (ఆలస్యంగా జీర్ణమై, దేహాన్ని బరువెక్కిస్తుంది), స్వల్పంగా ‘అభిష్యంది’కరం (స్రోతస్సులకు అవరోధం కలిగిస్తుంది), కఫకరం, వాతపిత్తహరం. శీతవీర్యం (చలవచేస్తుంది), విషహరం, కళ్లకు మంచిది, రుచిగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది (దీపనం). * ఉన్మాదం వంటి మానసిక వికారాలను తగ్గించడంలో ఉపకరిస్తుంది. ఉదరశూల, జ్వరం, కొన్ని చర్మరోగాలను పోగొడుతుంది. కృమిహరం (ఇన్ఫెక్షన్లను హరిస్తుంది). విశేష గుణాలు : గేదెనెయ్యి, వృష్యం (శుక్రవర్ధకం), కామోత్తేజకం, మేకనెయ్యి దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. గొర్రె నెయ్యి ఎముకలకు పుష్టినిస్తుంది, మూత్ర విసర్జక వ్యవస్థలో రాళ్లు పెరగకుండా చూస్తుంది. * ఇక ఆవునెయ్యి (గోఘృతం) అన్నింటిలోనూ శ్రేష్ఠం. వయస్థాపకం (ముసలితనాన్ని దూరం చేస్తుంది). మంచి పరిమళం ఉంటుంది. రసాయనం (శారీరక మానసిక శక్తివర్ధకం). భావప్రకాశ సంహితలోని శ్లోకం : ‘‘గత్యం ఘృతం... బల్యం, పవిత్ర మాయుష్యం, వయస్థాపకం, రసాయనం ॥ సుగంధం రోచనం చారు సర్వాజ్యేషు గుణాధికం॥‘‘ - పురాణఘృతం (ఒక సంవత్సరం దాటిన నెయ్యి): చాలా వ్యాధులను పోగొడుతుంది. ఉదా: మూర్ఛ, అపస్మారక, ఉన్మాద, తిమిర (కంటి చూపు తగ్గడం), చర్మరోగాలు మొదలైనవి. - నవీన ఘృతం (కొత్త నెయ్యి) : నీరసాన్ని, పాండురోగాన్ని (అనీమియా), నేత్రరోగాలను తగ్గిస్తుంది. - బాలురు, వృద్ధులు, ఆకలి తక్కువగా ఉన్నవారు, అజీర్ణం, మలబంధ వికారాలు కలిగి ఉన్నవారు నెయ్యిని చాలా మితంగా సేవించాలి. గమనిక : నెయ్యి వేడి చేస్తుందనడం అపోహ మాత్రమే. వాస్తవానికి అది చలవచేసి అనేక పిత్త దోష వికారాలను తగ్గిస్తుంది. (ఉదాహరణకు రక్తస్రావం, తలతిరగడం, మంట వంటివి). ఆవు నెయ్యిని ‘మితం’గా ప్రతిరోజూ సేవిస్తూ, తదనుగుణంగా ఏదో రీతిలో ప్రతిరోజూ తగినంత వ్యాయామం చేస్తుంటే, ఎంతో ఆరోగ్యప్రదం. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. దాదాపు ఆర్నెల్ల క్రితం క్రికెట్ ఆడుతుండగా కాలు మడతపడి, మోకాలు వాచింది. విపరీతమైన నొప్పి వస్తోంది. రెండు వారాల తర్వాత నొప్పి తగ్గింది. తర్వాత నేను క్రికెట్ ఆడేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. దాంతో మోకాలిలో తీవ్రమైన వాపు, నొప్పి వచ్చాయి. ఈసారి ఎమ్మారై చేయించాం. అందులో ఏసీఎల్ లిగమెంట్ దెబ్బతినట్లుగా తేలింది. మా డాక్టర్‌గారు శస్త్రచికిత్స అవసరం అన్నారు. కానీ మా బాబాయికి కూడా ఇలాంటి సమస్యే వచ్చిందని చెప్పి, ఆయన సర్జరీ అవసరం లేదన్నారు. దాంతో ఇప్పుడు నేను అయోమయంలో పడిపోయాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - మధుసూదన్, అనకాపల్లి ఆటలు ఆడేవారిలోనూ, బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డవారిలో ఏసీఎల్ లిగమెంట్ దెబ్బతినడం అన్నది చాలా సాధారణంగా జరుగుతుంది. గతంలో దీన్ని కనుగొనడం కూడా అంతగా జరగకపోయేది. కాబట్టి శస్త్రచికిత్స ప్రస్తావనే వచ్చేది కాదు. మీ బాబాయి లాంటి పెద్ద వయసు వారు ఎలాగూ పెద్దగా కదలికలు లేని జీవనశైలి గడుపుతారు కాబట్టి వారికి శస్త్రచికిత్స లేకపోయినా పర్వాలేదు. కానీ మీలాంటి యువకుల్లో శారీరక కదలికలు ఎక్కువ కాబట్టి సమస్య మళ్లీ తిరగబెట్టడం, కొన్నేళ్ల తర్వాత ఆర్థరైటిస్ సమస్య రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. యువకుల్లో ఈ పరిణామం చాలా ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి... మీ వయసులో ఉన్నవారికి ఏసీఎల్ లిగమెంట్ను పునర్నిర్మించే శస్త్రచికిత్స (ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ) అవసరం అని నా సలహా. దీని వల్ల మీరు భవిష్యత్తులోనూ ఇంతే చురుగ్గా ఉండటంతో పాటు మీకు వచ్చేందుకు అవకాశం ఉన్న ఆర్థరైటిస్‌ను నివారించినట్లు అవుతుంది. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మేము ఉన్న ఊరు నుంచి సిటీ కాస్త దూరం. గుండెపోటు వచ్చినప్పుడు పెద్దాసుపత్రులకు వెళ్లేలోపు మాలాంటి వారు ఎలాంటి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. - వి. గురునాథరావు, చౌటుప్పల్ రోగికి గుండెనొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే అతడిచేత ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్-300 మి.గ్రా. మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టిగానీ, పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపిగానీ డిస్ప్రిన్-300 మి.గ్రా. కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర కూడా వేయవచ్చు. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా (శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా) ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్‌కు సమానంగా పనిస్తుంది. అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం. ఆ మాత్రను నీళ్లలో కలిపి తాగించడం వల్ల... వెంటనే ఒంటిలోకి అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్... ఈ రెండూ ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని, నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్‌కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్లు తిరిగి పడిపోతారు. గుండెవేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని ‘సింకోప్ అటాక్’ అంటారు. ఇది గుండెజబ్బుకు సూచన. గుండెదడతో పడిపోయిన వారు మాత్రం రెండు నిమిషాల్లోనే మళ్లీ తేరుకుని, లేచి నడవగలరు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి, అవసరమైన చికిత్స అందించడం మేలు. - డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మజ్జిగ మహా మంచిది!
ఆయుర్వేద కౌన్సెలింగ్ వేసవి తాపాన్ని తట్టుకోడానికి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలంటారు. ముఖ్యంగా మజ్జిగ మంచిదంటారు. ఆవు మజ్జిగ వేడి చేస్తుందంటూ కొందరు అంటున్నారు. ఈ విషయమై మరికొంచెం వివరంగా తెలియజేయప్రార్థన. - దాక్షాయణి, విశాఖపట్నం ‘వేడి, చలవ’ అనే పదప్రయోగాలు వ్యావహారిక భాషకు సంబంధించినవి. ప్రతి పదార్థం జీర్ణమైన తర్వాత ధాతుపరిణామం చెంది, రక్తంతో కలిసి, మన శరీరంపై ప్రభావం చూపుతుంది. అప్పుడు మనకు ‘కళ్లు మండటం, మూత్రంలో మంట, మలబంధం, తలతిరగడం, అజీర్ణం, పొడిదగ్గు, గొంతునొప్పి, నీరసం, కాళ్లు లాగడం, జ్వరం వచ్చినట్లుగా ఉండటం...’ వంటి లక్షణాలు కనిపిస్తే... వేడి చేసిందనీ, అలా కాకుండా వ్యతిరేక లక్షణాలు ఉంటే చలవ చేసిందనీ, అతిగా చలవ చేయడం కూడా మంచిది కాదని అంటూ ఉంటాం. ఈ సందర్భంలో... ఆయుర్వేదం... ‘ఉష్ణవీర్య, శీతవీర్య’ అనే పరిభాషను వాడింది. వాటి ప్రభావ ప్రయోజనాలను వివరించింది. పాలు (క్షీరం) : దాదాపు అన్ని జంతువుల పాలూ శీతవీర్యమే. ఒక్క గుర్రం, గొర్రె పాలు మాత్రం ఉష్ణవీర్యం. మజ్జిగ (తక్రం) : అన్ని రకాల మజ్జిగలూ ఉష్ణవీర్యమే. ఇక్కడ వేడైనా, చలవైనా... ప్రాకృతస్థాయిలో ఉంటే మంచిదే. అధిక స్థాయిలో ఉంటేనే వ్యాధి కారకం. అన్ని రకాల మజ్జిగల కంటే (లభిస్తే) ఆవుమజ్జిగ శ్రేష్ఠమని శాస్త్రం చెబుతోంది. మజ్జిగను పెరుగు నుంచి తయారు చేస్తాం కదా! పెరుగు (దధి) : రుచిని బట్టి పెరుగు ఐదు రకాలు. పూర్తిగా తోడుకునే ముందు కొంచెం చప్పగా, తియ్యగా ఉంటే ‘మందం’. చక్కగా తోడుకుని తియ్యగా ఉంటే ‘స్వాదు’. కొంచెం పులుపు కూడా తోడైతే ‘స్వాద్యమ్లం’. పులుపు మాత్రమే ఉంటే ‘అమ్లం’. పులుపు అధికంగా ఉంటే ‘అత్యమ్లం’. ఈ రసాన్ని (రుచిని) బట్టి దాని గుణకర్మలలో తేడా ఉంటుంది. మజ్జిగను చేసే విధానాన్ని బట్టి ఐదు రకాలు : 1. నీరు కలపకుండా మీగడతో బాటే పెరుగుని చిలికితే ‘ఘోల’ అంటారు. 2. మీగడ తొలగించి, నీరు కలపకుండా పెరుగుని చిలికితే ‘మథివ’ అంటారు. 3. మీగడ పెరుగుకు నాల్గవ వంతు పరిమాణంలో నీరు కలపి చిలికితే ‘తక్రం’ అంటారు. 4. మీగడ పెరుగుకు సగభాగం నీరు కలిపి చిలికితే ‘ఉదశ్విత్’అంటారు. 5. మీగడ పెరుగుకు సమానభాగం నీరు కలిపి చిలికితే ‘చఛికా’ అంటారు. ఈ ఐదు రకాల మజ్జిగలనూ ‘తక్రం’ అనే పేరుతోనే వ్యవహరిస్తుంది ఆయుర్వేదం. బాగా ‘వెన్న’తీసిన తక్రం శరీరానికి చాలా మంచిది. పులుపు లేని మజ్జిగ ఏ రకమైనా (ఉదశ్విత్, చచ్ఛికా మొదలైనవి) శరీరానికి చలవ చేస్తుంది. అగ్నిదీప్తిని చేసి దేహాన్ని తేలికపరుస్తుంది. బలకరం, వాతహరం, కఫహరం. చక్కటి మజ్జిగ మధురరస ప్రధానంగా, కించిత్ అమ్లరస (పులుపు), కషాయరస అనుబంధంగా ఉంటుంది. కొద్దిపాటి వెన్న కలిగిన తక్రం శుక్రకరం, పుష్టికరం. కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగలో శుంఠి, సైంధవలవణం కలిపితే వాతహరం. పటికబెల్లం (మిశ్రీ) కల్పిన తియ్యని మజ్జిగ పిత్తహరం. పిప్పళ్లు, మిరియాలు కలిపితే కఫహరం. వేసవిలో మనం తాగే మజ్జిగలో ఇంగువ, జీలకర్ర, సైంధవలవణం కలుపుకుంటే పొట్టలోని వాయువులు తగ్గి, ఆకలి పెరిగి, బలం కలిగి, విరేచనాలయ్యే ప్రమాదం ఉండదు. రక్తాన్ని పెంచుతుంది. తృష్ణ (దప్పిక) తొలగిపోతుంది. కరివేపాకు, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. (భావప్రకాశ) శ్లోకం : ఆవు పెరుగు/మజ్జిగ గుణాలు : ‘‘గవ్యం దధి విశేషేణ స్వాద్యమ్లంచ రుచి ప్రదం పవిత్రం దీపనం హృద్యం, పుష్టికృత్ పవనాపహం ॥ ఉక్తం దధ్నామ శేషారిశాం మధ్యే గవ్యం గుణాధికం అరుచౌ స్రోతోసాం రోధే తక్రం స్వాదమృతోపమమ్ ॥ డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అంటే ఏమిటి? ఇది రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు చెప్పండి. - రవి, నిడదవోలు శరీరంలోని ప్రతి అవయవానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్ సరఫరా అన్ని కణాలకూ జరుగుతుంది. అన్ని అవయవాలకు అందినట్టే కరొనరీ ఆర్టరీ అనే రక్తనాళాల ద్వారా గుండెకు రక్తం అందుతుంది. వీటిల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరాలకు రక్తం సరిగా సరఫరా కాదు. దాంతో కండరాలు బలహీనమైపోయి గుండె స్పందనలు కష్టమవుతాయి. గుండె తాలూకు రక్తనాళాలైన కరొనరీ ఆర్టరీలు పూడుకుపోయి, తద్వారా గుండెకు రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అంటారు. గుండె రక్తనాళాల్లో కొవ్వును ప్లేక్స్ అంటారు. ఈ ప్లేక్స్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాలతో పెద్దగా ఏర్పడి సన్నటి క్యాప్ కప్పినట్లు పెరుగుతాయి. వాటి ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50 శాతం కన్నా ఎక్కువగా పేరుకుపోతే, అలా తగ్గిన ప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అలా వచ్చే గుండె జబ్బులను కరొనరీ ఆర్టరీ డిసీజెస్‌గా చెబుతారు. మామూలు వ్యక్తుల కన్నా పొగతాగే వాళ్లలో ఎక్కువ. కొలెస్రాల్ట్ పెరగడం కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలు ఉంటాయి. అవి... 1) వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్ పెరగడం 2) ఆహారం ద్వారా రక్తంలో కొవ్వులు పెరగడం. చిన్న వయసులో కొన్ని జీన్స్ దెబ్బతినడం వల్ల వంశపారంపర్యంగా కొవ్వులు పెరగడం జరగవచ్చు. దాంతో కరొనరీ హార్ట్ డిసీజెస్ చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. ఇక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం (ఫ్యాట్స్) తీసుకోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. అధికబరువు, డయాబెటిస్, హైబీపీ వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లలో రక్తనాళాలు మూసుకుపోయే రిస్క్ ఎక్కువ. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్కు పెరుగుతుంది. అందుకే వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు పాటు వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ వంటి వ్యాయామమైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకున్నా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. బాగా స్ట్రాంగ్‌గా ఉండే కాఫీలు కూడా గుండెకు అంత మంచిది కాదు. జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయామంతో ఈ కరొనరీ హార్ట్ డిసీజెస్‌ను చాలావరకు నివారించుకోవచ్చు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
కురుపులు తగ్గినా బాధించే నొప్పి!
ఆయుర్వేద కౌన్సెలింగ్ పచ్చకామెర్లకు ఆయుర్వేదంలో చికిత్స, నివారణ వివరించండి. - పద్మజాలక్ష్మి, సికింద్రాబాద్ ఈ వ్యాధిని ఆయుర్వేదశాస్త్రకారులు ‘కామలా’ అని వివరించారు. ఆధునికంగా ‘జాండిస్ లేక ఇక్టెరస్’ అంటారు. లక్షణాలు: కళ్లు, మూత్రం పసుపుపచ్చగా ఉంటాయి. వ్యాధి ముదురుతున్న కొద్దీ గోళ్లు, చర్మం, ముఖం పసుపుపచ్చగా మారతాయి. ఆకలి సన్నగిల్లడం, అరుచి, మందజ్వరం, వాంతి, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. దీనిని ‘కోష్ఠాశ్రీతకామలా’ అని చెప్పారు. దీనికి తోడు పొట్ట ఉబ్బరించినట్లయితే ‘కుంభకామలా’ అని పేర్కొంటారు. మలం తెలుపునలుపు మిశ్రమవర్ణంలో, అంటే పిండిలా ఉండి, కామలా లక్షణాలు తీవ్రంగా ఉంటే దానిని ‘శాఖాశ్రీతకామలా’ అని చెప్పారు. దీనికి కారణం ‘పిత్తం’ (బైల్) కోష్ఠంలోకి చేరడం. దీన్ని ఆధునికంగా అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. మరో రకం జాండిస్... రక్తకణాలు ఎక్కువగా ధ్వంసం కావడం వల్ల సంభవిస్తుంది. ఈ భేదాల్ని బట్టి చికిత్స మారుతుంది. కారణాలు: ఆహార పదార్థాలు కలుషితం కావడం. చికిత్స: ఆయుర్వేదంలో కొన్నిరకాల మూలికలను సూచించినా అవి చికిత్సలో ఒక భాగం మాత్రమే. ఇది కేవలం ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే కామల చికిత్సకు మాత్రమే ఉపకరిస్తుంది. భూమ్యామలకి (నేర ఉసిరిక), భృంగరాజ (గుంటగలగర), గుడూచి (తిప్పతీగె), కాలమేఘ (మురుపిండి ) మొదలైన వాటిల్లో ఏదైనా ఒకదాని ఆకుల రసం తీసి వయసును బట్టి పావుచెంచా నుంచి మూడు చెంచాల వరకు తేనెతో కలిపి, రోజుకి రెండుపూటలా ఓ పదిరోజుల పాటు సేవించాలి. చూర్ణాలు: కటుకరోహిణ, పసుపు, ఉసిరికాయ మొదలైనవి అరగ్రాము నుంచి రెండు గ్రాముల వరకు తేనెతో రోజుకి రెండుసార్లు. మాత్రలు: ఆరోగ్యవర్ధనీవటి ఉదయం 1, రాత్రి 1, నిరోసిల్: ఉదయం1, రాత్రి 1. పథ్యం: వ్యాధి ఆరంభమైన ఓ వారం, పదిరోజుల వరకు నూనెపదార్థాలు, మసాలాలు, పులుపు, కారం, ఉప్పు నిషిద్ధం. కేవలం పెరుగు లేదా మజ్జిగ అన్నం మాత్రమే తినాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి. అనగా మరిగించి చల్లార్చిన నీరు, మజ్జిగ, బార్లీ, కొబ్బరినీళ్లు, పరిశుభ్రమైన చెరకుసరం, గ్లూకోజ్ మొదలైనవి. సాఫీగా విరేచనం కావాలి. ‘త్రిఫలాచూర్ణం’ 1 చెంచా రాత్రి వేడినీళ్లలో తాగాలి. జాగ్రత్తలు: బయటి పదార్థాలు తినకూడదు, తాగకూడదు, కల్తీ ఆహారాలను గమనిస్తూ, వాటిని విసర్జించాలి. వ్యాధి కారణాల్ని గుర్తుంచుకొని, వాటిని దూరంగా ఉండటం నివారణకూ ముఖ్యం. ఉదా: మద్యం, పొగతాగడం, కాలేయం చేసే పనులను దెబ్బతీసే ఔషధాలు తీసుకోకపోవడం, ఉప్పు, నూనె పదార్థాలు, కొవ్వు అతిగా తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు పదిరోజుల కింద నడుముకు ఒక పక్క కురుపులు వచ్చాయి. బాగా నొప్పి వచ్చింది. పదిరోజులకు మాడిపోయాయి. అయితే ఇప్పుడు కూడా బాగా నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - ఈ.ఎస్., కర్నూలు మీరు పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో, రోగి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది రావచ్చు. జబ్బు వచ్చినప్పుడు ఎసెక్లోవిర్ అనే ట్యాబ్లెట్లు వాడటంతో కురుపులు తగ్గిపోతాయి. ఇలా వాడని వారిలో కురుపులు వచ్చి మానిపోయాక భరించలేని నొప్పి వస్తుంది. దీనినే వైద్యపరిభాషలో హెర్పెటిక్ న్యూరాల్జియా అంటారు. దీన్ని రెండు, మూడు రకాల మందులతో అదుపు చేయవచ్చు. మీరు డాక్టర్‌కు చూపించుకోండి. వారు మీ వయసును బట్టి, బరువును బట్టి మందులు సూచిస్తారు. వాటిని తీసుకుంటే మీ నొప్పి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. నా వయసు 30 ఏళ్లు. నాకు ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. తలకు కుట్లు పడ్డాయి. మెదడు స్కానింగ్ చేయిస్తే, ఎముక ఫ్రాక్చర్ అయినట్లు రిపోర్ట్ వచ్చింది. మెదడులో రక్తస్రావం కూడా జరిగింది. అప్పటి నుంచి ఏడాదికి ఒకసారి ఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇవి తగ్గే మార్గం లేదా? - కిశోర్, ఈ-మెయిల్ తలకు దెబ్బ తగిలిన వారిలో రక్తస్రావం వల్ల, ఎముక ఫ్రాక్చర్ కావడం వల్ల మెదడులోని కణాలలో మార్పులు చోటుచేసుకుంటాయయి. ఫలితంగా ఆ కణాల నుంచి అవసరాని కంటే ఎక్కువగా విద్యుత్తు ఉత్పత్తి జరిగి ఫిట్స్ వస్తాయి. ఈ సమస్య వచ్చిన వారు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి దెబ్బ తగిలినప్పుడు ఫిట్స్ వచ్చి, స్కానింగ్ నార్మల్‌గా ఉంటుంది. అలాంటివారు కొన్ని నెలలపాటు మందులు వాడితే సరిపోతుంది. మీరు డాక్టర్‌కు చూపించుకొని, స్కానింగ్ రిపోర్టును బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40. గతంలో డస్ట్ అలర్జీ ఉండేది. నా ఫ్రెండ్స్ కొందరు వింటర్లో వ్యాయామాలు చేస్తుంటే నేను వారితో పాటు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాను. కానీ వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - చంద్రశేఖర్, కోదాడ వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపిస్తుంది అందుకే దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఇది కనిపిస్తుంటుంది. మనం శ్వాస తీసుకునే సమయంలోనే బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సమకూర్చుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారు. దాంతో గాలి వెళ్లే మార్గాలు ఒక్కసారిగా ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోని దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... పొడి దగ్గు వస్తుండటం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం పిల్లికూతలు వినిపించడం వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం కారణంగా వ్యాయాయాన్ని ఆపాల్సిన పని లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా-2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత పరిమితం సమయంలో వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
తొమ్మిదేళ్ల పాపకు పులిపిరులు ఎక్కువైతే?...
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. ఏడాదిగా చిన్న విషయాలకే చిరాకు, కోపం వస్తోంది. మా స్నేహితురాళ్లు... ఇది మెనోపాజ్ వయసు గనక అలాగే ఉంటుంది, ఏం పరవాలేదంటున్నారు. నాలో ఆందోళన ఎక్కువవుతోంది. ఆయుర్వేదంలో పరిష్కారం సూచించ ప్రార్థన. - రత్నకుమారి, నిజామాబాద్ స్త్రీలలో బహిష్టులు పూర్తిగా ఆగిపోవడానికి ముందుగా కొంతకాలంపాటు, బహిష్టులు ఆగిపోయిన అనంతరం కొంతకాలంపాటు శారీరకంగా, మానసికంగా చాలామార్పులు సంభవించడం వల్ల చాలా లక్షణాలతో బాధపడటం సహజం. ఈ సమస్యను ‘మెనోపాజ్’గా చెబుతారు. ఈ ప్రక్రియ 45-55 ఏళ్ల వయసులో సంభవిస్తుంది. ఇక్కడ వాతదోషం ప్రధానంగానూ, పిత్తదోషం అనుబంధంగానూ చోటుచేసుకొని, స్త్రీల హార్మోన్లలో విశిష్టమైన తేడాలు కనిపిస్తాయి. ఆ వయసుకు సంబంధించిన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఆయుర్వేదం ఈ కింది ప్రక్రియలను నిర్దేశించింది. ఆహారం: ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషకవిలువలను సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు ప్రతినిత్యం తినాలి. ఉదా: కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి. మొత్తంమీద రోజూ 4-5 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తాగాలి. నువ్వుల పప్పు ప్రతిరోజూ ఉదయం 2 చెంచాలు, సాయంత్రం రెండు చెంచాలను నమిలి తింటే క్యాల్షియమ్ అధికంగా లభిస్తుంది. మొలకెత్తే దినుసులు కూడా మంచిదే. విహారం: ప్రాతఃకాలంలో నిద్రలేవడం, రాత్రి 10గంటలకల్లా పడుకోవడం చాలా అవసరం. రోజూ ఉదయం లేలేత సూర్యకిరణాలలో ఓ అరగంటపాటు ఉండాలి. శ్రావ్యమైన సంగీతం వినడం చాలా మంచిది. ఔషధం: శతావరెక్స్ (గ్రాన్యూల్స్) ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా పాలతో తాగాలి. సరస్వతీ లేహ్యం: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా తినాలి. పునర్నవాది మండూర (మాత్రలు) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, అధికరక్తస్రావం ఉంటే ‘బోలబద్ధరస’ మాత్రలు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఇలా రోజుకి ఆరు వరకు వాడవచ్చు. గమనిక: మధుమేహం, హైబీపీ వంటి ఇతర వ్యాధులు ఉంటే వాటిని అదుపులోకి తేవాలి. గృహవైద్యం: శొంఠి, దనియాలు, జీలకర్ర... ఈ మూడింటిని కషాయంలాగా కాచుకొని ఉదయం ఆరు చెంచాలు, సాయంత్రం ఆరు చెంచాలు తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా అమ్మాయికి తొమ్మిదేళ్లు. ఆమెకు ముఖం మీదా, ఒంటిపైన అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి వస్తున్నాయి. పైగా అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆమె మేనిపై వాటిని చూస్తే మాకు ఆందోళనగా ఉంది. మా పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి. - కల్యాణి, కోదాడ మీరు చెప్పిన వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ఇది ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. వ్యాప్తి జరిగే తీరు... చర్మానికి చర్మం తగలడం వల్ల, వ్యాధి ఉన్నవారి తువ్వాళ్లను మరొకరు ఉపయోగించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా చాలా సాధారణం. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స: ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్.... అంటే ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ కలిపి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయస్సు 32. నేను గత మూడేళ్లుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నాను. నేను దగ్గినప్పుడు దగ్గుతో తేన్పు కూడా వస్తుంది. నాకు సరైన చికిత్స వివరించగలరు. - సుజాత, గుంటూరు మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు బ్రాంకైటిస్‌తో బాధపడుతున్నారు. శ్వాసనాళాలకు వచ్చే ఇన్ఫ్లమేషన్ (వాపు, ఎరుపు)నే బ్రాంకైటిస్ అంటారు. శ్వాసనాళపు గోడ లేదా లోపలి కండరం మందం పెరగడం వల్ల గానీ కండరం కుచించుకు పోవడం వల్ల గానీ ఇలాంటి పరిస్థితులు కలుగుతుంది. కారణాలు: బాక్టీరియా, వైరల ఇన్ఫెక్షన్ల వల్ల బ్రాంకైటిస్ వస్తే గనక ఆ సమస్య స్వల్పకాలికంగా ఉంటుంది. అదే అలర్జీ వల్ల వస్తే దీర్ఘకాలికంగా వేధిస్తుంది. పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల వెంట్రుకల లాంటివి అలర్జీ కారక పదార్థాలు. కొందరికి తలస్నానం చేస్తే కూడా తుమ్ములు మొదలై అలర్జీ ప్రారంభమౌతుంది. పొగ తాగడం వల్ల కేవలం శ్వాసవ్యవస్థలోని కింది భాగం ప్రభావితం అవుతుంది. కాని అలర్జీ వల్ల మొత్తం శ్వాసవ్యవస్థ ప్రభావితం అవుతుంది. నివారణ: అలర్జీ కారక పదార్థాలు, ప్రేరకాలకు దూరంగా ఉండడం దీర్ఘకాలిక జలుబు, దగ్గు ఆయాసం వేధిస్తుంటే అశ్రద్ధ చేయకుండా డాక్టరును సంప్రదించాలి సొంత వైద్యం వద్దు. పరిష్కారం: అన్ని రకాల బ్రాంకైటిస్లకు యాంటీ బయోటిక్స్ వాడకూడదు. కేవలం బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు మాత్రమే యాంటీ బయోటిక్స్ వాడాలి. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు ఇవి పనిచేయవు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు యాంటీ హిస్టామిన్స్, డీ కంజెస్టెంట్స్లాంటి మందులు ఉపశమనం కలిగిస్తాయి. దగ్గుకు సిరప్లు బాగా పని చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల సమస్య తగ్గకపోగా ఇంకా పెద్దవి కావొచ్చు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి కూడా సొంతంగా యాంటీ బయోటిక్స్ వాడకూడదు. ఇష్టం వచ్చినట్లు మిడి మిడి జ్ఞానంతో వీటిని వాడటం వల్ల బాక్టీరియా నిరోధకతను పెంచుకుంటుంది. అందుకే డాక్టర్‌ను సంప్రదించకుండా ఉపయోగించవచ్చు. అశ్రద్ధ చేస్తే: బ్రాంకైటిస్‌కు సరైన చికిత్స తీసుకోకపోయినా, అశ్రద్ధ చేసినా అది న్యుమోనియాకు దారితీయొచ్చు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా యాంటీబయోటిక్స్ వాడాలి. న్యుమోనియా ఉన్నప్పుడు అసాధారణ శబ్దాలు వినబడతాయి. ఎక్స్‌రేలో మచ్చలుగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిచాల్సి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నా, షుగర్ అదుపులో లేకున్నా, కిమోథెరపీ మందులు వాడి ఉన్నా... హెచ్ఐవీ ఉన్నా న్యూమోనియా పదేపదే రావొచ్చు. స్టిరాయిడ్స్, రేడియేషన్ తీసుకున్న వాళ్లలో కూడా న్యుమోనియా మళ్లీ రావచ్చు. -
గురక వస్తోంది... పరిష్కారం చెప్పండి!
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 57 సంవత్సరాలు. నాకు రెండు సంవత్సరాల నుండి శీతాకాలంలో కఫంతో కూడిన దగ్గు. కొంచెం ఆయాసం వస్తోంది. ప్రస్తుతం పది రోజుల నుండి ఇబ్బందిగా ఉంటోంది. ఊపిరితిత్తుల వైద్య నిపుణుల సలహా మేరకు రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే చేయించాను. వారు పరీక్షించి ‘‘ఇస్నోఫిలియా’’ అని చెప్పారు. దీనికి ఆయుర్వేద మందులు సూచింప ప్రార్థన. - వి. సరవన్న , విశాఖపట్నం మీరు చెప్పిన దాన్ని బట్టి, ఆయుర్వేదంలో దీనిని ‘కఫజకాస’గా చెప్పుకోవచ్చు. మీరు తేలికగా జీర్ణమయ్యే ఆహారం, వేడివేడిగా తినండి. చల్లగాలి, మంచుకు గురి కాకుండా, ఛాతీని, చెవులను కప్పి ఉంచే దళసరి దుస్తులు ధరించండి. ఈ దిగువ సూచించిన మందుల్ని ఒక మూడు వారాల పాటు వాడి, రక్త పరీక్ష చేయించుకుని, ‘ఎబ్సల్యూట్ ఇస్నోఫిల్స్ కౌంటు’ను గమనించండి. మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. 1. త్రికటుచూర్ణం (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు): 3 గ్రా॥తేనెతో రెండు పూటలా నాకాలి. లేదా - వ్యోషాది వటి (మాత్రలు): పూటకు రెండు చొప్పున, మూడు పూటలా. 2. ‘మల్లసిందూరం’ (భస్మం), ‘ప్రవాళభస్మ’: ఒక్కొక్కటి రెండేసి చిటికెలు, తేనెతో కలిపి రెండుపూటలా. 3. తులసి ఆకుల రసం (‘నల్ల తులసి’ శ్రేష్ఠం): ఒక చెంచా తేనెతో రోజూ మూడు పూటలా సేవించాలి. గమనిక: మీ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా, తులసి రసాన్ని రోజూ ఒక చెంచా తేనెతో ఓ ఆరునెలలపాటు సేవించండి. ఇది దగ్గు, ఆయాసాన్ని తగ్గించటమే కాకుండా అజీర్ణం, మధుమేహం, చర్మరోగాలను నియత్రించడానికి కూడా దోహదపడుతుంది. నా వయసు 37 సంవత్సరాలు. అప్పుడప్పుడు మలవిసర్జనతో బాటు కొంచెం నెత్తురు పడుతోంది. ఇంటర్నల్ పైల్ మాస్ (లోపల ఉండే మూలశంక)గా డాక్టర్లు నిర్ధారణ చేశారు. పూర్తిగా నయమవ్వడానికి మంచి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - కె. ప్రత్యూష, కరీంనగర్ ఆయుర్వేదంలో దీనిని ‘రక్తజ అర్మో రోగం’గా చెప్పవచ్చు. ఆహారంలో ఉప్పు, పులుపు, కారాలు గణనీయంగా తగ్గించి, పీచు, నీరు అధికంగా ఉండే శాకాహారం తినండి. తాజాఫలాలలో ‘జామిపండు’ చాలా ఉపయోగకారి. కంద, బచ్చలి కూర ప్రతి రోజూ తినండి. వ్యాయామం, ప్రాణాయామం ప్రతీరోజూ చెయ్యండి. ఈ క్రింది మందులు ఒక నెలరోజులు వాడండి. 1. కాంకాయనవటి (మాత్రలు): ఉదయం-1, రాత్రి-1. 2. బోలబద్ధరస (మాత్రలు): ఉదయం-1, రాత్రి-1. గృహవైద్యం: ఒక చెంచా ఉల్లిపాయ రసం, ఒక చెంచా తేనెతో కలిపి రోజూ రెండు పూటలా సేవిస్తే రక్తస్రావం వెంటనే తగ్గుతుంది రోజూ ఒక ఉసిరికాయ, ఆరు నెలలపాటు తింటే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. గృహిణిని. ఒక ఏడాదిగా నాకు కీళ్లు, వెన్ను, భుజాలు, చేతుల్లో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఇంటి పనిచేస్తున్న సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదయం లేవగానే ఈ నొప్పులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పనిచేస్తున్న కొద్దీ నొప్పులు కాస్త తగ్గుతున్నాయి. కానీ సాయంత్రానికల్లా చేతులు విపరీతంగా లాగుతుంటాయి. డాక్టర్‌ను సంప్రదించాను. రక్త పరీక్షలు చేశారు. రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ అని వచ్చింది. దాని ఆధారంగా నాకు ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ ఉన్నట్లు చెప్పారు. మందులు మొదలుపెట్టారు. రోజూ చాలా మందులు వాడాల్సి వస్తోంది. అది నాకు చాలా సమస్యగా ఉంది. ఇన్నేసి మందులు మింగకుండా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? - సులక్షణ, నిజామాబాద్ మీరు రాసిన లేఖను విశ్లేషించాక మీకు రెండు అంశాలను స్పష్టంగా చెప్పాలి. మొదటిది... జనాభాలో ఆరు శాతం మందికి రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష పాజిటివ్ రావచ్చు. కానీ వాళ్లందరికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోవడం సరికాదు. ఇక రెండో అంశం... మీ నొప్పులూ, శరీరంలో నొప్పులు వస్తున్న అవయవాలు, మీలో కనిపించే ఇతర లక్షణాలూ, అవి ఎంతకాలంగా కనిపిస్తున్నాయి, మీ రక్తపరీక్షలూ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను నిర్ధారణ చేయాలి. సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ నిర్దిష్టమైన కొన్ని లక్షణాలను నిశితంగా పరిశీలన చేయడంతో పాటు వివిధ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందని నిర్ణయం జరగాలి. మీకు రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందని చెబుతున్నప్పటికీ మీరు చెబుతున్న లక్షణాల ప్రకారమైతే మీకు ఆ వ్యాధి ఉన్నట్లుగా చెప్పలేం. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ నిపుణులను కలవండి. మళ్లీ కూలంకషంగా అన్ని పరీక్షలూ చేయించుకోండి. అప్పుడు వ్యాధి నిర్ధారణ అయితే... దాని ఆధారంగానే చికిత్స నిర్ణయించవచ్చు. అంతేగానీ ఇన్నిన్ని మందులను ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ హైదరాబాద్ స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. ఎత్తు ఐదడుగుల నాలుగు అంగుళాలు. బరువు 84 కేజీలు. నేను గురకతో బాధపడుతున్నాను. ఇటీవల ఫ్రెండ్స్‌తో టూర్‌కు వెళ్లాను. గదిలో, కారులో పడుకున్న వెంటనే గురకపెట్టేవాణ్ణి. ఆరోజు నుంచి తీవ్ర మానసిక వేదనతో సతమతమవుతున్నాను. న్యూనతకు గురవుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - డి. రవి, సూర్యాపేట వయసు పెరుగుతున్న కొద్దీ గురక సమస్య తీవ్రమవుతుంది. మనం నిద్రపోగానే అన్ని అవయవాలూ రిలాక్స్ అయినట్లే శ్వాసనాళమూ మెత్తబడుతుంది. శ్వాసనాళంతో పాటు, నాలుక చివర, అంగిలిలోన, గొంతు ముందు భాగం వద్ద గాలి ప్రకంపనలు సంభవిస్తాయి. ఆ కంపన వల్ల నోటి నుంచి, ముక్కు నుంచి ఒక రకమైన శబ్దం వస్తుంది. అదే గురక. గురక వస్తుందంటే ఈ సమస్యలకు అది సూచన కావచ్చు: శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత. ఇక ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతంగా రిలాక్స్ అయిపోవడం వల్ల గురక మరింత ఎక్కువగా రావచ్చు. కొందరిలో గొంతులోని కండరాలు మందంగా మారడం వల్ల గాలి ప్రవహించే నాళం సన్నబడవచ్చు. కొన్నిసార్లు అంగిలి వెనక మృదువుగా ఉండే భాగం పొడవు పెరగవచ్చు కొన్నిసార్లు ముక్కులో ఏవైనా అడ్డంకులు వచ్చినందువల్ల శ్వాస తీసుకోవడానికి మరింత గట్టిగా గాలి పీల్చాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలోనూ శబ్దం వస్తుంది. కొన్నిసార్లు జలుబు చేయడం, సైనస్లలో ఇన్ఫెక్షన్లు, ఆ కారణంగా వచ్చే జ్వరం వల్ల గాలిని మరింత బలంగా పీల్చడంతోనూ గురక రావచ్చు గురకలో శ్వాస అందని పరిస్థితిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గి, గుండెపై చాలా భారం పడుతుంది. గుండె రక్తసరఫరా కోసం ఆక్సిజన్ కోసం మరింత ఎక్కువ శ్రమిస్తుంది. చికిత్స : కొందరిలో ముక్కుకు ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను తొడుగుతారు. దీన్ని సీపాప్ చికిత్స అంటారు. మరికొందరిలో ‘ఉవాలోపాలటోఫ్యారింజియల్ ప్లాస్టీ’ అనే సర్జరీ చేస్తారు. ఇంకొందరిలో థెర్మల్ అబ్లేషన్ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో అడ్డంకులను తొలగిస్తారు. గురక నివారణ: బరువును అదుపులో పెట్టుకోడానికి వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్, అలర్జీని అదుపులో ఉంచే మందులను తీసుకోకండి ఆల్కహాల్ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య 4 గంటలూ, నిద్రకూ, హెవీ మీల్కూ మధ్య 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి ఒకవైపునకు ఒరిగి పడుకోండి మీ తలను మీ పడకకంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
మాంసాహారం తింటే గుండెజబ్బు..?
ఆయుర్వేద కౌన్సెలింగ్ వేరికోజ్ వీన్స్‌కు సర్వాంగధార చికిత్స నా వయసు 38. నాకు కొన్నేళ్లుగా కాళ్లనొప్పులున్నాయి. అప్పుడప్పుడు మోకాళ్ల నొప్పి, పాదాల వాపు వస్తోంది. మోకాలు కిందిభాగం నుండి చర్మం నల్లగా మారి, దురద వస్తోంది. గోకితే పుండు పడుతోంది. డాక్టర్ వెరికోజ్ వీన్స్ అని చెప్పారు. వెరికోజ్ అల్సర్స్ కూడా వచ్చిందన్నారు. మందులు వాడుతున్నాను కానీ ఫలితం కనిపించడం లేదు. ఆయుర్వేద వైద్యంలో దీనికి చికిత్స ఉందా? - డి.ఆర్.వి; భీమవరం వెరికోజ్ వీన్స్ అనేది చెడురక్తాన్ని తీసుకొని వెళ్లే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. వెరికోజ్ అనే రక్తనాళం పైకి ఉబ్బినట్లుగా ఉండి, మెలికలు తిరిగి, ముడిపడినట్లుగా కనిపిస్తుంది. ఈ లక్షణం మీకు కాలి భాగంలో ఉండవచ్చు. దీనిని ఆయుర్వేదంలో రక్తగత వాతం లేదా సిరాజాల గ్రంథి అని చెప్పారు. ఈ వెరికోజ్ వెయిన్స్ ఎక్కువ సమయం నిల్చుని ఉన్న వాళ్లకి వస్తుంది. ఉదాహరణకు కండక్టర్లు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, వ్యవసాయం చేసేవారిలోనూ, మధ్యవయస్కులలోనూ, ఎక్కువసేపు పరిగెత్తేవారిలోనూ, రిక్షా తొక్కేవారిలోనూ; స్త్రీలలో అయితే గర్భధారణ సమయంలో వస్తుంది. చికిత్స: ఇది వాతానికి సంబంధించింది కాబట్టి ఆయుర్వేదంలో దీనికి వాతహర చికిత్స చేయవలసి ఉంటుంది. రక్తనాళాల పటుత్వం పెంచడానికి ఆమలకి (ఉసిరికాయ), లశునం (వెల్లుల్లి)తో తయారు చేసిన తైలాన్ని, ముళ్లగోరింట చెట్టుతో తయారు చేసిన తైలాన్నీ వాడుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. పైన చెప్పిన తైలాన్ని రోజుకు 5 నుంచి 6 లీటర్లు తీసుకుని గోరువెచ్చగా చేసి ఒక క్రమపద్ధతిలో శరీరంలో ఎక్కడైతే వెరికోస్ వైన్స్ ఉంటాయో, ఆ భాగంలో పోస్తూ ఉన్నట్లయితే ఆ రక్తనాళం గోడలు పటుత్వంగా ఉండేటట్లు చేయవచ్చు. ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలో దీన్ని సర్వాంగధార అని అంటారు. పై పద్ధతిలో తైలాన్ని తయారు చేసే ముందు ముళ్లగోరింటచెట్టు; ఉసిరి, వెల్లుల్లి, మునగ ఆకులతో మినుములు, ఉలవలతో తయారు చేసిన పొడితో అపసవ్య మార్గంలో మర్దన చేయాలి. ఇది వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే జరగాలి పిల్లిపీచర (శతావరీ చూర్ణం)ను వ్యాధి అవస్థను బట్టి తీసుకోవాలి సహచరాది తైలం, స్వర్ణ మాక్షిక భస్మాన్ని, లశూనాది వటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది వెరికోజ్ అల్సర్స్‌కు వ్రణశోధన తైలాన్ని, రసోత్తమాది లేపం, జాత్యాదిఘృతాన్ని వాడాల్సి ఉంటుంది. జాగ్రత్తలు: ఎక్కువ సమయం నిలబడటం మంచిది కాదు. మలబద్ధకం రాకుండా పీచుపదార్థాలను, ద్రవరూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి బియ్యపు పిండి, బియ్యం, చక్కెర చాలా తక్కువగా తినడం మంచిది రైస్ స్థానంలో గోధుమలు, ఓట్స్, రూటిన్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా వాడవలసి ఉంటుంది శీర్షాసనం, కపాల భాతి వంటి ఆసనాలు సాధన చేయడం మంచిది. డాక్టర్ చిట్టేటి వేణుగోపాల్ ఎం.డి. ఆయుర్వేద, రుషి ప్రోక్త మన ఆయుర్వేద చికిత్సాలయం కే.పి.హెచ్.బి, రోడ్ నం.1, హెదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మాంసాహారం తింటే గుండెజబ్బు..? నా వయసు 48. నేను తరచూ మాంసాహారం తీసుకుంటూ ఉంటాను. దీనివల్ల గుండె దెబ్బతింటుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇది నిజమేనా? సలహా ఇవ్వండి. - శరభయ్య, ఆదిలాబాద్ గుండెజబ్బులకు కొలెస్ట్రాల్ తీవ్రమైన రిస్క్‌ఫ్యాక్టర్. మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్ఫుడ్స్లో ఇది ఎక్కువ. కొలెస్ట్రాల్ రెండు రకాలు. గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను ఎల్డీఎల్ అనీ, మేలు చేసేదాన్ని హెచ్‌డీఎల్ అనీ అంటారు. మన రక్తంలో ఎల్డీఎల్ 100 కంటే తక్కువగానూ, హెచ్‌డీఎల్ 40 కంటే ఎక్కువగానూ ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరానికి రెండు రకాలుగా అందుతుంది. మొదటిది ఆహారం ద్వారా, రెండోది కాలేయం పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు శరీరంలో 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ ఇలా శిశువు పూర్తిగా ఎదగడానికి రెండేళ్ల వయసు వచ్చేవరకు కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. రెండేళ్ల తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే వ్యక్తుల్లోని జన్యుతత్వాన్ని బట్టి కూడా మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి లో తేడాలు వస్తుంటాయి. మాంసాహారంతోబాటు... వేపుళ్లు, బేకరీ పదార్థాలు, నెయ్యి లాంటి వాటిని పరిమితికి మించి తీసుకుంటే ఆహారం కాస్తా కొవ్వుగా మారుతుంది. అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, దాన్ని అదుపులో ఉంచుకోడానికి మందులు వాడుతుంటే, వాటిని మధ్యలో మానేయకూడదు. మీరు మాంసాహారం మానేయనక్కరలేదు. కానీ కొవ్వులు తక్కువగా ఉండే చికెన్ తీసుకోవచ్చు. అయితే చికెన్ కంటే కూడా చేపలు మరికాస్త మేలైనవి. నా వయసు 38. ఇటీవల మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. నాకు గుండెపోటు రాకుండా నివారించుకునే మార్గాలు చెప్పండి. - సుదీప్, హైదరాబాద్ గుండెజబ్బులు రాకుండా చూసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలు ఇవి... 1. బీపీ 120 / 80 దాటకుండా చూసుకోవాలి. 2. మొత్తం కొలెస్ట్రాల్ 150 కంటే తక్కువగా ఉండాలి. 3. ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) 100 కంటే తక్కువగా ఉండాలి. 4. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) 40 కంటే ఎక్కువగా ఉండాలి. 5. బీఎమ్ఐ (బరువు కొలమానం సూచిక) 23 కంటే తక్కువగా ఉండాలి. 6. సిగరెట్లు, పొగతాగే అలవాటు పూర్తిగా వదిలేయాలి. 7. వ్యాయామం రోజూ తప్పక 30 నిమిషాల పాటు చేయాలి. 8. కూరగాయలు, తాజాపండ్లు రోజుకు కనీసం మూడుసార్లు (సాధ్యమైనంత ఎక్కువగా) భుజించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తే మీ గుండె ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవితకాలం కూడా పొడిగించుకోవచ్చు. పల్మునాలజీ కౌన్సెలింగ్ వ్యాయామం చేస్తుంటే ఆయాసం..? నా వయసు 40. గతంలో నాకు దుమ్ము అంటే సరిపడేది కాదు. (డస్ట్ అలర్జీ ఉండేది). ఇటీవల నేను వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - యాదగిరి, నల్గొండ వ్యాయామం ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడుతుంది, తేమపూరితమవుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... పొడిదగ్గు ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం పిల్లికూతలు వినిపించడం వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 - 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా-2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితోపాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే వ్యాయామానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత తగ్గుతుంది. డర్మటాలజీ కౌన్సెలింగ్ కళ్లజోడు ఆనేచోట ముక్కుపై మచ్చలు... నేను గత కొన్నేళ్లుగా కళ్లజోడు వాడుతున్నాను. నా కళ్లజోడు ఆనే చోట ముక్కు ఇరువైపులా నల్లటి మచ్చలు వచ్చాయి. కొన్ని క్రీములు కూడా వాడి చూశాను. అయితే ఫలితం తాత్కాలికమే. నా ముక్కుకు ఇరువైపుల ఉన్న మచ్చలు తొలగిపోయేదెలా? - సుబ్రహ్మణ్యం, విజయవాడ కళ్లజోడును ఎప్పుడూ తీయకుండా, నిత్యం వాడేవారికి, ముక్కుపై అది ఆనే చోట ఏర్పడే ఘర్షణ (ఫ్రిక్షన్) వల్ల ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అక్కడి చర్మంలో రంగుమార్చే కణాలు ఉత్పత్తి (పిగ్మెంటేషన్) జరిగి, ఇలా నల్లబారడం మామూలే. కొన్నిసార్లు అలా నల్లబడ్డ చోట దురద కూడా రావచ్చు. మీ సమస్య తొలగడానికి ఈ కింది సూచనలు పాటించండి.వీలైతే కళ్లజోడుకు బదులు కాంటాక్ట్ లెన్స్ వాడండి.కోజిక్ యాసిడ్, లికోరిస్, నికోటినెమైడ్ ఉన్న క్రీమును మచ్చ ఉన్న ప్రాంతంలో రాయండి.అప్పటికీ ఫలితం కనిపించకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. నేను గత పదేళ్లుగా కుడి చేతి వేలికి బంగారపు ఉంగరాన్ని ధరిస్తున్నాను. కానీ గత మూడు నెలల నుంచి ఉంగరం ధరించే చోట చర్మం నల్లబడుతోంది. ఆ ప్రాంతంలో కాస్త దురదగా, మంటగా కూడా ఉంటోంది. దయచేసి ఉంగరం పెట్టుకోవడం మానేయమని సలహా ఇవ్వకుండా, నా సమస్యకు పరిష్కారం చూపగలరు. - పూర్ణిమ, కొత్తగూడెం ఏదైనా వస్తువుతో మన చర్మం ఆనుకుంటున్నప్పుడు ఏ సమయంలోనైనా అక్కడ ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య ఎదురుకావచ్చు. బహుశా మీకు కూడా ఇదే సమస్య వచ్చి ఉంటుంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి తగులుతుంటుంది. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటర్జెంట్ తగిలి ఉండేచోట అలర్జీ కనిపిస్తోంది. లేదా మీ ఉంగరంలోని ఇతర లోహాలు (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా అందించవచ్చు. మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి. మీ ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు. ఈ నాలుగు జాగ్రత్తల తర్వాత కూడా మీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.