మజ్జిగ మహా మంచిది! | buttermilk is good! | Sakshi
Sakshi News home page

మజ్జిగ మహా మంచిది!

Published Sat, Apr 23 2016 10:34 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

మజ్జిగ మహా మంచిది!

మజ్జిగ మహా మంచిది!

ఆయుర్వేద కౌన్సెలింగ్

 

వేసవి తాపాన్ని తట్టుకోడానికి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలంటారు. ముఖ్యంగా మజ్జిగ మంచిదంటారు. ఆవు మజ్జిగ వేడి చేస్తుందంటూ కొందరు అంటున్నారు. ఈ విషయమై మరికొంచెం వివరంగా తెలియజేయప్రార్థన.  - దాక్షాయణి, విశాఖపట్నం
‘వేడి, చలవ’ అనే పదప్రయోగాలు వ్యావహారిక భాషకు సంబంధించినవి. ప్రతి పదార్థం జీర్ణమైన తర్వాత ధాతుపరిణామం చెంది, రక్తంతో కలిసి, మన శరీరంపై ప్రభావం చూపుతుంది. అప్పుడు మనకు ‘కళ్లు మండటం, మూత్రంలో మంట, మలబంధం, తలతిరగడం, అజీర్ణం, పొడిదగ్గు, గొంతునొప్పి, నీరసం, కాళ్లు లాగడం, జ్వరం వచ్చినట్లుగా ఉండటం...’ వంటి లక్షణాలు కనిపిస్తే... వేడి చేసిందనీ, అలా కాకుండా వ్యతిరేక లక్షణాలు ఉంటే చలవ చేసిందనీ, అతిగా చలవ చేయడం కూడా మంచిది కాదని అంటూ ఉంటాం. ఈ సందర్భంలో... ఆయుర్వేదం... ‘ఉష్ణవీర్య, శీతవీర్య’ అనే పరిభాషను వాడింది. వాటి ప్రభావ ప్రయోజనాలను వివరించింది.

 
పాలు (క్షీరం) : దాదాపు అన్ని జంతువుల పాలూ శీతవీర్యమే. ఒక్క గుర్రం, గొర్రె పాలు మాత్రం ఉష్ణవీర్యం.

 
మజ్జిగ (తక్రం) : అన్ని రకాల మజ్జిగలూ ఉష్ణవీర్యమే. ఇక్కడ వేడైనా, చలవైనా... ప్రాకృతస్థాయిలో ఉంటే మంచిదే. అధిక స్థాయిలో ఉంటేనే వ్యాధి కారకం. అన్ని రకాల మజ్జిగల కంటే (లభిస్తే) ఆవుమజ్జిగ శ్రేష్ఠమని శాస్త్రం చెబుతోంది. మజ్జిగను పెరుగు నుంచి తయారు చేస్తాం కదా!

 
పెరుగు (దధి) : రుచిని బట్టి పెరుగు ఐదు రకాలు. పూర్తిగా తోడుకునే ముందు కొంచెం చప్పగా, తియ్యగా ఉంటే ‘మందం’. చక్కగా తోడుకుని తియ్యగా ఉంటే ‘స్వాదు’. కొంచెం పులుపు కూడా తోడైతే ‘స్వాద్యమ్లం’. పులుపు మాత్రమే ఉంటే ‘అమ్లం’. పులుపు అధికంగా ఉంటే ‘అత్యమ్లం’. ఈ రసాన్ని (రుచిని) బట్టి దాని గుణకర్మలలో తేడా ఉంటుంది.

 
మజ్జిగను చేసే విధానాన్ని బట్టి ఐదు రకాలు :

1. నీరు కలపకుండా మీగడతో బాటే పెరుగుని చిలికితే ‘ఘోల’ అంటారు.
2. మీగడ తొలగించి, నీరు కలపకుండా పెరుగుని చిలికితే ‘మథివ’ అంటారు.
3. మీగడ పెరుగుకు నాల్గవ వంతు పరిమాణంలో నీరు కలపి చిలికితే ‘తక్రం’ అంటారు.
4. మీగడ పెరుగుకు సగభాగం నీరు కలిపి చిలికితే ‘ఉదశ్విత్’అంటారు.
5. మీగడ పెరుగుకు సమానభాగం నీరు కలిపి చిలికితే ‘చఛికా’ అంటారు.

 
ఈ ఐదు రకాల మజ్జిగలనూ ‘తక్రం’ అనే పేరుతోనే వ్యవహరిస్తుంది ఆయుర్వేదం. బాగా ‘వెన్న’తీసిన తక్రం శరీరానికి చాలా మంచిది. పులుపు లేని మజ్జిగ ఏ రకమైనా (ఉదశ్విత్, చచ్ఛికా మొదలైనవి) శరీరానికి చలవ చేస్తుంది. అగ్నిదీప్తిని చేసి దేహాన్ని తేలికపరుస్తుంది. బలకరం, వాతహరం, కఫహరం. చక్కటి మజ్జిగ మధురరస ప్రధానంగా, కించిత్ అమ్లరస (పులుపు), కషాయరస అనుబంధంగా ఉంటుంది.

 
కొద్దిపాటి వెన్న కలిగిన తక్రం శుక్రకరం, పుష్టికరం. కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగలో శుంఠి, సైంధవలవణం కలిపితే వాతహరం. పటికబెల్లం (మిశ్రీ) కల్పిన తియ్యని మజ్జిగ పిత్తహరం. పిప్పళ్లు, మిరియాలు కలిపితే కఫహరం. వేసవిలో మనం తాగే మజ్జిగలో ఇంగువ, జీలకర్ర, సైంధవలవణం కలుపుకుంటే పొట్టలోని వాయువులు తగ్గి, ఆకలి పెరిగి, బలం కలిగి, విరేచనాలయ్యే ప్రమాదం ఉండదు. రక్తాన్ని పెంచుతుంది. తృష్ణ (దప్పిక) తొలగిపోతుంది. కరివేపాకు, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

 
(భావప్రకాశ) శ్లోకం : ఆవు పెరుగు/మజ్జిగ గుణాలు :
‘‘గవ్యం దధి విశేషేణ స్వాద్యమ్లంచ రుచి ప్రదం
పవిత్రం దీపనం హృద్యం, పుష్టికృత్ పవనాపహం ॥
ఉక్తం దధ్నామ శేషారిశాం మధ్యే గవ్యం గుణాధికం
అరుచౌ స్రోతోసాం రోధే తక్రం స్వాదమృతోపమమ్ ॥

డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

 

 కార్డియాలజీ కౌన్సెలింగ్
కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అంటే ఏమిటి? ఇది రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు చెప్పండి.  - రవి, నిడదవోలు
శరీరంలోని ప్రతి అవయవానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్ సరఫరా అన్ని కణాలకూ జరుగుతుంది. అన్ని అవయవాలకు అందినట్టే కరొనరీ ఆర్టరీ అనే రక్తనాళాల ద్వారా గుండెకు రక్తం అందుతుంది. వీటిల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరాలకు రక్తం సరిగా సరఫరా కాదు. దాంతో కండరాలు బలహీనమైపోయి గుండె స్పందనలు కష్టమవుతాయి. గుండె తాలూకు రక్తనాళాలైన కరొనరీ ఆర్టరీలు పూడుకుపోయి, తద్వారా గుండెకు రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అంటారు. గుండె రక్తనాళాల్లో కొవ్వును ప్లేక్స్ అంటారు. ఈ ప్లేక్స్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాలతో పెద్దగా ఏర్పడి సన్నటి క్యాప్ కప్పినట్లు పెరుగుతాయి. వాటి ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50 శాతం కన్నా ఎక్కువగా పేరుకుపోతే, అలా తగ్గిన ప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అలా వచ్చే గుండె జబ్బులను కరొనరీ ఆర్టరీ డిసీజెస్‌గా చెబుతారు. మామూలు వ్యక్తుల కన్నా పొగతాగే వాళ్లలో ఎక్కువ. కొలెస్రాల్ట్ పెరగడం కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలు ఉంటాయి. అవి... 1) వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్ పెరగడం 2) ఆహారం ద్వారా రక్తంలో కొవ్వులు పెరగడం. చిన్న వయసులో కొన్ని జీన్స్ దెబ్బతినడం వల్ల వంశపారంపర్యంగా కొవ్వులు పెరగడం జరగవచ్చు. దాంతో కరొనరీ హార్ట్ డిసీజెస్ చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. ఇక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం (ఫ్యాట్స్) తీసుకోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. అధికబరువు, డయాబెటిస్, హైబీపీ వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లలో రక్తనాళాలు మూసుకుపోయే రిస్క్ ఎక్కువ. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్కు పెరుగుతుంది. అందుకే వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు పాటు వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ వంటి వ్యాయామమైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకున్నా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. బాగా స్ట్రాంగ్‌గా ఉండే కాఫీలు కూడా గుండెకు అంత మంచిది కాదు. జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయామంతో ఈ కరొనరీ హార్ట్ డిసీజెస్‌ను చాలావరకు నివారించుకోవచ్చు.

డాక్టర్  హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్,  బంజారాహిల్స్, హైదరాబాద్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement