పదే పదే నోటి పూత... తగ్గేదెలా?
ఆయుర్వేద కౌన్సెలింగ్
నా వయసు 46 ఏళ్లు. అతి తరచుగా ‘నోటిపూత’ వస్తోంది. మందులు వాడినా తగ్గడం లేదు. నోట్లో చిన్న చిన్న కురుపుల్లా వస్తున్నాయి. నీళ్లు తాగడం కూడా కష్టంగా ఉంటోంది. ఇది పూర్తిగా నయమవడానికి ఆయుర్వేదం మందులు తెలియజేయగలరు. - భానుమతి, కరీంనగర్
నోటిపూత వ్యాధిని ఆయుర్వేదంలో ‘ఆస్యాపాకం’ అంటారు. ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం, బీ-కాంప్లెక్సు వంటి కొన్ని పోషకపదార్థాలు లోపించడం, నోటిలో స్థానికంగా కలిగే కొన్ని క్రిమిరోగాలు (ఇన్ఫెక్షన్లు), మానసిక ఒత్తిడి వల్ల కలిగే ఆందోళన, భయం, అభద్రతాభావం మొదలైనవి ఆస్యాపాకానికి ప్రధాన కారణాలు.
చికిత్స : కారణాన్ని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. దీన్నే ‘నిదాన పరివర్జనం’గా ఆయుర్వేదం చెప్పింది.
ఆహారం : తేలికగా జీర్ణమయ్యే లఘ్వాహారం (బార్లీ జావ, గోధుమజావ, మెత్తటి మజ్జిగ అన్నం మొదలైనవి) తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం, మసాలాలు దగ్గరికి రానివ్వకండి. అరటిపండు రోజూ తినండి. గోధుమరొట్టె (పుల్కా)ను పెరుగులో నానబెట్టి మెత్తగా చేసి తినండి, నీళ్లు ఎక్కువగా తాగండి.
విహారం : మానసిక ఒత్తిడి లేకుండా ఉండేలా చూసుకోండి. రాత్రివేళ కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. పడుకునే ముందు ఒక గ్లాసెడు పాలు తాగండి. రోజూ తేలికపాటి వ్యాయామం చెయ్యండి. రోజూ రెండుపూటలా ఖాళీ కడుపున పదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి.
ఔషధం : {తిఫలాచూర్ణంతో కషాయం కాచుకుని, చల్లారిన తర్వాత నోటిలో పుక్కిలిపట్టి శుభ్రపరచుకోవాలి (ఉదయం, రాత్రి) లఘుసూతశేఖర రస (మాత్రలు) ఉదయం 2, రాత్రి 2 ఆమలకీ స్వరసం (ఉసిరికాయ రసం) : ఒక చెంచా తేనెతో రెండుపూటలా సేవించాలి. అల్లం, జీలకర్ర కషాయం : 20 మి.గ్రా. రోజూ ఉదయం పరగడపున తాగాలి.
గమనిక : ఇవి వ్యాధి తగ్గేవరకు మాత్రమే గాక... ఎంత కాలమైనా సేవించవచ్చు. ఇంకా తగ్గకపోతే... జాజి ఆకు ముద్దను పలుచగా చేసి నోటిలో ఉంచుకొని, అనంతరం, నీటితో శుభ్రం చేసుకోవాలి లేదా చందనం (మంచిగంధం), పచ్చకర్పూరం కలిపి నేతితో నోటిలో పూతగా వాడవచ్చు. ఈ ముద్దను అరచెంచా, రెండుపూటలా కడుపులోకి సేవించవచ్చు.
నా వయసు 44. షుగరు, బీపీవ్యాధులు లేవు. మూడునెలలనుండి మూత్రవిసర్జన చేసినప్పడు మంట, మూత్రం కొంచెం కొంచెంగా అవటం, చాలామార్లు రావటం జరుగుతోంది. డాక్టర్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనిచెప్పి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఆయుర్వేదంలో మంచిమందులుంటే చెప్పగలరు. పథ్యం తెలుపగలరు. - రాధాబాయి, తెల్కపల్లి
మీరు ద్రపదార్థాలు పుష్కలంగా తాగండి. అంటే బార్లీనీరు, పులుపులేని మజ్జిగ, పుచ్చకాయ రసం మొదలైనవి. ఆహారంలో కారం, పులుపు తాత్కాలికంగా మానేయండి. ఉప్పు బాగా తగ్గించండి. పరిశుభ్రంగా ఉండే చెరుకు రసం తీసుకోండి. ఈ కింది మందులు ఒక నెలరోజులపాటు వాడండి.
చంద్రప్రభావటి మాత్రలు ఉదయం 1, రాత్రి 1 గోక్షురాది గుగ్గులు మాత్రలు ఉదయం 1, రాత్రి 1 చందనాసవ ద్రావకం నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలుపుకుని రోజూ రెండుపూటలా తాగాలి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్