'చెవి పక్కన ట్రాన్స్‌ఫార్మర్ ఉన్నట్టుగా చెవిలోనో లేదా తలలోనో గుయ్‌య్‌య్ మంటూ హోరు. ఇలా గుయ్‌మంటూ శబ్దం వినిపించడాన్ని వైద్య పరిభాషలో దీన్ని ‘టినైటస్’ అంటారు. ప్రజల్లో ఇదెంత సాధారణమంటే.. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 16 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలోనూ ‘టినైటస్’ బాధించే జనాల సంఖ్య తక్కువేమీ కాదు. అన్ని వయసుల వారినీ వేధిస్తూ లక్షలాది మందిని బాధించే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.'
టినైటస్‌తో చెవిలో లేదా తలలో హోరున శబ్దం అదేపనిగా వినిపిస్తున్నప్పుడు నొప్పి కంటే.. దాన్ని విడిపించుకోలేకపోవడంతో విసుగుతో కూడిన నిస్పృహ వేధిస్తుంది. కొందరిలో ఇది గర్జన అంతటి తీవ్రంగా కూడా వినిపిస్తుండవచ్చు. కొందరిలో ఎడతెగకుండా వినిపిస్తున్నప్పటికీ.. మరికొందరిలో మాత్రం వస్తూ, పోతూ ఉండవచ్చు. ఇలా వస్తూపోతూ వినిపిస్తుండే హోరును ‘పల్సేటింగ్ టినైటస్’ అంటారు. దీని వల్ల ప్రాణాపాయం లేకపోయినప్పటికీ.. దేనిమీద ఏకాగ్రతా, దృష్టీ నిలపలేకపోవడం, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దాంతో నిరాశా నిస్పృహలకూ, తీవ్రమైన యాంగ్జైటీకి గురయ్యే అవకాశముంది.
ఎందుకిలా జరుగుతుందంటే..
ఈ కింది అంశాలు టినైటస్‌కు దోహదపడవచ్చు లేదా అవి ఈ సమస్యను తీవ్రతరం చేసే అవకాశమూ ఉంది. అవి..
- చెవిలో పేరుకుపోయే గులివి లేదా చెవిలో ఇన్ఫెక్షన్
- దీర్ఘకాలంపాటు బయట ఏదైనా హోరుకు అదేపనిగా ఎక్స్‌పోజ్ కావడం
- వినికిడి తగ్గడం / వినికిడి సమస్యలు
- ఇంకేమైనా మందులు తీసుకుంటూ ఉండటంతో వాటి దుష్ప్రభావంగా
- తలలో లేదా మెడభాగంలో ఎక్కడైనా గాయాలు కావడం
- దీర్ఘకాలపు అనీమియా, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ వంటి తలనొప్పులు
ముప్పుగా పరిణమించే అంశాలు..
సాధారణంగా టినైటస్ ప్రాణాపాయం కాకపోయినా, కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన ముప్పు తెచ్చిపెట్టే అంశంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఆ ముప్పులేమిటంటే..
- నిటారుగా నిల్చోలేక, ఎటో ఓ పక్కకు తూలిపోయే బ్యాలెన్సింగ్ సమస్య రావడం.
- వినికిడి సమస్యలు వస్తూపోతూ ఉన్నప్పుడు లేదా తీవ్రమైన వినికిడి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో వెంటనే ఈఎన్‌టీ నిపుణులను కలిసి, తమకు మీనియర్స్ డిసీజ్ (కళ్లు తిరుగుతుండే లక్షణాలతో కూడిన లోపలి చెవిని ప్రభావితం చేసే వర్టిగో లాంటి వైద్య సమస్య), అకాస్టిక్ న్యూరోమా (ఒక రకం నరాల సమస్య) వంటి జబ్బులేవీ లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం.
నిర్ధారణ..
దీని లక్షణాలు కొన్ని ఇతర సమస్యలతోనూ పోలుతున్నందువల్ల దీన్ని జాగ్రత్తగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయడమన్నది చాలా కీలక అంశం. టినైటస్ నిర్ధారణకు ఈఎన్‌టీ నిపుణులు రకరకాల పరీక్షలు చేస్తుంటారు. వాటిలో కొన్ని..
బాధితుల వైద్య చరిత్ర: వీరి మెడికల్ హిస్టరీని సునిశితంగా పరిశీలించడం. అంటే వారికి వినిపిస్తున్న శబ్దాలు ఎలాంటివి, మునుపు తల, మెడ వంటి చోట్ల ఏమైనాగాయాలయ్యాయా, ఇతరత్రా ఏమైనా వైద్యసమస్యలున్నాయా వంటి అంశాలని పరిశీలిస్తారు.
వినికిడి పరీక్షలు: వినికిడి లోపం ఏదైనా ఉందా, ఉంటే ఏమేరకు వినికిడి కోల్పోయారు వంటి అంశాలు.
ఇమేజింగ్ పరీక్షలు: కొన్ని సందర్భాల్లో ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి, చెవిలో లేదా మెదడులో ఏమైనా మార్పులు వచ్చాయా అని పరిశీలించడం.
చికిత్స / మేనేజ్‌మెంట్..
అన్ని రకాల వైద్యపరీక్షల తర్వాత.. ఒకవేళ చెవిలో గులివి లేదా చెవి ఇన్ఫెక్షన్‌తో ఈ సమస్య వచ్చినట్టు గుర్తిస్తే ఆ మేరకు గులివిని క్లీన్ చేయడం లేదా చెవి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు అవసరమైన మందులు వాడాలి.
ఎమ్మారై / సీటీ స్కాన్ వంటి పరీక్షల్లో మెదడులోగానీ, చెవిలోగాని గడ్డలు లేవని తేలితే.. అక్కడ టినైటస్‌కు ఉన్న కారణాలనూ, బాధితులపై ప్రభావాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు బాధితుల్లో తీవ్రమైన యాంగ్జైటీ ఉన్నప్పుడు టినైటస్‌ను తగ్గించే మందులతో పాటు, యాంటీ యాంగ్జైటీ మందుల్ని వాడాలి.
కొన్నిసార్లు ఓరల్ స్టెరాయిడ్స్ లేదా అవసరాన్ని బట్టి ఇంట్రా టింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లూ, కొన్ని రకాల హియరింగ్ ఎయిడ్స్ వంటివి వాడాల్సి రావచ్చు.
డా. సంపూర్ణ ఘోష్, కన్సల్టెంట్ ఈఎన్‌టీ సర్జన్
ఇవి చదవండి: ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..!
Comments
Please login to add a commentAdd a comment