Sounds
-
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్‌లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
భీకర బైకర్లు!
ట్రాఫిక్ రణగొణధ్వనులతో వాతావరణం ఇప్పటికే కలుషితమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్విచక్రవాహనదారులు సృష్టిస్తున్న భీకర శబ్దాలతో కాలుష్యం మరింతగా పెరుగుతోంది. బైక్‌లకు ఇష్టారాజ్యంగా సైలెన్సర్లు మార్చేసి హల్చల్ చేస్తున్నారు. గుండెలదిరే సౌండ్‌తో మోటార్‌సైకిల్ నడుపుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. చిత్రవిచిత్రమైన ధ్వనులను వెలువరించే వివిధ రకాల పొగ గొట్టాలను తమ వాహనాలకు అమర్చుకుని జనం చెవులుపగలగొడుతున్నారు. ఈ స్థాయి శబ్దాలు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కోరి వ్యాధులను కొనితెచ్చుకోవడమేనని హెచ్చరిస్తున్నారు.చిత్తూరు అర్బన్: ఇటీవల ఏదో ఆటంబాబు పేలితే వచ్చే పెద్ద పెద్ద శబ్దాలతో ద్విచక్రవాహన చోదకులు కొందరు చేస్తున్న స్టంట్లు ప్రాణాలపైకి తెస్తున్నాయి. రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లులు పడే శబ్దాలతో రోడ్లపై కొందరు కుర్రకారు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ద్విచక్రవాహనాలు కొనే సమయంలో కంపెనీ ద్వారా వచ్చే సైలెన్సర్లు (పొగ గొట్టాలు) తొలగించి, వాటి స్థానంలో రోత పుట్టించే వాటిని అమర్చుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా ఎన్ఫీల్డ్, కేటీఎం, ఆర్ఎక్స్–100 లాంటి ద్విచక్రవాహనాల్లో ఈ తరహా సైలెన్సర్లను అమర్చుకుని ప్రజల కర్ణభేరితో ఆడుకుంటున్నారు. ఇందుకోసం షార్ట్ బాటిల్. అంగళూర్, డబుల్ బేరల్, రెడ్ రూస్టర్. అబ్బో ఇలాంటి పేర్లు చాలానే ఉన్నాయి. ఇవన్నీ పలు రకాల బైకులకు అమచ్చే సైలెన్సర్ల పేర్లు. బాటిల్ పగులగొట్టినట్లు శబ్దం వస్తే షార్ట్ బాటిల్. అడవి పంది అరచినట్లు శబ్దం వచ్చే పొగ గొట్టానికి వైల్డ్ బోర్ ఎగ్జాస్ట్. తుపాకీ పేలుస్తున్నట్లు శబ్దం వస్తే టెయిల్ గన్నర్. ప్రస్తుతం ఈ తరహా వింత శబ్దాలు చేస్తూ రోడ్లపై తిరిగే ద్విచక్ర వాహనాలతో సామాన్యుల చెవులు పగిలిపోతున్నాయి. పర్యావరణానికీ ఇబ్బంది రాజసం, హోదా ఉట్టి పడేలా ఉండాలని బుల్లెట్ కొనుక్కునేవాళ్లు ఒకరు. కుర్రకారు క్రేజ్‌గా కేటీఎం. 80వ దశకం నాటి ఆర్ఎక్స్–100 పై రోడ్డుపై వెళుతుంటే ఆ హాయే వేరు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు సమస్యంతా రూ.లక్షలు వెచ్చించి కొంటున్న ద్విచక్ర వాహనాల పొగ గొట్టాలను ఇష్టానుసారం మార్చేసి, రోడ్లపై వెళ్లే ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయడమే. దీనికి తోడు బైకుల నుంచి వచ్చే వింత శబ్దాలతో పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతోంది.ఎదుటివారి పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతూ రోత పుట్టిస్తున్న వాళ్లపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకుపోతే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా మనం 60 డెసిబెల్స్ శబ్దం వరకు వినగలం. అంతకంటే శబ్దం పెరిగేకొద్దీ ఒక్కో రకమైన వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. చట్టం చెబుతోంది ఇదీ.. ఒక వాహనం సైలెన్సర్ నుంచి నిర్ణీత డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ వస్తే.. అది శబ్ద కాలుష్యం సృష్టించినట్టే. దీనికిగానూ మోటారు వాహన చట్టంలోని యాక్టు 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయాలి. బైకు నడిపిన వ్యక్తికి రూ.10వేల జరిమానాతో పాటు, కేసు నమోదు చేసి కోర్టుకు పంపాలి. మళ్లీ రెండోసారి శబ్దకాలుష్యానికి కారణమైతే బైకు నడిపిన వ్యక్తికి జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఇక మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు పెట్టవచ్చు. కొందరు కంపెనీ సైలెన్సర్లు తీసేస్తుంటే, మరికొందరు మఫ్లర్లను తీసేసి తీవ్రమైన శబ్ద కాలుష్యం సృష్టిస్తురు. మూడేళ్ల క్రితం చిత్తూరులో ఈ తరహా సైలెన్సర్లు అమర్చిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. పొగ గొట్టాలను తొలగించి, రోడ్డు రోలర్‌తో తొక్కించారు. రెండోసారి పట్టుబడ్డవారిపై కేసులు నమోదు చేశారు. కానీ ప్రస్తుతం తమ కళ్లెదుటే వింత వింత శబ్డాలు చేస్తూ బైకర్లు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనారోగ్యం తప్పదు శబ్ద తరంగాలను మన చెవికి కావాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ,వింటే శారీరక, మానసిక వ్యాధులు వస్తాయి. అధిక శబ్దాలను వినడం ద్వారా చెవిలోని నరాలు దెబ్బతిని వినికిడి వ్యవస్థకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. దీంతో శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. పైగా మానసికంగా ఒత్తిడి పెరిగి చిరాకు కలుగుతుంది. ఆ కోపాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవాళ్లపై చూపిస్తుంటాం. దీంతో మానవ బంధాలు కూడా దెబ్బతింటాయి. ద్విచక్ర వాహనాలకు ఆయా కంపెనీలు ఇచ్చే సైలైన్సర్లను పెట్టుకోవడమే మంచిది. లేకుంటే ఆనారోగ్యం తప్పదు. – పురుషోత్తం, వైద్య నిపుణుడు, చిత్తూరు ప్రభుత్వాసుపత్రి అధిక శబ్దంతో ముప్పు ఇదీ.. 100డెసిబెల్స్ దాటిన శబ్దం గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది 110డెసిబెల్స్ చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది.120డెసిబెల్స్ చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది. 160డెసిబెల్స్ చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతింటాయి. 190డెసిబెల్స్కర్ణభేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. చర్యలు తీసుకుంటాం సైలెన్సర్లను మార్చేసి ఇష్టానుసారం ప్రజలకు ఇబ్బందులు కలిగే శబ్దాలు చేయడం మంచిదికాదు. అసలు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ వయసులో వాహనాలు ఇవ్వాలో తెలుసుకోవాలి. ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు మార్చకుండా చూసుకోవాలి. ఎంవీ యాక్టు కింద ఇలాంటి వారికి భారీ జరిమానాలు విధిస్తున్నాం. ఇక మెకానిక్‌లు కూడా సైలెన్సర్లను మార్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం. సైలెన్సర్‌ను మార్పు చేయాలని ఎవరైనా మెకానిక్‌ల వద్దకు వస్తే, చేయమని కచ్చితంగా చెప్పండి. చట్ట పరిమితిలో లేని సైలెన్సర్లను విక్రయించేవారిపై కూడా చర్యలు తప్పవు. వీటి వల్ల ఎక్కడైనా ఇబ్బంది వస్తే డయల్–100 నంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చు. – మణికంఠ చందోలు, ఎస్పీ, చిత్తూరు -
మిమిక్రీ చేసే పక్షులు!
అండమాన్ దీవుల్లో నేను, నా భర్త రోమ్ ఒక రోజు తెల్లవారుజామున రెండు పిల్లులు అరుస్తూ కొట్టుకుంటున్నట్టు వినిపించిన శబ్దాలకు నిద్ర లేచాము. నిద్ర కళ్ళతో బాల్కనీకి వెళ్లి అడవిలో ఆ శబ్దాలు వస్తున్న వైపు చూసాము. ఆశ్చర్యంగా ఆ రెండు శబ్దాలు చేస్తున్నది పొడుగు తోకల ఏట్రింత (రాకెట్ టైల్డ్ డ్రోంగో) అనే పక్షి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాము. ఒకసారి సముద్రపు గ్రద్ద వలె, మరోసారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హార్న్ శబ్దాలను నమ్మశక్యం కానీ రీతిలో అనుకరిస్తున్న ఆ పక్షి అనుకరణలు గమనించాము. ఒక పక్షికి ఇంత అద్భుతమైన అనుకరణ (మిమిక్రీ) చేయవలసిన అవసరం ఏముంది?ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతూ ఉంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడుట కోసమే ఇవి వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ అనుకరణ యాదృచ్చికమో లేక కావాలని చేసే అనుకరణో కచ్చితంగా చెప్పడం కష్టం.ఇతర పక్షులు తమ ఆహారాన్ని తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా కాస్తుంటాయి . ఏదైనా ఘాతుక పక్షి దగ్గరగా వచ్చినట్లైతే ఆ ఘాతుక పక్షిపై మూకుమ్ముడిగా దాడి చేయడానికి ఇతర పక్షుల హెచ్చరిక అరుపులను అనుకరిస్తూ వాటిని ప్రోత్సాహిస్తాయిని భావిస్తారు.కొద్దిసేపటి క్రితం మేము ఒక జాలె డేగ, వంగ పండు పక్షిపిల్లని పట్టుకుని తింటూండటం చూసాము. దాని సమీపంలోనే నల్ల ఏట్రింత, జాలె డేగ అరుపులను అనుకరించినా, ఆ డేగ పట్టించుకోలేదు. దీనినినిబట్టి ఏట్రింతలు ప్రతీసారి మూకుమ్మడి దాడి కోసమే అనుకరిస్తాయని భావించలేము. కొన్ని సందర్భాలలో పక్షులు తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను అనుకరించవచ్చు, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురైనప్పుడు లేక మొదటి సారి ఆ శబ్దం విన్నప్పుడు ఆ విధంగా అనుకరించవచ్చు.చిలుకలు మరియు మైనా జాతి పక్షులు మనుషులను అనుకరించగలవు. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటినుంచే తర్ఫీదు ఇస్తారు. అవి మనుషుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారాన్ని బహుమానంగా ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తుంటారు. చిలుకలు వాక్క్యూమ్ క్లీనర్ చేసే శబ్దాన్ని, టెలిఫోన్ రింగు, కుక్క అరుపులను కూడా అనుకరించగలవు. ఐన్స్టీన్అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్స్విల్లె జూలోని తోడేళ్లు , చింపాంజీలు, కోళ్లు, పులులు మరియు ఇతర జంతువుల అరుపులను అనుకరించేది. ఈ అనుకరణ విద్య అవి సహజసిద్ధంగా బ్రతికే అడవుల్లో జీవించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించవలసిన విషయము. అడవిలో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకోవడానికి ఒకటినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయలోని లారా కెల్లీ అన్నారు. అవే చిలుకలు పంజరంలో బంధించినట్లైతే వాటి సమీపంలోని మనుషులను అనుకరిస్తాయి. ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకి చెందిన "లైర్ బర్డ్" చాలా ప్రముఖమైన పక్షి . యూట్యూబ్‌లో ఒక వీడియోలో ఈ పక్షి, కార్ రివర్స్ చేసే శబ్దాన్ని, కెమెరా క్లిక్ శబ్దాన్ని, చైన్ సా , చెట్లు పడిపోయే శబ్దాన్ని, తుపాకి, వాద్య పరికరాలు, ఫైర్ అలారం, పసి పాపాల ఏడుపు, రైళ్లు, మనుషులు, ఈ విధంగా అనేక రకాలైన శబ్దాలను అనుకరించడం చూడవచ్చు. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తూంటాయి కనుక ఆడ పక్షులు ఏ మగ పక్షైతే ఎక్కువ శబ్దాలను అనుకరిస్తుందో దాన్ని భాగస్వామిగా ఎంచుకోవచ్చు అని కొందరు భావిస్తూంటారు. కానీ ఐరోపా జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు, అది కేవలం సాధన మాత్రమే అని భావిస్తుంటారు. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో కనిపించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఘాతుక పక్షులు లేక వాటిపై దాడి చేసే ఇతర జంతువులు అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలను విన్న ఆ జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్ళగానే ఏట్రింతలు ఆ ఆహారాన్ని దొంగిలిస్తాయి. ఇప్పటి వరకు “పక్షుల అనుకరణ” వలన అవి పొందే ప్రయోజనాలలో ఇది ఒక్కటే నిరూపితమైనది.ఈ అండమాన్ దీవుల్లో మేము చూసిన ఏట్రింత కూడా ఇదే విధంగా ఆహారంగా కోసం అనుకరిస్తుందా? ఇది తెలియాలంటే కొంత సమయం మరియు పరిశీలన అవసరం. ఈ అనుకరణ విద్యను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని పక్షులు ప్రదర్శిస్తాయి కనుక ఈ చర్యని వివరించడానికి ఓకే వివరణ అన్నింటికీ వర్తింపచేయలేమని కెల్లీ అభిప్రాయపడతారు.ఈ ఆలోచనల మధ్యలో, డిష్ వాషర్లు, అంబులెన్సు శబ్దాలను కూడా అనుకరించే వాటి సామర్ధ్యానికి, ప్రకృతినే ఒక సంగీత వర్ణమాలగా ఉపయోగించే అద్భుతమైన నైపూణ్యానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. రచయిత - జానకి లెనిన్ ఫోటో క్రెడిట్: సుభద్రాదేవితెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewritersపుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
మీ తలలో 'గుయ్య్య్' మంటూ సన్నని శబ్దమా.. అయితే జాగ్రత్త!
'చెవి పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టుగా చెవిలోనో లేదా తలలోనో గుయ్య్య్ మంటూ హోరు. ఇలా గుయ్‌మంటూ శబ్దం వినిపించడాన్ని వైద్య పరిభాషలో దీన్ని ‘టినైటస్’ అంటారు. ప్రజల్లో ఇదెంత సాధారణమంటే.. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 16 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలోనూ ‘టినైటస్’ బాధించే జనాల సంఖ్య తక్కువేమీ కాదు. అన్ని వయసుల వారినీ వేధిస్తూ లక్షలాది మందిని బాధించే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.' టినైటస్తో చెవిలో లేదా తలలో హోరున శబ్దం అదేపనిగా వినిపిస్తున్నప్పుడు నొప్పి కంటే.. దాన్ని విడిపించుకోలేకపోవడంతో విసుగుతో కూడిన నిస్పృహ వేధిస్తుంది. కొందరిలో ఇది గర్జన అంతటి తీవ్రంగా కూడా వినిపిస్తుండవచ్చు. కొందరిలో ఎడతెగకుండా వినిపిస్తున్నప్పటికీ.. మరికొందరిలో మాత్రం వస్తూ, పోతూ ఉండవచ్చు. ఇలా వస్తూపోతూ వినిపిస్తుండే హోరును ‘పల్సేటింగ్ టినైటస్’ అంటారు. దీని వల్ల ప్రాణాపాయం లేకపోయినప్పటికీ.. దేనిమీద ఏకాగ్రతా, దృష్టీ నిలపలేకపోవడం, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దాంతో నిరాశా నిస్పృహలకూ, తీవ్రమైన యాంగ్జైటీకి గురయ్యే అవకాశముంది. ఎందుకిలా జరుగుతుందంటే.. ఈ కింది అంశాలు టినైటస్కు దోహదపడవచ్చు లేదా అవి ఈ సమస్యను తీవ్రతరం చేసే అవకాశమూ ఉంది. అవి.. చెవిలో పేరుకుపోయే గులివి లేదా చెవిలో ఇన్ఫెక్షన్ దీర్ఘకాలంపాటు బయట ఏదైనా హోరుకు అదేపనిగా ఎక్స్పోజ్ కావడం వినికిడి తగ్గడం / వినికిడి సమస్యలు ఇంకేమైనా మందులు తీసుకుంటూ ఉండటంతో వాటి దుష్ప్రభావంగా తలలో లేదా మెడభాగంలో ఎక్కడైనా గాయాలు కావడం దీర్ఘకాలపు అనీమియా, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ వంటి తలనొప్పులు ముప్పుగా పరిణమించే అంశాలు.. సాధారణంగా టినైటస్ ప్రాణాపాయం కాకపోయినా, కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన ముప్పు తెచ్చిపెట్టే అంశంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఆ ముప్పులేమిటంటే.. నిటారుగా నిల్చోలేక, ఎటో ఓ పక్కకు తూలిపోయే బ్యాలెన్సింగ్ సమస్య రావడం. వినికిడి సమస్యలు వస్తూపోతూ ఉన్నప్పుడు లేదా తీవ్రమైన వినికిడి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో వెంటనే ఈఎన్టీ నిపుణులను కలిసి, తమకు మీనియర్స్ డిసీజ్ (కళ్లు తిరుగుతుండే లక్షణాలతో కూడిన లోపలి చెవిని ప్రభావితం చేసే వర్టిగో లాంటి వైద్య సమస్య), అకాస్టిక్ న్యూరోమా (ఒక రకం నరాల సమస్య) వంటి జబ్బులేవీ లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం. నిర్ధారణ.. దీని లక్షణాలు కొన్ని ఇతర సమస్యలతోనూ పోలుతున్నందువల్ల దీన్ని జాగ్రత్తగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయడమన్నది చాలా కీలక అంశం. టినైటస్ నిర్ధారణకు ఈఎన్టీ నిపుణులు రకరకాల పరీక్షలు చేస్తుంటారు. వాటిలో కొన్ని.. బాధితుల వైద్య చరిత్ర: వీరి మెడికల్ హిస్టరీని సునిశితంగా పరిశీలించడం. అంటే వారికి వినిపిస్తున్న శబ్దాలు ఎలాంటివి, మునుపు తల, మెడ వంటి చోట్ల ఏమైనాగాయాలయ్యాయా, ఇతరత్రా ఏమైనా వైద్యసమస్యలున్నాయా వంటి అంశాలని పరిశీలిస్తారు. వినికిడి పరీక్షలు: వినికిడి లోపం ఏదైనా ఉందా, ఉంటే ఏమేరకు వినికిడి కోల్పోయారు వంటి అంశాలు. ఇమేజింగ్ పరీక్షలు: కొన్ని సందర్భాల్లో ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి, చెవిలో లేదా మెదడులో ఏమైనా మార్పులు వచ్చాయా అని పరిశీలించడం. చికిత్స / మేనేజ్మెంట్.. అన్ని రకాల వైద్యపరీక్షల తర్వాత.. ఒకవేళ చెవిలో గులివి లేదా చెవి ఇన్ఫెక్షన్తో ఈ సమస్య వచ్చినట్టు గుర్తిస్తే ఆ మేరకు గులివిని క్లీన్ చేయడం లేదా చెవి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు అవసరమైన మందులు వాడాలి. ఎమ్మారై / సీటీ స్కాన్ వంటి పరీక్షల్లో మెదడులోగానీ, చెవిలోగాని గడ్డలు లేవని తేలితే.. అక్కడ టినైటస్కు ఉన్న కారణాలనూ, బాధితులపై ప్రభావాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాధితుల్లో తీవ్రమైన యాంగ్జైటీ ఉన్నప్పుడు టినైటస్ను తగ్గించే మందులతో పాటు, యాంటీ యాంగ్జైటీ మందుల్ని వాడాలి. కొన్నిసార్లు ఓరల్ స్టెరాయిడ్స్ లేదా అవసరాన్ని బట్టి ఇంట్రా టింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లూ, కొన్ని రకాల హియరింగ్ ఎయిడ్స్ వంటివి వాడాల్సి రావచ్చు. డా. సంపూర్ణ ఘోష్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఇవి చదవండి: ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..! -
ష్... సైలెన్స్ డ్యాన్స్
పెళ్లి బరాత్ (ఊరేగింపు) అనగానే చెవులు చిల్లులు పడే భయానక సౌండ్స్, చుట్టుపక్కల వాళ్లకు కలిగే డిస్ట్రబెన్స్ గుర్తుకు వస్తాయి. అసలు సౌండ్ లేకుండా బరాత్ ఉంటే ఎలా ఉంటుంది? ‘అదెలా సాధ్యమండీ?’ అనే వాళ్లకు ఈ పెళ్లి బరాతే సమాధానం. ఈ పెళ్లి బరాత్‌లో పాటలు ఉన్నాయి. ధూమ్‌ధామ్ డ్యాన్స్‌లు ఉన్నాయి. అయితే అన్నీ సైలెంట్‌గానే. ‘డ్యాన్సులంటే సైలెంట్‌గా చేయవచ్చు. మరి పాటలను ఎలా సైలెంట్‌గా ప్లే చేస్తారు?’ అనే డౌట్ రావచ్చు. అసలు విషయమేమిటంటే బరాత్‌లో పాల్గొన్న వారికి హెడ్ఫోన్లు అందించారు. దీంతో ఎవరి పాటలకు వారు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సైలెంట్ డిస్కోకు ప్రేరణ హిందీ సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’ లోని బ్రేకప్ సాంగ్. ‘శబ్ద కాలుష్యంతో భయపెట్టే బరాత్‌లను గుర్తు తెచ్చుకున్నప్పుడు... ఈ వీడియో చూస్తుంటే హాయిగా అనిపించింది. నైస్ ఐడియా’ అంటూ నెటిజనులు స్పందించారు. -
అది ‘ఇత్తడి నగరం’ ఎందుకయ్యింది? నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి?
భారతదేశంలోని ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉంది. కొన్ని కలల నగరం హోదాను కలిగి ఉoడగా, మరికొన్ని చరిత్రను సజీవంగా ఉంచడానికి కృషి చేస్తున్నాయి. భారతదేశంలోని ఒక నగరాన్ని ఇత్తడి నగరం అని అంటారు. ఆ నగరంలో జరిగే వ్యాపారం మనదేశంలోనే కాదు అమెరికా నుండి యూరప్ వరకు విస్తరించింది. ఆ నగరం గురించి, అక్కడి వ్యాపారం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది మనదేశ ఘనతను తెలియజేస్తుంది. ఆ నగరానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఇత్తడి నగరంగా ప్రసిద్ధి చెందిన నగరం పేరు మొరాదాబాద్. ఈ నగరం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ప్రభుత్వం ఈ నగరానికి బ్రాస్ సిటీ అనే పేరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఒక ఉత్పత్తి పథకం కింద దీనికి ఈ పేరు వచ్చింది. ఈ నగరంలో తయారైన ఇత్తడి ఉత్పత్తులు భారతీయ సంస్కృతి, వైవిధ్యం, వారసత్వం, చరిత్రను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఇత్తడి వస్తువుల తయారీకి సంబంధించిన చిన్న పరిశ్రమలు, పెద్ద కర్మాగారాలు అనేకం ఉన్నాయి. హిందూ దేవుళ్లు, దేవతల బొమ్మలు మొదలుకొని మొఘల్ కాలం నాటి ఆకృతుల వరకు అన్నింటినీ ఇక్కడ ఇత్తడితో తయారుచేస్తారు. ఫలితంగా నగరంలో అనునిత్యం ఎక్కడచూసినా పాత్రల తయారీ శబ్ధాలు వినిపిస్తుంటాయి. అమెరికా నుండి యూరప్ వరకు.. బ్రాస్ సిటీలో తయారయ్యే ఉత్పత్తులు భారతదేశంలో విక్రయమవడమే కాకుండా అమెరికా, యూరప్ వంటి ఖండాలకు కూడా ఎగుమతి అవుతాయి. భారత్ నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఇత్తడి ఎగుమతి అవుతుంది. ఇక్కడి ఇత్తడి పరిశ్రమ టర్నోవర్ ఏటా రూ. 8,000 నుంచి 9,000 కోట్ల వరకూ ఉంటుంది. ది వైర్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఈ నగర జనాభాలో దాదాపు 47% మంది ముస్లింలు. ఇక్కడి ముస్లింలు ఇత్తడి పాత్రల తయారీలో ముందున్నారు. ప్రస్తుతం మొరాదాబాద్‌లో దాదాపు 4,000 మంది ఇత్తడి ఎగుమతిదారులు ఉన్నారు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది? -
శబ్ధాలు, పరికరాలతో చెవిచిల్లు.. ఆధునిక జీవనశైలి చెవి‘నిల్లు’
ఇటీవలి కాలంలో వినికిడి సమస్యలతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వైద్యులు అంటున్నారు. వైద్యుల గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, ఒక బిలియన్ పైగా యువతకు వినికిడి లోపం ప్రమాదం పొంచి ఉంది. టీనేజర్లలో వినికిడి శైలిని విశ్లేషించి దాని ప్రకారం వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉన్న వారి సంఖ్యల గురించి పరిశోధకులు ఈ అంచనాను రూపొందించారు. కరోనా విజృంభణ సమయంలో, ఆన్లైన్ సమావేశాలు, స్నేహితులు కుటుంబ సభ్యులతో వీడియో కాల్లు లేదా అతిగా చూసే సెషన్ల కారణంగా, మనలో చాలా మంది గంటల తరబడి హెడ్ఫోన్లకు అతుక్కుపోయారు. ఇప్పుడు, కోవిడ్‌తో సంబంధం లేకుండా హెడ్ఫోన్లు రోజువారీ జీవితంలో భాగంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాల (పిఎల్డిలు) వాడకం తో పాటు పెద్ద ఎత్తున హైఓల్టేజ్‌తో ఉండే సంగీత వేడుకలకు హాజరుకావడం వంటివి వినికిడి పాలిట శాపాలుగా అధ్యయనం తేల్చింది. పరిమితి మించిన సంగీతధ్వని.. పెద్దలకు 80 డీబీ, పిల్లలకు 75 డీబీ మాత్రమే అనుమతించదగిన ధ్వని స్థాయి. వినియోగదారులు తరచుగా 105 డెసిబెల్ (డిబి) కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటున్నారని గతంలో ప్రచురించిన మరో పరిశోధన వెల్లడించింది, అయితే మ్యూజిక్ కన్సర్ట్స్, వినోద వేడుకల్లో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డిబి వరకు ఉంటాయి. ఇందుగలదందు లేదని సందేహంబు లేదు.. ఇతర శబ్ధాల సమస్య లేకుండా సంగీతాన్ని ఆస్వాదించడానికి స్ట్రీమ్ సిరీస్, సినిమాలను చూడడానికి ఇష్టపడే యువతరం పెరిగింది. వీరు తరచుగా ఇయర్‌బడ్‌లు లేదా హెడ్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. మెట్రో నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టుపక్కల వారి మాటలు, శబ్ధాలు.. వగైరా తప్పించుకోవడానికి ఇయర్ఫోన్లు పెట్టుకుని వినడం సర్వసాధారణం. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా ఉండడానికి తమ వాల్యూమ్లను పెంచుతారు. మరోవైపు ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లు వినోదం మాత్రమే కాకుండా చాలా మందికి వృత్తిరీత్యా కూడా అవసరంగా మారాయి. ఏతావాతా ఈ ఆడియో గాడ్జెట్ల పెరుగుతున్న వినియోగం జుట్టు కణాలు, పొరలు, నరాలు లేదా చెవిలోని ఇతర భాగాలకు హాని కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి నష్టం కలిగిస్తుంది. వైద్యుల సూచనలివే.. ► టీవీ లేదా స్పీకర్లను లేదా హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాల్యూమ్‌ను నియంత్రించండి. ► ఇయర్‌బడ్‌లు హెడ్ఫోన్లలో మీ పక్కన ఉన్న వ్యక్తి వినే స్థాయికి వాల్యూమ్ చేరకుండా జాగ్రత్తపడాలి. ► బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా తరచుగా వాల్యూమ్‌ను పెంచాల్సిన అవసరం రాకుండా బయటి నుంచి శబ్దం–రాకుండాచేసే ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లను కొనుగోలు చేయండి. ► ఇయర్‌బడ్‌లు ఇయర్లోబ్ను కవర్ చేస్తాయి చెవికి అతి దగ్గరగా ఉంటాయి. మరోవైపు, హెడ్ఫోన్లు సంగీతపు వైబ్రేషన్‌ను నేరుగా చెవులకు పంపవు. కాబట్టి, దీర్ఘకాలంలో ఇయర్ బడ్స్ కన్నా హెడ్ఫోన్లకు మారడం మంచిది. ► ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాల విరామం లేదా ప్రతి 60 నిమిషాలకు 10 నిమిషాల పాటు చెవులకు విరామం ఇవ్వాలి. ► స్మార్ట్ఫోన్ల సెట్టింగ్‌లలో అనుకూల వాల్యూమ్ పరిమితిని కూడా సెట్ చేయవచ్చు. జాగ్రత్తలు అవసరం.. చెవిలో సున్నితమైన చర్మం, పొర ఉంటుంది. చెవికి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంటుంది. అయితే అతిగా ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఈ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది. తద్వారా చర్మానికి ఇన్ఫెక్షన్స్ అవకాశాలు పెరుగుతాయి. వాక్స్ జిగిరీ అనే ఆ పొర పోయిదంటే... ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వీటిని అతిగా వినియోగించకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు వీలున్నంత వరకూ అసలు వాడకూడదు. ఇయర్ డ్రమ్ ముఖ ద్వారం కాస్త పెద్దగా ఉన్నవాళ్ల కన్నా సన్నగా ఉన్నవాళ్లకి ప్రమాదం మరింత ఎక్కువ. వీళ్లు వాడేటప్పుడు దాన్ని ఇంకా ఇంకా లోపలికి తోస్తారు. అలా మరీ లోపలికి పెట్టడం వల్ల ఇయర్ డ్రమ్‌కు నష్టం కలుగుతుంది. వీలున్నంత వరకూ అవసరాన్ని బట్టి తప్ప ఎడాపెడా ఉపయోగించడం మంచింది కాదు. అలాగే వినికిడి సామర్ధ్యానికి హెడ్ ఫోన్స్, హై ఓల్టేజ్ సంగీతం కూడా హానికరమే. –డా.ఎం.ప్రవీణ్ కుమార్, ఇఎన్టీ సర్జన్ అమోర్ హాస్పిటల్స్ -
సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు.. ఇండియా మొత్తంలో ఆయన ఒక్కరేనా?
సినిమా అంటే సాధారణంగా అందరి దృష్టి హీరో, హీరోయిన్లపైనే ఉంటుంది. ఆ తర్వాత స్థానం డైరెక్టర్, మ్యూజిక్ ఎవరనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మీకెవరికీ కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో కష్టపడేవారి గురించి మీకు తెలుసా? కనీసం వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి అరుదైన వారి గురించిప్రత్యేక కథనం. మీరెప్పుడైనా సౌండ్ లేకుండా సినిమా చూశారా? బాహుబలి లాంటి సినిమాలో గుర్రపు స్వారీ శబ్దాలు లేకుండా చూడగలరా? మరీ దీనికంతటికీ కారణం ఎవరు? అసలు ఆ శబ్దాలు సృష్టించేది ఎవరో మీకు తెలుసా? ఈ పనిని ఎలా నిర్వర్తిస్తారో తెలుసా? దీని వెనుక చరిత్ర ఏంటీ? అసలు ఈ పనిని ఎవరు చేస్తారు? వారు ఎలా చేస్తారో తెలుసుకుందాం. సినిమాలోని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్లో వచ్చే శబ్దాలు చేసే వారిని ఫోలీ ఆర్టిస్ట్ అంటారు. వీరు సినిమాలోని సందర్భాన్ని బట్టి శబ్దాలు సృష్టించడం వీరి పని. ఎంత పెద్ద సినిమా అయినా వీరు చేసే శబ్దాలు లేకుండా చూడడం చాలా అరుదు. ఈ ఫోలియో ఆర్ట్ అంటే మన రోజు వారి జీవితంలో ఉపయోగించే వస్తువులతో సౌండ్ ఎఫెక్ట్స్ అందించండం. ఈ పనులన్నీ ప్రీ ప్రొడక్షన్ సమయంలో చేస్తారు. కరణ్ అర్జున్ సింగ్ సినీ పరిశ్రమలోని ఫోలీ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించారు కరణ్ అర్జున్ సింగ్. ఆయన చిన్న వయసులోనే ఫేమస్ అయ్యారు. ఆయన పలు రకాల భాషా చిత్రాలకు ఫోలీ పేరుతో సౌండ్ ఆర్ట్‌ను రూపొందిస్తున్నారు. బాహుబలి సినిమాతో సహా పలు ప్రముఖ చిత్రాలకు ఆయన బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు ఇచ్చారు. సినీ పరిశ్రమలో రాణించాలనుకునే వారికి ఆయన ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. అర్జున్ సింగ్ మాట్లాడుతూ..' ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు ఎక్కడ లేరు. కేవలం ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవాల్సిందే. ఫోలీ ఆర్టిస్ట్‌కు సౌండ్ ప్రధానం. ఇప్పటివరకు దీనిపై శిక్షణ ఇచ్చే సంస్థ లేదు. మంచి ఫోలీ ఆర్టిస్ట్ కావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది.' అని అన్నారు. కరణ్ అర్జున్ సింగ్ ఎవరు? కరణ్ అర్జున్ సింగ్ ఒక ప్రముఖ ఫోలీ ఆర్టిస్ట్. 35 సంవత్సరాలకు పైగా బాలీవుడ్ (ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ)తో సహా పలు చిత్రాలకు పని చేస్తున్నారు. ఆయన దాదాపు 3000 కంటే ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. అతను ముంబైలో అత్యంత ప్రతిభావంతులైన ఫోలీ కళాకారులు, సౌండ్ ఇంజనీర్లు, సౌండ్ ఎడిటర్లు, సౌండ్ డిజైనర్లతో జస్ట్ ఫోలీ ఆర్ట్ అనే పేరుతో సౌండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ప్రారంభించారు. -
కృష్ణ బిలం వినిపించింది! వైరల్ వీడియో.. సముద్ర అలల ధ్వనిలా
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉండే కృష్ణ బిలాలు(బ్లాక్ హోల్స్) గురించి మనకు తెలుసు. వాటిలోనుంచి నిరంతరం శబ్దాలు వెలువడుతూ ఉంటాయి. అవి ఎలాంటి శబ్దాలు అన్న సంగతి తెలియదు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు ఈ విషయంలో కొంత పురోగతి సాధించారు. బ్లాక్ హోల్ నుంచి చిన్నపాటి ప్రతిధ్వనులను రికార్డు చేసి, స్పష్టమైన శబ్దంగా మార్చారు. ఇందుకోసం సొనిఫికేషన్ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. సంబంధిత శబ్దంతో కూడిన వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇది భూమికి 7,800 కాంతి సంత్సరాల దూరంలో ఉన్న వీ404 సైగ్నీ అనే బ్లాక్‌హోల్‌కు సంబంధించినదని వెల్లడించారు. నాసా విడుదల చేసిన వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. కొన్ని గంటల వ్యవధిలోనే 40 లక్షల మందికిపైగా జనం వీడియోను తిలకించారు. కృష్ణ బిలం శబ్దం కొత్తగా ఉందంటూ నెటిజన్లు పోస్టు చేశారు. ఇసుకపై నుంచి దూసుకొచ్చే సముద్ర అలల ధ్వనిలా ఉందని కొందరు పేర్కొన్నారు. -
భూగర్భంలో వింత శబ్దాలు... భయాందోళనలో గ్రామం
ముంబై: మహారాష్ట్రాలోని లాతూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూగర్భంలో వింతవింత శబ్ధాలు గ్రామం అంతటా వస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలోని నివాసితులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. హసోరి గ్రామంలో ఈ భూగర్భ శబ్ధాలు వస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ వింత శబ్ధాలకు గల కారణాల గురించి అధ్యయనం చేయమంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం నుంచి నిపుణలను అభ్యర్థించినట్లు చెప్పారు. హసోరి గ్రామం కిల్లారి నుంచి 28 కి.మీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో 1993లో ఘోరమైన భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు 9700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి భూకంపాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో ఈ వింత శబ్దాలు సెప్టెంబర్ 6నుంచి భగర్భం నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయని, గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారని అధికారులు చెప్పారు. లాతూర్ జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ఈ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు భయందోళనలకు గురవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు మహారాష్ట్రాలోని నాందేడ్‌లోని స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించనుందని అధికారులు తెలిపారు. (చదవండి: సెల్ఫీ ఆనందంలో సెల్‌నే విసిరి ఆ తర్వాత...) -
విషాదం: పెళ్లి బారాత్‌లో ఆగిన గుండె
సాక్షి, వేములవాడ: పెళ్లి బారాత్‌లో ఏర్పాటు చేసిన డీజే పాటలతో యువకులు డ్యాన్స్‌లు, కేరింతలు, ఈలలతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో డీజే సౌండ్ కారణంగా పెళ్లి వాహనంలో ఉన్న వృద్దురాలికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సంతోష క్షణాల మధ్య గడుపుతున్న బంధువులు, కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి కోనరావుపేట గ్రామానికి చెందిన నక్క విజయ (58) అనే మహిళ హాజరైంది. అప్పగింతలు పూర్తి కాగానే పెళ్లి కుమారుని వాహనంలో అనంతపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. చదవండి: ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’ పెళ్లి బారత్‌లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. ఈ డీజే సౌండ్ శబ్ధానికి మహిళ చాతిలో నొప్పితో కుప్పకూలింది. అప్పటి వరకు డీజే పాటలకు స్టెప్పులు వేసిన యువకుల డ్యాన్సులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏమైందని అక్కడున్న వారందూ తెరుకునేలోపే మహిళ మృతిచెందింది. దీంతో శుభకార్యం జరిగే ఇంట్లో విషాదం అలుముకుంది. సంబరాలు జరుపుకోవాల్సిన బంధువులు మహిళ మృతదేహంతో కోనరావుపేటకు చేరుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ఆమె లేకపోతే బతకలేనంటూ భార్యతో చెప్పి.. -
ఆ గ్రామాల్లో వింత శబ్ధాలు.. వణికిపోతున్న ప్రజలు.. ఎందుకిలా..?
పలమనేరు: పల్లెల్లో ఎన్నడూ లేనివిధంగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి వచ్చిన కాసేపటికి భూమి అదిరినట్లు అవుతోంది. దీంతో ఎప్పుడేమి జరుగుతుందోననే భయంతో గ్రామీణ ప్రజలు సమీపాల్లోని అడవుల వద్ద ఉన్న వెడల్పాటి బండలపై గడుపుతున్నారు. పలమనేరు, బైరెడ్డిపల్లి మండలాల సరిహద్దుల్లో కౌండిన్య అడవికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతంలోనే ఎందుకు శబ్దాలు వస్తున్నాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. చదవండి: నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ.. తొలుత కరిడిమొడుగులో.. నాలుగు రోజుల క్రితం పలమనేరు మండలం కరిడిమొడుగు, సంబార్‌పూర్, నలగాంపల్లి ప్రాంతాల్లో వింతశబ్దాలు వినపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆపై తల తిరిగినట్లైందని, ఇళ్లలోని వస్తువులు కిందపడినట్లు అధికారులకు తెలిపారు. ఈ ప్రాంతానికి సమీపంలోని బైరెడ్డిపల్లి మండలంలో నెల్లిపట్ల పంచాయతీ కౌండిన్య అడవికి ఆనుకుని ఉంటుంది. రెండురోజుల క్రితం ఓటేరుపాళెం, నల్లగుట్లపల్లి, తిమ్మయ్యగారిపల్లి, ఎస్సీకాలనీ గ్రామాల్లోనూ వింత శబ్దాలు వచ్చాయి. గంటకోసారి, అరగంటకోసారి శబ్దాలు రావడంతో ఇంటి గోడలకు బీటలు పడడం, కళ్లు తిరిగినట్లు కావడంతో ఆ గ్రామాల ప్రజలు సమీపాల్లోని బండలపైకి వెళ్లారు. మండలంలోని పలుశాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి వెళ్లాక కూడా శబ్దాలు వస్తుండడంతో విధి లేక గ్రామీణులు గురువారం రాత్రి సైతం బండలపైనే జాగారం చేశారు. చదవండి: వైరల్: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా.. ఈ ప్రాంతంలోనే ఎందుకిలా.. కౌండిన్య అడవికి సమీపంలోని ఏడు గ్రామాల్లోనే ఇలా శబ్దాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఏడాది క్రితం 700 నుంచి 1200 అడుగుల దాకా వ్యవసాయబోర్లు డ్రిల్ చేస్తే గానీ గంగ జాడ కనిపించేంది కాదు. ఇటీవల ఈ ప్రాంతంలోనే వర్షాలు ఎక్కువ కురిశాయి. దీంతో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. దీంతో గతంలో భూమిలోపల ఖాళీగా ఉన్న పొరల మధ్య నీరు చేరడంతో అక్కడ ఏర్పడే ప్రకంపకనలతో భూమిలో నుంచి వచ్చే శబ్దాలు పైకి భయంకరంగా వినిపిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. సంబంధిత శాఖలైన భూగర్భజలాలు, భూకంపాలను పరిశీలిందే సిస్మోగ్రాఫర్లు ఈ ప్రాంతానికి వచ్చి స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈవిషయమై పలమనేరు తహసీల్దార్ కుప్పుస్వామిని వివరణ కోరగా ఆ గ్రామాల్లో శబ్దాలు వస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే భూమిలోపలి పొరల్లో నుంచి ఈ శబ్దాలు వస్తున్నాయని, సంబంధిత నిపుణులు పరిశీలించాక గానీ దీనిపై ఓ స్పష్టత రాదన్నారు. -
సంగీతమే సమతామంత్రం
సంగీతం అనాదికళ. పశుపక్ష్యాదుల ధ్వనులను మనుషులు అనుకరించడంతో సంగీతం పుట్టిందంటారు. భాష కంటే ముందే సంగీతం పుట్టి ఉంటుంది. తన బిడ్డను నిద్రపుచ్చడానికి ఏ ఆదిమ మాతృమూర్తి గళం నుంచో ప్రారంభ స్వరఝరి ప్రవహించి ఉంటుంది. వేదకాలం నాటికి సామగానంతో సంగీతానికి భాషతో చెలిమి కుదిరింది. ప్రపంచంలో పుట్టుకొచ్చిన ప్రతి భాషనూ సంగీతం అక్కున చేర్చుకుంది. అలా పాట పుట్టింది. పనికి పాట తోడైంది. పాట మనిషికి తన బతుకు పయనంలో ఊతమైంది, ఊరటైంది, ఊపిరైంది. ప్రపంచం నలుమూలలా విస్తరించిన సంగీతంలో ఎన్నో శైలీభేదాలు, వాటికి అనుగుణంగా సంగీత సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఎన్ని సంప్రదాయాలు, ఎన్ని శైలీభేదాలున్నా సంగీతం ఒక్కటే! అందులో ఉండేవి ఆ సప్తస్వరాలే! సంగీతం విశ్వజనీన భాష! సంగీతం మనసును తేలికపరుస్తుంది. సంగీతం జీవనోత్సాహాన్ని నింపుతుంది. సంగీతం మనుషుల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః’ అని ఆర్యోక్తి. శ్రావ్యమైన సంగీతానికి మనుషులే కాదు, పశుపక్ష్యాదులూ స్పందిస్తాయి. ఈ సంగతిని ఆధునిక శాస్త్ర పరిశోధనలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సంగీతాన్ని ఇష్టపడని వారు లోకంలో బహు అరుదు. సంగీతానికి స్పందించని మనిషి అత్యంత ప్రమాదకారి అని జ్యోతిష గ్రంథం ‘ఉత్తర కాలామృతం’ చెబుతోంది. మహాక్రూరులుగా పేరుమోసిన రాక్షసులు సైతం సంగీతాన్ని ఆస్వాదించిన ఉదంతాలు పురాణాల్లో ఉన్నాయి. ఆ లెక్కన సంగీతానికి స్పందించని వాళ్లు, సంగీతాన్ని ద్వేషించేవాళ్లు ఎంతటి కర్కశులో. సంగీతాన్ని ద్వేషించేవాళ్లంతా ఏకమై, జట్టుకడితే వాళ్లనే తాలిబన్లు అంటారు. సంగీతాన్ని ఏవగించుకునేవాళ్లు, పాటను పంజరంలో బంధించాలనుకునేవాళ్లు, గాలిలో స్వేచ్ఛగా ఎగిరే పాటను వేటాడాలనుకునేవాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్లు తాలిబన్ సోదరులే! తాలిబన్లకు తాతల నాటి నాజీలు సంగీతాన్ని నిషేధించలేదు గాని, సంగీతాన్ని తమ హింసాకాండకు పక్కవాద్యంలా వాడుకున్నారు. నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో జరిగిన ఘాతుకాల వెనుక ఆ క్యాంపుల్లో వినిపించిన సంగీతం పాత్ర గురించి తెలుసుకున్నాక విచలితుడైన ఫ్రెంచి సంగీతకారుడు, రచయిత పాస్కల్ కిగ్నార్డ్ తన సంగీత కార్యకలాపాలన్నింటినీ విరమించుకుని, ‘హేట్రెడ్ ఆఫ్ మ్యూజిక్’ అనే పుస్తకం రాశాడు. చరిత్రలోని వివిధకాలాల్లో సంగీతంలో చోటు చేసుకున్న పరిణామాలపై అధ్యయనం జరిపి, మనుషుల ఆలోచనలపైనా భావోద్వేగాలపైనా సంగీతం చూపగలిగే ప్రభావంపై విస్తృత పరిశోధన చేశాడాయన. సంగీతాన్ని ఆస్వాదించలేకపోవడం మానసిక రుగ్మత. ‘మ్యూజికల్ ఎన్హెడోనియా’ అనే వ్యాధికి లోనైనవారు సంగీతాన్ని ఆస్వాదించే శక్తిని కోల్పోతారు. ఇంకొందరికి ‘మ్యూజికల్ హాల్యూసినేషన్స్’– అంటే సంగీతభ్రాంతులు కలుగుతుంటాయి. చుట్టుపక్కల పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నా, వీరికి చెవులో నిరంతరం సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఏవేవో పాటలు, వాద్యగోష్ఠులు వినిపిస్తూ ఉంటాయి. దీనినే ‘మ్యూజికల్ ఇయర్ సిండ్రోమ్’ అంటారు. ఇవన్నీ నాడీవ్యవస్థ లోపాల వల్ల తలెత్తే మానసిక వ్యాధులు. సంగీతం పట్ల నిరాసక్తత, నిర్లిప్తత ప్రమాదకరంకాని మానసిక రుగ్మత. సంగీతం పట్ల నిరాసక్తత కలిగిన వారు జనాభాలో ఐదుశాతానికి మించి ఉండరని అంచనా. సంగీతం పట్ల ద్వేషం ఎలాంటి వ్యాధి అవుతుందో, దానికి నివారణ మార్గమేమిటో, దానిని నయం చేయగలిగిన చికిత్సా పద్ధతులేమిటో నిపుణులే చెప్పాలి. అసలు సంగీతమే చాలా రోగాలను నయం చేస్తుందంటారు. సంగీతంతో వ్యాధులను నయం చేసే ‘మ్యూజిక్ థెరపీ’ చికిత్సలు చేస్తున్నారు. సంగీతం సర్వరోగనివారిణి కాకపోయినా, చాలావరకు మానసిక రుగ్మతలను, మానసిక అలజడుల కారణంగా తలెత్తే శారీరక వ్యాధులను నయం చేయగలదని ఆధునిక నిపుణులు కూడా చెబుతున్నారు. మన భారతీయ సంగీతకారుల్లో ముత్తుస్వామి దీక్షితార్ తొలిసారిగా ఇలా సంగీతంతో వ్యాధిని నయం చేసినట్లు చెబుతారు. కడుపునొప్పితో విలవిలలాడుతున్న శిష్యుడిని చూసి ఆయన ఆశువుగా ‘తారాపతే బృహస్పతే’ అంటూ గురుగ్రహాన్ని స్తుతిస్తూ కీర్తనను గానం చేశారని, ఆయన గానానికి శిష్యుడు స్వస్థత పొందాడని ప్రతీతి. ఇటీవల మ్యూజిక్ థెరపీపై శాస్త్రీయ పద్ధతుల్లో ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. సంగీతం మానసిక అలజడిని దూరం చేస్తుందని, దిగులు గుబులు వంటి ప్రతికూల భావనలను దూరం చేస్తుందని, ఉత్సాహాన్ని నింపి కార్యోన్ముఖులను చేస్తుందని, రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుందని పరిశోధనలు తేల్చాయి. సంగీత ప్రపంచంలో ఇదివరకటి చాదస్తాలన్నీ ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. సంగీతంలోని భిన్న సంప్రదాయాలు ‘ఫ్యూజన్’ ప్రయోగాలతో పెనవేసుకుంటున్నాయి. సంగీతం తన శాస్త్రీయ పునాదులను పటిష్ఠం చేసుకుంటూనే, మరింతగా విస్తరిస్తోంది. ముక్కపచ్చలారని చిన్నారులు సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనాలను సృష్టిస్తున్నారు. ‘ఇండియన్ ఐడల్’, ‘సా రె గా మా పా’, ‘ది వాయిస్ ఆఫ్ ఇండియా’ వంటి టీవీ మ్యూజిక్ షోలే ఇందుకు నిదర్శనం. సంగీతం మరో పదికాలాల పాటు చల్లగా బతుకుతుందనడానికి కొత్తతరం గాయనీగాయకుల శ్రద్ధాసక్తులే తార్కాణం. ఎన్నో సంప్రదాయ కళలు కనుమరుగైపోతున్న తరుణంలో సంగీతం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా జవసత్త్వాలను పుంజుకోవడం విశేషం. ఈర్షా్య ద్వేషాల సంకుచిత ప్రపంచంలో మనుషుల మధ్య మమతానురాగాలను పదిలపరచడానికి సంగీతమే సమతామంత్రం. -
ఏ టీ ఎం సెంటర్ నుంచి భారీ మంటలు శబ్దాలు
-
‘శబ్ధాలకు భయపడి కార్తీక దీపం సీరియల్ చూడలేదు’
సాక్షి, హైదరాబాద్: బోరబండలోని వీకర్స్ కాలనీ సైట్ 3 నుంచి శుక్రవారం రాత్రి భారీ శబ్ధాలు వినిపించాయి. దాదాపు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయకంపితులయ్యారు. భూకంపం వచ్చిందేమోనని భయపడి స్థానికులు ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. శనివారం ఉదయం ఐదు గంటలకు మరో సారి శబ్ధాలు వచ్చాయి. దాంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శబ్ధాలకు భయపడి.. రాత్రి రోడ్డు మీదే నిద్రించారు. కొంతమంది అయితే రాత్రంతా మేలుకునే ఉన్నారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించ లేదు. భూమిలో నీరు పారుతుంటే కూడా శబ్ధాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ శబ్ధాలు వచ్చి రాత్రి కార్తిక దీపం సీరియల్ కూడా చూడలేదని బస్తీ మహిళ ఒకరు చెప్పడం విశేషం. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బోరబండ వాసులు భయపడుతున్నారు. (చదవండి: బోరబండలో స్వల్ప భూకంపం) -
బోరబండలో భారీ శబ్దాలు
సాక్షి, హైదరాబాద్ : బోరబండలోని వీకర్స్ కాలనీ సైట్ 3 నుంచి శుక్రవారం రాత్రి భారీ శబ్ధాలు వినిపించాయి. దాదాపు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయకంపితులయ్యారు. అయితే భూకంపం వచ్చిందేమోనని భయపడి స్థానికులు ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. అది భూకంపమా లేక భారీ శబ్దాలా అనేది తెలియాల్సి ఉంది. 2017లోనూ ఇదే తరహాలో భారీ శబ్దాలు వచ్చినట్లు బోరబండ వాసులు పేర్కొన్నారు. కాగా జీహెచ్ఎంసీ కమిషనర్ తన టీంతో కలిసి భారీ శబ్దాలు వినిపించిన సైట్-3 ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. -
ప్రపంచంలోనే ఉత్తమ శబ్దం ఇది
ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత అని మనందరికి తెలుసు. జంతువులను వేటాడే క్రమంలో అది పరుగెత్తినట్లు మరే జంతువు పరుగెత్తలేదు. అయితే ఇంత వేగంగా పరుగెత్తే జంతువు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శబ్దం ఎలా చేస్తుందో అందరికి తెలియదు. ఇప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందో ఈ వీడియో తెలియజేస్తుంది. దాని శబ్దం మీ చెవికి వినసొంపుగా ఉంటుంది. దీన్ని ఆస్ట్రేలియాలో ఉన్న వైల్డ్ క్యాట్ కన్జర్వేషన్ సెంటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!) కేర్ టేకర్ ఓ అందమైన చిరుత గడ్డం నిమురుతూ ఉండగా, అది హాయిగా నిద్రపోతోంది. ఆ సమయంలో చిరుత నుంచి వచ్చే శబ్దం సంగీతం విన్నట్లుగా ఉంది. ఈ వీడియోను వైల్డ్ క్యాట్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘ప్రపంచంలోనే ఉత్తమైన శబ్దం ఇది’అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గడ్డం నిమురుతూ ఉంటే చిరుత పొందిన శాంతికి నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఇంతకంటే హాయిదనం ఏముంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ప్రపంచంలోనే ఉత్తమ శబ్దం ఇది
-
కరోనా వేళ వణికిస్తున్న మిడతల దండు
-
మిడతల దండుపై దండయాత్ర
న్యూఢిల్లీ/నాగపూర్: రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది క్రిమి సంహారక మందులు చల్లారు, రైతులు పళ్లాలు మోగించారు. పెద్దపెద్ద శబ్దాలు చేశారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా? పచ్చటి పంటలను, చెట్ల ఆకులను విందు భోజనంలా ఆరగిస్తున్న రాకాసి మిడతల దండును తరిమికొట్టడానికే. ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మిడతలు దాడి చేసే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మిడతలు త్వరలో బిహార్, ఒడిశాకు చేరుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) హెచ్చరించింది. మామిడి తోటలకు తీవ్ర నష్టం మిడతలపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని హరియాణా వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కౌశల్ చెప్పారు. మిడతల విషయంలో తాజా పరిస్థితిని సమీక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. గత నెలలో పాకిస్తాన్ నుంచి రాజస్తాన్‌లోకి ప్రవేశించిన మిడతలు ఇప్పటికే 90 వేల హెక్టార్లలో పంటలను తినేశాయి. ఇవి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి అడుగుపెట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో క్రిమి సంహారక మందులు చల్లి, భారీ సంఖ్యలో మిడతలను హతమార్చారు. మహారాష్ట్రలోనూ పలు జిల్లాల్లో మిడతలు ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భారత్‌లో మిడతల దాడి మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఎఫ్ఏవో వెల్లడించింది. -
కొంగలు, పిచ్చుకలు ఏ జాతయ్యా?
ఆ చీకట్లో గొడ్లసావిడి దగ్గరకు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు పెద్దయ్య.‘‘రేయ్...గొడ్లకు నీళ్లు పెట్టారా లేదా?’’ఎటు నుంచి సమాధానం వినిపించడం లేదు.కాస్త ముందుకు వెళ్లి అక్కడున్న వ్యక్తిని చూసి...‘‘అదేమిటి ఉలుకూపలుకూ లేకుండా నిల్చున్నావు. ఎవరో అనుకుని నేను దడుచుకుచచ్చాను’’ అన్నాడు పెద్దయ్య.ఎల్లయ్య ముఖంలో విషాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.‘‘ఎందుకురా అలా ఉన్నావు?’’ అని అడగక ముందే... ‘‘నా పిల్ల కనబడటం లేదయ్యా’’ అన్నాడు. పిల్ల అంటే ఆయన కూతురు.‘‘పొద్దున్నే లేచి పొరుగూరి సంబంధం చూస్తానన్నావు!’’ అడిగాడు పెద్దాయన.‘‘అది ఉన్న ఊళ్లోనే మొగుడ్ని వెదుక్కుంది సామి’’ బాధగా అన్నాడు ఎల్లయ్య.‘‘ఉన్న ఊర్లోనే మొగుడ్ని వెదుక్కుందా? దాన్ని లేవదీసుకుపోయింది ఎవడో చెప్పు చెట్టుకు కట్టేసి చెప్పుతో కొడతాను’’ కోపంగా అన్నాడు పెద్దాయన.అతడు ఎవరో చెప్పకుండా ఎల్లయ్య మౌనముద్ర దాల్చాడు. ఆ మౌనంలో ఏదో భయం ఉంది.‘‘చెప్పరా?’’ అని గద్దించాడు పెద్దాయన.‘‘సామి! నా నోటి నుంచి ఆ మాట ఎలా చెప్పాలి?’’ అంటూనే ‘‘మీ మేనల్లుడు సిట్టయ్యండి. వాళ్లిద్దరూ కలిసి తిరగడం ఊరందరికీ తెలుసు. నా బిడ్డ వట్టి పిచ్చిదయ్యా. దానికి అన్నెంపున్నెం తెలియదు. అది పారిపోయి నెలతప్పి ఇంటికొస్తే ....’’ ఏడుపు ఆపుకుంటూ మనసులోని బాధని వెళ్లగక్కాడు ఎల్లయ్య.పెద్దయ్య కళ్లలో ఆశ్చర్యం.‘‘చొక్కాయికి బొత్తాలు కూడా పెట్టుకోలేని వెధవ అంత పెద్దవాడయ్యాడా. ఎల్లయ్యా...అలాంటిది ఏం జరగదు. నీ బిడ్డ భద్రంగా ఇల్లు చేరుతుంది పో’’ అంటూ పారిపోయిన జంటను వెదకడానికి బయలుదేరాడు పెద్దాయన. ‘‘ఒరేయ్ పుల్లయ్యా...’’ ‘‘ఏంటయ్యా ఇలా వచ్చారు?’’ ‘‘ఎల్లయ్య కూతురు కనిపించడం లేదు...’’ ‘‘దానికి మీరెందుకయ్యా నేను వెదుకుతాను’’పుల్లయ్య మాటతో సమాధానపడని పెద్దయ్య శరభయ్య ఇంటికి వెళ్లి...‘‘అరే శరభయ్యా...నీ స్నేహితుడు చిట్టయ్య ఆ ఎల్లయ్య కూతురిని ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పు’’ అని గద్దించాడు.‘‘నాకు తెలియదు’’ అని బుకాయించబోయాడు శరభయ్య.‘‘నరికిపోగులు పెడతాను’’ అని పెద్దాయన అరిచేసరికి శరభయ్య వణుకుతూ...‘‘యేటి పక్కకు తీసుకెళ్లాడయ్యా...అంతకుమించి నాకు ఏమీ తెలియదు’’ అని చెప్పాడు.‘‘అక్కడ లేకపోతే నీ సంగతి చెబుతా’’ అని బుసలు కొడుతూ యేటి దగ్గరికి బయలుదేరాడు పెద్దాయన.అక్కడేవో శబ్దాలు వినిపిస్తున్నాయి.‘‘చిట్టెయ్య...మీ మామ వస్తున్నాడు. దోనెలో దాక్కోండి...’’ అంటుంది గౌరి.పెద్దాయన దగ్గరకు రాగానే...‘‘ఈ యేళ ఇక్కడున్నరేమిటీ?’’ అడిగింది గౌరి.‘‘నేను అదే అడుగుతున్నాను. ఈ యేళ నీకు ఇక్కడేం పని?’’ గట్టిగా అడిగాడు పెద్దాయన.గౌరీ ఏదో చెప్పబోయిందిగానీ...అది అక్షరాలా అబద్ధమని తెలిసిపోతూనే ఉంది.గౌరి చెంప చెళ్లుమనిపించి....‘‘ఎవర్నే దోనెలో సాగనంపుతున్నావు? గుట్టుగా ఏరు దాటించి కాపురం చేయించడానికి అక్కడ ఏమైనా మేడ కట్టించావా!’’ అని గర్జించాడు పెద్దాయన.‘‘నన్ను ఏమైనా చేసుకోండి. నాకు బాధ లేదు. నన్ను కొట్టు చంపు...కానీ వాళ్లిద్దరినీ మొగుడు పెళ్లాలుగా అంగీకరిస్తేనే ఒడ్డుకు వస్తారు. లేకపోతే యేట్లో కొట్టుకుపోనీ.... వదలవయ్యా తాడు’’ అన్నది గౌరి.గౌరి మాటలు పట్టించుకోకుండా దోనె తాడును ఒడ్డు వైపు బలంగా లాగుతున్నాడు పెద్దాయన.అయినా గౌరి నోరు ఆగలేదు.‘‘వయసులో ఉన్నవాడు తనకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటే ఏమిటి తప్పు? వరుసైందని, డబ్బు చాలా ఉందని ఎవరినో ఒకరిని చేసుకుని బతికినంత కాలం వాన్ని ఏడ్వమంటావా.’’ అన్నది.గౌరి వైపు కోపంగా చూశాడు పెద్దాయన.‘‘నీకెందుకయ్యా ఉలుకు’’ అని గట్టిగా అంది గౌరి. పెద్దాయన కోపం నషాళానికి ఎక్కింది.‘‘ఏయ్ నోర్మోయ్...కడుపు చేత్తో పట్టుకుని తిరిగేవాళ్లకు కుటుంబ గౌరవం గురించి ఏం తెలుసే..’’ అని అరిచాడు. పెద్దయ్య మాటలకు గౌరి నొచ్చుకుంది.‘‘అవునయ్యా...మేము బతుకుదెరువు కోసం వొచ్చినోళ్లమే. పూరి గుడిసెలో పడుకున్నా, ఏటి ఒడ్డున పడుకున్నా పడుకోగానే నిద్ర పట్టే జాతయ్యా మాది. అంబలి తాగినా, జొన్న కూడు తిన్నా, మట్టి తిన్నా సరే...మళ్లీ ఆకలేసే జాతయ్యా మాది.కొంగలు, పిచ్చుకలు ఏ జాతయ్యా?అవి సంతోషంగా బతకడం లేదా!ఇంకా నయం రామచిలక,ఊరపిచ్చుక,గూడకొంగ అని జాతులు విడదీయలేదు. నీ కోపం కంటే ఏటి కోపం ఎక్కువ. తాడు వదిలేయ్’’ ఆవేశంగా అంది.‘ఏ వేదంబు పఠించె లూత?’ అన్నట్లు గౌరి ఏ వేదాలూ చదవలేదు. ఏ పుస్తకాలూ చదవలేదు. అక్షరజ్ఞానం లేని అమ్మాయి ఎంత లోతుగా మాట్లాడింది!యువజంట ఒడ్డుకు వచ్చి పెద్దాయన కాళ్ల మీద పడ్డారు. కోపంతో కత్తి పైకి లేపాడు పెద్దాయన. కానీ అప్పుడు ఆయన అంతరాత్మ చెవిలో ఇలాగొణికింది:‘‘ఏమాయ్య...నువ్వు నీ పెళ్లాంతో ఎలాగూ సుఖంగా లేవు. వాళ్లనైనా సుఖంగా కాపురం చేసుకోనివ్వు’’అంతే.. పెద్దయ్య బెట్టు చెదిరింది. అప్పుడే సన్నగా వర్షపు చినుకులు మొదలయ్యాయి.ఆచిన్నిచినుకుల్లో పెద్దాయన కోపం చల్లారి పోయింది. అతని పెదాలపై సన్నని నవ్వు. ఆ నవ్వు ఎన్నో చెబుతున్నట్టుగా ఉంది.‘చిన్నదానివైనా పెద్ద మాటలు చెప్పి చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకువచ్చావు’అప్పటి వరకు మంటలా చెలరేగిపోయిన పెద్దాయన మంచులా చల్లబడటంతో గౌరి కళ్లు చెమర్చాయి.‘‘నువ్వెంత కటువుగా మాట్లాడినా నీది చిన్నపిల్లాడి మనసు. రెండు మేకకూనలు వీడిపోతేనే బాధపడతావు...సిన్న పిల్లలు విడిపోతే ఊరుకుంటావా! ప్రాణాలు తీసే యముడి దగ్గర పాశం ఉంటుంది. శివుడి దగ్గర పాశం ఉంటుంది. నువ్వు శివుడివయ్యా...’’ పెద్దాయనను ఆకాశానికెత్తుతూఅన్నది గౌరి సంతోషంగా. -
రణగొణ ధ్వనులకు ఇక ఫుల్స్టాప్!
నగరం మధ్యలో ఇల్లు ఉంటే వచ్చే సౌకర్యాల మాటేమో గానీ.. రాత్రిపగలూ వచ్చే రణగొణ ధ్వనులు మాత్రం భలే చికాకు పెడతాయి. ఈ సమస్య ఇంకెంతో కాలం ఉండదంటున్నారు సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. హెడ్‌ఫోన్స్‌లో అనవసరమైన ధ్వనులను తొలగించేందుకు ఉపయోగించే నాయిస్ క్యాన్సెలేషన్ టెక్నాలజీని కిటికీలకూ అన్వయించడం ద్వారా నగరం నడిబొడ్డున కూడా ధ్వని కాలుష్యం లేకుండా చేయవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫొటోలో కిటికీలోని లోహపు కడ్డీలకు కొన్ని పరికరాల్లాంటివి వేలాడుతున్నాయి చూడండి.. అవే నాయిస్ క్యాన్సెలేషన్ పరికరాలు. బయటి నుంచి వచ్చే శబ్దాలకు అనుగుణంగా ఇవి కూడా కొన్ని శబ్దాలను సృష్టిస్తాయి. ఈ రెండు రకాల ధ్వనులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో రెండూ క్యాన్సిల్ అయిపోతాయి. ఫలితంగా ఇంట్లో ఉండేవారికి ఎలాంటి ధ్వని కూడా వినిపించదు. ధ్వనికి తగ్గ ప్రతిధ్వనిని సృష్టించేందుకు ఈ పరికరాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. నమూనా యంత్ర వ్యవస్థ ద్వారా తాము రణగొణ ధ్వనులను 50 శాతం వరకూ తగ్గించగలిగామని... నగరాల్లో తరచూ వినిపించే ధ్వనులను ఒక స్పీకర్ ద్వారా వెలువరించి తాము ప్రయోగాలు చేశామని గాన్ వూన్ సెంగ్ అనే శాస్త్రవేత్త వివరించారు. -
గూబ గుయ్యిమంటోంది
‘గ్రేటర్’లో పెరిగిపోతున్న ధ్వని, వాయు కాలుష్యం చాలాచోట్ల పరిమితికి మించి శబ్దాలు నగర రోడ్లపై 45 లక్షల వాహనాలు.. నిత్యం కొత్తగా రోడ్డెక్కుతున్నవి 600 ఎక్కడ చూసినా ఎడాపెడా హారన్ల మోతే.. ప్రత్యేక గుర్తింపు కోసం మోడిఫైడ్ హారన్లు వినియోగిస్తున్న కుర్రకారు పొగ, దుమ్ము, ధూళితో పెరుగుతున్న శ్వాసకోశ, చెవి సంబంధ సమస్యలు వాయు కాలుష్యంలో దేశంలోనే నాలుగో స్థానంలో రాజధాని నగరం మొదటి 3 స్థానాల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై సాక్షి, హైదరాబాద్ ఈ నగరానికి ఏమైంది..? ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఊపిరి సలపనీయని కాలుష్యం.. ఇంకోవైపు గూబ గుయ్‌మనిపించేలా హారన్ మోతలు! మహానగరంలో రోడ్డెక్కితే చాలు... ఇక పేషెంట్‌గా మారి మంచం ఎక్కడమే తరువాయి అనే పరిస్థితి. అటు వాయు కాలుష్యం.. ఇటు ధ్వని కాలుష్యంతో నగరజీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వాహనాల పొగ, దుమ్ము, ధూళితోపాటు రణగొణధ్వనులతో నగరవాసులు ఊపిరితిత్తులు, చెవి సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో మొత్తం వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకుంది. ఇందులో సుమారు 10 లక్షల వరకు కాలం చెల్లిన కార్లు, జీపులు, బస్సులు, ఆటోలున్నాయి. వీటి నుంచి వెలువడుతున్న పొగలో ధూళి రేణువులు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్య కారకాలు ఊపిరితిత్తులకు ఎసరు పెడుతున్నాయి. నగరంలో ప్రధానంగా పలు కూడళ్లలో ధూళి కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. ఒక ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రో గ్రాములు మించరాదు. కానీ నగరంలో చాలాచోట్ల వంద మైక్రో గ్రాములకు పైబడి ధూళి రేణువులు నమోదవుతున్నాయి. ఇక రోడ్లపై శబ్దాలు 50 నుంచి 55 డెసిబుల్స్ మించరాదు. కానీ చాలాచోట్ల 65-75 డెసిబుల్స్ ఉంటోంది. బద్దలవుతున్న కర్ణభేరీ ట్రాఫిక్ రద్దీలో వాహనాల రణగొణ ధ్వనులతో నగరవాసుల కర్ణభేరీ బద్ధలవుతోంది. ఇప్పటికే ఉన్న 45 లక్షలకుతోడు నిత్యం 600 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో వాయు కాలుష్యంతో పాటు శ బ్ద కాలుష్యం శృతిమించుతోంది. కుర్రకారు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు కోసం మార్పు చేసిన హారన్స్(మోడిఫైడ్ హారన్స్)ను వినియోగిస్తుండడం, స్పోర్ట్స్ బైక్స్, ఎస్యూవీ, ఎంయూవీ వాహనాల ధ్వనులతో శబ్ద కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు వంద ట్రాఫిక్ జంక్షన్లలో హారన్ల మోత మోగుతోందని ట్రాఫిక్ అధికారులు లెక్కలు వేశారు. ఆయా కూడళ్ల వద్ద వాహనదారులు సహనం కోల్పోయి హారన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈ శబ్దకాలుష్యాన్ని కట్టడి చేయడంలో ట్రాఫిక్, ఆర్టీఏ విభాగాలు విఫలమవుతున్నాయి. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులు, కార్లు కూడా నగరంలో సుమారు 8 లక్షలకుపైగా ఉన్నాయి. వీటివ ల్ల కూడా ధ్వని కాలుష్యం పెరిగిపోతోంది. వాయు కాలుష్యంలో నాలుగోస్థానం దేశంలో అత్యధిక వాయుకాలుష్య నగరాల జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తన తాజా నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. ఈ నివేదికలో దేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ నిలిచాయి. మన పొరుగున ఉన్న చెన్నై, బెంగళూరు ఐదు, ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ధూళి కాలుష్యం ఎక్కువ బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్పల్లి, సైనిక్‌పురి, నాచారం, జూపార్క్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళి కాలుష్యం వంద మైక్రో గ్రాములకు మించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమౌతున్నారు. ధూళి కాలుష్యానికి ప్రధాన కారణాలు.. - మెట్రో పనులతోపాటు నగర రహదారులపై నిత్యం విద్యుత్, మంచినీరు, రహదారుల నిర్మాణం, టెలిఫోన్ కేబుల్స్ కోసం జరుపుతున్న తవ్వకాలతో ధూళి కాలుష్యం పెరుగుతోంది. - పనులు ముగిసిన తర్వాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు అలాగే వదిలేయడం - వాహనాల వేగానికి రోడ్లపై లేస్తున్న దుమ్ము, ధూళి, ట్రాఫిక్‌లో డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగ. అనర్థాలు ఇవీ.. - డస్ట్ ఎలర్జీలతో సతమతమయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. - ఆస్తమా, బ్రాంకైటీస్, హైబ్లెడ్ ఫ్రెషర్, వంటి సమస్యలతో సతమతమతున్నారు. - నగరంలోని పలు ఆసుపత్రులకు వస్తున్న 90 శాతానికి పైగా రోగులు ధూళి కాలుష్యం బారిన పడుతున్నవారే పీసీబీ లెక్కల ప్రకారం పలు ప్రాంతాల్లో నమోదైన ధూళికాలుష్యం(ఆర్‌ఎస్‌పీఎం)మోతాదు ఇలా ఉంది. పరిమితి: ఘనపు మీటరు గాలిలో 60 మైక్రో గ్రాములకు మించరాదు. ప్రాంతం ధూళి కాలుష్యం మైక్రో గ్రాముల్లో బాలానగర్ 105 ఉప్పల్ 88 జూబ్లీహిల్స్ 85 ప్యారడైజ్ 113 చార్మినార్ 114 జీడిమెట్ల 123 ట్యాంక్‌బండ్ 64 ఎంజీబీఎస్ 67 చిక్కడపల్లి 81 లంగర్‌హౌజ్ 177(అత్యధికం) మాదాపూర్ 50 శామీర్‌పేట్ 70 కూకట్పల్లి 123 సైనిక్‌పురి 112 రాజేంద్రనగర్ 41 నాచారం 101 ఆబిడ్స్ 92 కేబీఆర్పార్క్ 54 హెచ్‌సీయూ 76 జూపార్క్ 107.7 పంజాగుట్ట 114.7 శ్వాసకోశ వ్యాధులు తప్పవు గాల్లోని దుమ్ము, ధూళి రేణువులు సూర్యకిరణాలతో రసాయనిక సంయోగం చెంది ఫోటో కెమికల్ సొల్యుషన్ ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావం ఊపిరితిత్తులపై ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేవారే అధికంగా ఉంటున్నారు. ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా కేసులు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై వెళ్లే వారు ముక్కుకు మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - డాక్టర్ యుగేందర్ భట్ , పల్మానాలజిస్ట్, కేర్ ఆస్పత్రి(1.40 కామన్‌లో డీఆర్ యుగేందర్ భట్ పేరుతో ఉంది ) శబ్ద కాలుష్యానికి కారణాలివే... - గ్రేటర్ పరిధిలో నిత్యం 45 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభిస్తోంది. ఈ క్రమంలో వాహనదారులు హారన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. - నగరంలో జరుగుతున్న మెట్రో పనుల్లో వినియోగిస్తున్న భారీ క్రేన్లు, ఇతర యంత్ర సామాగ్రితో అధిక శబ్దం వెలువడుతోంది. - చాలాచోట్ల అనవసరంగా హారన్ ఉపయోగించడం. అధిక శబ్దం వెలువరించే మోడిఫైడ్ హారన్ల వినియోగం - కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై తిరగడం చెవుడు వచ్చే ప్రమాదం: డాక్టర్ రవిశంకర్, కోఠి, ఈఎన్టీ ఆస్పత్రి. (1.40 కామన్‌లో డీఆర్ రవిశంకర్ పేరుతో ఉంటుంది) అధిక శబ్దాలు విన్నప్పుడు చికాకు, అసహనం, విసుగు కలుగుతాయి. 75-80 డెసిబుల్స్‌కు మించిన శబ్దాలు వింటే కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల్లో కర్ణభేరీలోని సూక్ష్మ నాడులు దెబ్బతింటాయి. వృద్ధులకు శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ఇయర్ ప్లగ్‌లు వాడడం లేదా హెల్మెట్ ధరించినా శబ్దకాలుష్యం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. కేంద్ర పీసీబీ తాజా నివేదిక ప్రకారం వాయు కాలుష్యంలో నగరాల స్థానాలివీ.. నగరం స్థానం కాలుష్యం మోతాదు (ఘనపు మీటరు గాలిలో మైక్రోగ్రాముల్లో) ఢిల్లీ 1 128 కోల్‌కతా 2 117 ముంబై 3 95 హైదరాబాద్ 4 80 చెన్నై 5 75 బెంగళూరు 6 70 నగరంలో పలుచోట్ల నమోదవుతున్న శబ్ద కాలుష్యం ఇలా.. ప్రాంతం డెసిబుల్స్ ప్యారడైజ్ 75 పంజగుట్ట 75 ఆబిడ్స్ 74 జేఎన్టీయూ 70 జీడిమెట్ల 67 తార్నాక 65 గచ్చిబౌలి 65 జూబ్లీహిల్స్ 61 జూపార్క్ 60 (పరిమితి: 50 నుంచి 55 డెసిబుల్స్‌ను మించరాదు) -
శబ్దంతో ఇబ్బంది పెట్టే జబ్బు!
మెడిక్షనరీ చెవిలో జోరీగ చేసే శబ్దం ఎంత చిరాగ్గా అనిపిస్తుంది! అకస్మాత్తుగా ఎవరైనా ఈల వేసినా, టీ వంటి ద్రవపదార్థాలను జుర్రుకునే శబ్దాలు చేసినా, గట్టిగా బ్రేవుమంటూ తేన్చినా, కాళ్లు టపటపా కొడుతూ నడిచినా, ఎవరైనా గురకపెడుతున్నా ... ఆ చప్పుళ్లు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇది అందరికీ ఉండే చాలా సాధారణమైన సహజాతం (ఇన్స్టింక్ట్). కానీ కొందరికి చిన్న చిన్న చప్పుళ్లే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తాయి. దాన్నే వైద్య పరిభాషలో ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’ అంటారు. అమెరికాకు చెందిన నరాలపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు (న్యూరోసైంటిస్టులు) పావెల్ జెస్టర్ఫాబ్, మార్గరెట్ జస్టర్ఫాబ్ ఆ జబ్బుకు ఈ పేరు పెట్టారు. దీన్నే సాధారణంగా ‘మీసోఫోనియా’ అంటారు. అంటే శబ్దాలను అసహ్యించుకోవడం అని అర్థం. ఇలాంటి జబ్బు ఉన్నవాళ్లు టూత్ బ్రష్ చేసే చప్పుళ్లనూ, తుమ్ములనూ, దగ్గునూ, టైపింగ్ శబ్దాలనూ, ఆవలింతలనూ, పెద్దగా నవ్వడాన్ని, చివరకు మింగుతున్నప్పుడు వచ్చే శబ్దాలనూ తట్టుకోలేరు. ఈ జబ్బు ఉన్నవాళ్లకు శబ్దాలు వినగానే ఒళ్లంతా చెమటలు పెట్టడం, గుండెవేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివాళ్లకు ముందుగా ఫ్యాన్ శబ్దంతో మొదలుపెట్టి నెమ్మదిగా నెమ్మదిగా శబ్దాలను తట్టుకునేలా వారికి రకరకాల శబ్దాలు అలవాటు చేస్తారు. కొందరికి 6-12 వారాల పాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) చేస్తారు. -
బోగీల్లో శబ్దాలు..ఆగిన నాందేడ్ రైలు
డిచ్పల్లి: కాచిగూడ నుంచి నాందేడ్ వెళ్లే రైలు బోగీల్లో శబ్దాలు వస్తుండటంతో కొద్దిసేపు నిలిచిపోయింది.నాందేడ్ రైలు రెండు బోగీల నుంచి పెద్దగా శబ్దాలు వస్తుండటంతో డ్రైవర్ బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి స్టేషన్లో కొద్దిసేపు సర్వీసును ఆపేశారు. శబ్ధాలు రావడంతో భయబ్రాంతులకు లోనైన ప్రయాణికులు కొందరు రైలు దిగారు. అర్దగంట అనంతరం తిరిగి రైలు సేవల్ని పునరుద్ధరించి,రైలును నిజామాబాద్ తీసుకెళ్లారు. మరమ్మతుల అనంతరం 12.30 గంటల ప్రాంతంలో నాందేడ్ వైపు బయలుదేరిందని రైల్వే అధికారులు తెలిపారు.