ద్విచక్రవాహనాల నుంచి గుండెలదిరే ధ్వనులు
వింత వింత శబ్దాలతో దడ పుట్టిస్తున్న మోటారుసైక్లిస్టులు
సైలెన్సర్లు మార్చేసి రోడ్లపై చక్కర్లు
భయాందోళనకు గురవుతున్న ప్రజలు
అధిక మోతతోప్రమాదమంటున్న నిపుణులు
ట్రాఫిక్ రణగొణధ్వనులతో వాతావరణం ఇప్పటికే కలుషితమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్విచక్రవాహనదారులు సృష్టిస్తున్న భీకర శబ్దాలతో కాలుష్యం మరింతగా పెరుగుతోంది. బైక్‌లకు ఇష్టారాజ్యంగా సైలెన్సర్లు మార్చేసి హల్‌చల్ చేస్తున్నారు.
గుండెలదిరే సౌండ్‌తో మోటార్‌సైకిల్ నడుపుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. చిత్రవిచిత్రమైన ధ్వనులను వెలువరించే వివిధ రకాల పొగ గొట్టాలను తమ వాహనాలకు అమర్చుకుని జనం చెవులుపగలగొడుతున్నారు. ఈ స్థాయి శబ్దాలు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కోరి వ్యాధులను కొనితెచ్చుకోవడమేనని హెచ్చరిస్తున్నారు.
చిత్తూరు అర్బన్: ఇటీవల ఏదో ఆటంబాబు పేలితే వచ్చే పెద్ద పెద్ద శబ్దాలతో ద్విచక్రవాహన చోదకులు కొందరు చేస్తున్న స్టంట్లు ప్రాణాలపైకి తెస్తున్నాయి. రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లులు పడే శబ్దాలతో రోడ్లపై కొందరు కుర్రకారు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
ద్విచక్రవాహనాలు కొనే సమయంలో కంపెనీ ద్వారా వచ్చే సైలెన్సర్లు (పొగ గొట్టాలు) తొలగించి, వాటి స్థానంలో రోత పుట్టించే వాటిని అమర్చుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా ఎన్‌ఫీల్డ్, కేటీఎం, ఆర్‌ఎక్స్–100 లాంటి ద్విచక్రవాహనాల్లో ఈ తరహా సైలెన్సర్లను అమర్చుకుని ప్రజల కర్ణభేరితో ఆడుకుంటున్నారు. ఇందుకోసం షార్ట్ బాటిల్. అంగళూర్, డబుల్ బేరల్, రెడ్ రూస్టర్. అబ్బో ఇలాంటి పేర్లు చాలానే ఉన్నాయి.
ఇవన్నీ పలు రకాల బైకులకు అమచ్చే సైలెన్సర్ల పేర్లు. బాటిల్ పగులగొట్టినట్లు శబ్దం వస్తే షార్ట్ బాటిల్. అడవి పంది అరచినట్లు శబ్దం వచ్చే పొగ గొట్టానికి వైల్డ్ బోర్ ఎగ్జాస్ట్. తుపాకీ పేలుస్తున్నట్లు శబ్దం వస్తే టెయిల్ గన్నర్. ప్రస్తుతం ఈ తరహా వింత శబ్దాలు చేస్తూ రోడ్లపై తిరిగే ద్విచక్ర వాహనాలతో సామాన్యుల చెవులు పగిలిపోతున్నాయి.
పర్యావరణానికీ ఇబ్బంది
రాజసం, హోదా ఉట్టి పడేలా ఉండాలని బుల్లెట్ కొనుక్కునేవాళ్లు ఒకరు. కుర్రకారు క్రేజ్‌గా కేటీఎం. 80వ దశకం నాటి ఆర్‌ఎక్స్–100 పై రోడ్డుపై వెళుతుంటే ఆ హాయే వేరు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు సమస్యంతా రూ.లక్షలు వెచ్చించి కొంటున్న ద్విచక్ర వాహనాల పొగ గొట్టాలను ఇష్టానుసారం మార్చేసి, రోడ్లపై వెళ్లే ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయడమే. దీనికి తోడు బైకుల నుంచి వచ్చే వింత శబ్దాలతో పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతోంది.
ఎదుటివారి పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతూ రోత పుట్టిస్తున్న వాళ్లపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకుపోతే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా మనం 60 డెసిబెల్స్ శబ్దం వరకు వినగలం. అంతకంటే శబ్దం పెరిగేకొద్దీ ఒక్కో రకమైన వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.
చట్టం చెబుతోంది ఇదీ..
ఒక వాహనం సైలెన్సర్ నుంచి నిర్ణీత డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ వస్తే.. అది శబ్ద కాలుష్యం సృష్టించినట్టే. దీనికిగానూ మోటారు వాహన చట్టంలోని యాక్టు 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయాలి. బైకు నడిపిన వ్యక్తికి రూ.10వేల జరిమానాతో పాటు, కేసు నమోదు చేసి కోర్టుకు పంపాలి. మళ్లీ రెండోసారి శబ్దకాలుష్యానికి కారణమైతే బైకు నడిపిన వ్యక్తికి జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉంది.
ఇక మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు పెట్టవచ్చు. కొందరు కంపెనీ సైలెన్సర్లు తీసేస్తుంటే, మరికొందరు మఫ్లర్‌లను తీసేసి తీవ్రమైన శబ్ద కాలుష్యం సృష్టిస్తురు. మూడేళ్ల క్రితం చిత్తూరులో ఈ తరహా సైలెన్సర్లు అమర్చిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు.
పొగ గొట్టాలను తొలగించి, రోడ్డు రోలర్‌తో తొక్కించారు. రెండోసారి పట్టుబడ్డవారిపై కేసులు నమోదు చేశారు. కానీ ప్రస్తుతం తమ కళ్లెదుటే వింత వింత శబ్డాలు చేస్తూ బైకర్లు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
అనారోగ్యం తప్పదు
శబ్ద తరంగాలను మన చెవికి కావాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ,వింటే శారీరక, మానసిక వ్యాధులు వస్తాయి. అధిక శబ్దాలను వినడం ద్వారా చెవిలోని నరాలు దెబ్బతిని వినికిడి వ్యవస్థకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. దీంతో శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. పైగా మానసికంగా ఒత్తిడి పెరిగి చిరాకు కలుగుతుంది. ఆ కోపాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవాళ్లపై చూపిస్తుంటాం. దీంతో మానవ బంధాలు కూడా దెబ్బతింటాయి. ద్విచక్ర వాహనాలకు ఆయా కంపెనీలు ఇచ్చే సైలైన్సర్లను పెట్టుకోవడమే మంచిది. లేకుంటే ఆనారోగ్యం తప్పదు. – పురుషోత్తం, వైద్య నిపుణుడు, చిత్తూరు ప్రభుత్వాసుపత్రి
అధిక శబ్దంతో ముప్పు ఇదీ..
100డెసిబెల్స్ దాటిన శబ్దం గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది
110డెసిబెల్స్ చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది.
120డెసిబెల్స్ చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది.
160డెసిబెల్స్ చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతింటాయి.
190డెసిబెల్స్‌కర్ణభేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు.
చర్యలు తీసుకుంటాం
సైలెన్సర్లను మార్చేసి ఇష్టానుసారం ప్రజలకు ఇబ్బందులు కలిగే శబ్దాలు చేయడం మంచిదికాదు. అసలు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ వయసులో వాహనాలు ఇవ్వాలో తెలుసుకోవాలి. ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు మార్చకుండా చూసుకోవాలి. ఎంవీ యాక్టు కింద ఇలాంటి వారికి భారీ జరిమానాలు విధిస్తున్నాం.
ఇక మెకానిక్‌లు కూడా సైలెన్సర్లను మార్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం. సైలెన్సర్‌ను మార్పు చేయాలని ఎవరైనా మెకానిక్‌ల వద్దకు వస్తే, చేయమని కచ్చితంగా చెప్పండి. చట్ట పరిమితిలో లేని సైలెన్సర్లను విక్రయించేవారిపై కూడా చర్యలు తప్పవు. వీటి వల్ల ఎక్కడైనా ఇబ్బంది వస్తే డయల్–100 నంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చు. – మణికంఠ చందోలు, ఎస్పీ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment