ముళ్లపొదల్లోకి గోల్డ్ విసిరేసిన వర్తకులు
బుల్లెట్ తగిలి ఒకరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
విజయనగరం జిల్లా అప్పన్నవలస కూడలి వద్ద ఘటన
చీపురుపల్లిరూరల్(గరివిడి): బంగారు వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్ద బుధవారం రాత్రి జరిగింది. గరివిడి ఎస్‌ఐ ఎల్.దామోదరరావు కథనం ప్రకారం... రాజాం పట్టణంలో నివసిస్తున్న ఇద్దరు బంగారు వర్తకులు రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.
చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వర్తకులు తమ వద్ద ఉన్న బంగారాన్ని సమీపంలో ఉన్న తుప్పల్లోకి విసిరేశారు. వారి నుంచి ఏమీ దొరక్కపోవడంతో సెల్‌ఫోన్లను లాక్కున్నారు. దుండగలు జరిపిన కాల్పుల్లో ఒక వర్తకుడికి బుల్లెట్ తగిలి ఎడమ చేతికి గాయమైంది.
ఆయన రాజాం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం బృందం, డాగ్‌స్క్వాడ్ పరిశీలించాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 7న ఇదే రోడ్డులో గరివిడి మండలం కాపుశంబం కూడలి వద్ద కూడా రాత్రి 12 గంటల సమయంలో చీపురుపల్లి వైపు వెళ్తున్న ఆటోను కొంతమంది వ్యక్తులు ఆపి దాడి చేయడమే కాకుండా వెంటాడి భయాందోళనకు గురిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment