Motor cyclist
-
భీకర బైకర్లు!
ట్రాఫిక్ రణగొణధ్వనులతో వాతావరణం ఇప్పటికే కలుషితమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్విచక్రవాహనదారులు సృష్టిస్తున్న భీకర శబ్దాలతో కాలుష్యం మరింతగా పెరుగుతోంది. బైక్‌లకు ఇష్టారాజ్యంగా సైలెన్సర్లు మార్చేసి హల్చల్ చేస్తున్నారు. గుండెలదిరే సౌండ్‌తో మోటార్‌సైకిల్ నడుపుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. చిత్రవిచిత్రమైన ధ్వనులను వెలువరించే వివిధ రకాల పొగ గొట్టాలను తమ వాహనాలకు అమర్చుకుని జనం చెవులుపగలగొడుతున్నారు. ఈ స్థాయి శబ్దాలు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కోరి వ్యాధులను కొనితెచ్చుకోవడమేనని హెచ్చరిస్తున్నారు.చిత్తూరు అర్బన్: ఇటీవల ఏదో ఆటంబాబు పేలితే వచ్చే పెద్ద పెద్ద శబ్దాలతో ద్విచక్రవాహన చోదకులు కొందరు చేస్తున్న స్టంట్లు ప్రాణాలపైకి తెస్తున్నాయి. రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లులు పడే శబ్దాలతో రోడ్లపై కొందరు కుర్రకారు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ద్విచక్రవాహనాలు కొనే సమయంలో కంపెనీ ద్వారా వచ్చే సైలెన్సర్లు (పొగ గొట్టాలు) తొలగించి, వాటి స్థానంలో రోత పుట్టించే వాటిని అమర్చుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా ఎన్ఫీల్డ్, కేటీఎం, ఆర్ఎక్స్–100 లాంటి ద్విచక్రవాహనాల్లో ఈ తరహా సైలెన్సర్లను అమర్చుకుని ప్రజల కర్ణభేరితో ఆడుకుంటున్నారు. ఇందుకోసం షార్ట్ బాటిల్. అంగళూర్, డబుల్ బేరల్, రెడ్ రూస్టర్. అబ్బో ఇలాంటి పేర్లు చాలానే ఉన్నాయి. ఇవన్నీ పలు రకాల బైకులకు అమచ్చే సైలెన్సర్ల పేర్లు. బాటిల్ పగులగొట్టినట్లు శబ్దం వస్తే షార్ట్ బాటిల్. అడవి పంది అరచినట్లు శబ్దం వచ్చే పొగ గొట్టానికి వైల్డ్ బోర్ ఎగ్జాస్ట్. తుపాకీ పేలుస్తున్నట్లు శబ్దం వస్తే టెయిల్ గన్నర్. ప్రస్తుతం ఈ తరహా వింత శబ్దాలు చేస్తూ రోడ్లపై తిరిగే ద్విచక్ర వాహనాలతో సామాన్యుల చెవులు పగిలిపోతున్నాయి. పర్యావరణానికీ ఇబ్బంది రాజసం, హోదా ఉట్టి పడేలా ఉండాలని బుల్లెట్ కొనుక్కునేవాళ్లు ఒకరు. కుర్రకారు క్రేజ్‌గా కేటీఎం. 80వ దశకం నాటి ఆర్ఎక్స్–100 పై రోడ్డుపై వెళుతుంటే ఆ హాయే వేరు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు సమస్యంతా రూ.లక్షలు వెచ్చించి కొంటున్న ద్విచక్ర వాహనాల పొగ గొట్టాలను ఇష్టానుసారం మార్చేసి, రోడ్లపై వెళ్లే ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయడమే. దీనికి తోడు బైకుల నుంచి వచ్చే వింత శబ్దాలతో పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతోంది.ఎదుటివారి పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతూ రోత పుట్టిస్తున్న వాళ్లపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకుపోతే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా మనం 60 డెసిబెల్స్ శబ్దం వరకు వినగలం. అంతకంటే శబ్దం పెరిగేకొద్దీ ఒక్కో రకమైన వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. చట్టం చెబుతోంది ఇదీ.. ఒక వాహనం సైలెన్సర్ నుంచి నిర్ణీత డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ వస్తే.. అది శబ్ద కాలుష్యం సృష్టించినట్టే. దీనికిగానూ మోటారు వాహన చట్టంలోని యాక్టు 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయాలి. బైకు నడిపిన వ్యక్తికి రూ.10వేల జరిమానాతో పాటు, కేసు నమోదు చేసి కోర్టుకు పంపాలి. మళ్లీ రెండోసారి శబ్దకాలుష్యానికి కారణమైతే బైకు నడిపిన వ్యక్తికి జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఇక మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు పెట్టవచ్చు. కొందరు కంపెనీ సైలెన్సర్లు తీసేస్తుంటే, మరికొందరు మఫ్లర్లను తీసేసి తీవ్రమైన శబ్ద కాలుష్యం సృష్టిస్తురు. మూడేళ్ల క్రితం చిత్తూరులో ఈ తరహా సైలెన్సర్లు అమర్చిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. పొగ గొట్టాలను తొలగించి, రోడ్డు రోలర్‌తో తొక్కించారు. రెండోసారి పట్టుబడ్డవారిపై కేసులు నమోదు చేశారు. కానీ ప్రస్తుతం తమ కళ్లెదుటే వింత వింత శబ్డాలు చేస్తూ బైకర్లు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనారోగ్యం తప్పదు శబ్ద తరంగాలను మన చెవికి కావాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ,వింటే శారీరక, మానసిక వ్యాధులు వస్తాయి. అధిక శబ్దాలను వినడం ద్వారా చెవిలోని నరాలు దెబ్బతిని వినికిడి వ్యవస్థకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. దీంతో శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. పైగా మానసికంగా ఒత్తిడి పెరిగి చిరాకు కలుగుతుంది. ఆ కోపాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవాళ్లపై చూపిస్తుంటాం. దీంతో మానవ బంధాలు కూడా దెబ్బతింటాయి. ద్విచక్ర వాహనాలకు ఆయా కంపెనీలు ఇచ్చే సైలైన్సర్లను పెట్టుకోవడమే మంచిది. లేకుంటే ఆనారోగ్యం తప్పదు. – పురుషోత్తం, వైద్య నిపుణుడు, చిత్తూరు ప్రభుత్వాసుపత్రి అధిక శబ్దంతో ముప్పు ఇదీ.. 100డెసిబెల్స్ దాటిన శబ్దం గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది 110డెసిబెల్స్ చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది.120డెసిబెల్స్ చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది. 160డెసిబెల్స్ చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతింటాయి. 190డెసిబెల్స్కర్ణభేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. చర్యలు తీసుకుంటాం సైలెన్సర్లను మార్చేసి ఇష్టానుసారం ప్రజలకు ఇబ్బందులు కలిగే శబ్దాలు చేయడం మంచిదికాదు. అసలు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ వయసులో వాహనాలు ఇవ్వాలో తెలుసుకోవాలి. ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు మార్చకుండా చూసుకోవాలి. ఎంవీ యాక్టు కింద ఇలాంటి వారికి భారీ జరిమానాలు విధిస్తున్నాం. ఇక మెకానిక్‌లు కూడా సైలెన్సర్లను మార్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం. సైలెన్సర్‌ను మార్పు చేయాలని ఎవరైనా మెకానిక్‌ల వద్దకు వస్తే, చేయమని కచ్చితంగా చెప్పండి. చట్ట పరిమితిలో లేని సైలెన్సర్లను విక్రయించేవారిపై కూడా చర్యలు తప్పవు. వీటి వల్ల ఎక్కడైనా ఇబ్బంది వస్తే డయల్–100 నంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చు. – మణికంఠ చందోలు, ఎస్పీ, చిత్తూరు -
ఇంట్లోకి దూసుకెళ్లిన బైక్.. మొబైల్ చూస్తూ కూర్చున్న మహిళ, అక్కడే ఉన్న కుక్క షాక్!
Motorcycle Crashed Into A Shop: ఇంతవరకు మనం చాలా రకాల ప్రమాదాలను చూసి ఉన్నాం. చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్లను కూడా చూశాం. అయితే కొద్దిమంది మాత్రమే ఎలాంటి గాయాలపాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అచ్చం అలాంటి ఘటనే వియాత్నంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...వియాత్నంలోని హో చి మిన్లో ఒక వ్యక్తి నడుపుతున్న మోటారు బైక్ అదుపు తప్పి ఓ ఇంట్లోని లివింగ్ రూమ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో లివింగ్ రూమ్‌లో మొబైల్ చూస్తూ కూర్చున్న ఓ మహిళకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లక్కీగా ఆమె వెంటనే తేరుకుని ఒక్క ఉదుటున వెనక్కి జరగడంతో దూసుకొచ్చిన బైక్ ఆమెకు కొద్ది దూరంలో ఎగిరిపడింది. అక్కడే ఉన్న పెంపుడు కుక్క సైతం ప్రమాదాన్ని గ్రహించి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే! ఇక బైక్‌తోపాటు దాని రైడర్ కూడా వెళ్లకిలా పడి చచ్చాన్రా దేవుడో అని నడుము పట్టుకున్నాడు. స్వల్ప గాయాలతో అతను బయటపడటం, ఆ మహిళకు, కుక్కకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ బైక్ ఎందువల్ల అదుపుతప్పి ఇంట్లోకి దూసుకు వచ్చిందో తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి) -
జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్!
సాధారణంగా వర్షా కాలంలో రోడ్లన్నీ తడిసి ముద్దవుతుంటాయి. అలాంటి రోడ్లపై ద్విచక్ర వాహనంలో ప్రయాణించే వారికి ప్రమాదాలు ఎదురైన ఘటనలు బోలెడు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయాల్లో రోడ్లపై బండి టైర్లకు పట్టులేని కారణంగా వాహనాలు అదుపు తప్పి పడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే మలేషియాలో చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ వాహనదారునికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. జస్ట్ మిస్ లేదంటే.. ఆ వీడియోలో.. వర్షం పడతుండడంతో రోడ్డంతా తడిసిపోయి తేమగా ఉంది. అంతలో ఓ బైకర్ వేగంగా దూసుకువచ్చాడు. అంతకు ముందే వర్షంతో రోడ్డు చిత్తడిగా మారడంతో ఆ వాహనదారుడు జారిపడ్డాడు. అయితే వెనకనుంచి అదే లేన్‌లో ఓ ట్రక్ వస్తోంది. ఇది గమనించిన ఆ బైకర్ తేరుకుని వెంటనే ఆ ట్రక్కు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఖాళీగా ఉన్న పక్క లేన్ వైపు లేచి పరిగెత్తాడు. కేవలం సెకన్ల వ్యవధిలో ఆ బైకర్ ట్రక్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 24న జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘బాబు చాలా లక్కీ’, ‘జస్ట్ మిస్ లేదంటే’.. అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్ -
లిఫ్ట్ అడిగి దాడి చేసి.. చివరికి..
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): లిఫ్ట్ అడిగి.. చివరికి ద్విచక్రవాహనాదారుడిపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని తొండవాడ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మల్లయ్యపల్లెకి చెందిన గురవయ్య తిరుపతి శివారులోని ఓ గోడౌన్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే శనివారం విధులు ముగించుకుని తన బైక్‌పై చంద్రగిరికి పయనమయ్యాడు. పేరూరు వద్ద వస్తున్న క్రమంలో ఇద్దరు యువకులు తమ బైక్‌లో పెట్రోల్ అయిపోయింది.. లిఫ్ట్ కావాలని కోరారు. దీంతో గురవయ్య పేరూరు నుంచి తొండవాడ వద్దకు రాగానే వారిని దిగాలని కోరాడు. అనంతరం అక్కడ నుంచి చంద్రగిరికి వెళ్తున్న క్రమంలో మరో యువకుడితో కలసి వారు గురవయ్యను వెంబడించారు. ఇనుప రాడ్డుతో ఆయనపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి గురవయ్య కింద పడిపోయాడు. అనంతరం రాడ్డుతో తలపై మోది, గురవయ్య వద్ద ఉన్న రూ.5వేల నగదు, ఏటీఎంలను దోచుకుని పారిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న గురవయ్యను స్థానికులు గుర్తించి, 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గురవయ్యను తిరుపతి రుయాకు తరలించారు. అనంతరం ఆదివారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పరువు కోసం కూతురిని కడతేర్చిన తండ్రి మహిళ కాళ్లు చేతులు కట్టి పడేసి, చిత్ర హింసలు పెట్టి.. -
మోటార్ సైక్లిస్టు సంతోష్‌కు ప్రమాదం
న్యూఢిల్లీ: భారత ప్రముఖ మోటార్ సైక్లిస్టు, హీరో మోటో స్పోర్ట్స్ రేసర్ సీఎస్ సంతోష్ బుధవారం ప్రమాదానికి గురయ్యాడు. సౌదీ అరేబియాలో జరుగుతోన్న డాకర్ ర్యాలీ మోటార్ రేసు సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. రేసులో భాగంగా కంకరతో కూడిన ట్రాక్‌పై 135 కి.మీ వేగంతో ప్రయాణిస్తోన్న 37 ఏళ్ల సంతోష్ అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతని కుడి భుజానికి, తలకు గా యాలయ్యాయి. వెంటనే విమానంలో రియాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని, వైద్యులు అతన్ని కృత్రిమ కోమాలో ఉంచారని హీరో మోటో స్పోర్ట్స్ యాజమాన్యం ప్రకటించింది. -
పోలీస్ అధికారి మీద పడి చితకొట్టాడు.. వైరల్
లివర్‌పూల్(ఇంగ్లాండ్) : నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ పోలీసు అధికారి మీద పడి పిడి గుద్దులు కురిపొంచాడో వ్యక్తి. అక్కడున్న వారు అతన్ని పక్కకు లాగడంతో ఆ అధికారి పరిస్థితి చావుతప్పి కన్నులొట్ట పోయినట్లైంది. స్వల్ప గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ నగరానికి దగ్గరలోని ఓ రోడ్డుపై పోలీసు అధికారి కేయిత్ కెల్లెట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు . అదే సమయంలో అటు వైపుగా మోటార్ బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిపై అనుమానంతో ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించాల్సిందిగా కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన వాహనదారుడు పోలీసు అధికారిని దుర్భాషలాడటమే కాకుండా మీద పడి పిడిగుద్దులు గుద్దటం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలు తాళలేకపోయిన అధికారి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇది గమనించిన అక్కడి వారు ఆ వ్యక్తిని విడిపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు బైకు యాజమానిని విడిపించి అటు నుంచి అటే పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని మెర్సీసైడ్‌కు చెందిన మాగ్హల్గా పోలీసులు గుర్తించారు. బైకుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడం, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై చెయ్యి చేసుకోవడం వంటి నేరాల కింద అతనికి శిక్ష పడింది. ఈ దృశ్యాలన్నింటిని అటువైపుగా వెళుతున్న ఓ వాహనదారుడు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పోలీసుపై దాడి
-
హ్యాండ్‌బ్యాగ్ హెల్మెట్!
హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని మోటార్ సైక్లిస్టులను అడగండి. సగం కంటే ఎక్కువ మంది ‘అబ్బే... మోత బరువు సార్’ అనే అంటారు. అలాంటి వారి కోసమేనేమో... న్యూయార్క్‌లోని ఓ కంపెనీ ఈ ఫొటోల్లో చూపిన హెల్మెట్‌ను తయారు చేసింది. ఏబీఎస్ అనే పదార్థంతో తయారుచేసిన ఈ హెల్మెట్ దృఢంగా ఉండటమే కాకుండా... మామూలు హెల్మెట్ల సైజులో మూడో వంతు మాత్రమే ఉంటుంది. అవసరం లేనప్పుడు దీన్ని మడతపెట్టి బ్యాగులోకి కుక్కేసుకోవచ్చునన్నమాట! -
కారు వెనకే వెళ్లినా...
జంటనగరాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ వానల ప్రభావానికి రోడ్లన్నీ బాగా పాడయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద గోతులు పడ్డాయి. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ గోతుల్లో పడి పెను ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే అంశంపై గతంలో జరిగిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందు కారు వెళ్తోంది కదా అని.. జాగ్రత్తగా దాని వెనకే వెళ్లిన ఓ మోటారు సైక్లిస్టు.. రోడ్డుపై ఉన్న పెద్ద గోతిలో పడిపోయాడు. చక్కగా హెల్మెట్ పెట్టుకుని.. వాననీళ్లు ఉన్నాయి కదాని జాగ్రత్తగా ఒక కారు వెనకాలే వెళ్లిన సదరు మోటారు సైకిల్ వ్యక్తి.. ఎదురుగా ఉన్నది నీళ్లే అనుకున్నాడు. ఎంత జాగ్రత్తగా ఆ నీళ్లలోంచి వెళ్లినా.. రోడ్డు మీద పడిన పెద్ద గోతిలో పడిపోయాడు. ఎలాగోలా అక్కడి నుంచి పైకి లేచి.. పక్కకు వచ్చాడు గానీ, అతడి మోటార్ సైకిల్ మాత్రం పూర్తిగా గోతిలోనే ఉండిపోయింది. గతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని, అందువల్ల నీళ్లలోంచి ద్విచక్ర వాహనాల మీద వెళ్లేటప్పుడు, నడిచేటపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. -
కారు వెనకే వెళ్లినా...
-
ఒళ్లు తెలియని కోపంతో..
మోటారుసైక్లిస్ట్‌ని కొట్టి చంపారు చిన్నారుల ఎదుటే తండ్రి ఉసురు తీసిన వైనం సాక్షి, న్యూఢిల్లీ : ఓ చిన్న ఘటనతో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని గాలిలో కలిపేసింది. తమ కారును ఢీకొట్టాడన్న కోపంతో కొందరు దుర్మార్గులు ఇద్దరు చిన్నారుల అమాయకపు చూపుల మధ్యేవారి తండ్రిని ఒళ్లు తెలియని కోపంతో నిర్ధాక్షిణ్యంగా చంపేశారు. ఈ దారుణం ఆదివారం రాత్రి దరియాగంజ్ ప్రాంతంలో తుర్క్‌మన్‌గేటు వద్ద జరిగింది. షానవాజ్(38) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను మోటారుసైకిల్‌పై కూర్చోబెట్టుకుని ఆదివారం రాత్రి ఇంటికి తిరిగివెళుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఐ20 కారును అనుకోకుండా ఢీకొట్టాడు. ఇది చిన్న ఘటనే అయినప్పటికీ కారులోని వ్యక్తులు షానవాజ్‌తో వాదులాటకు దిగారు. ఒళ్లు తెలియని కోపంతో కర్రలు, ఇనుపరాడ్లతో షానవాజ్‌ను తీవ్రంగా కొట్టారు. తలపై ఇనుపరాడ్ బలంగా తగలడంతో షానవాజ్ సృహతప్పి కిందపడిపోయాడు. దీంతో కారులో వచ్చిన వ్యక్తులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. షానవాజ్ పడిఉండటాన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే షానవాజ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన స్థానికులు రోడ్లను దిగ్బంధించారు. అటుగా వచ్చిన రెండు కార్ల విండోలను ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలను తగలబెట్టారు. పోలీసులు ఆలస్యంగా రావడంతోనే నిందితులు పారిపోయారని వారు ఆరోపించారు. కాగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు ప్రయాణికుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అలాగే వాహనాలను ధ్వంసం చేసిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.