కారు వెనకే వెళ్లినా...
జంటనగరాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ వానల ప్రభావానికి రోడ్లన్నీ బాగా పాడయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద గోతులు పడ్డాయి. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ గోతుల్లో పడి పెను ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే అంశంపై గతంలో జరిగిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందు కారు వెళ్తోంది కదా అని.. జాగ్రత్తగా దాని వెనకే వెళ్లిన ఓ మోటారు సైక్లిస్టు.. రోడ్డుపై ఉన్న పెద్ద గోతిలో పడిపోయాడు.
చక్కగా హెల్మెట్ పెట్టుకుని.. వాననీళ్లు ఉన్నాయి కదాని జాగ్రత్తగా ఒక కారు వెనకాలే వెళ్లిన సదరు మోటారు సైకిల్ వ్యక్తి.. ఎదురుగా ఉన్నది నీళ్లే అనుకున్నాడు. ఎంత జాగ్రత్తగా ఆ నీళ్లలోంచి వెళ్లినా.. రోడ్డు మీద పడిన పెద్ద గోతిలో పడిపోయాడు. ఎలాగోలా అక్కడి నుంచి పైకి లేచి.. పక్కకు వచ్చాడు గానీ, అతడి మోటార్ సైకిల్ మాత్రం పూర్తిగా గోతిలోనే ఉండిపోయింది. గతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని, అందువల్ల నీళ్లలోంచి ద్విచక్ర వాహనాల మీద వెళ్లేటప్పుడు, నడిచేటపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.