బేగంపేట్ – బాలానగర్ రహదారి ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: వానొస్తే నగర జీవనం నరకం కాకూడదనే తలంపుతో సీఆర్‌ఎంపీ కింద ప్రధాన రహదారుల మార్గాల్లోని రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేటు ఏజెన్సీలకిచ్చారు. రోడ్ల పరిస్థితి ఫర్వాలేదని భావిస్తున్న తరుణంలోనే.. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.
జీహెచ్‌ఎంసీ నిర్వహణలోని రోడ్లతో పాటు సీఆర్‌ఎంపీ మార్గాల్లోనూ గుంతలు పడ్డాయి. ప్రయాణాలకు ఆటంకంగా మారి, అవస్థలుకలిగిస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీల మార్గాల్లో ఫిర్యాదు చేసేందుకుసంబంధిత ఏజెన్సీల ఫోన్ నంబర్లతో ఆయా మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కే ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాన రహదారుల పరిస్థితి ఇలాఉండగా, కాలనీలు.. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి.
ఇటీవల కురిసిన వరుస వర్షాలతో నగరంలోని అనేక రహదారులు దెబ్బతిన్నాయి. నగరంలో వానొస్తే రోడ్లు జలమయం కావడం.. గుంతలమయం కావడం.. ప్రయాణం నరకప్రాయంగా మారడం.. నగర ప్రజలకు తెలిసిందే. ఈ సంవత్సరం ఇప్పటి వరకు వరుస వర్షాలు కురవకపోవడం.. కరోనా కారణంగా ప్రజలు చాలావరకు ఇళ్లల్లోనే ఉండటం.. లాక్‌డౌన్ తదితర కారణాలతో రోడ్ల సమస్యలు పెద్దగా దృష్టికి రాలేదు. ఈమధ్య వరుసబెట్టి కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అధ్వానపు రోడ్ల సమస్యలు ఉండరాదనే తలంపుతో ఈ సంవత్సరం ప్రధాన రహదారుల మార్గాల్లోని 709 కి.మీ మేర రోడ్ల నిర్వహణను ప్రభుత్వం సీఆర్‌ఎంపీ (సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం) పేరిట బడా కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించింది. రోడ్ల నిర్మాణం పూర్తయినా, కాకున్నా వీటి అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడ్డ పాట్‌హోల్స్ (గుంతలు) పూడ్చివేత తదితర మరమ్మతుల్ని ఈ ఏజెన్సీలే చేయాల్సి ఉంది. కాంట్రాక్టు ఒప్పందం మేరకు ఇప్పటి వరకు 50 శాతం రోడ్ల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా పనులు పూర్తికాలేదు. మిగతా రోడ్లలో ఏర్పడే సమస్యల్ని సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. వర్షాలకు సీఆర్‌ఎంపీ పరిధిలోని మార్గాల్లో, ఇతర మార్గాల్లో వెరసి మొత్తం 3069 పాట్‌హోల్స్ ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. వాటి మరమ్మతుల పనులు వెంటనే చేపట్టామని, చాలా వరకు పూర్తి కాగా, మిగతావి త్వరలోనే పూర్తి అవుతాయన్నారు.
ఫిర్యాదు చేసేదెలా?
సీఆర్‌ఎంపీ ఏజెన్సీలు పనులు చేపట్టిన మార్గాల్లోని రోడ్లపై ఫిర్యాదులకు ఆయా మార్గాల్లో సదరు ఏజెన్సీ.. ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్‌లతో బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ పని జరగలేదు. త్వరలోనే ఫోన్ నంబర్లతో సైనేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రోడ్ల సమస్యలపై ఇప్పటి వరకు పెద్దగా ఫిర్యాదులు లేకపోవడంతో తాము కూడా ఇతర పనులపై దృష్టి సారించినట్లు, ఇప్పుడిక వీటిపై శ్రద్ధ చూపుతామని మరో అధికారి పేర్కొన్నారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించకుంటే కాంట్రాక్టు ఏజెన్సీలకు పెనాల్టీలు విధించవచ్చు. కానీ, ఫిర్యాదులే అందనిది పెనాల్టీలా వేస్తారో మరి!
Comments
Please login to add a commentAdd a comment