
తీవ్రగాయాలతో గురవయ్య
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): లిఫ్ట్ అడిగి.. చివరికి ద్విచక్రవాహనాదారుడిపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని తొండవాడ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మల్లయ్యపల్లెకి చెందిన గురవయ్య తిరుపతి శివారులోని ఓ గోడౌన్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే శనివారం విధులు ముగించుకుని తన బైక్‌పై చంద్రగిరికి పయనమయ్యాడు. పేరూరు వద్ద వస్తున్న క్రమంలో ఇద్దరు యువకులు తమ బైక్‌లో పెట్రోల్ అయిపోయింది.. లిఫ్ట్ కావాలని కోరారు. దీంతో గురవయ్య పేరూరు నుంచి తొండవాడ వద్దకు రాగానే వారిని దిగాలని కోరాడు.
అనంతరం అక్కడ నుంచి చంద్రగిరికి వెళ్తున్న క్రమంలో మరో యువకుడితో కలసి వారు గురవయ్యను వెంబడించారు. ఇనుప రాడ్డుతో ఆయనపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి గురవయ్య కింద పడిపోయాడు. అనంతరం రాడ్డుతో తలపై మోది, గురవయ్య వద్ద ఉన్న రూ.5వేల నగదు, ఏటీఎంలను దోచుకుని పారిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న గురవయ్యను స్థానికులు గుర్తించి, 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గురవయ్యను తిరుపతి రుయాకు తరలించారు. అనంతరం ఆదివారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
పరువు కోసం కూతురిని కడతేర్చిన తండ్రి
మహిళ కాళ్లు చేతులు కట్టి పడేసి, చిత్ర హింసలు పెట్టి..
Comments
Please login to add a commentAdd a comment