గూబ గుయ్యిమంటోంది
‘గ్రేటర్’లో పెరిగిపోతున్న ధ్వని, వాయు కాలుష్యం
చాలాచోట్ల పరిమితికి మించి శబ్దాలు
నగర రోడ్లపై 45 లక్షల వాహనాలు..
నిత్యం కొత్తగా రోడ్డెక్కుతున్నవి 600
ఎక్కడ చూసినా ఎడాపెడా హారన్ల మోతే..
ప్రత్యేక గుర్తింపు కోసం మోడిఫైడ్ హారన్లు
వినియోగిస్తున్న కుర్రకారు
పొగ, దుమ్ము, ధూళితో పెరుగుతున్న
శ్వాసకోశ, చెవి సంబంధ సమస్యలు
వాయు కాలుష్యంలో దేశంలోనే
నాలుగో స్థానంలో రాజధాని నగరం
మొదటి 3 స్థానాల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై
సాక్షి, హైదరాబాద్
ఈ నగరానికి ఏమైంది..? ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఊపిరి సలపనీయని కాలుష్యం.. ఇంకోవైపు గూబ గుయ్‌మనిపించేలా హారన్ మోతలు! మహానగరంలో రోడ్డెక్కితే చాలు... ఇక పేషెంట్‌గా మారి మంచం ఎక్కడమే తరువాయి అనే పరిస్థితి. అటు వాయు కాలుష్యం.. ఇటు ధ్వని కాలుష్యంతో నగరజీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
వాహనాల పొగ, దుమ్ము, ధూళితోపాటు రణగొణధ్వనులతో నగరవాసులు ఊపిరితిత్తులు, చెవి సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో మొత్తం వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకుంది. ఇందులో సుమారు 10 లక్షల వరకు కాలం చెల్లిన కార్లు, జీపులు, బస్సులు, ఆటోలున్నాయి. వీటి నుంచి వెలువడుతున్న పొగలో ధూళి రేణువులు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్య కారకాలు ఊపిరితిత్తులకు ఎసరు పెడుతున్నాయి. నగరంలో ప్రధానంగా పలు కూడళ్లలో ధూళి కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. ఒక ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రో గ్రాములు మించరాదు. కానీ నగరంలో చాలాచోట్ల వంద మైక్రో గ్రాములకు పైబడి ధూళి రేణువులు నమోదవుతున్నాయి. ఇక రోడ్లపై శబ్దాలు 50 నుంచి 55 డెసిబుల్స్ మించరాదు. కానీ చాలాచోట్ల 65-75 డెసిబుల్స్ ఉంటోంది.
బద్దలవుతున్న కర్ణభేరీ
ట్రాఫిక్ రద్దీలో వాహనాల రణగొణ ధ్వనులతో నగరవాసుల కర్ణభేరీ బద్ధలవుతోంది. ఇప్పటికే ఉన్న 45 లక్షలకుతోడు నిత్యం 600 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో వాయు కాలుష్యంతో పాటు శ బ్ద కాలుష్యం శృతిమించుతోంది. కుర్రకారు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు కోసం మార్పు చేసిన హారన్స్(మోడిఫైడ్ హారన్స్)ను వినియోగిస్తుండడం, స్పోర్ట్స్ బైక్స్, ఎస్‌యూవీ, ఎంయూవీ వాహనాల ధ్వనులతో శబ్ద కాలుష్యం అవధులు దాటుతోంది.
గ్రేటర్ పరిధిలో సుమారు వంద ట్రాఫిక్ జంక్షన్లలో హారన్ల మోత మోగుతోందని ట్రాఫిక్ అధికారులు లెక్కలు వేశారు. ఆయా కూడళ్ల వద్ద వాహనదారులు సహనం కోల్పోయి హారన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈ శబ్దకాలుష్యాన్ని కట్టడి చేయడంలో ట్రాఫిక్, ఆర్టీఏ విభాగాలు విఫలమవుతున్నాయి. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులు, కార్లు కూడా నగరంలో సుమారు 8 లక్షలకుపైగా ఉన్నాయి. వీటివ ల్ల కూడా ధ్వని కాలుష్యం పెరిగిపోతోంది.
వాయు కాలుష్యంలో నాలుగోస్థానం
దేశంలో అత్యధిక వాయుకాలుష్య నగరాల జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తన తాజా నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. ఈ నివేదికలో దేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ నిలిచాయి. మన పొరుగున ఉన్న చెన్నై, బెంగళూరు ఐదు, ఆరో స్థానంలో ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో ధూళి కాలుష్యం ఎక్కువ
బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్‌పల్లి, సైనిక్‌పురి, నాచారం, జూపార్క్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళి కాలుష్యం వంద మైక్రో గ్రాములకు మించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమౌతున్నారు.
ధూళి కాలుష్యానికి ప్రధాన కారణాలు..
- మెట్రో పనులతోపాటు నగర రహదారులపై నిత్యం విద్యుత్, మంచినీరు, రహదారుల నిర్మాణం, టెలిఫోన్ కేబుల్స్ కోసం జరుపుతున్న తవ్వకాలతో ధూళి కాలుష్యం పెరుగుతోంది.
- పనులు ముగిసిన తర్వాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు అలాగే వదిలేయడం
- వాహనాల వేగానికి రోడ్లపై లేస్తున్న దుమ్ము, ధూళి, ట్రాఫిక్‌లో డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగ.
అనర్థాలు ఇవీ..
- డస్ట్ ఎలర్జీలతో సతమతమయ్యేవారి సంఖ్య పెరుగుతోంది.
- ఆస్తమా, బ్రాంకైటీస్, హైబ్లెడ్ ఫ్రెషర్, వంటి సమస్యలతో సతమతమతున్నారు.
- నగరంలోని పలు ఆసుపత్రులకు వస్తున్న 90 శాతానికి పైగా రోగులు ధూళి కాలుష్యం బారిన పడుతున్నవారే
పీసీబీ లెక్కల ప్రకారం పలు ప్రాంతాల్లో నమోదైన ధూళికాలుష్యం(ఆర్‌ఎస్‌పీఎం)మోతాదు ఇలా ఉంది.
పరిమితి: ఘనపు మీటరు గాలిలో 60 మైక్రో గ్రాములకు మించరాదు.
ప్రాంతం ధూళి కాలుష్యం మైక్రో గ్రాముల్లో
బాలానగర్ 105
ఉప్పల్ 88
జూబ్లీహిల్స్ 85
ప్యారడైజ్ 113
చార్మినార్ 114
జీడిమెట్ల 123
ట్యాంక్‌బండ్ 64
ఎంజీబీఎస్ 67
చిక్కడపల్లి 81
లంగర్‌హౌజ్ 177(అత్యధికం)
మాదాపూర్ 50
శామీర్‌పేట్ 70
కూకట్‌పల్లి 123
సైనిక్‌పురి 112
రాజేంద్రనగర్ 41
నాచారం 101
ఆబిడ్స్ 92
కేబీఆర్‌పార్క్ 54
హెచ్‌సీయూ 76
జూపార్క్ 107.7
పంజాగుట్ట 114.7
శ్వాసకోశ వ్యాధులు తప్పవు
గాల్లోని దుమ్ము, ధూళి రేణువులు సూర్యకిరణాలతో రసాయనిక సంయోగం చెంది ఫోటో కెమికల్ సొల్యుషన్ ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావం ఊపిరితిత్తులపై ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేవారే అధికంగా ఉంటున్నారు. ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా కేసులు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై వెళ్లే వారు ముక్కుకు మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- డాక్టర్ యుగేందర్ భట్ , పల్మానాలజిస్ట్, కేర్ ఆస్పత్రి(1.40 కామన్‌లో డీఆర్ యుగేందర్ భట్ పేరుతో ఉంది )
శబ్ద కాలుష్యానికి కారణాలివే...
- గ్రేటర్ పరిధిలో నిత్యం 45 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభిస్తోంది. ఈ క్రమంలో వాహనదారులు హారన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు.
- నగరంలో జరుగుతున్న మెట్రో పనుల్లో వినియోగిస్తున్న భారీ క్రేన్లు, ఇతర యంత్ర సామాగ్రితో అధిక శబ్దం వెలువడుతోంది.
- చాలాచోట్ల అనవసరంగా హారన్ ఉపయోగించడం. అధిక శబ్దం వెలువరించే మోడిఫైడ్ హారన్ల వినియోగం
- కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై తిరగడం
చెవుడు వచ్చే ప్రమాదం: డాక్టర్ రవిశంకర్, కోఠి, ఈఎన్‌టీ ఆస్పత్రి. (1.40 కామన్‌లో డీఆర్ రవిశంకర్ పేరుతో ఉంటుంది)
అధిక శబ్దాలు విన్నప్పుడు చికాకు, అసహనం, విసుగు కలుగుతాయి. 75-80 డెసిబుల్స్‌కు మించిన శబ్దాలు వింటే కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల్లో కర్ణభేరీలోని సూక్ష్మ నాడులు దెబ్బతింటాయి. వృద్ధులకు శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ఇయర్ ప్లగ్‌లు వాడడం లేదా హెల్మెట్ ధరించినా శబ్దకాలుష్యం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.
కేంద్ర పీసీబీ తాజా నివేదిక ప్రకారం వాయు కాలుష్యంలో నగరాల స్థానాలివీ..
నగరం స్థానం కాలుష్యం మోతాదు (ఘనపు మీటరు గాలిలో మైక్రోగ్రాముల్లో)
ఢిల్లీ 1 128
కోల్‌కతా 2 117
ముంబై 3 95
హైదరాబాద్ 4 80
చెన్నై 5 75
బెంగళూరు 6 70
నగరంలో పలుచోట్ల నమోదవుతున్న శబ్ద కాలుష్యం ఇలా..
ప్రాంతం డెసిబుల్స్
ప్యారడైజ్ 75
పంజగుట్ట 75
ఆబిడ్స్ 74
జేఎన్‌టీయూ 70
జీడిమెట్ల 67
తార్నాక 65
గచ్చిబౌలి 65
జూబ్లీహిల్స్ 61
జూపార్క్ 60
(పరిమితి: 50 నుంచి 55 డెసిబుల్స్‌ను మించరాదు)