సాక్షి,సిటీబ్యూరో : హైదరాబాద్‌ను స్వచ్ఛ, కాలుష్యరహిత నగరంగా నిరంతరం ఉంచే స్ఫూర్తిని కలిగించేలా జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. మంగళవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్‌ఎంసీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. అధికారులు, ఉద్యోగులతో పాటు నగరంలోని స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లందరూహమ్ రహేంగే నెం.1 అనే బ్యాడ్జిలను ప్రత్యేకంగా ధరించేలా చర్యలు చేపట్టనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు.
దీంతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు వైట్ కలర్ షర్ట్‌ను ధరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు కమిషనర్ తెలిపారు. ఈ సంవత్సరాన్ని స్వచ్ఛ సంవత్సరంగా పాటించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో సుమారు రోజుకు ఒక కిలో చెత్త ఉత్పత్తి అవుతుందని, వీటిలో 750గ్రాములను సేంద్రీయ ఎరువుగా తయారు చేయవచ్చని, ఇందుకుగాను ప్రతి ఇంటిలో సేంద్రీయ ఎరువు తయారీ యూనిట్‌ను లేదా గుంతలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
2022 నాటికి.....
పర్యావరణనానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ వాడకాన్ని, విక్రయాలను 2022లోగా పూర్తిగా వాడకాన్ని నిషేధించాలనే భారీ లక్ష్యాన్ని కూడా నిర్థారించుకుంది. ముఖ్యంగా ఒకేసారి మాత్రమే ఉపయోగించే అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నివారించేందుకు చర్యలు చేపట్టింది. నగరంలో ఉన్న మూడువేలకు పైగా కాలనీ సంక్షేమ సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించింది.
ప్రతి సర్కిల్‌లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్లాస్టిక్ వినియోగంపై వారితో ప్రత్యేక ప్రతిజ్ఞలు నిర్వహించడం, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో ఉన్న పదిలక్షల మంది విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని కమిషనర్ నిర్ణయించారు. వీటితో పాటు గ్రేటర్‌లో ఉన్న దాదాపు 5లక్షల స్వయం సహాయక బందాల మహిళలను ప్లాస్టిక్ నిషేదంలో భాగస్వామ్యం చేయడం, చిరు వ్యాపారులు మటన్, చికెన్ షాపులు ఇతర వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేదించాలని అవగాహన కల్పించాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు.
సత్ఫలితాలు ఇచ్చిన రెండుడస్ట్‌బిన్...
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఇంటింటికి రెండు డస్ట్‌బిన్‌ల పంపిణీ, చెత్త సేకరణకు 2,500 ఆటోట్రాలీలను ప్రవేశపెట్టడం, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలను ఉదతంగా నిర్వహించడం తదితర ఎన్నో పర్యావరణ హిత కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. 1,116 బహిరంగ చెత్తవేసే ప్రాంతాలను పూర్తిగా ఎత్తివేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా నగరాన్ని ప్రకటించడం, పెట్రోల్ బంక్‌లు, హోటళ్లలోని టాయిలెట్లను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడం, జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు క్యాపింగ్ పనులు చేపట్టడం తదితర స్వచ్ఛ కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ విజయవంతంగా చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment