Pollution free
-
TSRTC: ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు వచ్చేస్తున్నాయ్! రేపే ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ).. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోంది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ బస్సులకు ‘ఈ-గరుడ’ గా సంస్థ నామకరణం చేసింది. హైటెక్ హంగులతో ప్రయాణికులకు వీటిని అందుబాటులోకి తెచ్చామని, హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. హైదరాబాద్ లో 10 డబుల్ డెక్కర్ బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించింది. హైదరాబాద్ లో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం రేపు జరగనుంది. మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ బస్సుల ప్రారంభోత్సవానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తో కలిసి “ఈ-గరుడ” బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రత్యేకతలివే! 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమెటిక్ ప్యాసింజర్ కౌంటర్(ఏపీసీ) కెమెరా కూడా ఉంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుంది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. (చదవండి: రానున్న 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్) -
భారత్‌ను కాలుష్య రహిత దేశంగా మార్చుదాం
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ కోరారు. ఖనిజ పరిశ్రమల్లో హైడ్రోజన్, ఎల్ఎన్జీ గ్యాస్‌తో నడిచే యంత్రాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మినరల్ ఇండస్ట్రీస్ సదస్సు రెండు రోజులపాటు హైటెక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఖనిజ పరిశ్రమల్లో పర్యావరణ చర్యలు అనే అంశంపై సోమవారం పలువురు మైనింగ్ మేధావులు తమ పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో ఎన్ఎండీసీ చైర్మన్, ఫీమీ అధ్యక్షులు సుమిత్ దేవ్, ఉపాధ్యక్షులు శాంతేష్ గురెడ్డి, సింగరేణి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. ఖనిజ పరిశ్రమల్లో వినియోగించే థర్మల్ విద్యుత్ తగ్గించేలా చూడాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే తన విద్యుత్ అవసరాల కోసం 219 సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుందని, మరో 81 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పా టు చేసుకుని, 2023–24 నాటికి సంస్థ అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ను సోలార్ ప్లాంట్ల ద్వారా సమకూర్చుకుంటామని వివరించారు. దీంతో 100 శాతం ‘నెట్ జీరో ఎనర్జీ’లక్ష్యాన్ని సాధించబోతున్నామని వెల్లడించారు. -
ఈవీ..‘పొగ’బెట్టవు
సాక్షి ప్రతినిధి, అమరావతి: ప్రపంచం కాలుష్య రహిత వాహనాల వైపు చూస్తోంది. ప్రస్తుతం వాడుతున్న పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలూ కార్యాచరణలోకి దిగాయి. దీంతో కాలుష్య రహిత వాహనాల తయారీపై కంపెనీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీని ప్రారంభించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక బ్యాటరీల మేళవింపుతో ఈ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. భారత దేశంలోనూ ఇప్పుడిప్పుడే ఈ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులూ వస్తున్నాయి. ముంబైలో బ్యాటరీతో నడిచే డబుల్ డెక్కర్ బస్సును ఇటీవలే ప్రవేశపెట్టారు. దేశంలో బ్యాటరీ కార్ల తయారీ కూడా మొదలైంది. ఈవీల ధరలు ఎక్కువగా ఉండటం మార్కెట్లో పెద్ద సవాలుగా మారింది. అయితే, వీటి వినియోగంతో కాలుష్యంతో పాటు ఇంధన వ్యయం కూడా తగ్గుతుంది. విద్యుత్ వాహనాలపట్ల ప్రజలు ఆకర్షితులు కావడానికి ఇదే ప్రధాన కారణం. విద్యుత్ కార్లకు ఉన్న డిమాండ్‌ను, అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశంలో ప్రధాన కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. టాటా కంపెనీ ఇప్పటికే విద్యుత్ కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2024–26 మధ్య ఐదు కొత్త మోడల్స్ కార్లు తెస్తామని మహీంద్రా ప్రకటించింది. ఆన్లైన్ ట్యాక్సీ వ్యాపారం చేసే ‘ఓలా’, ఇప్పటికే విద్యుత్ స్కూటర్లు తయారుచేస్తోంది. రెండేళ్లలో విద్యుత్ కార్లు కూడా తెస్తామని ప్రకటించింది. దేశంలో కార్ల తయారీలో నంబర్–1 స్థానంలో ఉన్న మారుతి కూడా విద్యుత్ కారు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ కంపెనీలవన్నీ లిథియం అయాన్ బ్యాటరీ ఆధారిత వాహనాలే. విద్యుత్ వాహనాల్లో ఇది విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం. ఈవీల వినియోగంలో చైనా టాప్ ప్రయోగ దశ దాటి విద్యుత్ వాహనాలను పెద్ద సంఖ్యలో తయారుచేయడం 2010లో ప్రారంభమైంది. ‘ఈవీ’ల వాణిజ్య ఉత్పత్తి తొలుత ‘నిసాన్’ ప్రారంభించింది. నిసాన్ లీఫ్ తొలి ఈవీ వాహనం. 2012లో ‘టెస్లా మోడల్ ఎస్’ రోడ్డెక్కడంతో మిగతా సంస్థలూ వీటి తయారీ మీద దృష్టి పెట్టాయి. 2011లో ప్రపంచవ్యాప్తంగా 55 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. పదేళ్ల తర్వాత వీటి సంఖ్య 70 లక్షలకు చేరింది. అందులో సగం వాటా చైనాది. ఈవీల వినియోగంలో అమెరికా, ఐరోపా దేశాలను మించి చైనా దూసుకుపోతోంది. భారత్‌లో సగం ద్విచక్ర వాహనాలు 2021లో దేశంలో 3.29 లక్షల విద్యుత్ వాహనాలు రోడ్డెక్కితే, అందులో 48 శాతం ద్విచక్ర వాహనాలే. మరో 45 శాతం ఆటో రిక్షాలు ఉన్నాయి. కార్లు 4 శాతం ఉండగా, ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర వాహనాల వాటా 3 శాతం. ప్రజా, సరకు రవాణా వాహనాల సంఖ్య పెరిగితేనే కాలుష్యం తగ్గుదల ఎక్కువగా ఉంటుంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల దిగుమతులు తగ్గుతాయి. ఇటు పర్యావరణ పరిరక్షణకు, అటు విదేశీమాదక ద్రవ్యం మిగులుకు ఇది దోహదం చేస్తుంది. ధరలు ఎక్కువగా ఉండటమే అసలు సమస్య విద్యుత్ వాహనాల ధరలు సాధారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువ. ద్విచక్ర వాహనాల ధరలు మరీ ఎక్కువగా లేకపోవడం, ఇంధన వ్యయం తక్కువగా ఉండటం వల్లే టూవీలర్ల విక్రయాలు పెరుగుతున్నాయి. లోస్పీడ్ ఆటో రిక్షాల ధరలూ మరీ ఎక్కువగా లేవు. ఈవీ కార్లు, బస్సుల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. స్థానికంగా తయారయిన వాహనాల మీద 28 శాతం జీఎస్టీ ఉండగా, విద్యుత్ వాహనాలకు 5 శాతం వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈవీల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. బ్యాటరీ ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. దేశంలో బ్యాటరీ తయారీకి విదేశీ కంపెనీల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అరువు తెచ్చుకోవాలి. మన సొంత టెక్నాలజీతో బ్యాటరీలు తయారు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ తయారీలో సవాళ్లు ఎన్నో.. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ప్రధానంగా లిథియం, మాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్ (రాగి), అల్యూమినియం, గ్రాఫైట్, టైటానియం అనే 8 ఖనిజాలు అవసరం. మన దేశంలో మాంగనీస్, నికెల్, కాపర్, అల్యూమినియం నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. గ్రాఫైట్ నిల్వలూ ఉన్నప్పటికీ, ముడి ఖనిజం నుంచి బ్యాటరీ తయారీకి అవసరమయ్యే నాణ్యమైన గ్రాఫైట్‌ను తయారు చేసే కర్మాగారాలు లేవు. వాటిని ఏర్పాటు చేసుకుంటే గ్రాఫైట్ తయారు చేసుకోవచ్చు. దేశంలో ఉన్న టైటానియం మన అవసరాలకు సరిపోతుందో లేదో ఇంకా అంచనా వేయలేదు. లిథియం, కోబాల్ట్ మన దేశంలో లేవు. ఈ రెండింటినీ పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిందే. దేశంలో లభించే ఖనిజం ఉత్పత్తి, వీటిని లిథియం అయాన్ బ్యాటరీల్లో వినియోగానికి అనుగుణంగా మార్చుకోవడంపై ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు దృష్టి పెట్టాలి. దేశంలో లభించని లోహాలను ఏ రూపంలో దిగుమతి చేసుకోవాలనే విషయంలో భిన్నవాదనలు ఉన్నాయి. ముడి ఖనిజం దిగుమతి చేసుకొని ఇక్కడ లోహాలు ఉత్పత్తి చేయాలన్న భావన ఉంది. లోహం కాన్సంట్రేట్‌ను దిగుమతి చేసుకొని మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా చౌకగా, వేగంగా అందుబాటులోకి తేవాలన్న వాదనా ఉంది. వివిధ దేశాల్లో ‘క్లీన్ ఎనర్జీ’ లోహాల మైనింగ్, ఉత్పత్తి ఉన్నా, చైనా మార్కెట్ లీడర్‌గా ఎదిగింది. ఆయా లోహాల ముడి ఖనిజం నిల్వలు చైనాలో లేకున్నా, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సమకూర్చుకొంది. ఇదే తరహాలో మనమూ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటే బ్యాటరీల్లో వినియోగించే కీలక లోహాల కొరత లేకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
వావ్ గడ్కరీ.. ఈయన ప్రతీ ఆలోచన గొప్పే!
ఇప్పుడున్న కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీకి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే!. ఆయన నిర్ణయాలే కాదు.. ఆలోచనలు, ఆచరణలు సైతం అప్పుడప్పడు ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యాయ్నాలను ఉపయోగించాలని పిలుపు ఇచ్చేవాళ్లలో నితిన్ గడ్కరీ కూడా ఒకరు. తాజాగా ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం ఓ అడుగు ముందుకేశారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మధ్య ఓ కారును కొనుగోలు చేశారట. ఇందులో ఇంధనంగా పెట్రోల్, డీజిల్, సహజవాయువులను ఉపయోగించరు. ఈ కారు గ్రీన్ హైడ్రోజన్‌తో నడుస్తుంది. ఫరిదాబాద్‌లోని ఓ ఆయిల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన కారును త్వరలో రోడ్డెక్కించబోతున్నట్లు ఓ సదస్సులో పాల్గొన్న ఆయన స్వయంగా వెల్లడించారు. ‘నా హైడ్రోజన్ కారుతో త్వరలోనే ఢిల్లీ రోడ్లపై ప్రయాణిస్తా. ప్రజల్లో ఈ తరహా ప్రత్యామ్నాయ ఇంధనాలపై అవగాహన కల్పిస్తా. ఇది నమ్మదగిన విషయమేనని, కాలుష్యాన్ని తగ్గించే ఆచరణ అవుతుందని జనాలకి నమ్మకం కలిగిస్తా’ అని ప్రసంగించారాయన. యూట్యూబ్‌తో లక్షలు సంపాదిస్తున్న గడ్కరీ! డ్రైనేజీ మురుగు నీరు, ఘనరూప వ్యర్థాల నుంచి హైడ్రోజన్ ను తయారుచేసి దాన్నే ఇంధనంగా ఉపయోగించే వీలుందని, ఈ తరహా హైడ్రోజన్ ఇంధనంతో బస్సులు, ట్రక్కులు, కార్లను రోడ్లపై పరుగులు తీయించాలనేది తన ప్రణాళిక అని ఈ సందర్భంగా గడ్కరీ స్పష్టం చేశారు. ఇక మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు విశేష ప్రాధాన్యత లభిస్తోంది. కాలుష్య రహితానికి ఆస్కారం ఉన్న ఇంధనాలపై ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో వ్యర్థాలను కూడా సద్వినియోగ పరిచేందుకు ప్రయత్నిస్తున్నానని గడ్కరీ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గ్రీన్ హైడ్రోజన్ కార్ల నుంచి వేడి గాలి, నీటి ఆవిరి మాత్రమే వెలువడతాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! నితిన్ గడ్కరీ క్లారిటీ! గడ్కరీ కొత్త స్వరం.. కార్లకు మాత్రమే వినసొంపైన హారన్లు! చదవండి: ‘ఇలా చేస్తే పెట్రోలు ధరలు తగ్గుతాయి’ గడ్కరీ కీలక వ్యాఖ్యలు -
సిటీ పొల్యూషన్‌కి మంచి సొల్యూషన్ ‘లివింగ్ ల్యాబ్’
సాక్షి, రాయదుర్గం(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరమైంది. అభివృద్ధి మంచిదే. కానీ అభివృద్ధితోపాటు వృద్ధి చెం దుతున్న కాలుష్యం నగర జీవితాలను ఆందోళనలోకి నెట్టేస్తుంది. నగరాల్లోని గాలి నాణ్యత అక్కడి ప్రజల జీవన నాణ్యతను తెలియజేస్తుందంటారు. ఢిల్లీ లాంటి మహా నగరాలలాగా కాదు.. హైదరాబాద్ గాలిలో విషపూరిత వాయువులు అధికమయ్యాయి. వీటి నంచి బయటపడేందుకు గాలితోపాటు నీరు, విద్యుత్‌ను కాపాడుకోవడాకి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఓ వినూత్న ఆలోచన చేసింది. అదే క్యాంపస్ లో స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు. 2019 నుంచి ఈ లివింగ్ ల్యాబ్ పర్యవేక్షణలో ఉన్నది ట్రిపుల్ ఐటీ క్యాంపస్. యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ), ఆమ్స్టర్డామ్ ఇన్నోవేషన్ ఎరీనా (ఏఐఏ), అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, తెలం గాణ ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలిస్తున్నవి. లివింగ్ ల్యాబ్ ఎలా పనిచేస్తుందంటే.. ► గాలి నాణ్యత మాత్రమే కాదు... నీటి నిర్వహణ, విద్యుత్ వినియోగం ఎలా ఉంది? వాతావరణ పరిస్థితులు ఎలా మారుతున్నాయనే అన్ని అంశాలను ఈ లివింగ్ ల్యాబ్ పర్యవేక్షిస్తున్నది. ప్రతి 15 సెకన్లకు గాలి నాణ్యత అంచనా... ► ప్రతి పదిహేను సెకన్లకు ఓసారి గాలి నాణ్యతను లెక్కించి సర్వర్కి పంపిస్తుంది ట్రిపుల్ ఐటీలోని ల్యాబ్. వాయి వేగాన్ని, దిశను, గాలిలోని ఉష్ణోగ్రతలు, తేమను సైతం తెలుపుతుంది. నీరు వృథా కాకుండా... ► ప్రతి 4 గంటలకోసారి నీటిలోని లవణాలు, గాఢత స్థాయిలను లెక్కిస్తుంది. నీటి వృథాని నివారించడం కోసం, దుర్వినియోగం చేయకుం డా ఉండటం కోసం ఏర్పాటు చేసిన నియత్రణ పరికరాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. వాతావరణంలో వస్తున్న మార్పులను, వర్షపా తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. విద్యుత్ వినియోగంపైనా ఓ కన్ను... ► మానవ జీవితంలో మరో నిత్యావసరం విద్యుత్. ఎంత కాపాడుకుంటే అంత మంచిది. బల్బులు, ఫ్యానులు, ఇతర పరికరాల విద్యుత్ వినియోగాన్ని, సోలార్ విద్యుత్ వినియోగ డాటాని ల్యాబ్‌లోని నోడ్స్ ప్రతి పదిహేను నిమిషాలకోసారి అందిస్తుంది. దీని ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడానికి వీలవుతుంది. ఉల్లంఘనలను పసిగడుతుంది... ► సహజవనరులను కాపాడుకోవడమే కాదు... మహమ్మారుల నుంచి రక్షించడానికీ కొన్ని పద్ధతులున్నాయి. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో మాస్కు లేకుండా తిరిగినా, ఎక్కువమంది గుమిగూడినా, భౌతికదూరం పాటించకపోయినా.. ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయో సెక్యూరిటీ కెమెరాల ద్వారా ఈ లివింగ్ ల్యాబ్ కనిపెట్టేస్తోంది. ఇలా అన్ని విభాగాల నుంచి సమాచారం ఒకే దగ్గరకు రావడంతో... అన్ని సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ చెక్ పెడుతున్నది. హైదరాబాద్‌ను రక్షించడానికి, నగర మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శక్తి వినియోగంపై నిరంతర పర్యవేక్షణ అవసరం: లీడ్ ఆర్కిటెక్ట్ అనురాధ ఈ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు వల్ల గాలి, నీరు నాణ్యత, విద్యుత్ వినియోగం మాత్రమే కాదు... కోవిడ్ నిబంధలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా క్యాంపస్‌లో కోవిడ్–19 వ్యాప్తిని అదుపులో ఉంచగలిగాం. లివింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో అంతర్జాతీయ విలువలు కలిగిన ఓఎం2ఎం ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నాం. ఐయూడీఎక్స్తో కలిసి బలమైన ప్లాట్‌ఫామ్ ఏర్పాటు: పరిశోధక విద్యార్థులు ఇది జాతీయ, ప్రపంచవ్యాప్త వినియోగంలో ఉన్న ప్లాట్పామ్. ఒక్క క్యాంపస్‌లోనే కాదు.. నగరపాలన, పౌరుల రోజువారీ సమస్యలకు ఓ చక్కని పరిష్కారం ఇది. -
Hyderabad: స్వచ్ఛమైన గాలి కావాలా?.. అక్కడికి వెళ్లాల్సిందే..
ఏపుగా పెరిగిన చెట్లతో రంగురంగుల పూల మొక్కలతో పరుచుకున్న పచ్చదనం ఒక వైపు... అందమైన ఆకృతులలో రాళ్ల వరుసలు మరోవైపు... ఇదీ జూబ్లీహిల్స్ కాలనీలో ఆకట్టుకునే తీరు. నాణ్యమైన ప్రాణవాయువుకు జూబ్లీహిల్స్ కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెలువరించిన నివేదికలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో నాణ్యమైన వాయువు ప్రజలకు అందుతోందని వెల్లడించింది. – బంజారాహిల్స్ క్రమం తప్పకుండా... సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసిన నేషనల్ ఎయిర్ క్వాలిటీ, మానిటరింగ్ ప్రోగ్రామ్‌లలో ఎక్కడెక్కడ గాలి ఎలా ఉందన్నదాన్ని అంచనా వేస్తుంటారు. ప్రతినెలా ఈ లెక్కింపు ఉంటుంది. దీని ప్రకారమే నగరంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి గాలి లభిస్తుందన్నది నివేదిక ద్వారా స్పష్టం చేస్తున్నారు. ప్రతిసారి జూబ్లీహిల్స్ స్వచ్ఛమైన గాలికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నది. చుట్టుపక్కల ఎలాంటి పరిశ్రమలు లేకపోవడం, కాలనీల్లో కూడా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేకపోవడం, కాంక్రీట్ జంగిల్‌గా మారకపోవడంతో ఇక్కడ ప్రతిసారి స్వచ్ఛమైన లభించేందుకు కారణమవుతున్నాయి. ఎయిర్ క్వాలిటి ఇండెక్స్(ఎక్యూఐ) నివేదిక ప్రకారం నగరంలోని స్వచ్ఛమైన గాలి జూబ్లీహిల్స్‌లో లభిస్తున్నట్లుగా గుర్తించారు. నగరంలో 32 చోట్ల ఏర్పాటు చేసిన నేషనల్ ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ ప్రోగ్రామ్ (ఎన్ఏఎంపీ)ల ద్వారా ఎక్కడెక్కడ స్వచ్ఛమైన గాలి లభిస్తున్నదో అంచనా వేస్తున్నారు. గుడ్, సాటిస్‌ఫ్యాక్టరీ, మాడరేట్, పూర్, వెరీపూర్, సెవర్ తదితర అంశాలలో ఎక్కడెక్కడ ఏ రకమైన గాలి లభిస్తున్నదో అంచనా వేస్తున్నారు. దీని ప్రకారమే జూబ్లీహిల్స్‌లో స్వచ్ఛమైన గాలి లభిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నెల మొదటి వారంలో గుర్తించిన జాబితాలో జూబ్లీహిల్స్ మొదటి స్థానం దక్కించుకుంది. పచ్చదనమే కారణం... జూబ్లీహిల్స్ కాలనీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పచ్చదనం ఎక్కువ. ఇక్కడ అపార్ట్మెంట్ల కంటే వ్యక్తిగత నివాసాలు ఎక్కువగా ఉండటం, ఆ నివాసాల్లో మొక్కలు, చెట్లతో పాటు రోడ్లకు రెండువైపులా భారీ వృక్షాలు కూడా స్వచ్ఛమైన గాలి రావడానికి కారణమని కాలుష్య నియంత్రణ మండలి సైంటిస్ట్‌లు పేర్కొంటున్నారు. కేబీఆర్ పార్కు కూడా... జూబ్లీహిల్స్ కాలనీని ఆనుకొని 360 ఎకరాల్లో కేబీఆర్ పార్కు విస్తరించి ఉన్నది. పార్కులో 70 శాతం దట్టమైన అడవి ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ స్వచ్ఛమైన గాలితో ఉంటున్నాయి. జూబ్లీహిల్స్ కాలనీకి కేబీఆర్ పార్కు పచ్చదనం కూడా ఒక వరంగా మారిందనే చెప్పాలి. చదవండి: Karimnagar: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్ -
డొమినోస్ పిజ్జా కొత్త నిర్ణయం... పొల్యూషన్ ఫ్రీ డెలివరీ !
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాచానుకి జీవితాంతం ఫ్రీ ఆఫర్ ప్రకటించి దేశ ప్రజల మన్ననలు అందుకున్న డోమినోస్ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. వాతవారణ కాలుష్యం తగ్గించడంలో భాగంగా తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీ పర్సన్స్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోలు బైకులు, స్కూటర్ల స్థానంలో ఇక నుంచి కాలుష్యం విడుదల చేయని ఎలక్ట్రికల్ వెహికల్స్‌ను ఎంపిక చేసిన నగరాల్లో ప్రయోగాత్మకంగా ఉపయోగించాలని డొమినోస్ నిర్ణయించింది. అక్కడ సానుకూల ఫలితాల వస్తే క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లలో పని చేస్తున్న డెలివరీ పర్సన్స్ ప్రస్తుతం ఉన్న పెట్రోలు బైకుల స్థానంలో ఎలక్ట్రిక్ బైకులు ఉపయోగించేలా మార్పులు తేనుంది. రివోల్ట్ 300 కాలుష్య నియంత్రణలో భాగంగా రివోల్ట్ 300 మోడల్ ఎలక్ట్రిక్ బైకులను డొమినోస్ పిజ్జా ఉపయోగించనుంది. ఈ మేరకు రివోల్ట్‌తో సంప్రదింపులు చేపడుతోంది. డెలివరీకి అనుగుణంగా ఈ బైకులను కష్టమైజ్ చేయనున్నారు. ఈ బైకులను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 150 కి,.మీ రేంజ్ మైలేజీ ఇవ్వగలవు. గరిష్ట వేగం గంటలకు 65 కిలోమీటర్లు. వేలల్లో డెలివరీ పర్సన్స్ డొమినోస్ పిజ్జాకి దేశ వ్యాప్తంగా వేలాది అవుట్లెట్లు ఉన్నారు. వేలాది మంది డెలివరీ బాయ్స్ నిత్యం నగరాల్లో బైకులపై తిరుగుతూ పిజ్జాలను డెలివరీ చేస్తున్నారు. వేలల్లో ఉన్న ఈ డెలివరీ పర్సన్స్ నిత్యం పెట్రోలు బైకులపై తిరుగుతూ తమ విధులు నిర్వహ్తిన్నారు. -
లాక్డౌన్ ప్రజలకే కాదు.. నగరాల్లోని కాలుష్యానికి కూడా..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ విధింపుతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. నిత్యం కాలుష్యంతో నిండిపోయే నగరాల్లో ప్రస్తుతం స్వచ్ఛ వాయువులు వీస్తున్నాయి. కొన్నినెలల విరామం తర్వాత మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలు ‘గ్రీన్‌జోన్’లోకి అడుగుపెట్టాయి. వాయు నాణ్యతలో ‘గుడ్ కేటగిరీ’లోకి చేరుకున్నాయి. లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుండడంతో అన్నిరకాల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర కార్యకలాపాలు సైతం నిలిచిపోవడంతో గత ఐదురోజుల్లోనే పర్యావరణ పరంగా ఎంతో మేలు జరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. నగరాల్లో తగ్గిన కాలుష్యం గతేడాది దాదాపు 2, 3 నెలల లాక్‌డౌన్‌తో కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. జన సంచారం సైతం లేకపోవడంతో వన్యప్రాణులు, జంతువులు, పక్షులు స్వేచ్ఛగా సంచరిస్తూ గ్రామాలు, పట్టణ శివార్లలోకి కూడా వచ్చి కనువిందు చేశాయి. అయితే లాక్డౌన్ ఎత్తేశాక రెండంటే రెండు రోజుల్లోనే అన్నిరకాల కాలుష్యం పెరిగిపోయి మళ్లీ యధాతథ స్థితికి చేరుకుంది. అప్పటి నుంచి వాయు, తదితర కాలుష్యాలు పెరుగుతూనే వచ్చాయి. తాజాగా మరోసారి లాక్డౌన్ విధించడంతో ఐదురోజుల్లోనే వాయుకాలుష్యం గణనీయంగా తగ్గి నగరాలు గుడ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏఐక్యూ)లోకి చేరుకున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘సమీర్ యాప్’ద్వారా రియల్ టైమ్‌లో దేశవ్యాప్తంగా వందకు పైగా ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత, వివిధ రకాల కాలుష్య స్థాయిలను పరిశీలించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల సూచీని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. ఎన్ని పాయింట్లు ఉంటే ఏ విధమైన ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందో కూడా తెలియజేస్తోంది. సీపీసీబీ అప్డేట్ ఇదీ.. శనివారం సాయంత్రం 7.05 నిమిషాలకు సీపీసీబీ అప్డేట్ చేసిన ఏక్యూఐ తాజా వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో వాయు నాణ్యత 29 పాయింట్లుగా రికార్డు కాగా, ఏపీ రాజధాని అమరావతిలో 20 పాయింట్లు, రాజమండ్రిలో 27, తిరుపతిలో 43, ఏలూరులో 47, విశాఖలో 53 పాయింట్లు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ మహానగరం మొత్తంగా సగటున 29 పాయింట్లుగా నమోదు కాగా, వివిధ ప్రాంతాల వారీగా చూస్తే మల్లంపేట, బాచుపల్లిల సమీపంలో 19 పాయింట్లు, పటాన్చెరు దగ్గర 25 పాయింట్లు, శేరిలింగంపల్లి, కొండాపూర్‌ల సమీపంలో 30 పాయింట్లు, నెహ్రు జూ పార్కు దగ్గర 41 పాయింట్ల ఏక్యూఐ రికార్డయ్యింది. ( చదవండి: కరోనా వ్యాక్సిన్: స్పుత్నిక్–వి భేష్.. సామర్థ్యం ఎంతంటే? ) -
నయా అణుకేంద్రం ‘నాట్రియం’
ముప్పై కోట్ల నుంచి.. మూడు వందల కోట్లు.. భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితే వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం వల్ల మరణించే వారి సంఖ్య ఇది! బొగ్గు, చమురు ఉత్పత్తుల వాడకం వల్ల కార్బన ఉద్గారాలు పెరిగి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి.. వాటిని తగ్గించి, కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి కోసం అంతర్జాతీయంగా చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి నాట్రియం కూడా అలాంటిదే.. ఇదేంటి కొత్త అనుకుంటున్నారా? చాలా సింపుల్ మనం నిత్యం వాడే ఉప్పులో ఉండే సోడియం. సోడియంతో అణుశక్తి రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించే ప్రయత్నమే ‘నాట్రియం’ ప్రాజెక్టు సాక్షి హైదరాబాద్: బొగ్గు, చమురు వాడకంతో భూవాతావరణంలో పేరుకుపోతున్న విష వాయువులను తగ్గించాలన్నది అందరి ప్రయత్నం. కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. సౌర, పవన, జియో థర్మల్, తరంగ శక్తి వంటి అన్నిరకాల సంప్రదాయేతర ఇంధన వనరులను ఉయోగించినా అది సాకారం కావాలంటే ఏండ్లకేండ్లు పడతాయి. పైగా వీటి వాడకంలో బోలెడన్ని చిక్కులూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘నాట్రియం’ తెరపైకి వచ్చింది. ఓవైపు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తూనే.. మరోవైపు నిరంతరం విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు నాట్రియం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ దిశగానే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు చెందిన టెరాపవర్, అంతర్జాతీయ సంస్థలు జనరల్ ఎలక్ట్రిక్, హిటాచీ, అమెరికా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ కలిసి.. సోడియం ఆధారిత అణు విద్యుత్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. సాంకేతికత పరంగా నాలుగో తరంగా చెప్పుకుంటున్న ఈ అత్యాధునిక న్యూక్లియర్ రియాక్టర్ తయారీ వెనుక దశాబ్దాల శ్రమ దాగి ఉంది. అమెరికాలోని ఓ రహస్య ప్రాంతంలో ఈ నమూనా అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయింది కూడా. అన్నీ సవ్యంగా సాగితే.. మరికొన్ని నెలల్లోనే దాని నుంచి 345 మెగావాట్ల విద్యుత్తు అమెరికాకు అందనుంది. చవక, భద్రత కూడా.. నాట్రియం అణువిద్యుత్ కేంద్రాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అణువిద్యుత్ అనగానే రేడియేషన్ భయం మొదలవుతుంది. అయితే బొగ్గు, చమురు వంటి సంప్రదాయ ఇంధనాలతో జరిగే విద్యుదుత్పత్తిలో ప్రతి టెరావాట్ ఉత్పత్తికి 24.6.. 18.1 చొప్పున మరణాలు సంభవిస్తోంటే.. అణువిద్యుత్ కారణంగా జరుగుతున్న మరణాలు 0.07 మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇన్నేండ్ల అణువిద్యుత్ ఉత్పత్తి చరిత్రలో చెర్నోబిల్, ఫుకుషిమా వంటి రెండు ప్రమాదాలు మాత్రమే జరగాయని గుర్తు చేస్తున్నారు. అయితే నాట్రియం డిజైన్‌లో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తి అసలే లేనందున ఫుకుషిమా వంటి సంఘటనలు జరిగే అవకాశమే ఉండదని చెబుతున్నారు. వంద శాతం ఉత్పత్తి నాట్రియం డిజైన్‌లోని అణువిద్యుత్ కేంద్రాలు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. అదికూడా రోజంతా. ఈ ఏడాది అమెరికాలో ప్రారంభం కానున్న నాట్రియం అణువిద్యుత్ కేంద్రం సామర్థ్యం 345 మెగావాట్లు. ఎండాకాలంలోగానీ, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లోగానీ అకస్మాత్తుగా విద్యుత్‌కు డిమాండ్ పెరిగితే.. నాట్రియం అణువిద్యుత్ కేంద్రాల నుంచి ఆరేడు గంటల పాటు ఏకంగా 550 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఒక్కో నాట్రియం అణువిద్యుత్ కేంద్రం ద్వారా సుమారు 2.25 లక్షల ఇండ్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేయవచ్చునని నిపుణులు అంచనా వేశారు. నాట్రియం విజయవంతమైతే అతితక్కువ స్థలంలోనే ఈ కొత్త తరహా అణువిద్యుత్ కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చునని అంటున్నారు. నీటికి బదులు ఉప్పు! నాట్రియంకు, సంప్రదాయ అణువిద్యుత్ కేంద్రాలకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఉప్పు వాడకమే. యురేనియం అణువులను న్యూట్రాన్లతో ఢీకొట్టించడం ద్వారా పుట్టే శక్తితో నీటిని ఆవిరిగా మార్చడం, ఆ ఆవిరి సాయంతో టర్బయిన్లను తిప్పి విద్యుదుత్పత్తి చేయడం సంప్రదాయ అణువిద్యుత్ కేంద్రాల్లో జరిగే ప్రక్రియ. నాట్రియంలోనూ ఇదే తరహాలో జరుగుతుంది. కానీ నీటికి బదులు ఉప్పును ఉపయోగిస్తారు. ఇక నీరు వంద డిగ్రీల సెల్సియస్‌లో ఆవిరిగా మారితే.. ఉప్పు 500 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆవిరిగా మారుతుంది. పైగా నీళ్లు వేడయ్యాక హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడిపోయినట్టు ఉప్పు విడిపోదు. ఐదురెట్లు ఎక్కువ వేడిని నిల్వ చేసుకున్న ఉప్పును రియాక్టర్‌కు దూరంగా తీసుకెళ్లి నిల్వ చేయడం, అవసరానికి తగ్గట్టు నీటిని వేడి చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం ‘నాట్రియం’ అణు విద్యుత్తు కేంద్రాల డిజైన్‌లోని ప్రధాన విశేషం. -
ఆ కాలుష్యానికి ఆనంద్ మహీంద్ర పరిష్కారం
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త ,మహీంద్రా గ్రూప్ చైర్మన్ అనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన విషయాన్ని ట్విటర్ లో షేర్ చేశారు. వేసవి పంటల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను పారవేసే చౌకైన ,పర్యావరణ అనుకూలమైన మార్గాన్ని ట్వీట్ చేశారు. మహీంద్రా అనుబంధ సంస్థ స్వరాజ్ ట్రాక్టర్స్ రూపొందించిన ట్రాక్టర్ గురించి తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. కాలుష్య స్థాయిలను తగ్గించడానికి సూపర్ ప్లాంటర్ వాడాలన్నారు. ఇలాంటి యంత్రం రూపకల్పనకు నిజమైన ప్రాధాన్యత ఇస్తూ.. చురుకుగా ఉండాలంటూ వ్యవసాయరంగ ఉత్పత్తుల విభాగం అధ్యక్షుడు హేమంత్ సిక్కాకు ట్యాగ్ చేశారు. దీనికి సిక్కా సానుకూలంగా స్పందించారు. స్వరాజ్ షేర్ చేసిన ట్వీట్ ప్రకారం, గడ్డి కాల్చివేతతో వస్తున్న పొగ లాంటి సమస్యలకు ఈ ట్రాక్టర్ మంచి పరిష్కారం. ఇది పొలంలో మిగిలిని మొండి వ్యర్థాలను తిరిగి మట్టిలో కలపడానికి సహాయపడుతుందని స్వరాజ్ తెలిపింది. "సూపర్ సీడర్ విత్ స్వరాజ్ 963 ఎఫ్ఈ ట్రాక్టర్'' పర్యావరణహితమైందంటూ ఒక వీడిమోను ట్వీట్ చేసింది. తమ ట్రాక్టర్లను వాడాలని కంపెనీ సూచించింది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రను ఆకర్షించింది. కాగా పంట వ్యర్థాలను తగులబెట్టడం పర్యావరణ వ్యవస్థకు తీవ్ర ముప్పుగా ప రిణమిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వీటిని కాల్చడం మూలగా వస్తున్న పొగ భయంకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతోంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులు తమ పొలాల్లో పంట తరువాత గడ్డిని తగులబెట్టడం దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తోంది. అలాగే దేశ వ్యాప్తంగా పలు చోట్లు అనుసరిస్తున్న ఈ పద్థతి పర్యావరణాన్ని హానికరంగా పరిణమిస్తున్న సంగతి తెలిసిందే. We should be more active in facilitating the adoption of such implements @hsikka1 This is a real priority. https://t.co/6D22OPHCGv — anand mahindra (@anandmahindra) October 14, 2020 -
హైదరాబాద్‌కు మహాభాగ్యం.. ఆవాసయోగ్యం
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రం మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని స్వచ్ఛమైన వాయువు, నీళ్లతో ప్రపంచస్థాయిలోనే మంచి ఆవాసమైనదిగా మార్చే కృషికి మరో ముందడుగు పడింది. నగరంలో వాయునాణ్యతను గణనీయంగా పెంచేందుకు అవసరమైన సలహాలు, సూచనల కోసం ఈ రంగంలో కృషి చేస్తున్న ఉన్నతస్థాయి ప్రమాణాలున్న సంస్థ సాయం తీసుకోనుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వివిధ రూపాల్లో కాలుష్య కారకాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఒక ప్రాజెక్ట్‌ను అప్పగించనుంది. ఇందులో భాగంగా నాగ్‌పూర్‌కు చెందిన (నీరి), ఢిల్లీకి చెందిన (తెరి), కాన్పూర్, ముంబై, ఢిల్లీ ఐఐటీల నుంచి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈ సంస్థలన్నింటికి కూడా కాలుష్య నియంత్రణ ముఖ్యంగా వాయు నాణ్యత మెరుగుపై వివిధ రాష్ట్రాల్లో పరిశోధనలు నిర్వహించిన అనుభవం ఉంది. దీంతో ఇవి సమర్పించే నివేదికల ఆధారంగా ఏదో ఒక దాన్ని షార్ట్ లిస్ట్ చేసి ఈ నెలాఖరుకల్లా ప్రాజెక్ట్‌ను అప్పగించనున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఈ బాధ్యతలను అప్పగించాక సదరు సంస్థ ఏడాది కాలంలో వాహన, రోడ్డు దుమ్ము, బయో మాస్ దహనం, పారిశ్రామిక, భవననిర్మాణ, ఇతర రూపాల్లో కాలుష్యం వ్యాప్తి చెందుతోంది. దీని నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు... తెలంగాణలో నాలుగోవంతుకు (కోటికి పైగానే) పైగా ప్రజలు ఇక్కడే నివాసం ఉంటుండడంతో వారికి స్వచ్ఛమైన గాలి అందేలా వాయుకాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయి. భాగ్యనగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు వివిధ రూపాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో వివిధ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా స్వచ్ఛమైన గాలులతో ఇతర నగరాలతో పోల్చితే మెరుగైన వాయు నాణ్యత సాధించేందుకు చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రజలకు మెరుగైన వాయువును అందించే కృషి సాగుతోంది. ఇదే ప్రథమం... తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్‌లో వాయు నాణ్య తను పెంచేందుకు ఒక ఉన్నతస్ధాయి సంస్థకు బాధ్యతలు అప్పగించడం ఇదే ప్రధమం. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007కు ముందు కొన్ని ప్రయత్నాలు మొదలుకాగా, అందులో భాగంగా సీఎన్జీ ఇంధనంతో పాటు బస్సులు, వాహనాలు హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 2003–2010 మధ్యలో కొంత ముందడుగు పడింది.దేశంలోని పది కాలుష్య ప్రభావిత నగరాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బూరేలాల్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు మొదలుపెట్టారు.ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ అంశానికి ప్రాధామివ్వకపోవడంతో ఈ ప్రయత్నాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ ఆదేశాలు... 2014 కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక, 2015 నుంచి కార్యాచరణ చేపట్టారు. వాయునాణ్యతను పెంచేందుకు...కాలుష్యస్థాయిని తగ్గించేందుకు సీఎన్జీ వాహనాల వినియోగం, కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)అవతలకు తరలింపు, నగరంలో వాహనాలకు బీఎస్–6 (భారత ప్రమాణాలు–6) అమలుతో పాటు ట్రాఫిక్ ఫ్లోకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఏ రకం వాహనాలకు కేటాయించిన లైన్లో అవి వెళ్లేలా ‘లేన్ క్రమశిక్షణ’పాటించేలా చర్యలు చేపట్టాలని ఇటీవల జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ నిర్ణయించింది. ప్రాధాన్యతా ›క్రమంలో ఔటర్ ఓఆర్ఆర్ అవతలికి కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు చెందిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖను ఈ కమిటీ ఆదేశించింది. గడువు తీరిన పాత వాహనాలను రోడ్లపైకి రాకుండా చేయడంతో పాటు కాలుష్య కారక వాహనాలపై జరీమానాల విధింపు, విద్యాసంస్థల బస్సులు సీఎన్జీని ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. -
2020 నుంచి బీఎస్–6 వాహనాలే
న్యూఢిల్లీ: 2020 నుంచి దేశంలో బీఎస్–6 ప్రమాణాలున్న వాహనాలే అందుబాటులో ఉంటాయని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ‘బీఎస్–6 ఇంధనాన్ని ఇప్పటికే ఢిల్లీలో వాడుతున్నాం. వచ్చేఏడాది నాటికి దేశవ్యాప్తంగా బీఎస్–6 ఇంధనంతో నడిచే వాహనాలే ఉంటాయి. కాలుష్యం అన్నది ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంది. మొత్తం కాలుష్యంలో దాదాపు 22 శాతం కేవలం వాహనాల వల్లే వస్తోంది. కాలుష్యంపై పోరాడాల్సిందే. పంజాబ్–హరియాణా రాష్ట్రాల్లో ఇటీవల పంట వ్యర్థాల దహనం తగ్గింది. ఢిల్లీ శివార్లలో ఇటుక బట్టీలను మూయించేశాం’ అని జవదేకర్ ట్వీట్ చేశారు. -
కాలుష్య రహిత వాహనాలనే నడిపిద్దాం
సాక్షి,జనగామ: కాలుష్య రహిత వాహనాలను నడిపిస్తూ రాబోయే తరాలకు సంపూర్ణ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గుడ్‌లక్ వెహికిల్ ఇండస్ట్రీస్ ఎండీ పెద్ది శరత్, డైరెక్టర్ రవీందర్ అన్నారు. ఎలక్ట్రికల్ ఆటోల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది.ఈ సందర్భంగా గుడ్‌లక్ వెహికిల్ ఇండస్ట్రీస్ ఎండీ పెద్ది శరత్, డైరెక్టర్ రవీదర్ మాట్లాడుతూ నాలుగు బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రికల్ ఆటోలు ఎనిమిది గంటల పాటు చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. విద్యుత్ కేవలం నాలుగు యూనిట్లు మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. ఒక కిలోమీటరు ప్రయాణానికి ఖర్చు 30 పైసలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్యాసింజర్ ఆటో ధర రూ.1,25 లక్షల నుంచి రూ.1,40లక్షలు, ట్రాలీ ఆటో ధర రూ.1,25 లక్షల నుంచి రూ.1,35 లక్షల వరకు ఉందని తెలిపారు. 25 కిలోమీటర్ల వేగంతో నడిచే ఆటోలకు ఆర్టీ అప్రూవల్ లేకున్నా రోడ్డుపై తిరగవచ్చన్నారు. అత్యవసర సమయంలో బ్యాంకు రుణం, బీమా పొందాలనుకునే యజమానులు వెహికిల్ రిజిష్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓజోన్ పొరపై పొల్యూషన్ చూపిస్తున్న ప్రమాద సంకేతాలను దృష్టిలో ఉంచుకుని కాలుష్య రహిత ఆటోలను మాత్రమే వినియోగించాలని సూచించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా బ్రాంచీలను స్థాపించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జనగామ మునిసిపల్ కమిషనర్ రవీందర్ యాదవ్, టౌన్ ప్లానింగ్ అధికారి రంగు వీరస్వామి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి కేఆర్ లత, మతిన్, వెంకటేశ్వర్లు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
హమ్ రహేంగే నంబర్ వన్
సాక్షి,సిటీబ్యూరో : హైదరాబాద్‌ను స్వచ్ఛ, కాలుష్యరహిత నగరంగా నిరంతరం ఉంచే స్ఫూర్తిని కలిగించేలా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. మంగళవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. అధికారులు, ఉద్యోగులతో పాటు నగరంలోని స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లందరూహమ్ రహేంగే నెం.1 అనే బ్యాడ్జిలను ప్రత్యేకంగా ధరించేలా చర్యలు చేపట్టనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు వైట్ కలర్ షర్ట్‌ను ధరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు కమిషనర్ తెలిపారు. ఈ సంవత్సరాన్ని స్వచ్ఛ సంవత్సరంగా పాటించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో సుమారు రోజుకు ఒక కిలో చెత్త ఉత్పత్తి అవుతుందని, వీటిలో 750గ్రాములను సేంద్రీయ ఎరువుగా తయారు చేయవచ్చని, ఇందుకుగాను ప్రతి ఇంటిలో సేంద్రీయ ఎరువు తయారీ యూనిట్‌ను లేదా గుంతలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 2022 నాటికి..... పర్యావరణనానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ వాడకాన్ని, విక్రయాలను 2022లోగా పూర్తిగా వాడకాన్ని నిషేధించాలనే భారీ లక్ష్యాన్ని కూడా నిర్థారించుకుంది. ముఖ్యంగా ఒకేసారి మాత్రమే ఉపయోగించే అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నివారించేందుకు చర్యలు చేపట్టింది. నగరంలో ఉన్న మూడువేలకు పైగా కాలనీ సంక్షేమ సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించింది. ప్రతి సర్కిల్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్లాస్టిక్ వినియోగంపై వారితో ప్రత్యేక ప్రతిజ్ఞలు నిర్వహించడం, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో ఉన్న పదిలక్షల మంది విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని కమిషనర్ నిర్ణయించారు. వీటితో పాటు గ్రేటర్లో ఉన్న దాదాపు 5లక్షల స్వయం సహాయక బందాల మహిళలను ప్లాస్టిక్ నిషేదంలో భాగస్వామ్యం చేయడం, చిరు వ్యాపారులు మటన్, చికెన్ షాపులు ఇతర వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేదించాలని అవగాహన కల్పించాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. సత్ఫలితాలు ఇచ్చిన రెండుడస్ట్బిన్... ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఇంటింటికి రెండు డస్ట్బిన్ల పంపిణీ, చెత్త సేకరణకు 2,500 ఆటోట్రాలీలను ప్రవేశపెట్టడం, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలను ఉదతంగా నిర్వహించడం తదితర ఎన్నో పర్యావరణ హిత కార్యక్రమాలను జీహెచ్ఎంసీ చేపట్టింది. 1,116 బహిరంగ చెత్తవేసే ప్రాంతాలను పూర్తిగా ఎత్తివేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా నగరాన్ని ప్రకటించడం, పెట్రోల్ బంక్‌లు, హోటళ్లలోని టాయిలెట్లను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడం, జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు క్యాపింగ్ పనులు చేపట్టడం తదితర స్వచ్ఛ కార్యక్రమాలను జీహెచ్ఎంసీ విజయవంతంగా చేపడుతోంది. -
కాలుష్య రహితంగా అమరావతి
ప్రణాళిక రూపొందించాలని సీఆర్డీఏకు సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. అమరావతి నగరంలో ఎలక్ట్రిల్ వాహనాలే తిరిగేలా అమరావతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ప్లాన్ రూపొందించాలని సూచించారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో రాజధానిలో నిర్మిస్తున్న రోడ్లు, పరిపాలన, విద్యా నగరాల నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల నుంచి ఎదురైన అవరోధాలను అధిగమిస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ చెప్పారు. ఒకవేళ ఇంకా ఎవరైనా తమ భూముల్లో సాగు చేసుకుంటామంటే రానున్న కాలంలో వారి భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని గ్రీన్ బెల్ట్ కింద ప్రకటిస్తామని చెప్పారు. పరిపాలనా నగరం మాస్టర్‌ప్లాన్ దాదాపు పూర్తయిందని, వచ్చే వారంలో దీన్ని ప్రభుత్వానికి అందిస్తామని నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ చెప్పారని కమిషనర్ శ్రీధర్ తెలిపారు. సమావేశంలో విట్, అమృత, ఎస్ఆర్ఎం, ఎన్ఐడీ తదితర విద్యా సంస్థల ప్రతినిధులు తమ కార్యకలాపాల పురోగతిని వివరించారు. విట్ వర్సిటీ భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో విశ్వ విద్యాలయానికి కాంపౌండ్ వాల్స్ ఉండవని, నగరంలో భాగంగా ఉంటాయని తెలిపారు.