సాక్షి, హైదరాబాద్: దేశాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ కోరారు. ఖనిజ పరిశ్రమల్లో హైడ్రోజన్, ఎల్‌ఎన్‌జీ గ్యాస్‌తో నడిచే యంత్రాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మినరల్ ఇండస్ట్రీస్ సదస్సు రెండు రోజులపాటు హైటెక్స్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ఖనిజ పరిశ్రమల్లో పర్యావరణ చర్యలు అనే అంశంపై సోమవారం పలువురు మైనింగ్ మేధావులు తమ పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో ఎన్‌ఎండీసీ చైర్మన్, ఫీమీ అధ్యక్షులు సుమిత్ దేవ్, ఉపాధ్యక్షులు శాంతేష్ గురెడ్డి, సింగరేణి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు.
ఖనిజ పరిశ్రమల్లో వినియోగించే థర్మల్ విద్యుత్ తగ్గించేలా చూడాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే తన విద్యుత్ అవసరాల కోసం 219 సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుందని, మరో 81 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పా టు చేసుకుని, 2023–24 నాటికి సంస్థ అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ను సోలార్ ప్లాంట్ల ద్వారా సమకూర్చుకుంటామని వివరించారు. దీంతో 100 శాతం ‘నెట్ జీరో ఎనర్జీ’లక్ష్యాన్ని సాధించబోతున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment