సాక్షి, హైదరాబాద్: వేయి మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రెండేళ్లుగా అంతులేని ఆవేదనతో విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అవుతున్నాయి. విధి నిర్వహణలోఉండగా ఉద్యోగి చనిపోయి సంపాదించేవారు లేక కొన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమైతే, కుటుంబ పెద్ద ఉద్యోగం చేయలేక అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో జీవనాధారం లేక మరికొన్ని దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి.
వీరిని ఆదుకునేందుకు చట్టపరంగా రెండు పథకాలున్నా.. ఆర్టీసీలో నెలకొన్న గందరగోళ పరిస్థితితో అవి అక్కర కు రాకుండా పోయాయి. బాధిత కుటుంబసభ్యులు నిత్యం బస్‌భవన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కన్నీళ్లే మిగులుతున్నాయి..తప్ప కనికరించే నాథుడే కన్పించడం లేదు.
సమ్మె సమయంలో నిర్ణయాలే శాపం
2019 అక్టోబర్.. ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మె. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆర్టీసీలో ఎన్నో సమస్యలకు కారణమయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి చనిపోతే అతని కుటుంబంలో ఒకరికి అర్హతల ఆధారంగా సంస్థలో ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే (బ్రెడ్ విన్నర్) కారుణ్య నియామకాలను సంస్థ అటకెక్కించింది.
అలాగే అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను ఆర్టీసీ అన్‌ఫిట్‌గా ప్రకటించి ఉద్యోగం నుండి తొలగిస్తుంది. అలాంటి వారికి ఇంకా సర్వీసు మిగిలే ఉంటే వారి కుటుంబంలో కూడా ఒకరికి మెడికల్ ఇన్‌వాలిడేషన్ పథకం కింద ఉద్యోగం ఇవ్వొచ్చు. కానీ ఇవ్వడం లేదు.
ఉద్యోగాల కోసం 1,025 దరఖాస్తులు
2018 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద 770 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50 మందికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి శిక్షణ ఇచ్చారు. పోస్టింగులు ఇవ్వడమే తరువాయి. అలాగే అనారోగ్య సమస్యలతో 2018 తర్వాత అన్‌ఫిట్ అయిన డ్రైవర్ల కుటుంబాల నుంచి 255 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 30 మంది పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసీలో 52 రోజుల సుదీర్ఘ సమ్మె జరిగింది.
ఆ సమయంలో ఖర్చును తగ్గించే పేరుతో ఏకంగా వేయికి పైగా బస్సులను తొలగించి వాటి స్థానంలో 1,300 అద్దె బస్సులను తీసుకున్నారు. ఫలితంగా 2,500 మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగులు (ఎక్సెస్)గా తేలారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్‌మెంటు వయసును 58 నుంచి 60కి పెంచారు. ఫలితంగా రెండేళ్లపాటు రిటైర్మెంట్లు లేకుండాపోయాయి. ఈ రెండు నిర్ణయాలతో ఆర్టీసీలో ఖాళీలు ఏర్పడకపోగా, భారీగా సిబ్బంది మిగిలిపోయారు.
దీంతో కారుణ్య నియామకాలు, అన్‌ఫిట్ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ కల్పన పథకాలు అటకెక్కాయి. భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడితే తప్ప వారికి ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తికాని వారి మాటలా ఉంచితే.. చివరకు శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగులకు సిద్ధంగా ఉన్న వారిని కూడా తీసుకోలేదు.
వారికిచ్చి.. వీరికివ్వకుండా..
ఆర్టీసీ సమ్మె సమయంలో 32 మంది కార్మికులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు గుండెపోటు, ఇతర కారణాలతో చనిపోయారు. ఆ కుటుంబాల్లోని ఇతర సభ్యులకు అర్హతల ఆధారంగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వీరి కంటే ముందునుంచి పెండింగులో ఉన్న దరఖాస్తుదారులను మాత్రం ఆర్టీసీ పట్టించుకోవడం లేదు.
తండ్రికి మందులు కూడా కొనలేక..
పగడపల్లి దత్తు ఆదిలాబాద్ డిపోలో డ్రైవర్. తీవ్ర అనారోగ్య సమస్యతో 2017లో డ్రైవర్‌గా పనిచేసే అర్హత కోల్పోయారు. ఆయనను సంస్థ అన్‌ఫిట్‌గా డిక్లేర్ చేసింది. అప్పటికి మరో ఐదేళ్ల సర్వీసు ఉండటంతో ఆయన కుమారుడు బీఎస్సీ చదివిన చంద్రశేఖర్ బ్రెడ్ విన్నర్ స్కీం కింద ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుల్‌గా దరఖాస్తు చేసుకుని, ఎంపికై శిక్షణ కూడా పొందారు. కానీ పోస్టింగ్ ఇచ్చే సమయానికి సంస్థలో ఖాళీలు లేవనే పరిస్థితి ఏర్పడింది. అతని పోస్టింగ్ కోసం ఆ కుటుంబం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది.
వివాహమైన చంద్రశేఖర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో రూ.8 వేల జీతానికి పనిచేస్తున్నాడు. తల్లి, అనారోగ్యంతో ఉన్న తండ్రి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన ఆ కుటుంబానికి రూ.8 వేలు ఎటూ చాలకపోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. ఆరోగ్యం సరిగా లేని తండ్రికి మందులు ఇప్పించటం కూడా కష్టంగా మారిందని చంద్రశేఖర్ ఆవేదన చెందుతున్నాడు.
కండక్టర్‌గా ఎంపికైనా ఫలితం లేదు
ఎన్.లింగన్న నిర్మల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధుల్లో ఉండగా 2017లో గుండెపోటుకు గురై చనిపోయారు. బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసి హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్న ఆయన కుమారుడు విఘ్నేశ్ దానికి రాజీనామా చేసి కారుణ్య నియామకం పథకం కింద ఆర్టీసీకి దరఖాస్తు చేసుకున్నాడు.
కండక్టర్ పోస్టుకు ఎంపికయ్యాడు కూడా. పోస్టింగ్ కోసం శిక్షణ ఇచ్చే సమయంలోనే.. ఆర్టీసీలో బస్సుల సంఖ్య తగ్గించటం, ఉద్యోగ పదవీ విరమణ వయసును పెంచటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో విఘ్నేశ్‌కు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. విధిలేని పరిస్థితుల్లో కుటుంబపోషణకు నిర్మల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ వద్ద చాలీచాలని జీతానికి సైట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment