employment schemes
-
కేంద్రం అసత్య ప్రచారాలు.. ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ పథకం పను ల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగడుతూ భారత్ రాష్ట్ర సమితి శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టా లని నిర్ణయించింది. ఉపాధిహామీ పథకం నిధులతో రైతులు నిర్మించుకున్న ధాన్యం ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ పలు పర్యాయాలు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం కొత్త షరతులు, కోతలు విధిస్తోందన్నారు. కోవిడ్ పరిణామాలతో ఉపాధి అవకాశాలు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పథకం ద్వారా భరోసా కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు భిన్నంగా క్రమంగా నిధులు తగ్గిస్తోందన్నారు. కల్లాలను అడ్డుకుంటున్న కేంద్రం తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ధాన్యాన్ని ఆరబోసేందుకు రైతులు నిర్మించుకున్న కల్లాలపై కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాలు సముద్రతీర ప్రాంతాల్లో చేపలు ఎండబెట్టుకునేందుకు సిమెంటు కల్లాలను నిర్మించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడరాని అభ్యంతరం తెలంగాణలో ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన 79 వేల వ్యవసాయ కల్లాలను మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ఉపాధి హామీ పథకం నిధులు ఖర్చుచేయొచ్చనే నిబంధన ఉన్నా తెలంగాణ రైతులపై కక్ష సాధించేందుకు.. నిధుల మళ్లింపు అంటూ కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అంతేకాక వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించినందని కేంద్రం కుట్రలకు పాల్పడుతోందన్నారు. కల్లాల నిర్మాణానికి ఖర్చు చేసిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడానికి నిరసనగా జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తున్నామన్నారు. -
తెలంగాణ ఆర్టీసీ: కారుణ్యం లేదు.. కనికరం లేదు
సాక్షి, హైదరాబాద్: వేయి మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రెండేళ్లుగా అంతులేని ఆవేదనతో విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అవుతున్నాయి. విధి నిర్వహణలోఉండగా ఉద్యోగి చనిపోయి సంపాదించేవారు లేక కొన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమైతే, కుటుంబ పెద్ద ఉద్యోగం చేయలేక అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో జీవనాధారం లేక మరికొన్ని దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి. వీరిని ఆదుకునేందుకు చట్టపరంగా రెండు పథకాలున్నా.. ఆర్టీసీలో నెలకొన్న గందరగోళ పరిస్థితితో అవి అక్కర కు రాకుండా పోయాయి. బాధిత కుటుంబసభ్యులు నిత్యం బస్‌భవన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కన్నీళ్లే మిగులుతున్నాయి..తప్ప కనికరించే నాథుడే కన్పించడం లేదు. సమ్మె సమయంలో నిర్ణయాలే శాపం 2019 అక్టోబర్.. ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మె. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆర్టీసీలో ఎన్నో సమస్యలకు కారణమయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి చనిపోతే అతని కుటుంబంలో ఒకరికి అర్హతల ఆధారంగా సంస్థలో ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే (బ్రెడ్ విన్నర్) కారుణ్య నియామకాలను సంస్థ అటకెక్కించింది. అలాగే అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను ఆర్టీసీ అన్‌ఫిట్‌గా ప్రకటించి ఉద్యోగం నుండి తొలగిస్తుంది. అలాంటి వారికి ఇంకా సర్వీసు మిగిలే ఉంటే వారి కుటుంబంలో కూడా ఒకరికి మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం కింద ఉద్యోగం ఇవ్వొచ్చు. కానీ ఇవ్వడం లేదు. ఉద్యోగాల కోసం 1,025 దరఖాస్తులు 2018 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద 770 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50 మందికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి శిక్షణ ఇచ్చారు. పోస్టింగులు ఇవ్వడమే తరువాయి. అలాగే అనారోగ్య సమస్యలతో 2018 తర్వాత అన్‌ఫిట్ అయిన డ్రైవర్ల కుటుంబాల నుంచి 255 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 30 మంది పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసీలో 52 రోజుల సుదీర్ఘ సమ్మె జరిగింది. ఆ సమయంలో ఖర్చును తగ్గించే పేరుతో ఏకంగా వేయికి పైగా బస్సులను తొలగించి వాటి స్థానంలో 1,300 అద్దె బస్సులను తీసుకున్నారు. ఫలితంగా 2,500 మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగులు (ఎక్సెస్)గా తేలారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంటు వయసును 58 నుంచి 60కి పెంచారు. ఫలితంగా రెండేళ్లపాటు రిటైర్మెంట్లు లేకుండాపోయాయి. ఈ రెండు నిర్ణయాలతో ఆర్టీసీలో ఖాళీలు ఏర్పడకపోగా, భారీగా సిబ్బంది మిగిలిపోయారు. దీంతో కారుణ్య నియామకాలు, అన్‌ఫిట్ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ కల్పన పథకాలు అటకెక్కాయి. భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడితే తప్ప వారికి ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తికాని వారి మాటలా ఉంచితే.. చివరకు శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగులకు సిద్ధంగా ఉన్న వారిని కూడా తీసుకోలేదు. వారికిచ్చి.. వీరికివ్వకుండా.. ఆర్టీసీ సమ్మె సమయంలో 32 మంది కార్మికులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు గుండెపోటు, ఇతర కారణాలతో చనిపోయారు. ఆ కుటుంబాల్లోని ఇతర సభ్యులకు అర్హతల ఆధారంగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వీరి కంటే ముందునుంచి పెండింగులో ఉన్న దరఖాస్తుదారులను మాత్రం ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. తండ్రికి మందులు కూడా కొనలేక.. పగడపల్లి దత్తు ఆదిలాబాద్ డిపోలో డ్రైవర్. తీవ్ర అనారోగ్య సమస్యతో 2017లో డ్రైవర్‌గా పనిచేసే అర్హత కోల్పోయారు. ఆయనను సంస్థ అన్‌ఫిట్‌గా డిక్లేర్ చేసింది. అప్పటికి మరో ఐదేళ్ల సర్వీసు ఉండటంతో ఆయన కుమారుడు బీఎస్సీ చదివిన చంద్రశేఖర్ బ్రెడ్ విన్నర్ స్కీం కింద ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుల్‌గా దరఖాస్తు చేసుకుని, ఎంపికై శిక్షణ కూడా పొందారు. కానీ పోస్టింగ్ ఇచ్చే సమయానికి సంస్థలో ఖాళీలు లేవనే పరిస్థితి ఏర్పడింది. అతని పోస్టింగ్ కోసం ఆ కుటుంబం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది. వివాహమైన చంద్రశేఖర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో రూ.8 వేల జీతానికి పనిచేస్తున్నాడు. తల్లి, అనారోగ్యంతో ఉన్న తండ్రి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన ఆ కుటుంబానికి రూ.8 వేలు ఎటూ చాలకపోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. ఆరోగ్యం సరిగా లేని తండ్రికి మందులు ఇప్పించటం కూడా కష్టంగా మారిందని చంద్రశేఖర్ ఆవేదన చెందుతున్నాడు. కండక్టర్‌గా ఎంపికైనా ఫలితం లేదు ఎన్.లింగన్న నిర్మల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధుల్లో ఉండగా 2017లో గుండెపోటుకు గురై చనిపోయారు. బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసి హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్న ఆయన కుమారుడు విఘ్నేశ్ దానికి రాజీనామా చేసి కారుణ్య నియామకం పథకం కింద ఆర్టీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. కండక్టర్ పోస్టుకు ఎంపికయ్యాడు కూడా. పోస్టింగ్ కోసం శిక్షణ ఇచ్చే సమయంలోనే.. ఆర్టీసీలో బస్సుల సంఖ్య తగ్గించటం, ఉద్యోగ పదవీ విరమణ వయసును పెంచటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో విఘ్నేశ్‌కు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. విధిలేని పరిస్థితుల్లో కుటుంబపోషణకు నిర్మల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద చాలీచాలని జీతానికి సైట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. -
సరిహద్దు పల్లెల్లో కనిపించని ‘నవోదయం’
గిరిజన, సరిహద్దు గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పిస్తాం.. యువతకు ఉద్యోగాలు ఇస్తాం.. రుణాలు మంజూరు చేసి ఆర్థిక ఆసరా కల్పిస్తాం.. సారా తయా రీ పనుల్లోనుంచి విముక్తి కల్పిస్తాం.. వారి బతుకుల్లో ‘నవోదయం’ కల్పిస్తామన్న పాలకుల హామీలు, అధికారుల ప్రకటనలు ఆచరణ శూన్యమయ్యాయి. సారా తయారీ నుంచి దూరం చేయలేకపోయాయి. ఫలితం.. జిల్లాలో నాటుసారా తయారీ ఆరునెలలుగా ఊపందుకుంది. ఎక్సైజ్ అధికారుల దాడులు పెరగడం, కేసులు నమోదు సంఖ్యే దీనికి నిలువెత్తు సాక్ష్యం. తెలుగుదేశం ప్రభుత్వం ఏ పథకాన్నీ, ఏ పనినీ సక్రమంగా అమలు చేయదని, ఉత్తుత్తి ప్రకటనలతో కాలక్షేపం చేస్తోందని, సారాతో జీవితాలు ఛిద్రమవుతున్నాయంటూ మహిళలు ఆవేదన చెందుతున్నారు. విజయనగరం రూరల్: సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ‘నవోదయం’ కార్యక్రమాన్ని 2016 ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. కార్యక్రమం ప్రారంభ సమయంలో జిల్లాను 2017 ఏప్రిల్ నెలాఖరు నాటికి సారా రహిత జిల్లాగా తీర్చుదిద్దుతామని ప్రభుత్వ పెద్దలు, జిల్లా కలెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శా ఖ అధికారులు ప్రకటించారు. ఏడాదిన్నర గడిచినా నాటుసారా తయారీ జిల్లాలో ఆగడం లేదు. దీనికి ఎక్సైజ్ అధికారుల దాడుల్లో సారా బట్టీలు వెలుగుచూడడం, కేసులు అధికంగా నమోదవుతుండడమే నిదర్శనం. జిల్లాలో నాటుసారా ఎక్కువుగా తయారు చేసే 80 గ్రామాలను గుర్తించారు. వీటిని ఏ,బీ,సీ విభా గాలుగా విడదీసి మూడు నెలల్లో అన్ని గ్రామాల్లో నవోదయం కార్యక్రమంపై విస్త్రత ప్రచారం చేశారు. సారా తయారీ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనేక గ్రామాల్లో సారాబట్టీలపై దాడులు నిర్వహించి సారా తయారీ, సారా సరఫ రాను ఎక్సైజ్ అధికారులు అడ్డుకుంటున్నారు. 2017 వరకు జిల్లాలో సుమారు 300కు పైగా గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. నవోదయం ప్రారంభమైన మొదట్లో 210 మందిపై ముం దస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. నేర చరితగల 95 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ గ్రామ సభలు, ప్రతీ శనివారం నవోదయం కార్యక్రమంపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పటివరకు వందశాతం సారారహిత గ్రామాలుగాతీర్చిదిద్దామని అధికారులు చెబుతున్నా వాస్తవంలో ఇప్పటికీ అనేక గ్రామాల్లో నాటుసారా తయారవుతున్నట్టు ఎక్సైజ్ అధికారుల దాడులతో తేటతెల్లం అవుతోంది. ఉపాధి ఏదీ? అధికారులు సారా తయారు చేస్తున్న 80 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వారిని తయారీకి దూరంగా ఉంటే ఉపాధికి ప్రభుత్వం నుంచి రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పి హామీలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సారా తయారీకి దూరంగా ఉండాలని చెప్పారు. దీంతో ఏడాది పాటు వారు సారా తయారీకి దూరంగానే ఉన్నారు. అయితే, అధి కారులు వారికి ఉపాధి కల్పనకు ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తామని చెప్పిన హామీని నెరవేర్చకపోవడంతో వారు ఉపాధి లేక కుటుంబాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ రుణాలు అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే మంజూరు చేయడంతో ఎక్సైజ్ అధికారులు చేతులెత్తేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సారా తయారీవైపు ఆయా గ్రామాల ప్రజలు మొగ్గుచూపారు. ఫలితం.. గత ఆరు నెలలుగా జిల్లాలో నాటు సారా తయారీ ఊపందుకుంది. దీనికి నిదర్శనంగా 2018 జనవరి నుంచి ఇప్పటివరకు 328 కేసులు 382 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే, 10,700 లీటర్లకు పైగా నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 55 వేలకు పైగా బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతీ శనివారం గుర్తించిన గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడంలేదని కొందరు అధికారులే చెబుతుండడం గమనార్హం. ప్రజల భాగస్వామ్యం అవసరం సంపూర్ణ సారా రహిత జిల్లాగా రూపుదిద్దుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం. నాటుసారా తయారీ, అమ్మకం, సరఫరా చేస్తే నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా, రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ నియంత్రణకు కృషి చేస్తున్నాం. అలాగే, ఒడిశా రాష్ట్ర సరిహద్దు మండలాలు పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, బొద్దిడి గ్రామాల్లో ఒడిశాకు చెందిన సారా తయారీ ముఠాలు జిల్లాలోకి అక్రమంగా సారా ప్యాకెట్లు సరఫరా చేసి గిరిజనలుతో అమ్మకాలు సాగిస్తున్నాయి. పార్వతీపురం, కురుపాం స్టేషన్ల పరిధిలో నాటుసారా కొంతవరకు తయారవుతున్నా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి అరికడుతున్నాం. సారా తయారీదారులపై అవగాహన కల్పిస్తున్నాం. నెల్లిమర్ల, కొత్తవలస, ఎస్.కోట సర్కిల్ పరిధిలో నాలుగైదు గ్రామాల్లో కొంతమంది సారా తయారుచేస్తున్నా వారిని నియంత్రించి కేసులు నమోదు చేస్తున్నాం. అయితే, రుణాల మంజూరుకు సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నాం. – ఎ.శంభూప్రసాద్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, విజయనగరం -
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. నిరుద్యోగ యువతను గుర్తించి వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. పరిశ్రమల్లో ఉన్న ఖాళీలను గుర్తించాలన్నారు. ఆ ఖాళీల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్ఆర్) నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. ఉజ్వలపై ప్రచారం నిర్వహించండి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంపై ప్రజలకు అవగాహన కలిగేలా గ్యాస్ ఏజెన్సీల ద్వారా చర్యలు తీసుకోవాలని జేసి ఇంతియాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 20 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మీ–సేవా కేంద్రాల్లో పాత నోట్లతో బిల్లుల చెల్లింపు మీ–సేవ కేంద్రాల్లో ఈ నెల 14వ తేది అర్ధరాత్రి వరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో బిల్లులు చెల్లించవచ్చునని జేసీ ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో మీ–సేవా కేంద్రాలకు ఉత్తర్వులు ఇచ్చామని పేర్కొన్నారు. విద్యుత్, ఇంటి, కుళాయి పన్నులను పాత నోట్లతో చెల్లించవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.