సరిహద్దు పల్లెల్లో కనిపించని ‘నవోదయం’ | Employment Guarantee Works Delayed in Vizianagaram | Sakshi
Sakshi News home page

సరిహద్దు పల్లెల్లో కనిపించని ‘నవోదయం’

Published Mon, Dec 10 2018 7:20 AM | Last Updated on Mon, Dec 10 2018 7:20 AM

Employment Guarantee Works Delayed in Vizianagaram - Sakshi

పార్వతీపురంలో అధికారులకు నాటుసారాతో పట్టుబడిన నిందితులు

గిరిజన, సరిహద్దు గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పిస్తాం.. యువతకు ఉద్యోగాలు ఇస్తాం.. రుణాలు మంజూరు చేసి ఆర్థిక ఆసరా కల్పిస్తాం.. సారా తయా రీ పనుల్లోనుంచి విముక్తి కల్పిస్తాం.. వారి బతుకుల్లో ‘నవోదయం’ కల్పిస్తామన్న పాలకుల హామీలు, అధికారుల ప్రకటనలు ఆచరణ శూన్యమయ్యాయి. సారా తయారీ నుంచి దూరం చేయలేకపోయాయి. ఫలితం.. జిల్లాలో నాటుసారా తయారీ ఆరునెలలుగా ఊపందుకుంది. ఎక్సైజ్‌ అధికారుల దాడులు పెరగడం, కేసులు నమోదు సంఖ్యే దీనికి నిలువెత్తు సాక్ష్యం. తెలుగుదేశం ప్రభుత్వం ఏ పథకాన్నీ, ఏ పనినీ సక్రమంగా అమలు చేయదని, ఉత్తుత్తి ప్రకటనలతో కాలక్షేపం చేస్తోందని, సారాతో జీవితాలు ఛిద్రమవుతున్నాయంటూ మహిళలు ఆవేదన చెందుతున్నారు.  

విజయనగరం రూరల్‌: సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ‘నవోదయం’ కార్యక్రమాన్ని 2016 ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. కార్యక్రమం ప్రారంభ సమయంలో జిల్లాను 2017 ఏప్రిల్‌ నెలాఖరు నాటికి సారా రహిత జిల్లాగా తీర్చుదిద్దుతామని ప్రభుత్వ పెద్దలు, జిల్లా కలెక్టర్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శా ఖ అధికారులు ప్రకటించారు. ఏడాదిన్నర గడిచినా నాటుసారా తయారీ జిల్లాలో ఆగడం లేదు. దీనికి  ఎక్సైజ్‌ అధికారుల దాడుల్లో సారా బట్టీలు వెలుగుచూడడం, కేసులు అధికంగా నమోదవుతుండడమే నిదర్శనం.

జిల్లాలో నాటుసారా ఎక్కువుగా తయారు చేసే 80 గ్రామాలను గుర్తించారు. వీటిని ఏ,బీ,సీ విభా గాలుగా విడదీసి మూడు నెలల్లో అన్ని గ్రామాల్లో  నవోదయం కార్యక్రమంపై విస్త్రత ప్రచారం చేశారు. సారా తయారీ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనేక గ్రామాల్లో సారాబట్టీలపై దాడులు నిర్వహించి సారా తయారీ, సారా సరఫ రాను ఎక్సైజ్‌ అధికారులు అడ్డుకుంటున్నారు. 2017 వరకు జిల్లాలో సుమారు 300కు పైగా గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. నవోదయం ప్రారంభమైన మొదట్లో 210 మందిపై ముం దస్తుగా బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. నేర చరితగల 95 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ గ్రామ సభలు, ప్రతీ శనివారం నవోదయం కార్యక్రమంపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పటివరకు వందశాతం సారారహిత గ్రామాలుగాతీర్చిదిద్దామని అధికారులు చెబుతున్నా వాస్తవంలో ఇప్పటికీ అనేక గ్రామాల్లో నాటుసారా తయారవుతున్నట్టు ఎక్సైజ్‌ అధికారుల దాడులతో తేటతెల్లం అవుతోంది.

ఉపాధి ఏదీ?
అధికారులు సారా తయారు చేస్తున్న 80 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వారిని తయారీకి దూరంగా ఉంటే ఉపాధికి ప్రభుత్వం నుంచి రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పి హామీలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సారా తయారీకి దూరంగా ఉండాలని చెప్పారు. దీంతో ఏడాది పాటు వారు సారా తయారీకి దూరంగానే ఉన్నారు. అయితే, అధి కారులు వారికి ఉపాధి కల్పనకు ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తామని చెప్పిన హామీని నెరవేర్చకపోవడంతో వారు ఉపాధి లేక కుటుంబాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్‌ రుణాలు అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే మంజూరు చేయడంతో ఎక్సైజ్‌ అధికారులు చేతులెత్తేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సారా తయారీవైపు ఆయా గ్రామాల ప్రజలు మొగ్గుచూపారు. ఫలితం.. గత ఆరు నెలలుగా జిల్లాలో నాటు సారా తయారీ ఊపందుకుంది. దీనికి నిదర్శనంగా 2018  జనవరి నుంచి ఇప్పటివరకు 328 కేసులు 382 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే, 10,700 లీటర్లకు పైగా నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 55 వేలకు పైగా బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతీ శనివారం గుర్తించిన గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడంలేదని కొందరు అధికారులే చెబుతుండడం గమనార్హం.

ప్రజల భాగస్వామ్యం అవసరం
సంపూర్ణ సారా రహిత జిల్లాగా రూపుదిద్దుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం. నాటుసారా తయారీ, అమ్మకం, సరఫరా చేస్తే నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా, రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ నియంత్రణకు కృషి చేస్తున్నాం. అలాగే, ఒడిశా రాష్ట్ర సరిహద్దు మండలాలు పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, బొద్దిడి గ్రామాల్లో ఒడిశాకు చెందిన సారా తయారీ ముఠాలు జిల్లాలోకి అక్రమంగా సారా ప్యాకెట్లు సరఫరా చేసి గిరిజనలుతో అమ్మకాలు సాగిస్తున్నాయి. పార్వతీపురం, కురుపాం స్టేషన్ల పరిధిలో నాటుసారా కొంతవరకు తయారవుతున్నా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి అరికడుతున్నాం. సారా తయారీదారులపై అవగాహన కల్పిస్తున్నాం. నెల్లిమర్ల, కొత్తవలస, ఎస్‌.కోట సర్కిల్‌ పరిధిలో నాలుగైదు గ్రామాల్లో కొంతమంది సారా తయారుచేస్తున్నా వారిని నియంత్రించి కేసులు నమోదు చేస్తున్నాం. అయితే, రుణాల మంజూరుకు సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నాం.              – ఎ.శంభూప్రసాద్, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement