సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ పథకం పను ల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగడుతూ భారత్ రాష్ట్ర సమితి శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టా లని నిర్ణయించింది. ఉపాధిహామీ పథకం నిధులతో రైతులు నిర్మించుకున్న ధాన్యం ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ పలు పర్యాయాలు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం కొత్త షరతులు, కోతలు విధిస్తోందన్నారు. కోవిడ్ పరిణామాలతో ఉపాధి అవకాశాలు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పథకం ద్వారా భరోసా కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు భిన్నంగా క్రమంగా నిధులు తగ్గిస్తోందన్నారు.
కల్లాలను అడ్డుకుంటున్న కేంద్రం
తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ధాన్యాన్ని ఆరబోసేందుకు రైతులు నిర్మించుకున్న కల్లాలపై కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాలు సముద్రతీర ప్రాంతాల్లో చేపలు ఎండబెట్టుకునేందుకు సిమెంటు కల్లాలను నిర్మించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడరాని అభ్యంతరం తెలంగాణలో ఎందుకు వస్తోందని ప్రశ్నించారు.
తెలంగాణలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన 79 వేల వ్యవసాయ కల్లాలను మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ఉపాధి హామీ పథకం నిధులు ఖర్చుచేయొచ్చనే నిబంధన ఉన్నా తెలంగాణ రైతులపై కక్ష సాధించేందుకు.. నిధుల మళ్లింపు అంటూ కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అంతేకాక వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించినందని కేంద్రం కుట్రలకు పాల్పడుతోందన్నారు. కల్లాల నిర్మాణానికి ఖర్చు చేసిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడానికి నిరసనగా జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment