యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
-
జేసీ ఇంతియాజ్
నెల్లూరు(పొగతోట):
జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. నిరుద్యోగ యువతను గుర్తించి వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. పరిశ్రమల్లో ఉన్న ఖాళీలను గుర్తించాలన్నారు. ఆ ఖాళీల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్) నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు.
ఉజ్వలపై ప్రచారం నిర్వహించండి
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంపై ప్రజలకు అవగాహన కలిగేలా గ్యాస్ ఏజెన్సీల ద్వారా చర్యలు తీసుకోవాలని జేసి ఇంతియాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 20 వేల గ్యాస్ కనెక‌్షన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక‌్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
మీ–సేవా కేంద్రాల్లో పాత నోట్లతో బిల్లుల చెల్లింపు
మీ–సేవ కేంద్రాల్లో ఈ నెల 14వ తేది అర్ధరాత్రి వరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో బిల్లులు చెల్లించవచ్చునని జేసీ ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో మీ–సేవా కేంద్రాలకు ఉత్తర్వులు ఇచ్చామని పేర్కొన్నారు. విద్యుత్, ఇంటి, కుళాయి పన్నులను పాత నోట్లతో చెల్లించవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.