LNG
-
బయోమాస్ సేకరణపై ఫోకస్.. ఖర్చు ఎంతంటే..
అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల నిత్యం గ్యాస్ ధరల పెరుగుతున్నాయి. భారత్ విదేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. దాంతో ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతోంది. చేసేదేమిలేక ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. అయితే దిగుమతి చేసుకునే గ్యాస్ స్థానే స్థానికంగా బయోమాస్‌ను సేకరించి దీన్ని తయారుచేసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్(ఐబీఏ) సూచించింది. అందుకు అనుగుణంగా బయోమాస్ సేకరణపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఐబీఏ పేర్కొంది. బయోగ్యాస్ ప్లాంట్లకు బయోమాస్‌ను సప్లయ్ చేయడానికి మెషినరీ, ఎక్విప్మెంట్ల కోసం రూ.30 వేలకోట్ల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ఐబీఏ అంచనా వేసింది. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) దిగుమతులను తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. వరిగడ్డి వంటి అగ్రి వేస్టేజ్‌ను బయోఎనర్జీ ఉత్పత్తికి వాడుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ చైర్మన్ గౌరవ్ కేడియా అన్నారు. అయితే బయోమాస్‌ను సేకరించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దాన్ని సేకరించడం, స్టోర్ చేయడం, రవాణా వంటి వాటికి అధికమొత్తంలో ఖర్చువుతుందని, దీంతో వరిగడ్డి వంటి అగ్రి వేస్ట్‌ను అమ్మడం కంటే తగలబెట్టడానికే రైతులు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడం కంటే వరి గడ్డిని సమర్ధవంతంగా సేకరించగలిగే ఎక్విప్మెంట్లను వాడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదీ చదవండి: ‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు.. -
కాకినాడలో భారీ ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ టెర్మినల్
సాక్షి, అమరావతి: నార్వేకు చెందిన క్రౌన్ ఎల్ఎన్జీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. కాకినాడ వద్ద సముద్రంలో రూ.8,300 కోట్లతో ఫ్లోటింగ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుని దానిని రీగ్యాసిఫికేషన్ చేసి దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే విధంగా 7.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు క్రౌన్ ఎల్ఎన్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వపన్ కఠారియా ప్రకటించారు. భారతదేశ పర్యటనకు వచ్చిన కఠారియా తాజాగా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ 2028 నాటికి కాకినాడ వద్ద సముద్రంలో తేలియాడే ఎల్ఎన్జీ యూనిట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తీవ్ర తుపానులు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం కోసం పలు అంతర్జాతీయ సంస్థలతో క్రౌన్ ఎల్ఎన్జీ ఒప్పందం కుదుర్చుకుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఆరు ఎల్ఎల్జీ టెర్మినల్స్ ఉండగా, ఇవి పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయడంలేదన్నారు. ప్రపంచంలో చౌకగా లభించే ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుని రీగ్యాసిఫికేషన్ ప్రక్రియ నిర్వహించి తిరిగి సరఫరా చేసే విధంగా దేశంలోనే రెండో అతిపెద్ద టెర్మినల్‌గా కాకినాడ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కఠారియా వివరించారు. ఎల్ఎన్జీకి పెరుగుతున్న డిమాండ్ దేశీయ ఇంధన అవసరాల్లో సహజవాయువు వినియోగాన్ని భారీగా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఎల్ఎన్జీకి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో ఎల్ఎన్జీ వినియోగం 6 శాతంగా ఉందని, దానిని 2030 నాటికి 15 శాతానికి పెంచాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 20.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ వినియోగం జరగ్గా, పదేళ్లలో ఇది 72.9 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలో రాష్ట్రానికి క్రౌన్ ఎల్ఎన్జీ ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్రౌన్ ఎల్ఎన్జీ ఆసక్తి చూపిస్తోందని, ఇప్పటికే తొలి దశ చర్చలు పూర్తయ్యాయని ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుందని చెప్పారు. ఫిబ్రవరిలో క్రౌన్ ఎల్ఎన్జీ ప్రతినిధుల బృందం రాష్ట్ర పర్యటనకు రానుందని వెల్లడించారు. -
భారత్‌ను కాలుష్య రహిత దేశంగా మార్చుదాం
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ కోరారు. ఖనిజ పరిశ్రమల్లో హైడ్రోజన్, ఎల్ఎన్జీ గ్యాస్‌తో నడిచే యంత్రాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మినరల్ ఇండస్ట్రీస్ సదస్సు రెండు రోజులపాటు హైటెక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఖనిజ పరిశ్రమల్లో పర్యావరణ చర్యలు అనే అంశంపై సోమవారం పలువురు మైనింగ్ మేధావులు తమ పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో ఎన్ఎండీసీ చైర్మన్, ఫీమీ అధ్యక్షులు సుమిత్ దేవ్, ఉపాధ్యక్షులు శాంతేష్ గురెడ్డి, సింగరేణి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. ఖనిజ పరిశ్రమల్లో వినియోగించే థర్మల్ విద్యుత్ తగ్గించేలా చూడాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే తన విద్యుత్ అవసరాల కోసం 219 సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుందని, మరో 81 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పా టు చేసుకుని, 2023–24 నాటికి సంస్థ అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ను సోలార్ ప్లాంట్ల ద్వారా సమకూర్చుకుంటామని వివరించారు. దీంతో 100 శాతం ‘నెట్ జీరో ఎనర్జీ’లక్ష్యాన్ని సాధించబోతున్నామని వెల్లడించారు. -
భారత్‌కు ఎల్ఎన్జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్!
న్యూఢిల్లీ: భారత్‌కు 5 కార్గోల ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ను సరఫరా చేయడంలో రష్యా డిఫాల్ట్ అయ్యింది.రష్యన్ గ్యాస్ సరఫరా చేసే కంపెనీల్లో ఒకదానిపై ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెడితే దేశీ దిగ్గజం గెయిల్‌కి ఏటా 2.85 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతి కోసం రష్యన్ సంస్థ గాజ్ప్రోమ్కి చెందిన సింగపూర్ విభాగంతో దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. ఈ సింగపూర్ విభాగం ప్రస్తుతం జర్మనీకి చెందిన అనుబంధ సంస్థ కింద పనిచేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలపై రష్యా ప్రతీకార ఆంక్షలు విధించిన దేశాల్లో జర్మనీ కూడా ఉంది. ఫలితంగా సింగపూర్ విభాగానికి రష్యా గ్యాస్ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఎల్ఎన్జీ సరఫరాకు ఆటంకం కలిగింది. గెయిల్ ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. -
గ్యాస్ షేర్లు గెలాప్!
దేశీయంగా పెరగనున్న గ్యాస్ లభ్యత, పర్యావరణానుకూల శుద్ధ ఇంధనాలకు కనిపిస్తున్న డిమాండ్ తదితర అంశాలు ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎల్పీజీ సంస్థలకు లబ్ధి చేకూర్చనున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ రవాణాకు అనువుగా ఏర్పాటవుతున్న మరిన్ని పైప్‌లైన్ నిర్మాణాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. వెరసి భవిష్యత్‌లో గ్యాస్ సంబంధ కంపెనీల షేర్లకు గిరాకీ పెరిగే వీలున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముంబై: రానున్న కొన్నేళ్లలో పలు పట్టణాలను కలుపుతూ గ్యాస్ రవాణాకు అనువుగా పైప్లైన్లు ఏర్పాటవుతున్నాయి. దీనికితోడు దేశ, విదేశీ మార్కెట్లలో గ్యాస్ లభ్యత పెరగనుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధనాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వెరసి ఇకపై అటు గ్యాస్, ఇటు ఇంధన రవాణా కంపెనీలకు డిమాండ్ ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అంటే 2023–24కల్లా దేశీయంగా అదనపు గ్యాస్ ఉత్పత్తి గరిష్టంగా రోజుకి 40 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు చేరే వీలున్నట్లు మోతీలా ల్ ఓస్వాల్ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు కేజీ బేసిన్లో బావుల నుంచి గ్యాస్ ఉత్పాదకత పెరిగే అంచనాలు జత కలిసినట్లు పేర్కొంది. ఆర్ఐఎల్ రెడీ రెండేళ్లలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ 28 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలున్నట్లు మోతీలాల్ నివేదిక పేర్కొంది. దీనిలో 12.5 ఎంఎంఎస్‌సీఎండీని వేలం వేయనున్నట్లు తెలియజేసింది. దీనిలో 4.8 ఎంఎంఎస్‌సీఎండీని జామ్‌నగర్ రిఫైనరీలకోసం వినియోగించనున్నట్లు వివరించింది. ఇక మిగిలిన 12 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ ఉత్పత్తి చేసే అవకాశమున్నట్లు నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో ప్రధానంగా ఎరువులు, రిఫైనింగ్–పెట్రోకెమికల్స్, సిటీగ్యాస్ పంపిణీ రంగాల నుంచి ఇంధనానికి అధిక డిమాండ్ కనిపించనున్నట్లు అంచనా వేసింది. తాజాగా పెరిగిన జోరు... రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ నివేదిక ప్రకారం దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గత రెండు నెలల్లో 6 శాతం అంటే 4.6 ఎంఎంఎస్‌సీఎండీ పుంజుకుని ఈ జనవరికల్లా 82.3 ఎంఎంఎస్‌సీఎండీకి చేరింది. ఇందుకు తూర్పుతీర సముద్ర క్షేత్రాల నుంచి 4.4 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి పెరగడంతో 5.9 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ లభ్యత చేరింది. ఆర్ఐఎల్–బీపీ క్షేత్రాలు ఇందుకు దోహదపడ్డాయి. ఎల్ఎన్జీ ట్రక్కులు పెరగడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో వార్షికంగా మరో 8–10 మిలియన్ మెట్రిక్ టన్నులకు డిమాండ్ జత కలిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గ్యాస్ లభ్యత, వినియోగం పుంజుకోవడం ద్వారా గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (జీఎస్పీఎల్), గెయిల్ వంటి ఇంధన రవాణా కంపెనీలకు మేలు చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. సామర్థ్యం ఇలా... ప్రస్తుతం వార్షికంగా దేశీ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యం 42.5 ఎంఎంటీపీఏగా నమోదైంది. అయితే 2020లో 30 ఎంఎంటీపీఏ మాత్రమే రీగ్యాసిఫికేషన్ జరిగింది. ఇందుకు కొన్ని తాత్కాలిక అవాంతరాలు ఎదురైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. మరోవైపు దహేజ్, ధమ్రా, జైగఢ్ తదితర ప్రాంతాలలో ఏర్పాటవుతున్న టెర్మినళ్ల ద్వారా 24 ఎంఎంటీపీఏ అందుబాటులోకి రానుంది. ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీకి దన్నునివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అంతిమ వినియోగదారులకు గ్యాస్‌ను అందించవలసి ఉన్నట్లు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా జీఎస్పీఎల్ కొన్ని కీలక పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తావించారు. వీటిలో దహేజ్–భాధుట్, అంజార్–చోటిల్లా, అంజార్–పలన్‌పూర్‌ను పేర్కొన్నారు. ఈ బాటలో 2021 జూలైకల్లా సిద్ధంకానున్న మెహశానా –భటిండా పైప్‌లైన్ వల్ల గుజరాత్ వెలుపలి గ్యాస్‌ను రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. -
పెట్రోనెట్ ఎల్ఎన్జీకి రికార్డ్ స్థాయి లాభాలు
న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీ 2017–18 క్యూ4 చూసినా.. ఏడాది మొత్తం చూసినా రికార్డు స్థాయి లాభాలొచ్చాయి. 2016–17 క్యూ4లో రూ.471 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో 11 శాతం వృద్ధితో రూ.523 కోట్లకు పెరిగిందని పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఎమ్డీ, సీఈఓ ప్రభాత్ సింగ్ చెప్పారు. అమ్మకాలు అధికంగా ఉండటం, కార్యకలాపాల్లో సామర్థ్యం కారణంగా క్యూ4లో రికార్డ్ స్థాయి నికర లాభం సాధించామన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.4.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో నికర లాభం 21% వృద్ధితో రూ.2,078 కోట్లకు పెరిగిందని, ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో పెట్రోనెట్ ఎల్ఎన్జీ షేర్ 3.5 శాతం నష్టంతో రూ.211 వద్ద ముగిసింది. -
పెట్రోనెట్‌లో జీడీఎఫ్ వాటాల విక్రయం
10% వాటా విలువ రూ. 3,200 కోట్లు న్యూఢిల్లీ: ద్రవీకృత సహజ వాయువు దిగుమతి సంస్థ.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థలో తమకున్న మొత్తం 10 శాతం వాటాలు విక్రయించినట్లు ఫ్రాన్స్‌కి చెందిన జీడీఎఫ్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 7.5 కోట్ల షేర్లను అమ్మినట్లు పేర్కొంది. సగటున షేరు ఒక్కింటికి రూ.421.63 ధరతో లావాదేవీల మొత్తం విలువ రూ.3,162.22 కోట్లుగా ఉంటుందని జీడీఎఫ్ తెలిపింది. సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, స్టిచ్టింగ్ డిపాజిటరీ ఏపీజీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ పూల్ తదితర సంస్థలు షేర్లను కొనుగోలు చేశాయి. సిటీగ్రూప్ 1.05 కోట్ల షేర్లు, స్టిచ్టింగ్ డిపాజిటరీ 39.26 లక్షల షేర్లు కొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన గెయిల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐవోసీ, బీపీసీఎల్ నెలకొల్పిన పెట్రోనెట్... ప్రైవేట్ కంపెనీగా రిజిస్టరయ్యింది. నాలుగు ప్రమోటర్ సంస్థలకు తలో 12.5 శాతం వాటాలు ఉన్నాయి. తన వాటాలను కొనుగోలు చేయాలంటూ ప్రమోటర్ సంస్థలకు జీడీఎఫ్ ముందుగా ఆఫర్ ఇచ్చినా అవి ముందుకు రాకపోవడంతో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది. -
స్టాక్స్ వ్యూ
పెట్రోనెట్ ఎల్ఎన్జీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.368 టార్గెట్ ధర: రూ.411 ఎందుకంటే: గెయిల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ కంపెనీల జాయింట్‌వెంచర్‌గా పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఏర్పాటైంది. అంతర్జాతీయంగా 2015లో 245 మిలియన్‌టన్నుల(ఎంఎంటీ) ఎల్ఎన్జీ ట్రేడయింది. 142 ఎంఎటీ వార్షికోత్పత్తి సామర్త్యం గల ఎల్ఎన్జీ టెర్మినల్లు వివిధ దశల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎల్ఎన్జీ కాంట్రాక్టులకు సంబంధించి డిస్టినేషన్ క్లాజ్‌ను జపాన్ ఫెయర్ ట్రేడ్ కమిషన్ తొలగిస్తే మార్కెట్లోకి మరింతగా ఎల్ఎన్జీ సరఫరాలు పెరుగుతాయి. దీంతో డిమాండ్ మందగమనంగా ఉండే అవకాశాలున్నాయి. ముడి చమురు ధరలు పెరిగినా కానీ, దీర్ఘకాలం పాటు ఎల్ఎన్జీ ధరలు బలహీనంగా ఉండే అవకాశాలున్నాయి. జీఎస్పీసీ (గుజరాత్ స్టేట్ పెట్రోలియమ్ కార్పొరేషన్)ముంద్రా టెర్మినల్, ఇండియన్ ఆయిల్ ఎన్నోర్ టెర్మినల్ల నుంచి ఈ కంపెనీకి తీవ్రమైన పోటీ ఎదురుకానున్నది. అయితే జీఎస్పీసీ ముంద్రా టెర్మినల్ ఈ ఏడాది జూలైకల్లా అందుబాటులోకి వచ్చినప్పటికీ, పైప్‌లైన్ కనెక్టివిటీ మరో రెండేళ్ల దాకా సమస్యాత్మకంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎన్నోర్ టెర్మినల్ 2018కు గానీ పూర్తవదు. ఈ టెర్మినల్‌కు సంబంధించి పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో కూడా పెద్దగా పురోగతి లేదు. ఇక పెట్రోనెట్ ఎల్ఎన్జీకి చెందిన దహేజ్ టెర్మినల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 15 ఎంఎంటీకు పెరగనున్నది. కోచి–మంగళూర్ పైప్‌లైన్ పనులు మొదలయ్యాయి. ఈపైప్‌లైన్ త్వరలోనే పూర్తవగలదని అంచనా. మరోవైపు విదేశాల్లో కూడా ఎల్ఎన్జీ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. గత నెలలో ఈ షేర్ 8 శాతం వరకూ తగ్గింది. ఈ షేర్ ఈ స్థాయిలో తగ్గడంతో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది మంచి అవకాశమని భావిస్తున్నాం. ఇండియన్ బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.221 టార్గెట్ ధర: రూ.275 ఎందుకంటే: మిడ్‌సైజ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఫండమెంటల్స్పరంగా పటిష్టంగా ఉన్న బ్యాంక్ ఇది. ఆరోగ్యకరమైన స్థాయలో మూలధనం(14.3 శాతం), 2.64 స్థాయిలో నికర వడ్డీ మార్జిన్లు ఆర్జించగలిగే సత్తా, తక్కువ వ్యయమయ్యే డిపాజిట్లు(34 శాతం) ఈ బ్యాంక్‌కు ఉన్న సానుకూలాంశాలు. ఒత్తిడి అధికంగా ఉండే రంగాలకు రుణాలు తక్కువగా ఇవ్వడం ఈ బ్యాంక్‌కు కలసివచ్చే అంశం. టైర్ వన్మూలధనం 13 శాతంగా ఉండటంతో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉండగలదని అంచనా. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇదే కీలకాంశం. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల్లోకి భారీగా డిపాజిట్లు వచ్చాయి. అధిక స్థాయిలో (2,597) బ్రాంచ్‌లు ఉండటంతో ఈ డిపాజిట్ల ద్వారా ప్రయోజనం పొందే బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి కానున్నది. ట్రెజరీ లాభాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 12–18 శాతం రేంజ్లో ఉండొచ్చని భావిస్తున్నాం. 2015 వరకూ రుణవృద్ధి 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఇది పరిశ్రమ సగటు కన్నా అధికం. ప్రస్తుతం రూ.1,22,563 కోట్ల రుణాలు ఇచ్చింది. వీటిల్లో కార్పొరేట్ రంగ రుణాలు 47 శాతంగా, ఎంఎస్ఎంఈ రంగం 16 శాతం, వ్యవసాయం 20 శాతం, రిటైల్ రంగ రుణాలు 16 శాతంగా ఉన్నాయి. రిటైల్, ఎస్ఎంఈ సెగ్మెంట్ల రుణాలపై అధికంగా దృష్టి పెడుతోంది. ఫలితంగా వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం రుణాలు 10% చక్రగతి వృద్ధితో రూ.1,56,493 కోట్లకు పెరుగుతాయని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా నికర వడ్డీ మార్జిన్లు 2.5–2.6 శాతం రేంజ్లో ఉండగలవని అంచనా వేస్తున్నాం. అలాగే నికర లాభం 51 శాతం చక్రగతి వృద్ధితో రూ.1,621 కోట్లకు చేరగలదని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అడ్జెస్ట్డ్ బుక్‌వేల్యూ(ఏబీవీ)కి 1.1 రెట్ల ధరను టార్గెట్ ధరగా నిర్ణయించాం.