స్టాక్స్ వ్యూ
పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.368 టార్గెట్ ధర: రూ.411
ఎందుకంటే: గెయిల్, ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ కంపెనీల జాయింట్‌వెంచర్‌గా పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ ఏర్పాటైంది. అంతర్జాతీయంగా 2015లో 245 మిలియన్‌టన్నుల(ఎంఎంటీ) ఎల్‌ఎన్‌జీ ట్రేడయింది. 142 ఎంఎటీ వార్షికోత్పత్తి సామర్త్యం గల ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌లు వివిధ దశల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎల్‌ఎన్‌జీ కాంట్రాక్టులకు సంబంధించి డిస్టినేషన్ క్లాజ్‌ను జపాన్ ఫెయర్ ట్రేడ్ కమిషన్ తొలగిస్తే మార్కెట్లోకి మరింతగా ఎల్‌ఎన్‌జీ సరఫరాలు పెరుగుతాయి. దీంతో డిమాండ్ మందగమనంగా ఉండే అవకాశాలున్నాయి. ముడి చమురు ధరలు పెరిగినా కానీ, దీర్ఘకాలం పాటు ఎల్‌ఎన్‌జీ ధరలు బలహీనంగా ఉండే అవకాశాలున్నాయి. జీఎస్‌పీసీ (గుజరాత్ స్టేట్ పెట్రోలియమ్ కార్పొరేషన్)ముంద్రా టెర్మినల్, ఇండియన్ ఆయిల్ ఎన్నోర్ టెర్మినల్‌ల నుంచి ఈ కంపెనీకి తీవ్రమైన పోటీ ఎదురుకానున్నది. అయితే జీఎస్‌పీసీ ముంద్రా టెర్మినల్ ఈ ఏడాది జూలైకల్లా అందుబాటులోకి వచ్చినప్పటికీ, పైప్‌లైన్ కనెక్టివిటీ మరో రెండేళ్ల దాకా సమస్యాత్మకంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎన్నోర్ టెర్మినల్ 2018కు గానీ పూర్తవదు. ఈ టెర్మినల్‌కు సంబంధించి పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో కూడా పెద్దగా పురోగతి లేదు. ఇక పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీకి చెందిన దహేజ్ టెర్మినల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 15 ఎంఎంటీకు పెరగనున్నది. కోచి–మంగళూర్ పైప్‌లైన్ పనులు మొదలయ్యాయి. ఈపైప్‌లైన్ త్వరలోనే పూర్తవగలదని అంచనా. మరోవైపు విదేశాల్లో కూడా ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. గత నెలలో ఈ షేర్ 8 శాతం వరకూ తగ్గింది. ఈ షేర్ ఈ స్థాయిలో తగ్గడంతో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది మంచి అవకాశమని భావిస్తున్నాం.
ఇండియన్ బ్యాంక్
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ.221 టార్గెట్ ధర: రూ.275
ఎందుకంటే: మిడ్‌సైజ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఫండమెంటల్స్‌పరంగా పటిష్టంగా ఉన్న బ్యాంక్ ఇది. ఆరోగ్యకరమైన స్థాయలో మూలధనం(14.3 శాతం), 2.64 స్థాయిలో నికర వడ్డీ మార్జిన్లు ఆర్జించగలిగే సత్తా, తక్కువ వ్యయమయ్యే డిపాజిట్లు(34 శాతం) ఈ బ్యాంక్‌కు ఉన్న సానుకూలాంశాలు. ఒత్తిడి అధికంగా ఉండే రంగాలకు రుణాలు తక్కువగా ఇవ్వడం ఈ బ్యాంక్‌కు కలసివచ్చే అంశం. టైర్ వన్‌మూలధనం 13 శాతంగా ఉండటంతో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉండగలదని అంచనా. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇదే కీలకాంశం. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల్లోకి భారీగా డిపాజిట్లు వచ్చాయి. అధిక స్థాయిలో (2,597) బ్రాంచ్‌లు ఉండటంతో ఈ డిపాజిట్ల ద్వారా ప్రయోజనం పొందే బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి కానున్నది. ట్రెజరీ లాభాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 12–18 శాతం రేంజ్‌లో ఉండొచ్చని భావిస్తున్నాం. 2015 వరకూ రుణవృద్ధి 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఇది పరిశ్రమ సగటు కన్నా అధికం. ప్రస్తుతం రూ.1,22,563 కోట్ల రుణాలు ఇచ్చింది. వీటిల్లో కార్పొరేట్ రంగ రుణాలు 47 శాతంగా, ఎంఎస్‌ఎంఈ రంగం 16 శాతం, వ్యవసాయం 20 శాతం, రిటైల్ రంగ రుణాలు 16 శాతంగా ఉన్నాయి. రిటైల్, ఎస్‌ఎంఈ సెగ్మెంట్ల రుణాలపై అధికంగా దృష్టి పెడుతోంది. ఫలితంగా వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం రుణాలు 10% చక్రగతి వృద్ధితో రూ.1,56,493 కోట్లకు పెరుగుతాయని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా నికర వడ్డీ మార్జిన్లు 2.5–2.6 శాతం రేంజ్‌లో ఉండగలవని అంచనా వేస్తున్నాం. అలాగే నికర లాభం 51 శాతం చక్రగతి వృద్ధితో రూ.1,621 కోట్లకు చేరగలదని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అడ్జెస్ట్‌డ్ బుక్‌వేల్యూ(ఏబీవీ)కి 1.1 రెట్ల ధరను టార్గెట్ ధరగా నిర్ణయించాం.