
ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సేవల ఆపరేటర్ పవన్ హన్స్ తాజాగా ఓఎన్‌జీసీ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఓఎన్‌జీసీ ఆఫ్–షోర్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి నాలుగు హెలికాప్టర్లను పవన్ హన్స్ సమకూరుస్తుంది. ఈ డీల్ విలువ రూ.2,141 కోట్లు. 10 ఏళ్లపాటు పవన్ హన్స్ ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టు పవన్ హన్స్ వెల్లడించింది.
ఇదీ చదవండి: హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్
హెచ్‌ఏఎల్ తయారీ అత్యాధునిక ధ్రువ్ ఎన్‌జీ హెలికాప్టర్లను పవన్ హన్స్ వినియోగించనుంది. ‘దేశీయంగా తయారు చేసిన ధృవ్ ఎన్‌జీ అనేది అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఎంకే–3 యొక్క సివిల్ వేరియంట్. ఏఎల్‌హెచ్ ఎంకే–3ని ప్రస్తుతం భారత రక్షణ దళాలు ఉపయోగిస్తున్నాయి. ఈ సైనిక హెలికాప్టర్లు నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 335 కంటే ఎక్కువ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేశాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,75,000 గంటలపాటు గగనతల విహారం చేశాయి’ అని పవన్ హన్స్ తెలిపింది. సంస్థ వద్ద ప్రస్తుతం 46 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి చమురు, సహజ వాయువు అన్వేషణ, పోలీసు, కేంద్ర బలగాలు తరలింపు, యుటిలిటీ రంగంతోపాటు మారుమూల, కొండ ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తున్నాయి.