ONGC Oil India Ltd
-
ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు ఊరట
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ఉత్పత్తి ధరలపై కేంద్రానికి కీలక సూచనలు చేసిన కిరీట్ పారిఖ్ కమిటీ, ఓఎన్జీసీ ఆయిల్ ఇండియాకు కొంత ఊరట కల్పించింది. ఈ సంస్థలకు ప్రభుత్వం నామినేషన్‌పై కేటాయించిన క్షేత్రాల (లెగసీ ఫీల్డ్స్) నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను.. దిగుమతి చేసుకునే ధరలో 10 శాతం నిర్ణయించాలని పేర్కొంది. అలాగే, ఇవే సంస్థలు కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ (ప్రస్తుత సామర్థ్యం కాకుండా)కు 20 శాతం అధిక ధరను పారిఖ్ కమిటీ సూచించింది. ఇక లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే ధరను దిగుమతి ధరలో 10 శాతం లేదా ఎంబీటీయూ గ్యాస్‌కు గరిష్టంగా 6.5 డాలర్లు మించకూడదని పేర్కొంది. అదే సమయంలో కనిష్టంగా 4 డాలర్లను సిఫారసు చేసింది. దీనివల్ల ఎరువుల కంపెనీలపై భారం తగ్గనుంది. ఎందుకంటే వీటికి ప్రధాన ఇంధనంగా సీఎన్జీ ఉన్న విషయం గమనార్హం. ఇవే ధరల పరిమితులు విద్యుత్ రంగానికీ సరఫరా చేసే గ్యాస్‌కు కూడా వరిస్తాయి. ప్రస్తుతం లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర ఎంబీటీయూకు 8.57 డాలర్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం దిగుమతి చేసుకునే క్రూడ్ బ్యారెల్ 83 డాలర్లుగా ఉంది. ఇందులో 10 శాతం అంటే 8.3 డాలర్లు అవుతుంది. అయినా కానీ గరిష్ట పరిమితి 6.5 డాలర్లుగానే ఉంటుంది. -
దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు, ఓఎన్జీసీ..రిలయన్స్‌కు లాభాలే లాభాలు!
న్యూఢిల్లీ: సహజవాయువు ధరలు రెట్టింపు కావడం, చమురు ధరల పెరుగుదల ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు (అప్‌స్ట్రీమ్ కంపెనీలు) భారీ లాభాలను తెచ్చిపెట్టనున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది. ఓఎన్జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును యూనిట్‌కు 2.9 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు, సంక్లిష్ట క్షేత్రాల నుండి రిలయన్స్ వంటి కంపెనీలు వెలికితీసే గ్యాస్ ధరను యూనిట్‌కు 6.1 డాలర్ల నుండి 9.92 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి ఇవి ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయి. దేశీయ గ్యాస్, చమురు ధర నిర్ణయం గత 12 నెలల్లో నాలుగు గ్లోబల్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ బెంచ్‌మార్క్‌ల ధరలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా తాజా ధరల పెరుగుదలకు సంబంధించి ఫిచ్ మంగళవారంనాటి విశ్లేషణలను పరిశీలిస్తే.. ► భారత ప్రభుత్వం సహజవాయువు ధరలను పెంచడంతోపాటు, 2022లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారల్ అంచనాలను గత 70 డాలర్ల నుంచి 100 డాలర్లకు, 2023లో 60 డాలర్ల నుంచి 80 డాలర్లకు పెంచింది. ఈ నిర్ణయం ఫిచ్ రేటింగ్ ఇస్తున్న భారత్ అప్‌స్ట్రీమ్ కంపెనీల లాభదాయకత, అలాగే వారి పెట్టుబడి వ్యయ పటిష్టత, వాటాదారుల డివిడెండ్ పంపిణీల వంటి అంశాలకు మద్దతును అందిస్తుంది. ► అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, తాజా ధరల పెంపు ముందు ఊహించిందే. అక్టోబర్ 2022లో తదుపరి ధర నిర్ణయంలో రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. అధిక గ్యాస్ ధరల స్థితి కొనసాగుతుందని భావించడం దీనికి కారణం. ► అధిక గ్యాస్ ధరలు ఆయిల్ ఇండియా లిమిటెడ్ క్రెడిట్ రేటింగ్ పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఆ సంస్థ మూలధనం తన అనుబంధ సంస్థ– నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ సామ ర్థ్యాన్ని విస్తరించేందుకు దోహదపడుతుంది. ► కేజీ బేసిన్ నుండి గ్యాస్ ఉత్పత్తి చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీలు ధరల పరిమితి (లోతైన నీరు, ఇతర క్లిష్టమైన క్షేత్రాలకు) పెంపు నుండి ప్రయోజనం పొందుతాయి. మొత్తం రాబడి పెరుగుదలకు కొంత మేర ఈ నిర్ణయం దోహదపడుతుంది. క్రెడిట్ ప్రొఫైల్స్ రెండు సంస్థలు పటిష్టంగా కొనసాగనున్నాయి. ► అధిక చమురు, గ్యాస్ ధరలు– వినియోగ రంగంలోకి తయారీ సంస్థలపై ముడి పదార్థాల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. రవాణా వంటి కీలక రంగాలకు ఈ బిల్లు భారంగా మారే వీలుంది. ► దేశీయంగా ఉత్పత్తి చేయబడిన గ్యాస్.. కొన్ని రంగాలకు ప్రాధాన్యతా ప్రాతిపదికన సరఫరా అవుతుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉత్పత్తిలో విద్యుత్ ఉత్పత్తిదారులు 30 శాతం, ఎరువుల రంగం దాదాపు 27 శాతం, సిటీ–గ్యాస్ పంపిణీదారులు 19 శాతం వినియోగించారు. ► గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ఎరువుల రంగం వర్కింగ్–క్యాపిటల్ అవసరాలను పెంచుతుంది. ఈ రంగం లాభదాయకతను ఈ నిర్ణయం దెబ్బతీస్తుంది. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా అధిక దిగుమతి వ్యయాలను కూడా ఈ రంగం ఎదుర్కొంటుంది. ► ఆటో గ్యాస్ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ద్రవ ఇంధనాల ధరలకు సంబంధించి పోటీ తత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ► కేంద్రం తాజా పెంపు నిర్ణయం వల్ల గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇది వినియోగదారుపై ప్రభావం చూపే అంశం. మోర్గాన్ స్టాన్లీదీ ఇదే మాట... దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం పెంచడంతో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గణనీయంగా ప్రయోజనం పొందుతాయని ఆర్థిక సేవల దిగ్గజం– మోర్గాన్ స్టాన్లీ కూడా అంచనా వేస్తోంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వార్షిక ఆదాయం 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11,500 కోట్లు) మేర పెరగవచ్చని ఆ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. మార్కెట్లో నిల్వలు, పెట్టుబడులు తగ్గడం మరోవైపు దాదాపు దశాబ్దం తర్వాత దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుండటం ఆయిల్ కంపెనీల లాభాలకు తోడ్పడనుందని తెలిపింది. గ్యాస్ ధర యూనిట్‌కు 1 డాలర్ పెరిగితే ఓఎన్జీసీ ఆదాయాలు 5–8 శాతం మేర పెరుగుతాయని అంచనా. మార్కెట్లో గ్యాస్ కొరత నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌లో మరోసారి నిర్వహించే ధరల సమీక్షలో గ్యాస్ రేటును ఇంకో 25 శాతం మేర కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చని కూడా మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో విశ్లేషించింది. -
కేజీ బేసిన్‌కు నాలుగు కొత్త రిగ్గులు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని చమురు నిక్షేపాల వెలికితీతకు ప్రభుత్వ ఆయిల్ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా గుర్తించిన బావుల నుంచి గ్యాస్, చమురు వెలికితీయడానికి ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగిస్తోంది. దేశం వ్యాప్తంగా ఉపయోగించడానికి 47 రిగ్గులను ఇటలీ నుంచి కొనుగోలు చేసిన ఓఎన్జీసీ అందులో నాలుగింటిని నరసాపురం, రాజమహేంద్రవరం కేంద్రాలుగా కార్యకలాపాలు సాగుతున్న కేజీ బేసిన్‌కు కేటాయించింది. తొలివిడతగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దెయ్యాలతిప్ప వద్ద ఇటలీ టెక్నాలజీ రిగ్గును ఇటీవల ప్రవేశపెట్టారు. మరో రిగ్గును కొద్ది రోజుల్లో భీమవరం సమీపంలోని వేండ్రలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు నిక్షేపాల కోసం తవ్వకాలను పాత యంత్రాలతోనే కొనసాగిస్తోంది. డ్రిల్లింగ్ సమయంలో బాంబింగ్ కూడా చేస్తారు. దీంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. పైప్లైన్లలో లీకేజీలతో బ్లోఅవుట్లు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి ఓఎన్జీసీ ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగంలోకి తెచ్చింది. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు.. నాలుగు దశాబ్దాలుగా నరసాపురం టెంపుల్ ల్యాండ్ కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. తరువాత కాలంలో రాజమహేంద్రవరంలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. చమురు నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన యంత్రసామగ్రి మొత్తం నరసాపురం టెంపుల్ ల్యాండ్‌లోనే ఉంటుంది. నరసాపురం ప్రాంతంలో 40 ఏళ్లుగా అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఇస్తున్న బావులు ఖాళీ అవ్వడంతో ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి జిల్లాలో గ్యాస్ నిక్షేపాల కోసం పలు ప్రాంతాల్లో విస్తృతంగా సర్వే చేసింది. మార్టేరు, పెనుగొండ, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని దెయ్యాలతిప్ప, మహదేవపట్నం, వేండ్ర ప్రాంతాల్లో కొత్త బావులను గుర్తించింది. కొత్తగా గుర్తించిన బావుల్లో వినియోగించేందుకు ఇటలీ టెక్నాలజీ రిగ్గులు కొనుగోలు చేసింది. చమురు, గ్యాస్ ఉత్పత్తిలో పశ్చిమదే అగ్రస్థానం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 600 టన్నుల ఆయిల్ వస్తోంది. సంస్థ ఉత్పత్తిలో ఇప్పటివరకు జిల్లాదే అగ్రస్థానం. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 విశిష్ట బ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లోను, తూర్పుగోదావరి జిల్లా కేసనపల్లి, కృష్ణాజిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లోను కొత్తగా చేపట్టిన అన్వేషణ పూర్తయింది. ఈ కొత్త బావుల నుంచి త్వరలో ఉత్పత్తి ప్రారంభించనుంది. కొత్త బావుల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఎక్కువ ఉత్పత్తి రాబోతోంది. వచ్చే ఏడాది నుంచి కేజీ బేసిన్లో రోజుకు 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దాదాపు 25 శాతం ఉత్పత్తి పెంచాలన్నది లక్ష్యం. సముద్రగర్భం నుంచి గ్యాస్.. 1974లో మొదటిసారిగా నరసాపురంలో ఓఎన్జీసీ చమురు నిక్షేపాలను గుర్తించింది. అప్పటి నుంచి కేవలం ఆన్ షోర్పైనే సంస్థ దృష్టి పెట్టింది. 10 ఏళ్ల కిందట నుంచి రిలయన్స్, గెయిల్ వంటి సంస్థలు రంగప్రవేశం చేసి ఆఫ్ షోర్ (సముద్రగర్భం)లో డ్రిల్లింగ్ ముమ్మరం చేయడంతో ఆ దిశగా కూడా ఓఎన్జీసీ దూకుడు పెంచింది. 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో అన్వేషిస్తోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంలో ఆఫ్ షోర్లో గ్యాస్ వెలికితీత ఇప్పటికే ప్రారంభమైంది. గ్యాస్ వెలికితీతలో మూడేళ్ల నుంచి ఓఎన్జీసీ దేశంలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. -
ఓఎన్జీసీ అమ్మకానికి వేళాయే, కేంద్రం చేతికి వేలకోట్లు!
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీలో ప్రభుత్వం విక్రయానికి ఉంచిన 1.5 శాతం వాటా పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయ్యింది. దీంతో ప్రభుత్వానికి రూ. 3,000 కోట్లు లభించనున్నాయి. ఈ నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో లెక్కకురానున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ.159 ఫ్లోర్ ధరలో ప్రభుత్వం 1.5% వాటాకు సమానమైన 1.88 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. గురువారం(31) ఆఫర్ ప్రారంభంకావడంతో 1.33 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. మిగిలిన షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రభుత్వం కేటాయించనుంది. 30న ప్రారంభమైన సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 8.49 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. రూ.159.91 సగటు ధరలో 30.35 కోట్ల షేర్లకు డిమాండ్ కనిపించింది. వెరసి మూడున్నర రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ నమోదైంది. ఈ బిడ్స్ మొత్తం విలువ రూ.4,854 కోట్లు! కాగా.. ఆఫర్‌కు అధిక డిమాండ్ కనిపిస్తే గ్రీన్‌షూ ఆప్షన్‌కింద రెట్టింపు షేర్ల(18.86 కోట్లు)ను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలుంది. ఆఫర్లో భాగంగా తొలుత 9.43 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 1 శాతం బలపడి రూ.164 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ ఫర్ సేల్.. వాటా విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)లో కేంద్రం రూ. 1.5 శాతం వాటాలు విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండనుంది. మార్చి 30, 31 తారీఖుల్లో ఓఎఫ్ఎస్ నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆఫర్ ఫర్ సేల్ కోసం ఫ్లోర్ ధరను షేరు ఒక్కింటికి రూ. 159గా నిర్ణయించినట్లు పేర్కొంది. మంగళవారం బీఎస్ఈలో స్టాక్ ముగింపు ధర రూ. 171.05తో పోలిస్తే ఇది 7 శాతం డిస్కౌంటు. ఓఎన్జీసీలో ప్రభుత్వానికి 60.41 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్ఎస్ కింద కనీసం 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్.. బీమా కంపెనీలకు, 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఓఎన్జీసీ ఉద్యోగులు తలో రూ. 5 లక్షల విలువ చేసే షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎఫ్ఎస్ కింద విక్రయిస్తున్న 0.075 శాతం షేర్లను అర్హులైన ఉద్యోగులకు కటాఫ్ ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ వివరించింది. -
ఓఎన్జీసీకి కాగ్ మొట్టికాయలు
రిగ్స్ నిర్వహణాలోపంవల్ల ఐదేళ్లలో రూ. 7,995 కోట్ల నష్టం వచ్చినట్లు నివేదిక న్యూఢిల్లీ: డ్రిల్లింగ్ రిగ్స్‌ను అద్దెకు తీసుకోవడం, వాటి నిర్వహణ, వినియోగం విషయంలో దేశంలో అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పాదక సంస్థ ఓఎన్జీసీ పేలవ పనితీరు ప్రదర్శించిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీఏజీ-కాగ్) పేర్కొంది. దీనివల్ల రూ.7,995 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం... వార్షికంగా రిగ్ అవసరాల ప్రణాళిక (ఆర్ఆర్పీ)ను సిద్ధం చేయడంలో సంస్థ తగిన ఏకీకృత విధానాన్ని అమలుచేయలేదు. రిగ్గుల రిపేరు, పునరుద్ధరణ ప్రణాళిక తగిన విధంగా లేదు. ఆయా అంశాల నేపథ్యంలో రిగ్ కొనుగోళ్లు, అద్దెకు తీసుకోవడం వంటి అంశాలు తగిన సమయానికి తగిన విధంగా జరగలేదు. 2010 నుంచి 2014 వరకూ రిగ్గులకు సంబంధించి ఉత్పత్తి జరగని సమయం 19% నుంచి 23% వరకూ ఉంది. దీని వల్ల దాదాపు రూ.6,418 కోట్ల నష్టం జరిగింది. రిగ్ కార్యకలాపాలకు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరో రూ.1,577 కోట్ల నష్టం వచ్చింది. ఇదే కారణాల వల్ల నష్టం క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించిందని కాగ్ పేర్కొంది. 2010-14 మధ్య కంపెనీ డ్రిల్ చేసిన ప్రాంతాల్లో దాదాపు 33% ప్రణాళికాబద్ధంగా లేవు. 1867 ప్రాంతాల్లో డ్రిలింగ్ జరిపితే.. 615 ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా జరగలేదు. -
ఓఎన్జీసీకి ‘కేజీ బేసిన్’ కష్టాలు..
ఇప్పటికే కొంత గ్యాస్ రిలయన్స్ చెంతకు.. మిగిలిన గ్యాస్ గిట్టుబాటు కాదు... రిలయన్స్‌తో వివాదంపై డీఅండ్‌ఎం నివేదికతో కొత్త కోణాలు న్యూఢిల్లీ: గ్యాస్ వెలికితీతకు సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ డీఅండ్‌ఎం ఇచ్చిన నివేదికతో ఓఎన్జీసీ-రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వివాదంలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. నిర్దేశిత బ్లాక్‌లో వున్న కొంత గ్యాస్ రిలయన్స్ క్షేత్రంలోకి తరలిపోవడం, దానిని రిలయన్స్ వెలికితీసి విక్రయించిన నేపథ్యంలో ఓఎన్జీసీ తన బ్లాక్ నుంచి లాభసాటిగా గ్యాస్‌ను వెలికితీయగలదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నివేదికను బట్టి చూస్తే ఇప్పటికే ఈ క్షేత్రం నుంచి కొంత భాగం గ్యాస్ ఆర్‌ఐఎల్‌కి చెందిన బ్లాక్ ద్వారా బైటికి వచ్చేసిన నేపథ్యంలో మిగతాదాన్ని వెలికితీయడానికి ఓఎన్జీసీ పెట్టే పెట్టుబడులు.. ప్రస్తుతం గ్యాస్‌కు ఉన్న రేట్ల ప్రకారం గిట్టుబాటు కాకపోవచ్చన్నది పరిశీలకుల అంచనా. కేజీ బేసిన్‌లోని తమ 98/2 బ్లాక్‌లో సుమారు 1.7 లక్షల కోట్ల ఘనపుటడుగుల (టీసీఎఫ్) గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని, యూనిట్‌కు 6 డాలర్ల రేటుతో ఇందులో 1.2 టీసీఎఫ్ దాకా లాభదాయకంగా వెలికితీయొచ్చని ఓఎన్జీసీ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదన (డీవోసీ) ఇచ్చింది. అయితే, ఈ బ్లాక్‌లో గ్యాస్ నిక్షేపాలు 0.9 టీసీఎఫ్ మాత్రమే ఉండగా, అందులో 0.4 టీసీఎఫ్‌ల గ్యాస్ రిలయన్స్ చేతికి వెళ్లిపోయిందని, ఇందులోనూ 0.5 టీసీఎఫ్ మాత్రమే వెలికితీయగలిగేదని డీఅండ్‌ఎం తమ నివేదికలో పేర్కొంది. ఇంత తక్కువగా ఉత్పత్తయినప్పుడు ఓఎన్జీసీ పేర్కొన్న 6 డాలర్ల ధర గిట్టుబాటు కాబోదని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా క్షేత్రంలో గ్యాస్ తగ్గిపోయినందున, ప్రెజర్ క్షీణించి, వాణిజ్యపరంగా ఉత్పత్తికి వ్యయం పెరిగిపోతుందని డీ అండ్ ఎం పేర్కొంది. మరోవైపు, ఈ వాదనను ఓఎన్జీసీ వర్గాలు ఖండిస్తున్నాయి. డీఅండ్‌ఎం లెక్క వేస్తున్నది బ్లాక్‌లో కొంత భాగానికే తప్ప పూర్తి క్షేత్రానికి కాదంటున్నాయి. ఆర్ఐఎల్ గానీ తమ బ్లాక్ నుంచి గ్యాస్ తీయకపోయి ఉంటే సదరు క్షేత్రం నుంచి గ్యాస్ ఉత్పత్తి లాభదాయకంగానే ఉండేదని ఓఎన్జీసీ వర్గాలు వాదిస్తున్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ బ్లాకు, రిలయన్స్‌కు చెందిన బ్లాకు పొరుగునే ఉన్న సంగతి తెలిసిందే. తమ క్షేత్రం నుంచి గ్యాస్‌ను ఆర్ఐఎల్ అక్రమంగా వెలికితీస్తోందని ఆరోపిస్తున్న ఓఎన్జీసీ.. దీనిపై తమకు పరిహారం కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో వాస్తవాలను తేల్చేందుకు నియమించబడిన అమెరికన్ కన్సల్టెన్సీ సంస్థ డీఅండ్‌ఎం.. తన నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించింది. సుమారు 0.4 టీసీఎఫ్ మేర ఓఎన్జీసీ గ్యాస్ ఆర్ఐఎల్ కేజీ-డీ6 బ్లాక్‌లోకి వెళ్లిన మాట వాస్తవమేనని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి, ఓఎన్జీసీకి నష్టపరిహారం ఎలా సమకూర్చాలన్నది నిర్ణయించే పనిలో ఉంది. నివేదిక అందిన ఆరునెలల్లోగా ప్రభుత్వం ఎటువంటి చర్యా తీసుకోకపోతే తిరిగి తమను సంప్రదించమని ఢిల్లీ హైకోర్టు న్యాయ మూర్తులు ఓఎన్జీసీకి సూచించారు. ఆర్ఐఎల్కు ఇలాంటి సమస్యే.. ముందస్తు అంచనాల కన్నా నిక్షేపాలు తక్కువగా ఉన్న అంశం రిలయన్స్‌కు కూడా ఎదురైంది. ఆర్ఐఎల్ ప్రాథమికంగా తమ కేజీ-డీ6 క్షేత్రంలో 7 టీసీఎఫ్ గ్యాస్ నిక్షేపాలు ఉంటాయని, 5.6 టీసీఎఫ్ను వెలికితీయొచ్చని పేర్కొంది. ఆ తర్వాత నిక్షేపాల పరిమాణాన్ని ఏకంగా 12 టీసీఎఫ్లకు, వెలికితీయగలిగే పరిమాణాన్ని 10-11 టీసీఎఫ్లకు పెంచింది. కానీ, 2012లో ఆర్ఐఎల్.. వెలికితీయగలిగే గ్యాస్ పరిమాణాన్ని భారీగా 2.9 టీసీఎఫ్కు కుదించేసింది. తర్వాత రోజుల్లో పెరిగే గ్యాస్ రేట్ల ప్రయోజనం పొందేందుకు ఆర్ఐఎల్ కావాలనే గ్యాస్ ఉత్పత్తిని తగ్గించేసిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆర్ఐఎల్ సదరు బ్లాక్‌పై పెట్టిన పెట్టుబడుల రికవరీపై వివాదం నడుస్తోంది. తాజాగా డీఅండ్‌ఎం ఆర్ఐఎల్ క్షేత్రం నిల్వలపైనా మదింపు జరిపింది. దీని ప్రకారం ఆర్ఐఎల్ ముందుగా చెప్పిన దానికన్నా సదరు క్షేత్రంలో నిక్షేపాలు చాలా తక్కువగా 2.9 టీసీఎఫ్ మాత్రమే ఉంటాయని అంచనా వేసింది. ఇంకా అందులో కేవలం 183 బిలియన్ ప్రామాణిక ఘనపుటడుగుల (బీసీఎం) (0.183 టీసీఎఫ్) గ్యాస్ మాత్రమే ఉందని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే అసలు ఆర్ఐఎల్ ఏ ప్రాతిపదికన తన ముందస్తు లెక్కలు వేసింది, వాటిని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఏ ప్రాతిపదికన ఆమోదించినదీ అన్న దానిపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. -
ఆ గ్యాస్.. ఓఎన్జీసీదే
రిలయన్స్ విక్రయించిన గ్యాస్ వివాదంపై డీఅండ్‌ఎం తుది నివేదిక న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య నడుస్తున్న గ్యాస్ వివాదంపై అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ డీఅండ్‌ఎం తుది నివేదికను రూపొందించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకు సంబంధించిన కృష్ణా గోదావరి బేసిన్ బ్లాకుల నుంచి దాదాపు రూ.11,000 కోట్ల విలువైన సహజ వాయువు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చె ందిన కేజీ-డీ6 బ్లాక్‌లోకి తరలివెళ్లిందనే వివాదంపై డీఅండ్‌ఎం తన తుది నివేదికను డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)కు అందించిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి, ఓఎన్జీసీ కోల్పోయిన గ్యాస్‌కు నష్టపరిహారాన్ని ఎలా సమకూర్చాలనే అంశంపై ఒక నిర్ణయానికి రానుందని పేర్కొన్నారు. ఓఎన్జీసీ బ్లాకుల నుంచి రిలయన్స్ కేజీ-డీ6 బ్లాక్‌లోకి దాదాపు 11.122 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) గ్యాస్ తరలివెళ్లిందని డీఅండ్‌ఎం తెలిపింది. -
భెల్, ఐవోసీలలో డిజిన్వెస్ట్మెంట్కు ఓకే
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు భెల్, ఐవోసీలలో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సాధికార మంత్రుల కమిటీ(ఈజీవోఎం) ఆమోదముద్ర వేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఐవోసీలో 10%, భెల్‌లో 5% వాటాను ప్రభుత్వం విక్రయానికి పెట్టనుంది. తద్వారా రూ. 7,300 కోట్లు లభించగలవని ప్రభుత్వం ఆశిస్తోంది. ఐవోసీలో 10% వాటాను ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు 5% చొప్పున విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధర రూ. 248 వద్ద ఐవోసీ(10%) వాటాకు రూ. 5,300 కోట్లు లభించే అవకాశమున్నట్లు డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి రవి మాథుర్ చెప్పారు. వాటా విక్రయాన్ని ఆఫ్‌మార్కెట్ ద్వారా ప్రభుత్వం చేపట్టనుంది. ఇక భెల్‌లో 5% వాటాను బ్లాక్‌డీల్ ద్వారా ఎల్ఐసీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుత ధర రూ. 167 వద్ద భెల్ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 2,045 కోట్లవరకూ సమకూరవచ్చు. ప్రస్తుతం భెల్‌లో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది.