ఓఎన్‌జీసీకి కాగ్ మొట్టికాయలు
రిగ్స్ నిర్వహణాలోపంవల్ల ఐదేళ్లలో రూ. 7,995 కోట్ల నష్టం వచ్చినట్లు నివేదిక
న్యూఢిల్లీ: డ్రిల్లింగ్ రిగ్స్‌ను అద్దెకు తీసుకోవడం, వాటి నిర్వహణ, వినియోగం విషయంలో దేశంలో అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పాదక సంస్థ ఓఎన్‌జీసీ పేలవ పనితీరు ప్రదర్శించిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీఏజీ-కాగ్) పేర్కొంది. దీనివల్ల రూ.7,995 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం...
వార్షికంగా రిగ్ అవసరాల ప్రణాళిక (ఆర్‌ఆర్‌పీ)ను సిద్ధం చేయడంలో సంస్థ తగిన ఏకీకృత విధానాన్ని అమలుచేయలేదు.
రిగ్గుల రిపేరు, పునరుద్ధరణ ప్రణాళిక తగిన విధంగా లేదు. ఆయా అంశాల నేపథ్యంలో రిగ్ కొనుగోళ్లు, అద్దెకు తీసుకోవడం వంటి అంశాలు తగిన సమయానికి తగిన విధంగా జరగలేదు.
2010 నుంచి 2014 వరకూ రిగ్గులకు సంబంధించి ఉత్పత్తి జరగని సమయం 19% నుంచి 23% వరకూ ఉంది. దీని వల్ల దాదాపు రూ.6,418 కోట్ల నష్టం జరిగింది.
రిగ్ కార్యకలాపాలకు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరో రూ.1,577 కోట్ల నష్టం వచ్చింది.
ఇదే కారణాల వల్ల నష్టం క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించిందని కాగ్ పేర్కొంది.
2010-14 మధ్య కంపెనీ డ్రిల్ చేసిన ప్రాంతాల్లో దాదాపు 33% ప్రణాళికాబద్ధంగా లేవు. 1867 ప్రాంతాల్లో డ్రిలింగ్ జరిపితే.. 615 ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా జరగలేదు.