న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలో వచ్చిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రిపోర్టు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మరిన్ని తలనొప్పులు తెచ్చేదిగా మారింది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన ఎక్సైజ్ విధానంపై తాజాగా వెలువడిన కాగ్ రిపోర్టులో నాడు పాలసీ అమలులో చోటు చేసుకున్న పలు లోపాలు వెలుగు చూశాయి.
ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ(Delhi Liquor Policy) కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ డేటాను కాగ్ తొలిసారిగా సమర్పించింది. అయితే ఇది బీజేపీ కాగ్ నివేదిక అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం దేశరాజధానిలో మద్యం వ్యాపారం నష్టాల్లో ఉన్నప్పటికీ ఆప్ ప్రభుత్వం కొంతమంది బిడ్డర్లకు లైసెన్సులు ఇచ్చిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఎక్సైజ్ విధానాన్ని అమలు చేయడంలో ప్రధాన లోపాలను ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల కారణంగా సర్కారుకు దాదాపు రూ.2,026 కోట్ల నష్టం(RS 2000 Crore Loss) వాటిల్లింది.ఈ నష్టానికి సామాన్యులు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఆప్ నేతలు మాత్రం భారీగా కమీషన్లు అందుకున్నారని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
నాడు ఎక్సైజ్ శాఖకు సారధ్యం వహించిన మనీష్ సిసోడియాతో పాటు అతని మంత్రుల బృందం.. నిపుణుల ప్యానెల్ సిఫార్సులను విస్మరించిందని నివేదిక పేర్కొంది. మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపింది. ఎక్సైజ్ పాలసీ అమలులో పలు కీలక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారని నివేదిక పేర్కొంది. ఇందుకోసం కేబినెట్ నుండి లేదా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆమోదం తీసుకోలేదని నివేదిక తెలియజేసింది.
కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలు
1. భారీ నష్టాలు: విధానంలోని లోపాల కారణంగా ప్రభుత్వానికి ₹2,026 కోట్ల నష్టం వాటిల్లింది.
2. నిపుణులను విస్మరించడం: మద్యం విధానాన్ని రూపొందించే ముందు నిపుణులను సంప్రదించారు. కానీ వారి సిఫార్సులను పాటించలేదు.
3. బిడ్డింగ్ అక్రమాలు: ఫిర్యాదులు ఎదుర్కొంటున్న లేదా నష్టాల్లో నడుస్తున్న కంపెనీలకు కూడా లైసెన్సులు జారీ చేశారు.
4. ఆమోదం తీసుకోలేదు: అనేక కీలక నిర్ణయాలలో క్యాబినెట్, లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఆమోదం తీసుకోలేదు.
5. పారదర్శకత లేకపోవడం: మద్యం ధర నిర్ణయించడంలో, లైసెన్సులు జారీ చేయడంలో పారదర్శకత లోపించింది. నియమాలను ఉల్లంఘించిన వారికి ఎటువంటి జరిమానా విధించలేదు.
6. పాలసీ సరిగ్గా అమలు చేయలేదు: మద్యం నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రయోగశాలలు, పరీక్షా సౌకర్యాలు కల్పించలేదు. రిటైల్ మద్యం దుకాణాలను అన్ని ప్రాంతాలకూ సమానంగా పంపిణీ చేయలేదు.
7. తప్పుడు మినహాయింపులు: కోవిడ్-19 పేరుతో రూ.144 కోట్ల విలువైన లైసెన్స్ ఫీజులను మాఫీ చేశారు. అయితే అలా చేయవలసిన అవసరం లేదు.
8. జోనల్ లైసెన్స్‌దారులకు ఇచ్చిన రాయితీల ఫలితంగా రూ. 941 కోట్ల నష్టం వాటిల్లింది.
9. సెక్యూరిటీ డిపాజిట్లను సరిగా రికవరీ చేయకపోవడం వల్ల రూ. 27 కోట్ల నష్టం.
10. ఉపసంహరించిన లైసెన్స్‌లకు టెండర్లు వేయకపోవడం వల్ల రూ. 890 కోట్ల నష్టం వాటిల్లింది.
కోవిడ్-19 ఆంక్షల కారణంగా కేజ్రీవాల్ ప్రభుత్వం రూ.144 కోట్ల విలువైన లైసెన్స్ ఫీజులను మాఫీ చేసిందని నివేదిక పేర్కొంది. దీని వలన ఆదాయం మరింతగా తగ్గింది. సెక్యూరిటీ డిపాజిట్‌ను తప్పుగా డిపాజిట్ చేయడం వల్ల రూ. 27 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి: ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..
Comments
Please login to add a commentAdd a comment