పంచాయతీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లలో.. గత ఐదేళ్లలో భారీ వృద్ధి | Huge growth in state government grants to Panchayat institutions in the last five years | Sakshi
Sakshi News home page

పంచాయతీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లలో.. గత ఐదేళ్లలో భారీ వృద్ధి

Published Sat, Nov 23 2024 5:28 AM | Last Updated on Sat, Nov 23 2024 5:28 AM

Huge growth in state government grants to Panchayat institutions in the last five years

2017–18లో రూ.151.67 కోట్లు.. 2021–22లో రూ.281.12 కోట్లు 

పంచాయతీరాజ్‌ సంస్థల మొత్తం రాబడుల్లోనూ భారీ వృద్ధి 

కాగ్‌ నివేదిక వెల్లడి

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు, రుణాల రూపంలో ఇచ్చే నిధులు  2017–18తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరానికి గణనీయంగా పెరిగినట్టు కాగ్‌ వెల్లడించింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థానిక సంస్థల నిధుల వినియోగంపై కాగ్‌ నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 

2017–18లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ సంస్థలకు రూ.151.67 కోట్లు విడుదల చేయగా, 2021–22లో రూ.281.12 కోట్లు ఇచ్చినట్టు కాగ్‌ తెలిపింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు మొత్తం 2017–18లో రూ.1,922.05 కోట్లు అందగా.. 2021–22లో రూ.3,666.30 కోట్లు అందినట్లు పేర్కొంది.  – సాక్షి, అమరావతి 

14, 15 ఆర్థిక సంఘాల నిధులకు ఎప్పటికప్పుడు యూసీలు 
ఆర్థికసంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడే యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు (యూసీలు) అందజేసిందని కాగ్‌ పేర్కొంది. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు కేంద్రం 2023 సెప్టెంబర్‌ నాటికి వివిధ సంవత్సరాల్లో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసిన 8,124.42 కోట్లు, 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు విడుదల చేసిన రూ.3,594.51 కోట్లకు వినియోగ ధ్రువపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చినట్లు కాగ్‌ వివరించింది. 

2017–22 మధ్య ఆర్‌జీఎస్‌ఏ ద్వారా విడుదల చేసిన రూ.190.27 కోట్లకు కేంద్రానికి యూసీలను సమర్పించారని తెలిపింది. 2016–22 మధ్య రుర్బన్‌ పథకం కోసం కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిన రూ.187 కోట్లలో రూ.45.71 కోట్లకు యూసీలను 2023 సెప్టెంబర్‌ నాటికి కేంద్రానికి ఇంకా సమర్పించాల్సి ఉందని పేర్కొంది. 

సామాజిక తనిఖీల్లో ఉల్లంఘనల గుర్తింపు 
2021–22లో గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పథకం ద్వారా జరిగిన రూ.వేలకోట్ల పనులకు సంబంధించి నిర్వహించిన సామాజిక కనిఖీల్లో రూ.232.99 కోట్ల విలువైన పనుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు మండలస్థాయి తనిఖీ బహిరంగ సమావేశాల్లో నిర్ధారించినట్లు తెలిపింది. 

అందులో రూ.89.35 కోట్ల విలువైన పనుల్లో (38.35 శాతం) ఆర్థిక దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలను అధికారులు ఆమోదించారని పేర్కొంది. ఆ ఆమోదం చేసిన మేర మొత్తం 2023 ఆగస్టు నాటికి సంబంధీకుల నుంచి వసూలు కాలేదని కాగ్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement