
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)లో కేంద్రం రూ. 1.5 శాతం వాటాలు విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండనుంది. మార్చి 30, 31 తారీఖుల్లో ఓఎఫ్‌ఎస్ నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది.
ఆఫర్ ఫర్ సేల్ కోసం ఫ్లోర్ ధరను షేరు ఒక్కింటికి రూ. 159గా నిర్ణయించినట్లు పేర్కొంది. మంగళవారం బీఎస్‌ఈలో స్టాక్ ముగింపు ధర రూ. 171.05తో పోలిస్తే ఇది 7 శాతం డిస్కౌంటు. ఓఎన్‌జీసీలో ప్రభుత్వానికి 60.41 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్‌ఎస్ కింద కనీసం 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్.. బీమా కంపెనీలకు, 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు.
ఓఎన్‌జీసీ ఉద్యోగులు తలో రూ. 5 లక్షల విలువ చేసే షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎఫ్‌ఎస్ కింద విక్రయిస్తున్న 0.075 శాతం షేర్లను అర్హులైన ఉద్యోగులకు కటాఫ్ ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment