ఓఎన్‌జీసీకి ‘కేజీ బేసిన్’ కష్టాలు..
ఇప్పటికే కొంత గ్యాస్ రిలయన్స్ చెంతకు..
మిగిలిన గ్యాస్ గిట్టుబాటు కాదు...
రిలయన్స్‌తో వివాదంపై డీఅండ్‌ఎం నివేదికతో కొత్త కోణాలు
న్యూఢిల్లీ: గ్యాస్ వెలికితీతకు సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ డీఅండ్‌ఎం ఇచ్చిన నివేదికతో ఓఎన్‌జీసీ-రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) వివాదంలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. నిర్దేశిత బ్లాక్‌లో వున్న కొంత గ్యాస్ రిలయన్స్ క్షేత్రంలోకి తరలిపోవడం, దానిని రిలయన్స్ వెలికితీసి విక్రయించిన నేపథ్యంలో ఓఎన్‌జీసీ తన బ్లాక్ నుంచి లాభసాటిగా గ్యాస్‌ను వెలికితీయగలదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నివేదికను బట్టి చూస్తే ఇప్పటికే ఈ క్షేత్రం నుంచి కొంత భాగం గ్యాస్ ఆర్‌ఐఎల్‌కి చెందిన బ్లాక్ ద్వారా బైటికి వచ్చేసిన నేపథ్యంలో మిగతాదాన్ని వెలికితీయడానికి ఓఎన్‌జీసీ పెట్టే పెట్టుబడులు.. ప్రస్తుతం గ్యాస్‌కు ఉన్న రేట్ల ప్రకారం గిట్టుబాటు కాకపోవచ్చన్నది పరిశీలకుల అంచనా.
కేజీ బేసిన్‌లోని తమ 98/2 బ్లాక్‌లో సుమారు 1.7 లక్షల కోట్ల ఘనపుటడుగుల (టీసీఎఫ్) గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని, యూనిట్‌కు 6 డాలర్ల రేటుతో ఇందులో 1.2 టీసీఎఫ్ దాకా లాభదాయకంగా వెలికితీయొచ్చని ఓఎన్‌జీసీ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదన (డీవోసీ) ఇచ్చింది. అయితే, ఈ బ్లాక్‌లో గ్యాస్ నిక్షేపాలు 0.9 టీసీఎఫ్ మాత్రమే ఉండగా, అందులో 0.4 టీసీఎఫ్‌ల గ్యాస్ రిలయన్స్ చేతికి వెళ్లిపోయిందని, ఇందులోనూ 0.5 టీసీఎఫ్ మాత్రమే వెలికితీయగలిగేదని డీఅండ్‌ఎం తమ నివేదికలో పేర్కొంది. ఇంత తక్కువగా ఉత్పత్తయినప్పుడు ఓఎన్‌జీసీ పేర్కొన్న 6 డాలర్ల ధర గిట్టుబాటు కాబోదని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా క్షేత్రంలో గ్యాస్ తగ్గిపోయినందున, ప్రెజర్ క్షీణించి, వాణిజ్యపరంగా ఉత్పత్తికి వ్యయం పెరిగిపోతుందని డీ అండ్ ఎం పేర్కొంది.
మరోవైపు, ఈ వాదనను ఓఎన్‌జీసీ వర్గాలు ఖండిస్తున్నాయి. డీఅండ్‌ఎం లెక్క వేస్తున్నది బ్లాక్‌లో కొంత భాగానికే తప్ప పూర్తి క్షేత్రానికి కాదంటున్నాయి. ఆర్‌ఐఎల్ గానీ తమ బ్లాక్ నుంచి గ్యాస్ తీయకపోయి ఉంటే సదరు క్షేత్రం నుంచి గ్యాస్ ఉత్పత్తి లాభదాయకంగానే ఉండేదని ఓఎన్‌జీసీ వర్గాలు వాదిస్తున్నాయి.
కృష్ణా గోదావరి బేసిన్‌లో ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్ బ్లాకు, రిలయన్స్‌కు చెందిన బ్లాకు పొరుగునే ఉన్న సంగతి తెలిసిందే. తమ క్షేత్రం నుంచి గ్యాస్‌ను ఆర్‌ఐఎల్ అక్రమంగా వెలికితీస్తోందని ఆరోపిస్తున్న ఓఎన్‌జీసీ.. దీనిపై తమకు పరిహారం కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో వాస్తవాలను తేల్చేందుకు నియమించబడిన అమెరికన్ కన్సల్టెన్సీ సంస్థ డీఅండ్‌ఎం.. తన నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించింది. సుమారు 0.4 టీసీఎఫ్ మేర ఓఎన్‌జీసీ గ్యాస్ ఆర్‌ఐఎల్ కేజీ-డీ6 బ్లాక్‌లోకి వెళ్లిన మాట వాస్తవమేనని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి, ఓఎన్‌జీసీకి నష్టపరిహారం ఎలా సమకూర్చాలన్నది నిర్ణయించే పనిలో ఉంది. నివేదిక అందిన ఆరునెలల్లోగా ప్రభుత్వం ఎటువంటి చర్యా తీసుకోకపోతే తిరిగి తమను సంప్రదించమని ఢిల్లీ హైకోర్టు న్యాయ మూర్తులు ఓఎన్‌జీసీకి సూచించారు.
ఆర్‌ఐఎల్‌కు ఇలాంటి సమస్యే..
ముందస్తు అంచనాల కన్నా నిక్షేపాలు తక్కువగా ఉన్న అంశం రిలయన్స్‌కు కూడా ఎదురైంది. ఆర్‌ఐఎల్ ప్రాథమికంగా తమ కేజీ-డీ6 క్షేత్రంలో 7 టీసీఎఫ్ గ్యాస్ నిక్షేపాలు ఉంటాయని, 5.6 టీసీఎఫ్‌ను వెలికితీయొచ్చని పేర్కొంది. ఆ తర్వాత నిక్షేపాల పరిమాణాన్ని ఏకంగా 12 టీసీఎఫ్‌లకు, వెలికితీయగలిగే పరిమాణాన్ని 10-11 టీసీఎఫ్‌లకు పెంచింది. కానీ, 2012లో ఆర్‌ఐఎల్.. వెలికితీయగలిగే గ్యాస్ పరిమాణాన్ని భారీగా 2.9 టీసీఎఫ్‌కు కుదించేసింది. తర్వాత రోజుల్లో పెరిగే గ్యాస్ రేట్ల ప్రయోజనం పొందేందుకు ఆర్‌ఐఎల్ కావాలనే గ్యాస్ ఉత్పత్తిని తగ్గించేసిందని ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఆర్‌ఐఎల్ సదరు బ్లాక్‌పై పెట్టిన పెట్టుబడుల రికవరీపై వివాదం నడుస్తోంది. తాజాగా డీఅండ్‌ఎం ఆర్‌ఐఎల్ క్షేత్రం నిల్వలపైనా మదింపు జరిపింది. దీని ప్రకారం ఆర్‌ఐఎల్ ముందుగా చెప్పిన దానికన్నా సదరు క్షేత్రంలో నిక్షేపాలు చాలా తక్కువగా 2.9 టీసీఎఫ్ మాత్రమే ఉంటాయని అంచనా వేసింది. ఇంకా అందులో కేవలం 183 బిలియన్ ప్రామాణిక ఘనపుటడుగుల (బీసీఎం) (0.183 టీసీఎఫ్) గ్యాస్ మాత్రమే ఉందని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే అసలు ఆర్‌ఐఎల్ ఏ ప్రాతిపదికన తన ముందస్తు లెక్కలు వేసింది, వాటిని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఏ ప్రాతిపదికన ఆమోదించినదీ అన్న దానిపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.