KG Basin Gas
-
కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తి
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిడెట్ (ఓఎన్జీసీ) ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌కు చెందిన కేజీ-డీ5 బ్లాక్‌లో ఐదు నంబర్ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. దీనివల్ల రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయం పెరగనుందని పేర్కొంది.ఓఎన్జీసీ తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో లోతైన సముద్ర ప్రాజెక్ట్‌లో ఐదో నంబర్ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో కేజీ-డీ5 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇందులో నాలుగు బావుల నుంచి ఇప్పటి వరకు చమురు, గ్యాస్ వెలికి తీసేవారు. కానీ తాజాగా కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 క్లస్టర్-2 అసెట్‌లో ఐదో చమురు బావిలో ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఓఎన్జీసీ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. ఈ కొత్త బావి వల్ల ముడిచమురు, సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని తెలిపింది.ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!ఇదిలా ఉండగా, కొత్త బావి నుంచి ఎంత మొత్తంలో చమురు ఉత్పత్తి చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ బావి ద్వారా చేస్తున్న చమురు, గ్యాస్ ఉత్పత్తి వల్ల దిగుమతులు తగ్గే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో రానున్న రోజుల్లో సంస్థ లాభాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. -
ఏపీలో ఓఎన్జీసీ కొత్తగా అన్వేషణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) మొత్తం 53 చోట్ల కొత్తగా అన్వేషణ సాగించనుంది. ఇందుకోసం రూ.2,150 కోట్లు ఖర్చు చేస్తోంది. పర్యావరణ అనుమతుల కోసం ఓఎన్జీసీ చేసిన రెండు వేర్వేరు ప్రతిపాదనలను గత నెలలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) ఆమోదించింది. బావుల నిర్వహణ కారణంగా నష్టపోయిన సందర్భంలో రైతులు, ఆస్తి హక్కుదారులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఓఎన్జీసీకి ఉంటుందని అథారిటీ స్పష్టం చేస్తూ షరతు విధించింది. కేజీ బేసిన్లో 2028 నాటికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 50 ప్రాంతాల్లో, అలాగే 2024 కల్లా కడప బేసిన్లో కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మూడుచోట్ల నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలను చేపట్టనుంది. వాణిజ్యపరంగా లాభదాయకమని రుజువైతే ఈ బావులను అభివృద్ధి చేసి, సమీపంలోని ప్రారంభ ఉత్పత్తి వ్యవస్థ/గ్యాస్ సేకరణ కేంద్రాలకు అనుసంధానిస్తారు. ఓఎన్జీసీ ప్రస్తుతం కేజీ బేసిన్లో రోజుకు 4.4 మిలియన్ల ప్రామాణిక క్యూబిక్ అడుగుల గ్యాస్, 700 టన్నులకుపైగా చమురు ఉత్పత్తి చేస్తోంది. -
కేజీ బ్లాకులో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ కేజీ బేసిన్‌లోని గ్యాస్ బ్లాకులో వాటాను విదేశీ సంస్థలకు విక్రయించనుంది. సముద్ర అంతర్భాగంలో అత్యధిక పీడనం, అధిక టెంపరేచర్‌గల ఈ బ్లాకులో వాటాను గ్లోబల్ సంస్థలకు ఆఫర్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు టెండర్లకు తెరతీసింది. సవాళ్లతో కూడిన ఈ గ్యాస్ డిస్కవరీ నుంచి ఉత్పత్తిని చేపట్టేందుకు వీలుగా సాంకేతికత, ఆర్థిక సామర్థ్యంగల సంస్థల కోసం చూస్తోంది. ఈ బాటలో గ్లోబల్ దిగ్గజాలకు ఆహ్వానం పలుకుతోంది. దీన్ దయాళ్ వెస్ట్(డీడీడబ్ల్యూ) బ్లాకుతోపాటు కేజీ–డీ5 ప్రాంతంలోని క్లస్టర్–3లో అత్యంత లోతైన డిస్కవరీల నుంచి గ్యాస్‌ను వెలికితీసేందుకు భాగస్వామ్యం కోసం ప్రాథమిక టెండర్లను ప్రకటించింది. వచ్చే నెల(జూన్) 16కల్లా ఆసక్తిగల సంస్థలు తమ సంసిద్ధత(ఈవోఐ)ను వ్యక్తం చేస్తూ బిడ్స్‌ను దాఖలు చేయవలసిందిగా ఆహ్వానించింది. భాగస్వాములపై కన్ను: కేజీ–55 బ్లాకులోని యూడీ–1 డిస్కవరీలో గ్యాస్ నిల్వలను కనుగొన్న ఓఎన్జీసీ 2017 ఆగస్ట్‌లో 80 శాతం వాటాను సొంతం చేసుకుంది. గుజరాత్ ప్రభుత్వ కంపెనీ జీఎస్పీసీ నుంచి ఈ వాటాను రూ. 7,738 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు యూడీ డిస్కవరీ అభివృద్ధి విషయంలో కంపెనీకి అవసరమైన నైపుణ్యం, సాంకేతికత లేకపోవడంతో అత్య ధిక ఒత్తిడి, టెంపరేచర్‌గల డీడీడబ్ల్యూ బ్లాకులోనూ తగినస్థాయిలో విజయవంతం కాలేకపోయింది. ఓఎన్జీసీ రూ.31,000 కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలో దేశ అవసరాలను మరింతగా తీర్చే లక్ష్యంతో రానున్న మూడేళ్లలో రూ.31,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఓఎన్జీసీ ప్రకటించింది. భవిష్యత్తు ఉత్పత్తి విధానానికి గురువారం ఓఎన్జీసీ బోర్డు ఆమోదం తెలిపింది. చమురు, గ్యాస్ వెలికితతకు సంబంధించి సమగ్రమైన కార్యాచరణను సంస్థ రూపొందించింది. -
తగ్గిన భారత్ ముడి చమురు ఉత్పత్తి
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి కారణంగా ఏప్రిల్‌లో భారత్ ముడి చమురు ఉత్పత్తి 1 శాతం పడిపోయిందని అధికారిక డేటా వెల్లడించింది. 2021 ఏప్రిల్‌లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2.5 మిలియన్ టన్నులుకాగా, 2022 ఏప్రిల్‌లో ఈ పరిమాణం 2.47 మిలియన్ టన్నులకు తగ్గినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి వార్షికంగా చూస్తే 7.5 శాతం తక్కువ ముడి చమురు (5,67,570 టన్నులు) ఉత్పత్తి జరిగింది. ప్రభుత్వ రంగం దూకుడు.. కాగా వేర్వేరుగా చూస్తే, ఏప్రిల్‌లో ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి పెరిగింది. చమురు, సహజ వాయువుల కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గత ఏడాది ఏప్రిల్ నెల ఉత్పత్తి 1.63 మిలియన్ టన్నులుకాగా, ఈ పరిమాణం తాజా సమీక్షా నెలలో 1.65 మిలియన్ టన్నులకు చేరింది. పెరుగుదల 0.86 శాతంకాగా, ఓఎన్జీసీ నిర్దేశించుకున్న లక్ష్యంకన్నా ఈ పరిమాణం 5 శాతం అధికం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 3.6 శాతం ఎక్కువ ముడి చమురును ఉత్పత్తి చేసింది. పరిమాణంలో ఇది 2,51,460 టన్నులు. సహజ వాయువు ఉత్పత్తి ఇలా... కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్. బీపీ కృష్ణా గోదావరి–డీ 6 బ్లాక్‌కు నిలయమైన తూర్పు ఆఫ్‌షోర్ నుండి అధిక ఉత్పత్తి కారణంగా సహజ వాయువు ఉత్పత్తి 6.6 శాతం పెరిగి 2.82 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం)కు చేరుకుంది. ఓఎన్జీసీ సహజ వాయువు ఉత్పత్తి ఒక శాతం తగ్గి 1.72 బీసీఎంగా నమోదయ్యింది. అయితే తూర్పు ఆఫ్‌షోర్ అవుట్‌పుట్ 43 శాతం పెరిగి 0.6 బీసీఎంలకు చేరినట్లు డేటా పేర్కొంటోంది. క్షేత్రం వారీగా ఉత్పత్తి వివరాలు తెలియరాలేదు. రిఫైనరీల పరిస్థితి ఇలా... డిమాండ్ మెరుగుపడ్డంతో రిఫైనరీలు ఏప్రిల్‌లో 8.5 శాతం ఎక్కువ ముడి చమురును ప్రాసెస్ చేశాయి. ఈ పరిమాణం 21.6 మిలియన్ టన్నులు గా ఉంది. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 12.8 శాతం ఎక్కువ ముడి చమురును ఇంధనంగా మార్చాయి. ప్రైవేట్, జాయింట్ సెక్టార్ యూనిట్ల క్రూడ్ ఉత్పత్తి 1.8 శాతం పెరిగింది. రిఫైనరీలు ఏప్రిల్‌లో 22.8 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు జరి పాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 9 శాతం అధికం. ప్రభుత్వ రంగ యూనిట్ల నుండి ఇంధన ఉత్పత్తి దాదాపు 12 శాతం పెరిగి 13 మిలియన్ టన్నులకు చేరుకోగా, ప్రైవేట్ రంగ యూనిట్లు 7 శాతం అధికంగా 9.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేశాయి. ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి రిఫైనరీలు వాటి స్థాపిత సామర్థ్యంలో 104.5 శాతంతో పనిచేశాయి. కేంద్రం నజర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికిగాను చమురు, గ్యాస్ దేశీయ ఉత్పత్తిని పెంచడంపై కేంద్రం మరోవైపు దృష్టి సారిస్తోంది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం, సహజ వాయువు అవసరాలలో సగం దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్లీజ్.. భారత్‌ను బతిమాలుతున్నాం, ఆ నిషేధాన్ని ఎత్తేయండి: ఐఎంఎఫ్ చీఫ్ -
అంతర్యుద్ధం వచ్చినా రావొచ్చు : రవీంద్ర బాబు
సాక్షి, ఢిల్లీ : ప్రత్యేక హోదా అంశంలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ రవీంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి నుంచి తాము బయటికి వచ్చినందునే రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పగబట్టారన్నారు. విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను చిన్న చూపు చూస్తూ మోదీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీశారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రధాని ఇంటిని ముట్టడించినా ఫలితం లేదని ఎంపీ రవీంద్ర బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం దేశాన్ని విచ్చిన్నం చేయడం ద్వారా దక్షిణ భారత దేశాన్ని వేరు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్ర అనుచిత వైఖరి పట్ల యువత రగిలిపోతోందని, అంతర్యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. కేజీ బేసిన్తోనే ఆదాయం.. రాష్ట్రంలో కేంద్రీకృతమైన కేజీ బేసిన్ వల్లే గ్యాస్, చమురు దిగుమతులు తగ్గాయని, ఈ కారణంగానే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. కేజీ బేసిన్‌లోని క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేయడానికి కాకినాడ ప్రాంతంలోనే పెట్రో కెమికల్ కాంప్లెక్ కడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు రత్నగిరికి మార్చడం అన్యాయమన్నారు. గ్యాస్ కోసం 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన ఓఎన్జీసీ అద్దె కొంపలో ఉంటోందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి, ఈస్టిండియా కంపెనీకి తేడా లేదని మండిపడ్డారు. తక్షణమే ఎల్ అండ్ జీ టెర్మినల్ నిర్మించాలని, రత్నగిరి నుంచి పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను కాకినాడకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ అంశమై త్వరలోనే పెట్రోలియం శాఖ మంత్రితో భేటీ అవుతానని రవీంద్ర బాబు తెలిపారు. -
జీఎస్పీసీ గ్యాస్ బ్లాక్‌లో 80% వాటా ఓఎన్జీసీ చేతికి
న్యూఢిల్లీ: గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీఎస్పీసీ)కి చెందిన కేజీ బేసిన్ గ్యాస్ బ్లాక్‌లో 80 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 995 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 6,700 కోట్లు) ఉండనున్నట్లు సంస్థ వివరించింది. డీల్ ప్రకారం కృష్ణ–గోదావరి బేసిన్‌లోని దీన్ దయాళ్ వెస్ట్ ఫీల్డ్‌ను ఓఎన్జీసీ దక్కించుకోనుంది. దీంతో ఆపరేటర్‌షిప్ హక్కులు కూడా దఖలుపడతాయని సంస్థ తెలిపింది. దీన్ దయాళ్ వెస్ట్ ఫీల్డ్ నుంచి ప్రయోగాత్మకంగా ఏడాది క్రితమే గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ..ఇంకా వాణిజ్యపరంగా ఉత్పత్తి మొదలుకాలేదు. ఒప్పందం పూర్తయిన బ్లాక్‌లోని ఇతర భాగస్వాములతో కలిసి వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఓఎన్జీసీ తెలిపింది. -
ఓఎన్జీసీకి ‘కేజీ బేసిన్’ కష్టాలు..
ఇప్పటికే కొంత గ్యాస్ రిలయన్స్ చెంతకు.. మిగిలిన గ్యాస్ గిట్టుబాటు కాదు... రిలయన్స్‌తో వివాదంపై డీఅండ్‌ఎం నివేదికతో కొత్త కోణాలు న్యూఢిల్లీ: గ్యాస్ వెలికితీతకు సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ డీఅండ్‌ఎం ఇచ్చిన నివేదికతో ఓఎన్జీసీ-రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వివాదంలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. నిర్దేశిత బ్లాక్‌లో వున్న కొంత గ్యాస్ రిలయన్స్ క్షేత్రంలోకి తరలిపోవడం, దానిని రిలయన్స్ వెలికితీసి విక్రయించిన నేపథ్యంలో ఓఎన్జీసీ తన బ్లాక్ నుంచి లాభసాటిగా గ్యాస్‌ను వెలికితీయగలదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నివేదికను బట్టి చూస్తే ఇప్పటికే ఈ క్షేత్రం నుంచి కొంత భాగం గ్యాస్ ఆర్‌ఐఎల్‌కి చెందిన బ్లాక్ ద్వారా బైటికి వచ్చేసిన నేపథ్యంలో మిగతాదాన్ని వెలికితీయడానికి ఓఎన్జీసీ పెట్టే పెట్టుబడులు.. ప్రస్తుతం గ్యాస్‌కు ఉన్న రేట్ల ప్రకారం గిట్టుబాటు కాకపోవచ్చన్నది పరిశీలకుల అంచనా. కేజీ బేసిన్‌లోని తమ 98/2 బ్లాక్‌లో సుమారు 1.7 లక్షల కోట్ల ఘనపుటడుగుల (టీసీఎఫ్) గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని, యూనిట్‌కు 6 డాలర్ల రేటుతో ఇందులో 1.2 టీసీఎఫ్ దాకా లాభదాయకంగా వెలికితీయొచ్చని ఓఎన్జీసీ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదన (డీవోసీ) ఇచ్చింది. అయితే, ఈ బ్లాక్‌లో గ్యాస్ నిక్షేపాలు 0.9 టీసీఎఫ్ మాత్రమే ఉండగా, అందులో 0.4 టీసీఎఫ్‌ల గ్యాస్ రిలయన్స్ చేతికి వెళ్లిపోయిందని, ఇందులోనూ 0.5 టీసీఎఫ్ మాత్రమే వెలికితీయగలిగేదని డీఅండ్‌ఎం తమ నివేదికలో పేర్కొంది. ఇంత తక్కువగా ఉత్పత్తయినప్పుడు ఓఎన్జీసీ పేర్కొన్న 6 డాలర్ల ధర గిట్టుబాటు కాబోదని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా క్షేత్రంలో గ్యాస్ తగ్గిపోయినందున, ప్రెజర్ క్షీణించి, వాణిజ్యపరంగా ఉత్పత్తికి వ్యయం పెరిగిపోతుందని డీ అండ్ ఎం పేర్కొంది. మరోవైపు, ఈ వాదనను ఓఎన్జీసీ వర్గాలు ఖండిస్తున్నాయి. డీఅండ్‌ఎం లెక్క వేస్తున్నది బ్లాక్‌లో కొంత భాగానికే తప్ప పూర్తి క్షేత్రానికి కాదంటున్నాయి. ఆర్ఐఎల్ గానీ తమ బ్లాక్ నుంచి గ్యాస్ తీయకపోయి ఉంటే సదరు క్షేత్రం నుంచి గ్యాస్ ఉత్పత్తి లాభదాయకంగానే ఉండేదని ఓఎన్జీసీ వర్గాలు వాదిస్తున్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ బ్లాకు, రిలయన్స్‌కు చెందిన బ్లాకు పొరుగునే ఉన్న సంగతి తెలిసిందే. తమ క్షేత్రం నుంచి గ్యాస్‌ను ఆర్ఐఎల్ అక్రమంగా వెలికితీస్తోందని ఆరోపిస్తున్న ఓఎన్జీసీ.. దీనిపై తమకు పరిహారం కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో వాస్తవాలను తేల్చేందుకు నియమించబడిన అమెరికన్ కన్సల్టెన్సీ సంస్థ డీఅండ్‌ఎం.. తన నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించింది. సుమారు 0.4 టీసీఎఫ్ మేర ఓఎన్జీసీ గ్యాస్ ఆర్ఐఎల్ కేజీ-డీ6 బ్లాక్‌లోకి వెళ్లిన మాట వాస్తవమేనని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి, ఓఎన్జీసీకి నష్టపరిహారం ఎలా సమకూర్చాలన్నది నిర్ణయించే పనిలో ఉంది. నివేదిక అందిన ఆరునెలల్లోగా ప్రభుత్వం ఎటువంటి చర్యా తీసుకోకపోతే తిరిగి తమను సంప్రదించమని ఢిల్లీ హైకోర్టు న్యాయ మూర్తులు ఓఎన్జీసీకి సూచించారు. ఆర్ఐఎల్కు ఇలాంటి సమస్యే.. ముందస్తు అంచనాల కన్నా నిక్షేపాలు తక్కువగా ఉన్న అంశం రిలయన్స్‌కు కూడా ఎదురైంది. ఆర్ఐఎల్ ప్రాథమికంగా తమ కేజీ-డీ6 క్షేత్రంలో 7 టీసీఎఫ్ గ్యాస్ నిక్షేపాలు ఉంటాయని, 5.6 టీసీఎఫ్ను వెలికితీయొచ్చని పేర్కొంది. ఆ తర్వాత నిక్షేపాల పరిమాణాన్ని ఏకంగా 12 టీసీఎఫ్లకు, వెలికితీయగలిగే పరిమాణాన్ని 10-11 టీసీఎఫ్లకు పెంచింది. కానీ, 2012లో ఆర్ఐఎల్.. వెలికితీయగలిగే గ్యాస్ పరిమాణాన్ని భారీగా 2.9 టీసీఎఫ్కు కుదించేసింది. తర్వాత రోజుల్లో పెరిగే గ్యాస్ రేట్ల ప్రయోజనం పొందేందుకు ఆర్ఐఎల్ కావాలనే గ్యాస్ ఉత్పత్తిని తగ్గించేసిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆర్ఐఎల్ సదరు బ్లాక్‌పై పెట్టిన పెట్టుబడుల రికవరీపై వివాదం నడుస్తోంది. తాజాగా డీఅండ్‌ఎం ఆర్ఐఎల్ క్షేత్రం నిల్వలపైనా మదింపు జరిపింది. దీని ప్రకారం ఆర్ఐఎల్ ముందుగా చెప్పిన దానికన్నా సదరు క్షేత్రంలో నిక్షేపాలు చాలా తక్కువగా 2.9 టీసీఎఫ్ మాత్రమే ఉంటాయని అంచనా వేసింది. ఇంకా అందులో కేవలం 183 బిలియన్ ప్రామాణిక ఘనపుటడుగుల (బీసీఎం) (0.183 టీసీఎఫ్) గ్యాస్ మాత్రమే ఉందని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే అసలు ఆర్ఐఎల్ ఏ ప్రాతిపదికన తన ముందస్తు లెక్కలు వేసింది, వాటిని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఏ ప్రాతిపదికన ఆమోదించినదీ అన్న దానిపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. -
కేజీ బేసిన్ గ్యాస్ వచ్చేసింది..
ఆర్ఎల్ఎన్జీ పరస్పర మార్పిడికి తొలగిన అడ్డంకులు అంగీకారం తెలిపినఎరువుల మంత్రిత్వ శాఖ త్వరలో గెయిల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అందుబాటులోకి రానున్న 450 మెగావాట్ల విద్యుత్ సాక్షి, హైదరాబాద్/ ఢిల్లీ: రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు కొంతమేరకు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్‌లోని డి6 బ్లాక్ నుంచి రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను సర్దుబాటు పద్ధతిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మళ్లించేందుకు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ గ్యాస్‌తో ఏపీలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు వినియోగంలోకి రానున్నాయి. వాటి నుంచి దాదాపు 450 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్), తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య త్వరలోనే పరస్పర అంగీకార ఒప్పందం జరగనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రీ గ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఆర్ఎల్ఎన్జీ) ధర తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గ్యాస్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే కొరత నుంచి గట్టెక్కవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. తూర్పు తీరంలో ఉన్న ఏపీకి దూర ప్రాంతాల నుంచి ఆర్ఎల్ఎన్జీని సరఫరా చేసుకునేందుకు పైపులైన్లు లేవు. ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి రోజూ 2.2 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ మహారాష్ట్రలోని జాతీయ రసాయనాలు, ఎరువుల యూనిట్ (ఆర్సీఎఫ్)కు తరలివెళుతుంది. ఇలా కేజీ బేసిన్ నుంచి మహారాష్ట్ర సరఫరా అవుతున్న గ్యాస్‌ను ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుని, ప్రత్యామ్నాయంగా ఆర్‌సీఎఫ్‌కు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆర్ఎల్ఎన్జీని అందించాలని.. దీనికి అదనంగా అయ్యే ఖర్చును ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భరించాలని గతంలో నిర్ణయించాయి. ఈ గ్యాస్ స్వాపింగ్‌కు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఎరువుల మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో అనుమతినిచ్చింది. అయితే ఏపీలోని జీవీకే, స్పెక్ట్రమ్, ల్యాంకో, కోనసీమ, వేమగిరి గ్యాస్ప్లాంట్లకు మొత్తం 2,499 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యముంది. కానీ గ్యాస్ కొరత కారణంగా మూడు పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు అవి తిరిగి ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. మొత్తం తెలంగాణకే..! ఈ గ్యాస్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి జరిగితే తెలంగాణకు 53.89 శాతం.. విద్యుత్ రావాల్సి ఉంటుంది. వీటిల్లో వాటాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పేచీ కూడా లేదు. ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా లేకపోవటంతో గ్యాస్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు అందుతున్న విద్యుత్ 150 మెగావాట్లకు మించటం లేదు. ఇప్పుడు గ్యాస్ స్వాపింగ్తో మొత్తం 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తయ్యే అవకాశముంది. ఇందులో తెలంగాణకు దాదాపు 250 మెగావాట్ల వరకు రానుంది. అయితే గ్యాస్ స్వాపింగ్ వల్ల అయ్యే వ్యయాన్ని చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించని పక్షంలో... మొత్తం వ్యయం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే జరిగితే మొత్తం 450 మెగావాట్లను రాష్ట్రమే తీసుకునే అవకాశాలున్నాయి. -
గ్యాస్ ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం
హైకోర్టులో పాలెం శ్రీకాంత్‌రెడ్డి పిల్ సాక్షి, హైదరాబాద్: కేజీ(కృష్ణా-గోదా వరి) బేసిన్లో రిలయన్స్ కంపెనీ వెలికి తీసిన గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ జనపాలన పార్టీ అధ్యక్షుడు పాలెం శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించేలా తగిన చర్యలు తీసుకునేటట్లు కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఇం దులో కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి, పెట్రోలియం మంత్రిత్వశాఖ కార్యదర్శి, హైడ్రోకార్బన్స్ డెరైక్టర్ జనరల్, రిల యన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐలతో పాటు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
అమ్ముడుపోయారా? : ఆప్
సాక్షి, హైదరాబాద్: కేజీ బేసిన్ గ్యాస్ ధరలపై రిలయన్స్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను రిలయన్స్ అధినేతలైన అంబానీలు గుప్పిట్లో పెట్టుకొన్నారని ఆ పార్టీ ఆరోపించింది. గురువారమిక్కడ ఆప్ నేతలు కిరణ్‌కుమార్, చక్రిలతో కలిసి రాష్ట్రశాఖ కన్వీనర్ బి. రామకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై రూ. 4 వేల కోట్ల భారం పడే గ్యాస్ ధర పెంపుదలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అంబానీకి అమ్ముడుపోయారా అంటూ ప్రశ్నించారు. -
ముఖేశ్ అంబానీ, మొయిలీలపై కేసు
గ్యాస్ వ్యవహారంలో ఢిల్లీ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు మురళీదేవరా, వీకే సిబల్పై కూడా.. న్యూఢిల్లీ: కేజీ బేసిన్ గ్యాస్ వ్యవహారంలో కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ కుమ్మక్కయ్యారంటూ వచ్చి న ఫిర్యాదులననుసరించి కేసులు పెట్టాలన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలపై ఢిల్లీ అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) చర్యలు చేపట్టింది. ముఖేశ్ అంబానీ, వీరప్ప మొయిలీ, మాజీ మంత్రి మురళీ దేవరా, హైడ్రోకార్బన్స్ మాజీ డీజీ వీకే సిబల్లపై ఆ సంస్థ కేసు పెట్టింది. వారిపై అవినీతి నిరోధక చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైందని ఏసీబీ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. సహజవాయువుకు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరల పెంచేందుకు కుమ్మక్యయ్యారంటూ కేజ్రీవాల్ కేంద్ర మంత్రి, రిలయన్స్ అధిపతిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన మీకు: కేసులో విచారణ పూర్తయే వరకూ గ్యాస్ ధరలు పెంచాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ ప్రధానికి లేఖ రాశారు. గ్యాస్ ధరల పెంపు వల్ల సీఎన్జీ, విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడి సామాన్యుడికి కష్టాలు తెచ్చిపెడుతుందని, ఆర్థికవేత్త అయిన మీకు ధరల పెంపు కుమ్మక్కు ద్వారా ఆర్థిక వ్యవస్థపై ఏమేరకు ప్రభావం పడుతుంతో చెప్పనక్కర్లేదని పేర్కొన్నారు. అవినీతి బాగా పెరిగింది: సీజేఐ న్యూఢిల్లీ: అవినీతి కేన్సర్ వంటిదని, గత 60 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయిందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ పి.సదాశివం ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టాలంటే ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. ఆయన బుధవారమిక్కడ కేంద్ర విజిలెన్స్ కమిషన్ స్వర్ణోత్సవాల్లో ప్రసంగించారు. ప్రజలు అవినీతి నిర్మూలనపై ఆశ వదులుకోవడం, దానితో రాజీపడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. సీవీసీని లోక్‌పాల్‌తో అనుసంధానించాలని లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. కాంగ్రెస్ అవిశ్వాసాన్ని నెగ్గిన నవీన్ సర్కారు భువనేశ్వర్: బీజేడీ నేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష కాంగ్రెస్ బుధవారం అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానం 69 ఓట్ల తేడాతో వీగిపోయింది. తీర్మానానికి వ్యతిరేకంగా 95 మంది, మద్దతుగా 26 మంది ఓటేశారు. ప్రభుత్వం నిరుద్యోగం, అవినీతి తదితర సమస్యలను తీర్చడంలో ఘోరంగా విఫలమైందని, కేంద్ర నిధులను ఖర్చు చేయడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానం వీగడం కాంగ్రెస్ మేధోపరమైన దివాలాకోరుతనానికి అద్దం పడుతోందని నవీన్ దుయ్యట్టారు.