జీఎస్‌పీసీ గ్యాస్ బ్లాక్‌లో 80% వాటా ఓఎన్‌జీసీ చేతికి
న్యూఢిల్లీ: గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీఎస్‌పీసీ)కి చెందిన కేజీ బేసిన్ గ్యాస్ బ్లాక్‌లో 80 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 995 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 6,700 కోట్లు) ఉండనున్నట్లు సంస్థ వివరించింది. డీల్ ప్రకారం కృష్ణ–గోదావరి బేసిన్‌లోని దీన్ దయాళ్ వెస్ట్ ఫీల్డ్‌ను ఓఎన్‌జీసీ దక్కించుకోనుంది.
దీంతో ఆపరేటర్‌షిప్ హక్కులు కూడా దఖలుపడతాయని సంస్థ తెలిపింది. దీన్ దయాళ్ వెస్ట్ ఫీల్డ్ నుంచి ప్రయోగాత్మకంగా ఏడాది క్రితమే గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ..ఇంకా వాణిజ్యపరంగా ఉత్పత్తి మొదలుకాలేదు. ఒప్పందం పూర్తయిన బ్లాక్‌లోని ఇతర భాగస్వాములతో కలిసి వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఓఎన్‌జీసీ తెలిపింది.