GSPC
-
జీఎస్పీసీని సగం ధరకే కొన్నాం..
న్యూఢిల్లీ: కేజీ–బేసిన్ క్షేత్రంలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ) వాటాలు, హెచ్‌పీసీఎల్ కొనుగోలు డీల్స్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ మాజీ చైర్మన్ డీకే సరాఫ్ సమర్ధించుకున్నారు. కేజీ బేసిన్ క్షేత్రంలోని దీన్‌దయాళ్ బ్లాక్‌లో జీఎస్పీసీ వాటాలను మార్కెట్ రేటుకన్నా సగానికే కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ వాటాలకు రూ. 20,000 కోట్లు పలుకుతుండగా, ఓఎన్జీసీ రూ. 8,000 కోట్లకే (1.2 బిలియన్ డాలర్లు) కొన్నట్లు పేర్కొన్నారు. దశాబ్దాలుగా చమురు, గ్యాస్ ఉత్పత్తి వ్యాపారంలో ఉన్న ఓఎన్జీసీ .. సరైన అవకాశం లభించడంతోనే జీఎస్పీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అలాగే, హెచ్పీసీఎల్లో మెజారిటీ వాటాల కొనుగోల వల్ల ఉత్పత్తి కంపెనీ ధరలపరంగా ఎదుర్కొనే రిస్కుల్లో కొంత భాగాన్ని హెడ్జింగ్ చేసుకునేందుకు వీలు లభించినట్లయిందని సరాఫ్ చెప్పారు. భారీ రుణభారమున్న జీఎస్పీసీని గట్టెక్కించడానికి, హెచ్పీసీఎల్లో వాటాల విక్రయంతో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించడానికి ఈ డీల్స్ కుదుర్చుకునేలా ఓఎన్జీసీపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సరాఫ్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సరాఫ్ ఓఎన్జీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఈ రెండు ఒప్పందాలు కుదిరాయి. -
జీఎస్పీసీ బ్లాక్‌లో వాటాల కొనుగోలుకు
⇒ ఓఎన్జీసీ బోర్డు ఓకే ⇒ డీల్ విలువ దాదాపు రూ. 8,000 కోట్లు న్యూఢిల్లీ: కేజీ–బేసిన్‌లోని గ్యాస్ బ్లాక్‌లో జీఎస్పీసీకి ఉన్న మొత్తం 80 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,000 కోట్లు). 2014 ఆగస్టు నుంచి ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేస్తున్న కేజీ–ఓఎస్ఎన్–2001/3 బ్లాక్‌లోని మూడు అన్వేషణ క్షేత్రాలకు 995.26 మిలియన్ డాలర్లు ఓఎన్జీసీ చెల్లించనుంది. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మరో ఆరు డిస్కవరీలకు 200 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. ఈ ఆరు క్షేత్రాల అభివృద్ధికయ్యే వ్యయాలు కూడా ఓఎన్జీసీనే భరించాల్సి ఉంటుంది. ఈ వ్యయాలు కనీసం మరికొన్ని బిలియన్ డాలర్ల మేర ఉంటాయని అంచనా. రుణభారంతో కుంగుతున్న గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ)కి కేజీ–బేసిన్ బ్లాక్‌లో ఉన్న వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీ గతేడాది డిసెంబర్ 23న అంగీకరించింది. 2015 మార్చి 31 నాటికి జీఎస్పీసీ రుణభారం దాదాపు రూ. 19,716.27 కోట్ల మేర ఉంది. జీఎస్పీసీ ఇప్పటిదాకా బంగాళాఖాతంలో 9 గ్యాస్ క్షేత్రాలను కనుగొంది. వీటిలో మూడింటి (దీన్‌దయాళ్ వెస్ట్–డీడీడబ్ల్యూ) అభివృద్ధికి అనుమతులు లభించాయి. ప్రభుత్వానికి సమర్పించిన క్షేత్రాల అభివృద్ధి ప్రణాళిక (ఎఫ్డీపీ) ప్రకారం 2.75 బిలియన్ డాలర్ల వ్యయానికి అనుమతులు ఉన్నప్పటికీ .. వాస్తవంగా వ్యయాలు 2.83 బిలియన్ డాలర్లు దాటాయి. అన్వేషణకు సంబంధించి మరో 585 మిలియన్ డాలర్ల మేర ఖర్చయ్యింది. దీంతో 2015 మార్చి ఆఖరు నాటికి మొత్తం వ్యయం 3.41 బిలియన్ డాలర్లకు చేరింది. ఎఫ్డీపీ ప్రకారం మరో 12 బావుల తవ్వకం పూర్తి చేయాలి. దీంతో ప్రాజెక్టు వ్యయం మరింతగా పెరగనుంది. 2014 ఆగస్టులో డీడీడబ్ల్యూలో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించారు. -
జీఎస్పీసీ గ్యాస్ బ్లాక్‌లో 80% వాటా ఓఎన్జీసీ చేతికి
న్యూఢిల్లీ: గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీఎస్పీసీ)కి చెందిన కేజీ బేసిన్ గ్యాస్ బ్లాక్‌లో 80 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 995 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 6,700 కోట్లు) ఉండనున్నట్లు సంస్థ వివరించింది. డీల్ ప్రకారం కృష్ణ–గోదావరి బేసిన్‌లోని దీన్ దయాళ్ వెస్ట్ ఫీల్డ్‌ను ఓఎన్జీసీ దక్కించుకోనుంది. దీంతో ఆపరేటర్‌షిప్ హక్కులు కూడా దఖలుపడతాయని సంస్థ తెలిపింది. దీన్ దయాళ్ వెస్ట్ ఫీల్డ్ నుంచి ప్రయోగాత్మకంగా ఏడాది క్రితమే గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ..ఇంకా వాణిజ్యపరంగా ఉత్పత్తి మొదలుకాలేదు. ఒప్పందం పూర్తయిన బ్లాక్‌లోని ఇతర భాగస్వాములతో కలిసి వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఓఎన్జీసీ తెలిపింది. -
చమురు, గ్యాస్ ప్రతిపాదనలకు ఓకే
న్యూఢిల్లీ: చాన్నాళ్లుగా కాంట్రాకు వివాదాల్లో నలుగుతున్న పలు చమురు, గ్యాస్ నిక్షేపాల అభివృద్ధి ప్రతిపాదనలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇందుకు సంబంధించి దాదాపు రూ. 1,50,000 కోట్లు విలువ చేసే ప్రతిపాదనలకు కేంద్ర చమురు శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ), ఓఎన్జీసీ తదితర సంస్థలు కనుగొన్న చమురు, గ్యాస్ నిక్షేపాలను సత్వరం అభివృద్ధి చేసి, ఉత్పత్తి ప్రారంభించేందుకు సాధ్యపడగలదని చమురు రంగ నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) వెల్లడించింది. దీని వల్ల దాదాపు 34.06 మిలియన్ బ్యారెళ్ల చమురు, 0.731 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాలను వెలికితీయొచ్చని తెలియజేసింది. వీటి విలువ రూ. 35,000 కోట్ల్లు ఉండొచ్చని అంచనా.