చమురు, గ్యాస్ ప్రతిపాదనలకు ఓకే
న్యూఢిల్లీ: చాన్నాళ్లుగా కాంట్రాకు వివాదాల్లో నలుగుతున్న పలు చమురు, గ్యాస్ నిక్షేపాల అభివృద్ధి ప్రతిపాదనలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇందుకు సంబంధించి దాదాపు రూ. 1,50,000 కోట్లు విలువ చేసే ప్రతిపాదనలకు కేంద్ర చమురు శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్‌పీసీ), ఓఎన్‌జీసీ తదితర సంస్థలు కనుగొన్న చమురు, గ్యాస్ నిక్షేపాలను సత్వరం అభివృద్ధి చేసి, ఉత్పత్తి ప్రారంభించేందుకు సాధ్యపడగలదని చమురు రంగ నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) వెల్లడించింది. దీని వల్ల దాదాపు 34.06 మిలియన్ బ్యారెళ్ల చమురు, 0.731 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాలను వెలికితీయొచ్చని తెలియజేసింది. వీటి విలువ రూ. 35,000 కోట్ల్లు ఉండొచ్చని అంచనా.