ఓఎన్‌జీసీకి డీజీహెచ్ బాసట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో గ్యాస్ వెలికితీత వివాదంలో ఓఎన్‌జీసీకి డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) బాసటగా నిల్చింది. దీనిపై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలన్న ఓఎన్‌జీసీ డిమాం డ్‌కి మద్దతు పలికింది. తన ఆధీనంలో ఉన్న క్షేత్రాల్లో గ్యాస్ నిల్వలు, ఉత్పత్తి వివరాలను ఓఎన్‌జీసీకి తెలియజేయాలంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)ను డీజీహెచ్ ఆదేశించినట్లు సమాచారం. అలాగే, ఓఎన్‌జీసీ కూడా తన గ్యాస్ వివరాలను ఆర్‌ఐఎల్‌కి అందజేయాలని సూచించింది.
కృష్ణా గోదావరి బేసిన్‌లోని డీ6 బ్లాకులో ఆర్‌ఐఎల్ తవ్విన కొన్ని బావులు, ఓఎన్‌జీసీకి కేటాయించిన గ్యాస్ క్షేత్రాలకు దగ్గర్లో ఉండటం తెలిసిందే. ఆర్‌ఐఎల్ ఇప్పటికే గ్యాస్ ఉత్పత్తి చేస్తుండగా.. ఓఎన్‌జీసీ ఇంకా తన క్షేత్రాల్లో ఉత్పత్తి మొదలుపెట్టలేదు. రెండు క్షేత్రాలూ పక్కపక్కనే ఉండటంతో ఆర్‌ఐఎల్ తమ క్షేత్రాల నుంచి కూడా గ్యాస్ తీస్తుండవచ్చని ఓఎన్‌జీసీ భావిస్తోంది. దీనిపై ఓఎన్‌జీసీ ఫిబ్రవరి 11న డీజీహెచ్‌కి ఫిర్యాదు చేయడంతో డీజీహెచ్ స్పందించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.