న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లోని కేజీ డీ5 ప్రాజెక్ట్ పరిధిలో చమురు ఉత్పత్తిని ఈ ఏడాది మే నెలలో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. సహజ వాయువు ఉత్పత్తిని ఏడాది తర్వాత ప్రారంభిస్తామని ఓఎన్‌జీసీ డైరెక్టర్ (ఉత్పత్తి విభాగం) పంకజ్ కుమార్ వెల్లడించారు.
ముందుగా అనుకున్న ప్రకారం అయితే కేజీ డీ5 పరిధిలోని డీడబ్ల్యూఎన్–98/2 క్లస్టర్–2 క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2019 జూన్‌లోనే మొదలు పెట్టాలి. అదే విధంగా ఆయిల్ ఉత్పత్తిని 2020 మార్చిలో ఆరంభించాల్సి ఉంది. కానీ, ఈ లక్ష్యాలను ఓఎన్‌జీసీ చేరుకోలేకపోయింది. కరోనా మహమ్మారితో కాంట్రాక్టు, సరఫరా చైన్ సమస్యలను కారణాలుగా పేర్కొంటూ చమురు ఉత్పత్తిని 2021 నవంబర్‌కు వాయిదా వేసింది.
ఆ తర్వాత 2022 మూడో త్రైమాసికానికి, ఇప్పడు మే నెలకు వాయిదా వేసుకుంది. గ్యాస్ ఉత్పత్తిని 2021 మే నెలకు వాయిదా వేసుకోగా, అది కూడా సాధ్యపడలేదు. ఆ తర్వాత 2023 మే నెలకు వాయిదా వేయగా, ఇప్పుడు 2024 మేలోనే గ్యాస్ ఉత్పత్తి సాధ్యమవుతుందని ఓఎన్‌జీసీ చెబుతోంది.
ఫ్లోటింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం
ఇప్పటికే సముద్ర జలాల్లో ఫ్లోటింగ్ (నీటిపై తేలి ఉండే) ఉత్పత్తి యూనిట్‌ను (ఎఫ్‌పీఎస్‌వో) ఏర్పాటు చేసినట్టు ఓఎన్‌జీసీ డైరెక్టర్ పంకజ్ కుమార్ తెలిపారు. చమురు ఉత్పత్తి మే నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘‘రోజువారీ 10,000 నుంచి 12,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి మొదలు పెడతాం. రెండు నుంచి మూడు నెలల్లో రోజువారీ 45,000 బ్యారెళ్ల గరిష్ట ఉత్పత్తికి తీసుకెళతాం. చమురుతోపాటు 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ కూడా బయటకు వస్తుంది.
వాస్తవంగా గ్యాస్ ఉత్పత్తిని 2024 మే నెలలో మొదలు పెడతాం. అప్పుడు రోజువారీగా 7–8 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి సాధ్యపడుతుంది’’అని వివరించారు. వాస్తవంగా వేసుకున్న ఉత్పత్తి అంచనాల కంటే ఇవి తక్కువ కావడం గమనించాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని పంకజ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment