న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 17 శాతం జంప్‌చేసి రూ. 11,948 కోట్లను తాకింది. చమురు ధరలు నీరసించినప్పటికీ విండ్‌ఫాల్‌సహా ఇతర పన్నులు తగ్గడం ఇందుకు సహకరించింది.
గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 10,238 కోట్లు మాత్రమే ఆర్జించింది. చట్టబద్ధ సుంకాలు రూ. 10,791 కోట్ల నుంచి రూ. 7,830 కోట్లకు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగితే ప్రభుత్వం విండ్‌ఫాల్ లాభాల పన్ను విధిస్తుంది. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
78.33 డాలర్లు
తాజా సమీక్షా కాలంలో ఓఎన్‌జీసీ ఒక్కో బ్యారల్ చమురు విక్రయంపై 78.33 డాలర్ల ధరను అందుకుంది. గత క్యూ2లో 84.84 డాలర్లు చొప్పున లభించింది. అయితే కంపెనీ ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు ఒక్కో ఎంబీటీయూకి 6.5 డాలర్లుగా కొనసాగాయి. చమురు వెలికితీత నామమాత్ర వృద్ధితో 4.576 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2 శాతం తక్కువగా 4.912 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది.
ఇకపై ముడిచమురు ఉత్పత్తి పెరగనున్నట్లు కంపెనీ తెలియజేసింది. కేజీ బేసిన్ బ్లాక్ కేజీ–డీడబ్ల్యూఎన్ 98/2లో ఉత్పత్తి పుంజుకోనుండటం ఇందుకు తోడ్పడనున్నట్లు పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 35,163 కోట్ల నుంచి రూ. 33,881 కోట్లకు క్షీణించింది. అయితే ఇతర ఆదాయం రెట్టింపై రూ. 4,766 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేరు బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 257 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment