Q2 net profit
-
అంచనాలను దాటి దూసుకెళ్లిన ‘హీరో’
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతం వృద్ధితో రూ. 1,066 కోట్లను తాకింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,007 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,533 కోట్ల నుంచి రూ. 10,483 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 15.2 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. గత క్యూ2లో 14.16 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. మూడు మోడళ్లు రెడీ...క్యాష్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా పటిష్ట క్యాష్‌ఫ్లోను సాధిస్తున్నామని, దీంతో ఆర్థికంగా మరింత బలపడుతున్నట్లు కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా పేర్కొన్నారు. ఎంట్రీ, డీలక్స్ విభాగాల్లో మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. తద్వారా ప్రీమియం విభాగంలో పటిష్ట పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్లురానున్న ఆరు నెలల్లో ఎక్స్‌పల్స్ 210, ఎక్స్ట్రీమ్ 250ఆర్, కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 బైకులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరికల్లా ప్రీమియా విభాగంలో 100 స్టోర్లను అధిగమించనున్నట్లు తెలియజేశారు. హీరో మోటో షేరు బీఎస్ఈలో 2% బలపడి రూ. 4,604 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ లాభం అదుర్స్.. షేరుకి రూ.6 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 17 శాతం జంప్‌చేసి రూ. 11,948 కోట్లను తాకింది. చమురు ధరలు నీరసించినప్పటికీ విండ్ఫాల్సహా ఇతర పన్నులు తగ్గడం ఇందుకు సహకరించింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 10,238 కోట్లు మాత్రమే ఆర్జించింది. చట్టబద్ధ సుంకాలు రూ. 10,791 కోట్ల నుంచి రూ. 7,830 కోట్లకు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగితే ప్రభుత్వం విండ్‌ఫాల్ లాభాల పన్ను విధిస్తుంది. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.78.33 డాలర్లు తాజా సమీక్షా కాలంలో ఓఎన్జీసీ ఒక్కో బ్యారల్ చమురు విక్రయంపై 78.33 డాలర్ల ధరను అందుకుంది. గత క్యూ2లో 84.84 డాలర్లు చొప్పున లభించింది. అయితే కంపెనీ ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు ఒక్కో ఎంబీటీయూకి 6.5 డాలర్లుగా కొనసాగాయి. చమురు వెలికితీత నామమాత్ర వృద్ధితో 4.576 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2 శాతం తక్కువగా 4.912 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది.ఇకపై ముడిచమురు ఉత్పత్తి పెరగనున్నట్లు కంపెనీ తెలియజేసింది. కేజీ బేసిన్ బ్లాక్ కేజీ–డీడబ్ల్యూఎన్ 98/2లో ఉత్పత్తి పుంజుకోనుండటం ఇందుకు తోడ్పడనున్నట్లు పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 35,163 కోట్ల నుంచి రూ. 33,881 కోట్లకు క్షీణించింది. అయితే ఇతర ఆదాయం రెట్టింపై రూ. 4,766 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 257 వద్ద ముగిసింది. -
సగానికి పడిపోయిన టాటా కంపెనీ లాభం
ముంబై: టాటా కెమికల్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బలహీన పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం మేర తగ్గి రూ.267 కోట్లకు పరిమితమైంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ.190 కోట్లతో పోల్చితే పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.495 కోట్లుగా ఉండడం గమనార్హం.ఆదాయంలో పెద్దగా మార్పు లేకుండా రూ.3,999 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.3,998 కోట్లుగా ఉంది. ‘‘భారత్‌లో సోడాయాష్‌కు డిమాండ్ స్థిరంగా ఉంది. అమెరికా, యూరప్‌లో కంటెయినర్ గ్లాస్ తదితర విభాగాల్లో డిమాండ్ స్తబ్దుగా ఉంది. జూలై, ఆగస్ట్‌లో అసాధారణ వర్షాలతో మిథాపూర్ ప్లాంట్‌లో కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఉత్పత్తి తగ్గడంతో మార్జిన్లపై ప్రభావం పడింది’’అని టాటా కెమికల్స్ ఎండీ, సీఈవో ఆర్ ముకందన్ తెలిపారు.మార్చి త్రైమాసికంతో పోల్చితే పనితీరు మొత్తం మీద మెరుగపడినట్టు చెప్పారు. కస్టమర్లను అట్టిపెట్టుకోవడంతోపాటు స్థిరమైన కార్యకలాపాలపై తమ దృష్టి కొనసాగుతుందన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా కెమికల్స్ షేరు 2.41 శాతం క్షీణించి రూ.1,074 వద్ద ముగిసింది. -
క్యూ2లో కాగ్నిజెంట్‌కు తగ్గిన లాభాలు
సాక్షి, ముంబై: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ క్యూ2 లో నికర లాభాల్లో క్షీణతను నమోదు చేసింది. జూన్ నెలాఖరుకు ముగిసిన రెండవ త్రైమాసికంలో నికరలాభం 2.97 శాతం తగ్గి 456 మిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 470 మిలియన్ డాలర్లుగా నమోదయిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆదాయంలో పుంజుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 3.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 9.2 శాతం ఎగిసి 4 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. మూడో త్రైమాసికంలో సంస్థ 4.06 బిలియన్ డాలర్ల నుంచి 4.10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది. నికర-ఆపరేటింగ్ విదేశీ మారకం నష్టాలు ,రూపాయి విలువ గత సంవత్సరంతో పోల్చితే తమ లాభాలను దెబ్బతీసిందని కాగ్ని జెంట్ఫలితాల సందర్భంగా వెల్లడించింది. అయితే వచ్చే ఏడాది ఆదాయంలో మరింత పుంజుకోనుందనే ధీమాను కంపెనీ సీఈవో వెలిబుచ్చారు. -
ఇన్ఫీ.. అటు ఇటుగా!
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. మరోపక్క, వార్షిక ఆదాయ అంచనాలకు భారీగా కోత పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో(2017–18, క్యూ2) కంపెనీ రూ.3,726 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.3,606 కోట్లతో పోలిస్తే 3.3% వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం స్వల్పంగా 1.5 శాతం మాత్రమే పెరిగింది. గతేడాది క్యూ2లో రూ.17,310 కోట్ల నుంచి ఈ క్యూ2లో రూ.17,567 కోట్లకు చేరింది. డాలర్ల రూపంలో చూస్తే లాభం 7.3% వృద్ధితో 578 మిలియన్ డాలర్లకు చేరింది. ఆదాయం 5.4% ఎగబాకి 2.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రమోటర్లతో పొసగక సీఈఓ పదవికి విశాల్ సిక్కా అకస్మాత్తుగా రాజీనామా చేసిన తర్వాత ఇవి తొలి ఫలితాలు కావడం గమనార్హం. సీక్వెన్షియల్‌గా చూస్తే... ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్యూ2లో ఇన్ఫోసిస్ నికర లాభం 6.9 శాతం పెరిగింది. ఇక ఆదాయం 2.8 శాతం వృద్ధి చెందింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో ఇన్ఫీ రూ. 3,496 కోట్ల లాభాన్ని, రూ.17,630 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. గైడెన్స్ డౌన్...: ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలర్ల రూపంలో కంపెనీ ఆదాయ అంచనా(గైడెన్స్)లను 5.5–6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతక్రితం 6.5–8.5 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేయడం గమనార్హం. ఆపరేటింగ్ మార్జిన్ 23–25 శాతంగా, రూపాయి ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 3–4 శాతం మేర ఉంటుందని కంపెనీ తాజాగా అంచనా వేసింది. కొనసాగుతున్న సీఈఓ వేట...: కంపెనీకి పూర్తిస్థాయిలో కొత్త సీఈఓను నియమించేందుకు అన్వేషణ ప్రక్రియ చురుగ్గానే కొనసాగుతోందని ఇన్ఫోసిస్ పేర్కొంది. వివిధ పక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపింది. సిక్కా ఆకస్మిక రాజీనామా తర్వాత నీలేకనిని చైర్మన్‌గా, యూబీ ప్రవీణ్ రావును తాత్కాలిక సీఈఓ, ఎండీగా నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుత తాత్కాలిక సీఈఓ ప్రవీణ్‌రావుతో పాటు, సీఎఫ్ఓ రంగనాథ్, బీఎఫ్ఎస్ఐ విభాగం హెడ్ మోహిత్ జోషిలను ఈ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వి.బాలకృష్ణన్, మోహన్‌దాస్ పాయ్, అశోక్ వేమూరి, బీజీ శ్రీనివాస్‌లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ ఒక్కో షేరుపై రూ.13 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. ♦ క్యూ2లో కంపెనీ 72 క్లయింట్లను దక్కించుకుంది. ♦ ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో స్థూలంగా ఇన్ఫోసిస్ 10,514 మందిని నియమించుకుంది. అయితే, 10,627 మంది కంపెనీని వీడిపోవడంతో నికరంగా 113 ఉద్యోగాలు తగ్గాయి. సెప్టెంబర్ ఆఖరికి మొత్తం సిబ్బంది సంఖ్య 1,98,440గా నమోదైంది. జూన్ చివరికి 1,98,553 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్యూ1లో కూడా నికరంగా 1,800 ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం. కాగా, కన్సాలిడేటెడ్‌గా(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు సెప్టెంబర్ క్వార్టర్లో 21.4 శాతంగా నమోదైంది. క్రితం క్వార్టర్(క్యూ1)లో ఇది 21 శాతంగా ఉంది. మంగళవారం బీఎస్ఈలో ఇన్ఫీ షేరు 1.37% నష్టపోయి రూ.927 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ‘కంపెనీ డైరెక్టర్ల బోర్డులో చోటుచేసుకున్న మార్పుల నుంచి (సిక్కా ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో) కంపెనీ వెంటనే కుదుటపడింది. ఇన్వెస్టర్లతోపాటు ఇతరత్రా అన్ని పక్షాలతో తగిన సంప్రదింపులు నిర్వహించడం ద్వారా వ్యాపారంపై దీని ప్రతికూల ప్రభావం పెద్దగా పడకుండా చూడగలిగాం. తద్వారా అన్ని వ్యాపార విభాగాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేశాం’ – యూబీ ప్రవీణ్ రావు, ఇన్ఫోసిస్ తాత్కాలిక సీఈఓ, ఎండీ ‘పనయా’ డీల్‌కు క్లీన్చిట్... సిక్కా వైదొలగిన తర్వాత కంపెనీ కొత్త చైర్మన్, ప్రమోటర్లలో ఒకరైన నందన్ నీలేకని నేతృత్వంలో జరిగిన తొలి బోర్డు సమావేశంలో వివాదాస్పద పనయా కొనుగోలు ఒప్పందానికి క్లీన్చిట్ లభించింది. దీని కొనుగోలుకు సంబంధించి ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదన్న దర్యాప్తు నివేదికలను బోర్డు సమర్ధించిందని ఇన్ఫీ ఒక ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా పూర్తి నివేదికను బహిర్గత పరచకూడదని మాజీ సీఈఓ విశాల్ సిక్కా తీసుకున్న నిర్ణయానికి కూడా బోర్డు మద్దతివ్వడం గమనార్హం. ‘పనయా డీల్ వ్యవహారాల్లో స్వతంత్ర దర్యాప్తులన్నీ సజావుగానే జరిగాయని బోర్డు మొత్తం అంగీకరించింది. ఇక కంపెనీ మేలు కోసం అహర్నిశలూ పాకులాడే నారాయణ మూర్తి వంటివారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని నీలేకని వ్యాఖ్యానించారు. మరోపక్క, మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్‌కు చెల్లించిన వీడ్కోలు ప్యాకేజీలో తప్పులేవీ చోటుచేసుకోలేదని బోర్డు అభిప్రాయపడినట్లు ఇన్ఫీ పేర్కొంది. 2015లో ఇజ్రాయిల్‌కు కంపెనీ పనయాను దాదాపు రూ.1,250 కోట్లు వెచ్చించి ఇన్ఫీ కొనుగోలు చేసింది. అయితే, ఈ డీల్‌లో అవకతవకలు జరిగాయంటూ కంపెనీలోని అంతర్గత వేగు (విజిల్‌బ్లోయర్) సెబీకి ఫిర్యాదు చేయడంతో వివాదం రాజుకుంది. ప్రమోటర్లు ప్రధానంగా నారాయణమూర్తి దీనిపై కన్నెర్ర చేయడంతో లుకలుకలు తీవ్రతరమయ్యాయి. -
భారీగా ఢమాలన్న అమెజాన్
న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీగా కుదేలైంది. అంతర్జాతీయ కార్యకలాపాల్లో తీవ్రమైన నష్టాలు ఎదుర్కొనడంతో జూన్ క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు 77 శాతం కోల్పోయి, రూ.1264 కోట్లగా నమోదయ్యాయి. అయినప్పటికీ భారత్ ఈ-కామర్స్ మార్కెట్లో తమ కార్యకలాపాల విస్తరణకు భారీగా పెట్టుబడి పెట్టాలని అమెజాన్ నిర్ణయించింది. 2017 జూన్ క్వార్టర్లో అంతర్జాతీయ వ్యాపారాల్లో అమెజాన్ నిర్వహణ నష్టాలు రూ.4,646 కోట్లకు పెరిగినట్టు కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్లో నిర్వహణ నష్టాలు రూ.866 కోట్లగా ఉన్నాయి. అయితే కంపెనీ రెవెన్యూలు 25 శాతం, అమెజాన్ వెబ్ సర్వీసులు 27శాతం పైకి జంప్ చేశాయి. నార్త్ అమెరికా బిజినెస్‌ల్లో కూడా ఆపరేటింగ్ ఇన్కమ్ 38 శాతం క్షీణించింది. ఎన్ని నష్టాలు ఉన్నప్పటికీ, అమెజాన్ భారత్‌లో పెట్టుబడులకు తాము కట్టుబడి ఉందని కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ బ్రియాన్ టి ఒల్సావ్స్కీ చెప్పారు. భారత్‌లో తాము పెట్టుబడులను కొనసాగిస్తామని, తాము అక్కడ గొప్ప విజయాన్ని చూస్తామని చెప్పారు. భారత్‌లో అమెజాన్‌కు, ఫ్లిప్‌కార్ట్ నుంచి తీవ్ర పోటీ నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడులను అమెజాన్ ఉధృతం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అమెజాన్ రూ.3,800 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది. 5 బిలియన్ డాలర్లను భారత్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని గతేడాదే ఈ కంపెనీ ప్రకటించింది. విజయవంతంగా అమెజాన్ ఇండియాలో నాలుగేళ్ల ఆపరేషన్స్‌ను పూర్తిచేసుకుంది. వేర్‌హౌజ్‌లను అభివృద్ధి చేయడానికి, లాజిస్టిక్స్‌ను బలోపేతం చేయడానికి, ప్రొడక్ట్ అసోర్ట్మెంట్లను పెంచడానికి ఈ పెట్టుబడులను పెడుతోంది. మరోవైపు గురువారం మార్కెట్లో దూసుకెళ్లిన అమెజాన్ స్టాక్స్, శుక్రవారం మార్కెట్లో ఒత్తిడిని ఎదుర్కోబోతున్నాయి. కంపెనీ లాభాల్లో భారీగా పడిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో షేర్లపై దీని ప్రభావం పడనుందని విశ్లేషకులు చెప్పారు. గురువారం స్టాక్స్ దూసుకెళ్లడంతో ఆ కంపెనీ ఫౌండర్ జెఫ్ బెజోస్, బిల్‌గేట్స్‌ను మించిపోయి, ప్రపంచపు కుబేరుడిగా నిలిచారు. -
నెల రోజుల గరిష్టం
క్యూ2లో అంచనాలను మించిన జీడీపీ వృద్ధి(4.8%) స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహమిచ్చింది. శుక్రవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ గణాంకాలు సెంటిమెంట్‌ను మెరుగుపరచడంతో సెన్సెక్స్ వరుసగా మూడో రోజు లాభపడింది. 106 పాయింట్లు జమ చేసుకుని 20,898 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 372 పాయింట్లు లాభపడ్డ సంగతి తెలిసిందే. బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా, ఆయిల్ ఇండెక్స్ నామమాత్రంగా నష్టపోయింది. ప్రధానంగా హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు వెలుగులో నిలిచాయి. ఇక నిఫ్టీ సైతం 42 పాయింట్లు పుంజుకుని మళ్లీ 6,200 ఎగువన 6,218 వద్ద నిలిచింది. నవంబర్ నెలకు తయారీ రంగం పుంజుకున్నట్లు హెచ్ఎస్బీసీ సర్వే తెలపడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎఫ్ఐఐల అండ దేశీయ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. వారాంతం రోజున రూ. 745 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు సోమవారం మరో రూ. 791 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 618 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సెన్సెక్స్‌లో సన్ ఫార్మా, జిందాల్ స్టీల్ 4% జంప్‌చేయగా, విప్రో, ఎల్అండ్టీ, భెల్, ఐసీఐసీఐ, టాటా స్టీల్, భారతీ, ఎంఅండ్ఎం 2-1.5% స్థాయిలో లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌యూఎల్ 2% నీరసించగా, ఓఎన్జీసీ, గెయిల్ 1.5% చొప్పున నష్టపోయాయి. చిన్న షేర్లు ఓకే సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,435 పురోగమించగా, 1,046 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో ఆమ్టెక్ ఇండియా, నితిన్ ఫైర్, జిందాల్ సౌత్, సింటెక్స్, టెక్నో ఎలక్ట్రిక్, కేశోరాం, సుందరం ఫాజనర్స్, యూఫ్లెక్స్, ఎస్ఆర్ఎఫ్, జిందాల్ సా, బీఈఎంఎల్, జేపీ ఇన్ఫ్రా, జేఎం ఫైనాన్షియల్, ఐషర్ మోటార్స్, జీఎండీసీ, కేఈసీ, ఎన్సీసీ 20-6% మధ్య దూసుకెళ్లాయి. -
నాట్కో ఫార్మా లాభం 28% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా నికర లాభం 28 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 27 కోట్లుగా నమోదైంది. అయితే, అమ్మకాలు మాత్రం రూ. 162.91 కోట్లకు తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో అమ్మకాలు రూ. 169.16 కోట్లు కాగా లాభం రూ. 20.99 కోట్లు. వేల్యూ యాడెడ్ ఫార్ములేషన్ల ఎగుమతులు మెరుగైన పనితీరుకు దోహదపడ్డాయని కంపెనీ తెలిపింది. కొపాక్జోన్ వివాదంలో ఊరట.. మల్టిపుల్ స్లెరోసిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే కొపాక్జోన్ జనరిక్ వెర్షన్‌కి సంబంధించి టెవా ఫార్మాతో వివాదంలో అమెరికా కోర్టులో నాట్కోకి ఊరట లభించింది. ఈ ఔషధ జనరిక్ తయారీపైనా, తన పేటెంట్ హక్కుల గడువు ఏడాది ముందే ముగిసిపోతుందన్న అప్పీళ్ల కోర్టు ఉత్తర్వులపైనా స్టే విధించాలంటూ టెవా ఫార్మా వేసిన పిటీషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇక అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతులు కూడా లభిస్తే వచ్చే ఏడాదిలో కొపాక్జోన్ జనరిక్ని ప్రవేశపెట్టేందుకు నాట్కోకి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తతం టెవా లాభాల్లో దాదాపు 50 శాతం కొపాక్జోన్దే ఉంటుంది. దీనిపై టెవా పేటెంట్ హక్కుల గడువు 2015 కాకుండా 2014లో ముగిసిపోతుందని అప్పీల్స్ కోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై టెవా సుప్రీం కోర్టుకు వెళ్లగా తాజా ఆదేశాలు వచ్చాయి. -
ఆంధ్రా బ్యాంక్ క్యూ2 ఫలితాలు మొండి బకాయిల దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రా బ్యాంక్‌పై ఎన్పీఏల ఒత్తిడి మరింత పెరిగింది. నిరర్థక ఆస్తులు భారీగా పెరగడంతో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నికరలాభం ఏకంగా 78 శాతం క్షీణించింది. గతేడాది ఇదే కాలానికి రూ.325 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.71 కోట్లకు పడిపోయింది. పెరిగిన నిరర్థక ఆస్తులకు అనుగుణంగా రూ.140 కోట్లు ప్రొవిజనింగ్ కేటాయింపులు చేయడం లాభాలు తగ్గడానికి ప్రధాన కారణంగా బుధవారం బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మూడు నెలల కాలంలో మొత్తం ప్రొవిజనింగ్ కింద రూ.200 కోట్లు కేటాయించింది. సమీక్షా కాలంలో ఆదాయం 12% వృద్ధి చెంది రూ.3,415 కోట్ల నుంచి రూ.3,818 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యాపారం 18 శాతం వృద్ధి చెంది రూ.2.30 లక్షల కోట్లకు చేరింది. ఈ మూడు నెలల కాలంలో డిపాజిట్లలో 19 శాతం, రుణాల్లో 16.5% వృద్ధి నమోదైనట్లు బ్యాంకు పేర్కొంది. గడచిన ఏడాది 3.48 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు ఇప్పుడు 5.15%కి చేరగా, నికర నిరర్థక ఆస్తులు 2.16% నుంచి 3.54%కి చేరాయి. అదే విలువ పరంగా చూస్తే నికర నిరర్థక ఆస్తులు రూ.1,831 కోట్ల నుంచి రూ.3,477 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ లాభదాయకత 3.16%గా నమోదైంది. రూ. 200 కోట్ల సమీకరణ: మూలధన అవసరాల కోసం ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కింద షేర్లను కేటాయించి రూ.200 కోట్లను సమీకరించడానికి బోర్డు ఆమోదించింది. డిసెంబర్ 19న జరగబోయే అత్యవసర సర్వసభ్య సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
83% క్షీణించిన ఐవోసీ నికర లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఐవోసీ జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 83% క్షీణించి రూ. 1,684 కోట్లకు పరిమితమైంది. ఇందుకు భారీగా ఏర్పడ్డ విదేశీ మారక నష్టాలకుతోడు, ఇంధన అమ్మకాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని సమకూర్చకపోవడం కారణమైంది. ప్రస్తుత సమీక్షా కాలంలో రూ. 2,158 కోట్లమేర విదేశీ మారక నష్టాలు నమోదుకాగా, గతంలో ఈ పద్దుకింద రూ. 2,289 కోట్ల లాభాన్ని అందుకున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్ఎస్ బ్యుటోలా పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత సమీక్షా కాలంలో టర్నోవర్ రూ. 1,06,001 కోట్ల నుంచి రూ. 1,10,390 కోట్లకు పెరిగింది. డిజిన్వెస్ట్మెంట్కు నో : షేరు ధర కనిష్ట స్థాయిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో డిజిన్వెస్ట్‌మెంట్ లో భాగంగా 10% వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధపడటాన్ని కంపెనీ వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేరు రూ. 213 వద్ద కదులుతోంది. కాగా, కంపెనీలో వాటా విక్రయంపై డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ ఈ నెలలో రోడ్‌షోలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. -
21% తగ్గిన ఎన్టీపీసీ నికర లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఎన్టీపీసీ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికరలాభం 21 శాతం క్షీణించి రూ.2,492 కోట్లుగా నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.3,142 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో ఆదాయం రూ.17,171 కోట్ల నుంచి రూ.17,059 కోట్లకు తగ్గినట్లు ఎన్టీపీసీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇంధన వ్యయాలు పెరగడమే ఆదాయం, లాభాలు తగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సమీక్షా కాలంలో ఇంధన వ్యయం రూ,9,932 కోట్ల నుంచి రూ.10,139 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.11,000 కోట్ల పెట్టుబడులు పెట్టగా దాన్ని ఈ ఏడాది రూ.21,000 కోట్లకు పెంచనుంది. ప్రస్తుతం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 41,684 మెగావాట్లుగా ఉంది.