నెల రోజుల గరిష్టం
క్యూ2లో అంచనాలను మించిన జీడీపీ వృద్ధి(4.8%) స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహమిచ్చింది. శుక్రవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ గణాంకాలు సెంటిమెంట్‌ను మెరుగుపరచడంతో సెన్సెక్స్ వరుసగా మూడో రోజు లాభపడింది. 106 పాయింట్లు జమ చేసుకుని 20,898 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 372 పాయింట్లు లాభపడ్డ సంగతి తెలిసిందే. బీఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా, ఆయిల్ ఇండెక్స్ నామమాత్రంగా నష్టపోయింది. ప్రధానంగా హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు వెలుగులో నిలిచాయి. ఇక నిఫ్టీ సైతం 42 పాయింట్లు పుంజుకుని మళ్లీ 6,200 ఎగువన 6,218 వద్ద నిలిచింది. నవంబర్ నెలకు తయారీ రంగం పుంజుకున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ సర్వే తెలపడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఐల అండ
దేశీయ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. వారాంతం రోజున రూ. 745 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు సోమవారం మరో రూ. 791 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 618 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సెన్సెక్స్‌లో సన్ ఫార్మా, జిందాల్ స్టీల్ 4% జంప్‌చేయగా, విప్రో, ఎల్‌అండ్‌టీ, భెల్, ఐసీఐసీఐ, టాటా స్టీల్, భారతీ, ఎంఅండ్‌ఎం 2-1.5% స్థాయిలో లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌యూఎల్ 2% నీరసించగా, ఓఎన్‌జీసీ, గెయిల్ 1.5% చొప్పున నష్టపోయాయి.
చిన్న షేర్లు ఓకే
సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,435 పురోగమించగా, 1,046 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో ఆమ్టెక్ ఇండియా, నితిన్ ఫైర్, జిందాల్ సౌత్, సింటెక్స్, టెక్నో ఎలక్ట్రిక్, కేశోరాం, సుందరం ఫాజనర్స్, యూఫ్లెక్స్, ఎస్‌ఆర్‌ఎఫ్, జిందాల్ సా, బీఈఎంఎల్, జేపీ ఇన్‌ఫ్రా, జేఎం ఫైనాన్షియల్, ఐషర్ మోటార్స్, జీఎండీసీ, కేఈసీ, ఎన్‌సీసీ 20-6% మధ్య దూసుకెళ్లాయి.