
రాంచి: స్థూల ఉత్పాదకతలోనూ, ఉపాధి కల్పనలోనూ కీలక భూమిక పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) పాత్రను కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) మరింత ఇనుమడింపజేస్తాయని ‘ఆఫ్‌బిజినెస్’ తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో 30 శాతం ఎంఎస్‌ఎంఈ రంగం నుంచే సమకూరుతుండగా.. ఏఐ, ఎంఎల్(మెషిన్ లెర్నింగ్) సాయంతో వీటి ఉత్పాదకత వాటాను 50 శాతానికి చేర్చొచ్చని అంచనా వేసింది.
ఈ రంగంలో ప్రస్తుతం 11 కోట్లుగా ఉన్న ఉపాధి అవకాశాలను 17.5 కోట్లకు పెంచొచ్చని బీ2బీ ఈ కామర్స్ సంస్థ అయిన ఆఫ్‌బిజినెస్ తన తాజా నివేదికలో తెలిపింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేయగలదని పేర్కొంది. ఎస్‌ఎంఈల్లో చాలా వరకు తమ ఉత్పత్తిని పెంచుకునేందుకు ఏఐ, ఎంఎల్ అప్లికేషన్లను తమ కార్యకలాపాల్లో అమలు చేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది. ముడి సరుకుల కొనుగోళ్లు, అనుసంధానత, పంపిణీ నెట్‌వర్క్, వినూత్నమైన ఉత్పత్తులు, సిబ్బందికి శిక్షణ, వ్యర్థాల నిర్వహణ, మరీ ముఖ్యంగా సమయ నిర్వహణలో ఏఐ, ఎంఎల్ ఎంఎస్‌ఎంఈలకు సాయపడతాయని వెల్లడించింది.
ఇదీ చదవండి: బ్యాంకింగ్ సమ్మె సైరన్
ఏఐ ప్లాట్‌ఫామ్‌ల సాయం..
ఎస్‌ఎంఈలకు ‘బిడ్‌అసిస్ట్’ తరహా ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు అవసరమని.. ఇది వివిధ ప్రభుత్వ విభాగాల్లో 50 లక్షల మేర టెండర్ల సమాచారాన్ని అందిస్తుందని ఆఫ్‌బిజినెస్ నివేదిక తెలిపింది. అలాగే ‘నెక్సిజో.ఏఐ’ అన్నది ఎప్పటికప్పుడు తాజా కమోడిటీ ధరల పమాచారాన్ని, ఆయా వ్యాపారాలకు అనుగుణమైన టెండర్ల గురించి తెలియజేస్తుందని పేర్కొంది. ఎస్‌ఎంఈలు తమ మెటీరియల్స్‌ను దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అనుసంధానత కీలకమని తెలిపింది. ఎంఎస్‌ఎంఈలు కీలక విభాగాల్లో ఎదుర్కొంటున్న ఆందోళనల పరిష్కారానికి వీలుగా ఇంజినీరింగ్ కాలేజీలు, మేనేజ్‌మెంట్ కాలేజీలు, మానవ వనరుల సంస్థలను వీటితో అనుసంధానించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment