
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి 2025–26 సంవత్సరంలో 6.5 శాతాన్ని మించుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది 6.3%గా ఉంటుందన్నది మూడిస్ రేటింగ్స్ గత అంచనా. ప్రభుత్వం నుంచి అధిక మూలధన వ్యయాలు, పన్నుల తగ్గింపుతో పెరిగే వినియోగం, వడ్డీ రేట్ల తగ్గింపు ఇవన్నీ వృద్ధికి అనుకూలిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత బ్యాంకింగ్ రంగం పట్ల స్థిరమైన దృక్పథాన్ని (స్టెబుల్ అవుట్‌లుక్) ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నిర్వహణ వాతావరణం మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.
ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకుల రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడగా, మోస్తరుగా క్షీణించొచ్చని తెలిపింది. అన్ సెక్యూర్డ్, సూక్ష్మ రుణాల్లో (మైక్రోఫైనాన్స్) ఒత్తిళ్లను ప్రస్తావించింది. రేట్ల త గ్గింపు నేపథ్యంలో నికర వడ్డీ మార్జిన్లపై ప్రభావం పెద్దగా ఉండదని, బ్యాంకుల లాభదాయకత పటిష్టంగా ఉంటుందని అంచనా వేసింది.
2024 మధ్య నుంచి భారత వృద్ధి నిదానించగా, తిరిగి వేగాన్ని అందుకుంటుందని.. ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది. ప్ర స్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ 5.6%కి పడిపోగా, డిసెంబర్ క్వార్టర్‌లో తిరిగి 6.2%కి పుంజుకోవడం గమనార్హం.
2025–26లో సగటు ద్రవ్యోల్బణం 4.5%కి దిగొస్తుందని మూడీస్ పేర్కొంది. ఫిబ్రవరి సమీక్షలో ఆర్‌బీఐ ఎంపీసీ రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ‘‘అమెరికా వాణిజ్య విధానాలతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో.. ఆర్‌బీఐ కాస్త అప్రమత్త ధోరణిని అనుసిరించొచ్చు. దీంతో తదుపరి రేట్ల కోత మోస్తరుగా ఉండొచ్చు’’అని మూడీస్ పేర్కొంది. 2025–26లో రుణాల వృద్ధి 11–13 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment