న్యూఢిల్లీ: భారత్ జీడీపీ 2024లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణ రిస్క్‌లు ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానాన్నే కొనసాగించేందుకు (2024 చివరి వరకు) దారితీయవచ్చని తెలిపింది.
తగినన్ని ఆహార నిల్వలు, పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయని, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యం (4 శాతం) దిశగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి అయిన 6.21 శాతానికి చేరడం తెలిసిందే. ‘‘పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఎదురయ్యే ద్రవ్యోల్బణం రిస్క్, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ద్రవ్య విధానాన్ని సడలించే విషయంలో ఆర్‌బీఐ అప్రమత్తతను తెలియజేస్తోంది’’అని మూడీస్ పేర్కొంది.
ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్
ఈ ఏడాదికి చివరి ఎంపీసీ సమావేశం డిసెంబర్ 7–9 తేదీల మధ్య జరగనుంది. గృహ వినియోగం పెరగనుందని చెబుతూ.. పండుగల సీజన్‌లో కొనుగోళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడాన్ని మూడీస్ తన నివేదికలో ప్రస్తావించింది. సామర్థ్య వినియోగం పెరుగుతుండడం, వ్యాపార సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తోందని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుండడం ప్రైవేటు పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment