
క్యూ3లో జీడీపీ 6.2 శాతం
డాయిష్ బ్యాంక్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం ముగిసినట్టేనని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో జీడీపీ 5.4 శాతానికి (ఏడు త్రైమాసికాల కనిష్టం) పడిపోవడం తెలిసిందే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6.2 శాతానికి మెరుగుపడుతుందని బ్యాంక్ అంచనా వేసింది. అయినప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధి 7 శాతం లోపే ఉంటుందని పేర్కొంది.
క్యూ3 (2024 అక్టోబర్-డిసెంబర్) జీడీపీ గణాంకాలు విడుదల కావడానికి ముందు బ్యాంక్ ఈ నివేదిక విడుదల చేయడం గమనార్హం. కీలక సూచికలు సైతం వృద్ధి రేటు 6.2 శాతానికి పెరుగుతుందని సూచిస్తున్నట్టు తెలిపింది. వృద్ధికి మద్దతుగా ఏప్రిల్ మానిటరీ పాలసీ సమీక్షలోనూ ఆర్‌బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని అంచనా వేసింది. అనంతరం 0.50 శాతం రేటు బదిలీ దిశగా లిక్విడిటీ చర్యలపై ఆర్‌బీఐ దృష్టి సారించొచ్చని తెలిపింది.
ప్రస్తుత సైకిల్‌లో మరిన్ని రేట్ల కోతలు ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. లిక్విడిటీ అవసరాల పట్ల ఆర్‌బీఐ ఇప్పటికే దృష్టి పెట్టిందంటూ.. ఇటీవల 10 బిలియన్ డాలర్ల స్వాప్ ప్రకటన ప్రోత్సాహనీయంగా పేర్కొంది.
జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలి: ఈవై
భారత్ 6.5 - 7 శాతం మేర జీడీపీ వృద్ధిని నమోదు చేయాలంటే, పన్నుల పరిధిని 1.2 - 1.5 శాతం స్థాయిలో కొనసాగించాలని ఈవై సూచించింది. ఆదాయ వసూళ్లను బలోపేతం చేసుకోవాలంటూ.. జీడీపీలో పన్నుల నిష్పత్తిని 2025 - 26లో 12 శాతం అంచనా స్థాయి నుంచి 2030 - 31 నాటికి 14 శాతానికి పెంచుకోవాలని పేర్కొంది. ద్రవ్య నిర్వహణ, నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించాలని సూచించింది. 2025–26లో భారత జీడీపీ 6.3 - 6.8 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment