
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందడంలో మంగళవారం నాలుగు గంటలకు పైగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తింది. సమస్యను పూర్తిగా పరిష్కరించామని బ్యాంక్ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది. దీంతో వినియోగదార్లు చాలా మంది తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ‘ఎస్‌బీఐ యూపీఐ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కరించాం. సాయంత్రం 5 గంటల నుండి ఆటంకం లేకుండా పనిచేస్తోంది’ అని బ్యాంక్ వివరించింది.
రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. లావాదేవీల విలువ, పరిమాణం విషయంలో 2025 ఫిబ్రవరి 1 సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ఆ ఒక్కరోజే రూ.99,835 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 60 కోట్లు దాటింది. యూపీఐ వ్యవస్థలో ఇదే రికార్డు. గత రికార్డులు చూస్తే లావాదేవీల విలువ 2025 జనవరి 2న అత్యధికంగా రూ.94,429 కోట్లు, లావాదేవీల సంఖ్య జనవరి 10న 57.8 కోట్లు నమోదైంది. ఫిబ్రవరి 1–25 మధ్య రూ.19,60,263 కోట్ల విలువైన 1439.8 కోట్ల లావాదేవీలు జరిగాయి.
ఇదీ చదవండి: టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో
అగ్రస్థానంలో ఫోన్‌పే
యూపీఐ విభాగంలో ఫోన్‌పే తొలి స్థానంలో దూసుకుపోతోంది. 2025 జనవరిలో రూ.11,91,304 కోట్ల విలువైన 810 కోట్ల లావాదేవీలను సాధించింది. గూగుల్‌పే రూ.8,26,845 కోట్ల విలువైన 618 కోట్ల లావాదేవీలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. రూ.1,26,313 కోట్ల విలువైన 115 కోట్ల లావాదేవీలతో పేటీఎం మూడవ స్థానంలో నిలిచింది. లావాదేవీల విలువ పరంగా క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, నవీ, గ్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్స్, అమెజాన్ పే, భీమ్ యాప్స్ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment