internet banking
-
సైబర్ కేటుగాళ్లు ఎంత దోచేశారంటే.. ప్రభుత్వం లెక్కలు!
ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్, ఆర్థిక మోసాలు సైతం అదే స్థాయిలో పెగుతున్నాయి. దేశంలో నిత్యం ఎక్కడో చోట ఇలాంటి మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు, ఆర్థిక సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. దేశంలో మూడేళ్లలో నమోదైన సైబర్, ఆర్థిక మోసాల కేసుల వివరాలను ప్రభుత్వం తాజాగా తెలియజేసింది. 12,000 మోసాలు.. రూ.461 కోట్లు దేశవ్యాప్తంగా మూడేళ్లలో సైబర్, ఆర్థిక మోసాలు భారీగానే జరిగాయి. ‘కార్డ్/ఇంటర్నెట్/ఏటీఎం / డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు’ కేటగిరి కింద గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం సుమారు 12,000 మోసాలు నమోదయ్యాయని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. వీటి ద్వారా రూ.461 కోట్ల మేర బాధితులు మోసపోయారని పేర్కొంది. ఇదీ చదవండి: రుణాల ‘ఎవర్‌గ్రీనింగ్’కు చెక్.. ఆర్బీఐ నిబంధనలు కఠినతరం మరోవైపు సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మాడ్యూల్ ద్వారా ఈ ఏడాది డిసెంబర్ 14 నాటికి నాలుగు లక్షలకు పైగా ఘటనల్లో రూ. 1,000 కోట్లకుపైగా బాధితులు మోసపోకుండా కాపాడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ టెలికాం శాఖ అందించిన వివరాలను ఉటంకిస్తూ తెలిపారు. నకిలీ పత్రాలతో తీసుకున్నవి, అనుమానిత కనెక్షన్లు, సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాల్లో ప్రమేయం ఉన్నవి దాదాపు 72 లక్షల మొబైల్ కనెక్షన్లను తొలగించినట్లు పేర్కొన్నారు. -
బ్యాంకుల్లో రూ.5 లక్షల బీమాపై అవగాహన అవసరం
ముంబై: డిపాజిట్ బీమా పథకం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆగస్టు 31లోగా తమ వెబ్సైట్లు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్లలో తన లోగో, క్యూఆర్ కోడ్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని ఆర్బీఐ అనుబంధ విభాగం– డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అన్ని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు డీఐసీజీసీ ద్వారా బీమా కవరేజ్ ఉంటుంది. ఈ బీమా పథకం వాణిజ్య బ్యాంకులుసహా లోకల్ ఏరియా బ్యాంకులు (ఎల్ఏబీ), చెల్లింపుల బ్యాంకులు (పీబీ), చిన్న ఆర్థిక బ్యాంకులు (ఎస్ఎఫ్బీ), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) సహకార బ్యాంకులలో డిపాజిట్లకు వర్తిస్తుంది. ఆర్బీఐ సంప్రదింపులతో తాజా సూచనలు చేస్తున్నట్లు డీఐసీజీసీ సర్కులర్ వివరించింది. ఎందుకంటే... ► చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని పటిష్టం చేయడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో డిపాజిట్ బీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించింది. ► లోగో, క్యూర్ కోడ్ ప్రదర్శన వల్ల డీఐసీజీసీ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలోకి వచ్చే బ్యాంకులను కస్టమర్ సులభంగా గుర్తించడానికి వీలవుతుందని, అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమాచారం సకాలంలో వారు పొందగలుగుతారని తెలిపింది. బీమా కవరేజ్ బ్యాంకులు 2,027 డీఐసీజీసీ నమోదిత బీమా బ్యాంకుల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 2,027. ఇందులో 140 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. 43 ఆర్ఆర్బీలు, రెండు ఎల్ఏబీలు, ఆరు పీబీలు, 12 ఎస్ఎఫ్బీలు, 1,887 సహకార బ్యాంకులు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ బీమా ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షలు. ఇందుకు సంబంధించి కవరవుతున్న ఖాతాల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 294.5 కోట్లు. బీమా కవరవుతున్న డిపాజిట్ల విలువ రూ.83,89,470 కోట్లు. -
SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరూ లావాదేవీలను గురించి తెలుసుకోవడానికి నేరుగా బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాతో మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడానికి రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్లను వారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాలి, ఇలా చేసుకున్నప్పుడు తమ అకౌంట్ ద్వారా జరిగే అన్ని ట్రాన్సక్షన్స్ గురించి వెంటనే సమాచారం తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుండి మొబైల్ నెంబర్ అప్డేట్: మొదట www.onlinesbi.com ఓపెన్ చేయండి. మీ మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి, పేజీ ఎడమ పానెల్లో ఉన్న 'మై అకౌంట్' విభాగంలోని ''ప్రొఫైల్ - పర్సనల్ డీటైల్స్ - చేంజ్ మొబైల్ నెంబర్'' ఎంపిక చేసుకోండి. అకౌంట్ నెంబర్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత, మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, క్రింది స్క్రీన్‌పై సబ్మిట్పై క్లిక్ చేయండి. మీకు రిజిస్టర్డ్ నంబర్ చివరి రెండు అంకెలను కనిపిస్తాయి. మ్యాపింగ్ స్టేటస్ తెలియజేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉపయోగపడుతుంది. ఏటీఎమ్ నుండి మొబైల్ నెంబర్ అప్డేట్: మీ సమీపంలో ఉన్న SBI ATM వద్దకు వెళ్లి, అందుబాటులో ఉన్న ఎంపికల నుండి రిజిస్టర్ ఎంపికను సెలక్ట్ చేసుకోండి. మీ ఏటీఎమ్ పిన్ని టైప్ చేసుకోండి. తరువాత స్క్రీన్‌పై కనిపించే మెను ఆప్షన్స్ నుండి మొబైల్ నెంబర్ ఎంటర్ ఎంచుకోండి. స్క్రీన్‌పై ఉన్న మెను ఎంపికల నుండి, చేంజ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి. గతంలో ఉపయోగిస్తున్న మీ మునుపటి మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేసి ధృవీకరించాలి. తరువాత మీ కొత్త మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి ధృవీకరించమని చెబుతుంది. కొత్త నెంబర్, పాత మొబైల్ నెంబర్ రెండింటికి వేరువేరుగా OTPలు వస్తాయి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. -
డబ్బులు వద్దు.. డిజిటల్ ముద్దు
సాక్షి రాయచోటి: జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్‌ఫోన్ అందుబాటులో ఉంటే పని సులువవుతోంది. పాల ప్యాకెట్ తీసుకోవచ్చు.. హోటల్లో తినొచ్చు.. వేడివేడి టీ తాగొచ్చు.. బార్బర్ షాపులోనూ నచ్చినట్లు కటింగ్ చేయించుకోవచ్చు.. మార్కెట్లో కూరగాయలు మొదలుకొని దుకాణంలో సరుకుల కొనుగోలు వరకు కార్డు ఉంటే చాలు ఎలాగైనా పనులు చేసుకోవచ్చు. పాతకాలం పోయింది.. కొత్త కాలం వచ్చింది.. ప్రపంచం డిజిటల్ మయంగా మారింది. ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులకు తెర తీస్తున్నారు. పైగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా డిజిటల్ పేమెంట్లు పెరగడానికి పెద్ద కారణంగా చెప్పవచ్చు. అన్నిచోట్ల ఆన్లైన్ లావాదేవీలు కాలంలో ఎంత మార్పు అంటే ఏకంగా దుకాణంలో టీ తాగాలన్నా కూడా జనాలు ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. చిన్నపాటి వ్యాపారులు కూడా డిజిటల్ విధానానికి అలవాటు పడుతున్నారు.. మామిడిపండ్ల బండి మొదలుకుని చివరకు గంపలపై పండ్లు పెట్టుకుని అమ్ముకునే చిన్నచిన్న వ్యాపారులు కూడా ఫోన్‌పే అంటున్నారు. సమయానికి చిల్లర లేకపోయినా, అత్యవసరంగా మందులు కావాల్సి వచ్చినా.. చేతిలో డబ్బుల్లేకున్నా.. ఇంటి ముందుకు సరుకులొస్తున్నాయి అంటే కారణం డిజిటల్ లావాదేవీలేనని చెప్పక తప్పదు. మీ బ్యాంక్ ఖాతాలో నగదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అన్ని పనులు సులభంగా చేసేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఈ విధానం కొనసాగుతున్నా కోవిడ్ నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం పెరిగింది. కరోనా విజృంభించిన తరుణంలో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఆన్లైన్ చెల్లింపుల వైపు విపరీతంగా మొగ్గు చూపారు. ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం తదితర థర్డ్ పార్టీ యాప్‌ల సాయంతో ప్రజలు ఆన్లైన్ లావాదేవీలను సులభంగా చేస్తున్నారు. తక్కువ పరిధిలో సురక్షితమైన చెల్లింపులు జరుగుతుండటంతో వీటికి ఆదరణ లభిస్తోంది. కిరాణా, నిత్యావసరాలు, పెట్రోలు తదితర సామగ్రి మొదలు మొబైల్, డీటీహెచ్ రీచార్జిలు, విద్యుత్, గ్యాస్ బిల్లులు, రుణాల చెల్లింపులు, నగదు బదిలీలు తదితర అవసరాలన్నింటికీ వీటినే ఉపయోగిస్తున్నారు. యువత సాంకేతికతను ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. డిజిటల్ చెల్లింపుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్ రీచార్జి మొదలు, షాపింగ్, వినోదం, నిత్యావసరాలు, బిల్లులు తదితర అవసరాలన్నింటికి యువత డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్యాంకులలో డిజిటల్కే ప్రాధాన్యం జిల్లాలో బ్యాంకుల్లో కూడా ఎక్కడచూసినా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. ఎవరికి ఎలాంటి అవసరమొచ్చినా నేరుగా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏటీఎంల ద్వారా కూడా వెసులుబాటు ఉంది. సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి జిల్లాలో ఖాతాదారులు బ్యాంకులు మొదలుకొని బయట కూడా డిజిటల్ లావాదేవీలే చేపట్టాలి. అయితే సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి. కొంతమంది నకిలీ వ్యక్తులు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటీపీలు, పిన్ నంబర్లు అడిగితే పొరపాటున కూడా చెప్పొద్దు. అలా అడిగారంటే వెంటనే కట్ చేసి బ్యాంకులో సంప్రదించాలి. నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గించి ఆన్లైన్ ద్వారా చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. – దుర్గాప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్, కడప. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్!
ఎస్బీఐ తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే బ్యాంక్ సిస్టమ్‌ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మార్చి 20న రాత్రి 11:30 గంటల నుంచి మార్చి 21 2:00 గంటల మధ్య కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సిస్టమ్‌ను అప్డేట్ చేస్తోంది. ఈ కారణంగా రేపు రెండున్నర గంటలపాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్ సేవలు ఈ రెండున్నర గంటల పాటు అందుబాటులో ఉండవని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని ట్వీట్ చేశారు. మరి ఈ సమయాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు ముందుగానే జాగ్రత్త పడండి. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/t1GGRRxWjx — State Bank of India (@TheOfficialSBI) March 20, 2022 (చదవండి: రూ.53 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కంటే ఎక్కువ రేంజ్!) -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్..!
భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులను అలర్ట్ చేసింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలను జనవరి 22న నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేవలు రేపు ఉదయం 02:00 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఎటువంటి సేవలు పనిచేయవు అని తన ట్విటర్ ఖాతా వేదికగా పేర్కొంది. "మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాము అని, ఈ ఒక్క రోజు పాటు తమకు సహకరించగలరని" ఎస్బీఐ అభ్యర్థించింది. ఎస్బీఐ తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను బంద్ చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా చాలా సార్లు మెయింటనెన్స్ చేపట్టింది. యూజర్లకు మరింత సురక్షితమైన సేవలను అందించేందుకు ఎస్బీఐ గత కొంత కాలంగా మెయింటనెన్స్ వర్క్ చేపడుతూ వస్తుంది. దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన ఎస్బీఐకి 22 వేలకు పైగా బ్రాంచులున్నాయి. దేశవ్యాప్తంగా 57,889కి పైగా ఏటీఎంలున్నాయి. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/3Y1ph0EUUS — State Bank of India (@TheOfficialSBI) January 21, 2022 (చదవండి: కరోనా కాలంలో అమ్మకాల్లో డోలో 650 టాబ్లెట్ రికార్డు..!) -
SBI: మూడు గంటలపాటు డిజిటల్ సేవలకు అంతరాయం
తన ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 4, 5 తేదీల మధ్య మూడు గంటలపాటు అన్ని డిజిటల్ సర్వీసులకు విఘాతం కలగనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 4వ తేదీ(ఇవాళ రాత్రి) రాత్రి 10.35 నుంచి అర్ధరాత్రి దాటాక 1గం.30ని. వరకు డిజిటల్ సర్వీసులు పని చేయవని తెలిపింది ఎస్బీఐ. ఈ మూడు గంటలపాటు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని తెలిపింది. మెరుగైన సేవలు అందించడం కోసం చేసే మెయింటెనెన్స్ కారణంగానే అంతరాయం కలగనుందని, యూజర్లు ఇది గమనించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ ద్వారా విషయం వెల్లడించిన స్టేట్‌బ్యాంక్.. ఈ ఉదయం మరోసారి కస్టమర్లను అప్రమత్తం చేసింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/GXu3UCTSCu — State Bank of India (@TheOfficialSBI) September 3, 2021 గత కొంతకాలంగా ఎస్బీఐ సర్వీసులపై ఖాతాదారుల్లో, డిజిటల్‌సేవలపై యూజర్లలో అసహనం నెలకొంటోంది. యోనో యాప్ సరిగా పని చేయకపోవడంతో ఫిర్యాదులతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఖాతాదారులకు క్షమాపణలు చెబుతూనే.. యూజర్లకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రయత్నిస్తున్నామని, ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫీడ్‌బ్యాక్ రూపంలో వివరంగా ఇవ్వొచ్చని చెబుతోంది ఎస్బీఐ. చదవండి: రిటైల్ సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్!
అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి మారనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు, దేశీయ పొదుపు ఖాతాదారుల చెక్ బుక్ ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్ డ్రా, చెక్ బుక్ ఛార్జీల గురించి ఈ క్రింద పేర్కొన్నాము. ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి. 6 మెట్రో నగరాలలో ఒక నెలలో మొదటి 3 లావాదేవీలు(ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు) మాత్రమే ఉచితంగా లభిస్తాయి. మెట్రో నగరాలు కాకుండా ఇతర అన్ని ప్రాంతాల్లో మొదటి 5 లావాదేవీలు ఉచితం. ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. నాన్ హోమ్ బ్రాంచీలో రోజుకు ₹25,000 వరకు నిర్వహించే క్యాష్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు. ₹25,000 కంటే ఎక్కువ లావాదేవిలు జరిపితే ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితి రోజుకు ₹25,000గా నిర్ణయించబడింది. ప్రతి లావాదేవీకి ₹25,000 వరకు నిర్వహించే ప్రతి లావాదేవీపై ₹150. ₹25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు చేయడం వీలు కాదు. ఒక సంవత్సరంలో 25 చెక్కు లీఫ్స్ గల చెక్ బుక్ ఉచితం. 10 చెక్కు లీఫ్స్ గల అదనపు చెక్కు బుక్ కావాలంటే ₹20 చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెలలో నిర్వహించే మొదటి 4 లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ప్రతి వెయ్యి రూపాయలకు ₹5 చెల్లించాల్సి ఉంటుంది. కనీస రుసుము రూ.150కు లోబడి ఉంటుంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం జులై 4 న రోజున ఉదయం 3.25am గంటల నుంచి 5.50am వరకు డిజిటల్ లావాదేవీలు నిలిచిపోనున్నాయి. దీంతో ఖాతాదారులకు డిజిటల్ సేవల నిర్వహణకు ఆటంకం ఏర్పడనుంది. ఎస్బీఐ తమ సేవలను అప్ గ్రేడ్ చేసే క్రమంలో డిజిటల్ సేవలు నిలిచిపోనున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ తదితర సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఎస్బీఐ జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయి. We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/l7dsyoQcsu — State Bank of India (@TheOfficialSBI) July 2, 2021 -
నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోయారా..?
సాక్షి, హైదరాబాద్ : ఇంతకుముందు నగదు లావేదేవీలకు బ్యాంకు అకౌంట్ ఉంటే సరిపోయేది. పెద్ద నోట్ల రద్దుతో ఆన్లైన్ లావాదేవీలు ఊపందుకున్నాయి. నేటికీ ఏటీఎంల వద్ద నగదు లేకపోవడంతో నగదు లావాదేవీల విషయంలో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాదారులందరినీ నగదు లావాదేవీలవైపు మళ్లించే వ్యూహంలో భాగంగానే మార్కెట్లో నగదు కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నా వారంతా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు చాలామంది 2, 3 బ్యాంక్ ఖతాలకు సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వినియోగిస్తున్నారు. దీంతో పాస్వర్డ్లు మర్చిపోవడం పరిపాటైపోయింది. ఎవరైనా ఖాతాదారుడు వరుసగా మూడుసార్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను తప్పుగా నమోదు చేస్తే కొన్ని గంటల పాటు ఆ నెట్ బ్యాంకింగ్ ఖాతాను లాక్ చేస్తారు. సాధారణంగా 24 గంటల పాటు పనిచెయ్యదు. దేశంలోనే బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద బ్యాంక్ వ్యవస్థ ఎస్బీఐ. ఎస్బీఐ ఖాతాదారులు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సంబంధించి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం, ఎస్బీఐ లాగిన్ పాస్వర్డ్ మర్చుకోవడం తెలుసుకుందాం.. మూడు విధాలుగా రీసెట్ చేసుకోవచ్చు ఏటీఎమ్ కార్డును, ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, ఏటీఎమ్ కార్డు వివరాలు లేకుండా రీసెట్ చేసుకోవచ్చు అనుసరించాల్సిన పద్ధతులు ఇలా.. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ www.onlinesbi.com లోకి లాగిన్ అవ్వాలి. ‘ఫర్గాట్ పాస్వర్డ్’పై క్లిక్ చెయ్యాలి. ‘మీ యూజర్ నేమ్, బ్యాంక్ ఖాతా సంఖ్య దేశం, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్ సంఖ్య, క్యాప్చా కోడ్ ఎంటర్ చెయ్యాలి. ‘సబ్మిట్పైన క్లిక్ చెయ్యాలి. ‘మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీ కాలంలో వచ్చిన ఓటీపీని ఎంటర్ చెయ్యండి. ‘కన్ఫర్మ్’ బటన్ క్లిక్ చేయండి. సరైన ఓటీపీని ఎంటర్ చేస్తే పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకునేందుకు మూడు ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి. ఒకటి : ఏటీఎమ్ కార్డును ఉపయోగించి రెండు : ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి మూడు : ఏటీఎమ్ కార్డు వివరాల్లేకుండా ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఎస్బీఐ లాగిన్ పాస్వర్డ్ మార్చుకోండిలా.. మొదట ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వండి ప్రొఫైల్ ట్యాబ్‌కు వెళ్లండి. ఆ తర్వాత చేంజ్ పాస్వర్డ్పైన క్లిక్ చెయ్యండి. ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ప్రొఫైల్ పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ ఒకలాగే ఉండకూడదని గుర్తుంచుకోండి. పాత పస్వర్డ్ను ఎంటర్ చేయండి. కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి రెండోసారి అదే పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను అప్పుడప్పుడు మార్చుకోవడం మంచిది. -
నగదు రహితం..ఎంతో ఉత్తమం
– జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): అన్ని శాఖల అధికారులు..నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం తర్వాత జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను నగదు రహిత లావాదేవీలు చేపట్టే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి అధికారి తన కింది స్థాయి సిబ్బంది మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పై అవగాహన పెంచాలన్నారు. సమావేశంలోనే ప్రయోగాత్మకంగా ఎస్బీఐ బడ్డీ కలెక్టర్ తన స్మార్ట్ ఫోన్ నుంచి రూ. 100లను జెడ్పీ సీఇఓకు..అలాగే జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కూడా తన స్మార్ట్ పోన్ ద్వారానే డీఆర్ఓ గంగాధర్‌గౌడుకు 100 రూపాయలు పంపి నగదు బదిలీ ఎంత సులభమో చూపించారు. జిల్లాలో 40 లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నాయని.. ఖాతాదారులందరినీ ఆన్లైన్ లావాదేవీల వైపు మళ్లించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం నుంచి ఇంటింటికి వెళ్లి బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి.. ఖాతాలు ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసి బస్సుల్లోను ఈ–పోస్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 రామస్వామి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మొబైల్ బ్యాంకింగ్‌లోకి ఏపీ గ్రామీణ వీకాస్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఆవిష్కరించింది. నెఫ్ట్ విధానంలో ఖాతాదారులు ఇతర బ్యాంకు ఖాతాకు సులభంగా నగదు బదిలీ చేయవచ్చు. ఖాతా బ్యాలెన్స్, అయిదు లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ సేవలను 2016 సెప్టెంబర్ నాటికి 2 లక్షల మంది కస్టమర్లకు చేరువ చేయాలని ఏపీజీవీబీ లక్ష్యంగా చేసుకుంది. అలాగే ఈ సంఖ్యను వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షలకు చేర్చాలని కృతనిశ్చయంతో ఉంది. శనివారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్బీఐ రూరల్ బిజినెస్ సీజీఎం కె.ఎం.త్రివేది, ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్బీఐ ‘ఆఫ్‌లైన్’..!
► పది రోజులుగా సతాయిస్తున్న నెట్ బ్యాంకింగ్ ► రోజులో ఎప్పుడో కాసేపు పనిచేస్తున్న ఆన్లైన్ ► ముంబై సర్వర్‌లో సమస్యంటూ అధికారుల దాటవేత ► బ్యాంకు నుంచి ఇప్పటికీ రాని అధికారిక ప్రకటన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎస్బీఐ అంటే... దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. అంతేకాదు!! ప్రైవేటు బ్యాంకులతో పోల్చినా నంబర్ వన్ స్థానం దీనిదే. 22 వేలకు పైగా బ్రాంచీలు, 32 దేశాల్లో విస్తరించిన ఈ బ్యాంక్‌కు... దేశంలో కోట్ల మంది ఖాతాదారులున్నారు. మొత్తం దేశీ బ్యాంకింగ్‌లో 20 శాతం వాటా దీనిదే. ఇక ఆన్లైన్ విషయానికొస్తే లావాదేవీల సంఖ్యలో అగ్రస్థానం దీనిదే. అలాంటి బ్యాంక్... గడిచిన పది రోజులుగా ‘ఆఫ్‌లైన్’ అయిపోతోంది. రోజు మొత్తంలో ఎప్పుడైనా సమస్య వస్తే ఓకే అనుకోవచ్చుగానీ... రివర్స్‌లో ఈ బ్యాంక్ వెబ్సైట్ రోజు మొత్తంలో ఎప్పుడైనా కాసేపు మాత్రం పనిచేస్తోంది. మొబైల్ నుంచి లావాదేవీలు జరపాలన్నా అదే పరిస్థితి. పోనీ ఏదో ఒకటి రెండు రోజుల్నుంచి ఇలా ఉంటే... ఏదో సమస్య వచ్చిందిలే అనుకోవచ్చు. కానీ గడిచిన పది రోజులుగా ఇదే పరిస్థితి. లక్షల మంది ఆన్లైన్ ఖాతాదారులు లావాదేవీలు జరపలేక... బిల్లులు చెల్లించలేక నానా యాతనా పడుతున్నా బ్యాంకు నుంచి మాత్రం అధికారికంగా స్పందించటం గానీ, సమస్య ఎప్పటిదాకా ఉంటుందో చెప్పటం కానీ ఏమీ లేదు. ఖాతాదారులకు కలుగుతున్న కష్టంపైగానీ, తనకు వాటిల్లుతున్న నష్టంపైగానీ బ్యాంకు ఇప్పటిదాకా కనీసం స్పందించిందీ లేదు. ఎస్బీఐ దీనిపై స్పందించకపోయినా... ఆన్లైన్ మార్కెట్ సంస్థలు దీనిపై పలు సూచనలు చేస్తుండటం విశేషం. ‘‘మీరు ఎస్బీఐ ద్వారా మాకు చెల్లించాలని ప్రయత్నిస్తే కుదరకపోవచ్చు. ఎందుకంటే ఎస్బీఐ ఆన్లైన్ సరిగా పనిచేయటం లేదు. అంతగా కావాలంటే ఎస్బీఐ డెబిట్ కార్డునో, ఏటీఎం కార్డునో ఆన్లైన్లో వాడండి. ఇంకా చాలా మార్గాలున్నాయి కదా!!’’ అని ఆ సంస్థలు సూచిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం మధ్యాహ్నం సతాయించిన ఆన్లైన్ ఎస్బీఐ... రాత్రికి కూడా అలాగే ఉండటంతో దీనిపై ఓ అధికారిని ‘సాక్షి’ ప్రతినిధి సంప్రతించారు. ‘‘రెండు రోజుల కిందటే ఈ సమస్య పరిష్కరించాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు’’ అని ఆయన సమాధానమిచ్చారు. ఒకవేళ ఏవైనా సమస్యలుంటే ముంబాయి అధికారులతో మాట్లాడతానన్నారు. నిజానికి రాత్రి కూడా ఎంత ప్రయత్నించినా అటు మొబైల్లో, ఇటు వెబ్‌లో ఎస్బీఐ సైట్ తెరుచుకుంటే ఒట్టు. నాలుగు రోజల కిందట కూడా సమస్య తీవ్రంగా ఉన్నపుడు మరో అధికారిని సంప్రతించగా... ‘‘ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ వ్యవస్థను రక్షణ పరంగా మరింత సమర్థంగా చేయటానికి చర్యలు తీసుకుంటున్నాం. అందుకని కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది’’ అని చెప్పారు. ఎస్బీఐ కూడా తన సర్వీస్ ప్రొవైడర్ టెక్ మహీంద్రా, ఇతర ఐటీ పార్ట్‌నర్స్‌తో కలసి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తన వెబ్సైట్లో పేర్కొంది. కానీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవటం గమనార్హం. అడ్వాన్స్ ట్యాక్స్‌లు చెల్లించడానికి చివరి రోజైన డిసెంబర్ 15న కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ పనిచేయకపోవడంతో అనేకమంది పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్బీఐలో ఆన్లైన్ బ్యాంకింగ్ పది రోజులుగా పనిచేయడం లేదంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఒక ఐటీ ఉద్యోగి వ్యాఖ్యానించారు. -
అన్ని సహకార బ్యాంకులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్
ముంబై: రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు వారి వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అందించడానికి ఆర్బీఐ అంగీకరించింది. ఇప్పటి వరకు పట్టణ సహకార బ్యాంకులకు మాత్రమే కొన్ని షరతులతో వాటి వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాం కింగ్‌ను అందించే వెసులుబాటు ఉంది. పట్టణ సహకార బ్యాంకులకు రూపొందించిన నిబంధనలను సవరించి ఇకపై అన్ని సహకార బ్యాంకులను ఒకే రకమైన నిబంధనలను జారీ చేశామని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం.. అన్ని సహకార బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ను అమలు చేయాలి. వారి కస్టమర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అందించడానికి వీలుగా బ్యాంకులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6కు మారాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను అందించే క్రమంలో వన్ టైమ్ పాస్వర్డ్ వంటి పద్ధతులను పాటించాలి. అన్ని సహకార బ్యాంకులు వారి వినియోగదారులకు ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు మినహా బ్యాలెన్స్ విచారణ, అకౌంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్, చెక్‌బుక్ సప్లై అభ్యర్థన వంటి నాన్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలను అందించొచ్చు. దీనికి ఆర్బీఐ అనుమతి అవసరం లేదు. సహకార బ్యాంకులు ఒకవేళ ట్రాన్సాక్షన్తో కూడిన సేవలను పొందాలని భావిస్తే.. దానికి ఆర్ బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆర్బీఐ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 10 శాతం కన్నా తక్కువగా ఉండకూడదు, నెట్‌వర్త్ రూ.50 కోట్లకు పైగా ఉండాలి వంటి పలు షరతులను విధించింది. -
మొబైల్ బ్యాంకింగ్.. పోటాపోటీ!
అగ్రస్థానం కోసం ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వ్యూహాలు - ఈ ఏడాది ఎస్బీఐ 250 ఇన్ టచ్ లైట్ డిజిటల్ శాఖలు - కోటి మంది ఖాతాదారులపై ఐసీఐసీఐ బ్యాంక్ దృష్టి - స్మార్ట్ వాచీల్లోనూ అందుబాటులోకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకులో డబ్బులు వెయ్యాలంటే లైను. తియ్యాలంటే లైను. డీడీ తియ్యాలన్నా... ఇంకే సర్వీసు కోసమైనా లైను కట్టాల్సిందే. కాకపోతే ఇదంతా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి రాక ముందటి మాట. ఇపుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందరికీ అందుబాటులోకి రావటమే కాదు... కొత్త కొత్త అడుగులు వేస్తూ మొబైల్‌లోకి కూడా యాప్ రూపంలో దూరిపోయింది. అందరూ కాకపోయినా మెజారిటీ ఖాతాదారులిపుడు బ్యాంకింగ్ పనులన్నీ కంప్యూటర్, మొబైల్‌తోనే కానిచ్చేస్తున్నారు. ఆన్లైన్ కస్టమర్లు, లావాదేవీలు పెరుగుతుండటంతో ఇదిగో... ఇక్కడా పోటీ మొదలైంది. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ డిజిటల్లో అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్‌లో ప్రస్తుతం ఎవరు టాప్ అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే లావాదేవీల సంఖ్య చూస్తే ఎస్బీఐదే అగ్రస్థానం. కానీ ఆ లావాదేవీల విలువను చూస్తే హెచ్‌డీఎఫ్‌సీయే టాపర్. అందుకే... లావాదేవీల విలువలోనూ మొదటి స్థానానికి చేరేందుకు ఎస్బీఐ, రెండింట్లోనూ నంబర్-1 కావటానికి ఐసీఐసీఐ పలు వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. ఈ పోటీని తట్టుకొని ఎలాగైనా తొలి స్థానం కాపాడుకోవటానికి హెచ్డీఎఫ్సీ ఇటీవలే దేశంలోనే తొలిసారిగా ‘స్మార్ట్ వాచీ’ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టింది. ఇవికాక పేజాప్, చిల్లర్ వంటి యాప్స్‌తో పాటు కేవలం నిమిష్లాల్లోనే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను మంజూరు చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దీనికి పోటీగా ఐసీఐసీఐ బ్యాంక్ తన మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు మొబైల్ యాప్‌లో 55 లావాదేవీలను అందిస్తున్న ఐసీఐసీఐ ఇప్పుడు ఈ సంఖ్యను రెట్టింపు... అంటే 110కి చేర్చింది. దీంతో అత్యధికంగా 80 వరకు సేవలను అందిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను ఈ విషయంలో అధిగమించినట్లయింది. త్వరలోనే ఫోన్ ద్వారా సుమారు 200 లావాదేవీలను నిర్వహించుకునేలా తీర్చిదిద్దనున్నట్లు ఐసీఐసీఐ చెబుతోంది. వచ్చే 9 నెలల్లో మొబైల్ బ్యాంకింగ్‌లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను 50 లక్షల నుంచి కోటికి చేర్చడం ద్వారా ఈ రంగంలో టాప్కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీఐసీఐ ఈడీ రాజీవ్ సబర్వాల్ చెప్పారు. రివార్డు పాయింట్లతో ఎస్బీఐ... ఎస్బీఐ కూడా డిజిటల్ బ్యాంకింగ్‌పై మరింత దృష్టిపెట్టింది. ఇంటర్నెట్, మొబైల్, కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై రివార్డు పాయింట్లను అందిస్తోంది. అంతేకాక ఇన్టచ్ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ శాఖలను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదిలో కొత్తగా 250 డిజిటల్ బ్యాంకింగ్ శాఖలను ఏర్పాటు చేయాలనేది బ్యాంక్ లక్ష్యం. భారీగా పెరుగుతున్న లావాదేవీలు... స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. గతేడాదితో పోలిస్తే మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల సంఖ్య పలు రెట్లు పెరిగినట్లు ఆర్బీఐ తాజా గణాంకాలు తెలియచేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో 10 లక్షలుగా ఉన్న లావాదేవీల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 1.9 కోట్లకు చేరింది. ఇందులో 78.48 లక్షల లావాదేవీలతో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉండగా, 17.46 లక్షల లావాదేవీలతో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. అదే విలువ పరంగా చూస్తే మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల పరిమాణం రూ.3,296 కోట్ల నుంచి రూ. 18,869 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆన్లైన్, కార్డులు సహా వివిధ డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగిన లావాదేవీల పరిమాణం రూ.6 లక్షల కోట్లుగా ఉంది. రెండేళ్లలో ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను మొబైల్ బ్యాంకింగ్ అధిగమిస్తుందని హెచ్డీఎఫ్సీ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ చెప్పారు. మొబైల్స్ వాడేవారిలో 70% మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో మొబైల్ బ్యాంకింగ్ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. -
ఈ-లాబీతో మెరుగైన సేవలు
హైదరాబాద్: ఖాతాదారుల సౌకర్యార్థం ఈ-లాబీ సేవలను బ్యాంక్ ఆఫ్ బరోడా అందుబాటులోకి తెస్తోందని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జోనల్ జనరల్ మేనేజర్ ఆర్పీ మరాఠే చెప్పారు. శనివారం నల్లకుంట శివం రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏర్పాటు చేసిన ఈ-లాబీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఖాతాదారుల సమావేశంలో మాట్లాడుతూ 24 గంటలూ మెరుగైన సేవలు అందించేందుకు మొదటగా ఈ-లాబీని హైదరాబాద్ నగరంలో ప్రారంభించామన్నారు. ఇందులో చెక్ డిపాజిట్ మెషిన్, సెల్ఫ్ సర్వీస్ పాస్ బుక్ ప్రింటర్, బల్క్ నోట్ యాక్సెప్టెన్సీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ఉన్నాయని వివరించారు. వీటిలో మొదటి నాలుగు మిషన్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుల కోసమేనని చెప్పారు. త్వరలో తెలంగాణలో మరో ఏడు, ఆంధ్రలో మూడు ఈ-లాబీలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్, ఎండీ ఎస్ఎస్.ముంద్ర, డిప్యూటీ జీఎం పి.నర్సింహారావు, చీఫ్ మేనేజర్ పీఎస్ఎన్.మూర్తి, ఏపీ రీజియన్ ఏజీఎం మురళీ క్రిష్ణ పాల్గొన్నారు. -
పదేళ్లు దాటితే బ్యాంక్ ఖాతా నిర్వహణకు అర్హులే
న్యూఢిల్లీ: పది సంవత్సరాలు నిండిన బాలబాలికలు ఇకనుంచి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను తెరవవచ్చు. లావాదేవీలను సొంతంగా నిర్వహించవచ్చు. ఏటీఎం, చెక్‌బుక్ వంటి సౌకర్యాలను కూడా వినియోగించుకోవచ్చు. స్వతంత్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణకు మైనర్లను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ మంగళవారం మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. ఫిక్స్డ్, సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్లు ప్రారంభించడానికి మైనర్లను గతంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. వారి తల్లులు గార్డియన్లుగా ఈ అకౌంట్లు ఉండేవి. ఈ మార్గదర్శకాలను ప్రస్తుతం సవరించారు. సహజ సంరక్షకులు లేదా చట్టబద్ధంగా నియమితులైన వ్యక్తి గార్డియన్‌గా సేవింగ్స్, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్లను మైనర్లు ఇపుడు ప్రారంభించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా డిపాజిట్ అకౌంట్ల స్వతంత్ర నిర్వహణకు బాలల వయోపరిమితిని, డిపాజిట్ మొత్తాన్ని నిర్ణయించే సౌలభ్యం బ్యాంకులకు ఉంటుంది. అకౌంటు తెరవడానికి అవసరమైన కనీస డాక్యుమెంట్ల విషయంలోనూ బ్యాం కులు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/ డెబిట్ కార్డు, చెక్‌బుక్ తదితర అదనపు సౌకర్యాలను మైనర్లకు కల్పించే విషయంలోనూ బ్యాంకులకు స్వేచ్ఛ ఉంటుంది. -
సైబర్ ముఠా గుట్టు రట్టు
తాడిపత్రి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ జిల్లా కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఏటీఎం సెంటర్లలో వెనకాలే నిల్చొని ఇతరుల ఏటీఎం కార్డుపై గల సీవీవీ- పిన్ నంబర్లు రహస్యంగా తెలుసుకుని, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసుకునే ముఠాలోని ఇద్దరు సభ్యులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పూర్తి విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని సీఐ లక్ష్మినారాయణ వెల్లడించారు. నిందితుల్లో వైఎస్సార్ జిల్లా తొండూరుకు చెందిన శివకంచిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. వీరు రాయలసీమలోని వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ తరహా చోరీలకు పాల్పడ్డారు. ఏటీఎం కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా వీరిని గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. నలుగురికి పైగా సభ్యులు గల ఈ ముఠా వైఎస్సార్ జిల్లా కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతోంది. కొంత కాలంగా తాడిపత్రిలోని వాణిజ్య బ్యాంకుల ఖాతాదారుల్లో కొందరు ఇటీవల తమ ప్రమేయం లేకుండానే డబ్బు డ్రా అయిందని బ్యాంకు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో ప్రవీణ్‌కుమార్ ఖాతాలో రూ.9,100, గంగాధర్ ఖాతాలో రూ.9656, వెంకటేశ్వర్లు ఖాతాలో రూ.6 వేలు నగదు గల్లంతు కావడంతో బాధితులు లిఖితపూర్వకంగా బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులు తీవ్రంగా పరిగణించి.. సైబర్ నేరాలకు పాల్పడే ముఠాపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఫిర్యాదుదారుల్లో కొందరిని పిలిపించి ఏటీఎం కార్డు ఎక్కడ ఉపయోగించిందీ, సమయం, తేదీలు తెలుసుకుని.. దాని ఆధారంగా ఏటీఎం సెంటర్లలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఖాతాదారుడు నగదు డ్రా చేస్తుండగా.. వెనకాలే ఇద్దరు అపరిచిత వ్యక్తులు తదేకంగా గమనిస్తుండటాన్ని గుర్తించారు. పట్టణంలోని చాలా ఏటీఎం సెంటర్లలో ఈ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఫిర్యాదుదారులకు ఆ వ్యక్తులను చూపించగా.. వారెవరో తమకు తెలియదని చెప్పారు. పవీణ్, గంగాధర్ గురువారం కెనరా బ్యాంకు ఏటీఎం వద్ద డబ్బు డ్రా చేసేందుకు వెళ్లగా.. అక్కడ అపరిచిత వ్యక్తులను గుర్తించి అధికారులకు సమాచారమందించారు. వెంటనే బ్యాంకు అధికారులు అప్రమత్తమై ఏటీఎం కేంద్రం తలుపులు మూసివేసి.. బంధించేందుకు ప్రయత్నించారు. అయితే ఇద్దరు పారిపోగా.. శివకంచిరెడ్డి, మధుసూదనరెడ్డి పట్టుబడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారివద్ద గల ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ కేబుల్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.సైబర్ నేరం కావడంతో నిందితులను అనంతపురం సీసీఎస్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన నిందితుల్లో ఒకరు తాను విలేకరినని చెప్పుకోవడం గమనార్హం. అయితే గుర్తింపు కార్డును చూపలేదు.