పదేళ్లు దాటితే బ్యాంక్ ఖాతా నిర్వహణకు అర్హులే
న్యూఢిల్లీ: పది సంవత్సరాలు నిండిన బాలబాలికలు ఇకనుంచి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను తెరవవచ్చు. లావాదేవీలను సొంతంగా నిర్వహించవచ్చు. ఏటీఎం, చెక్‌బుక్ వంటి సౌకర్యాలను కూడా వినియోగించుకోవచ్చు. స్వతంత్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణకు మైనర్లను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ మంగళవారం మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది.
ఫిక్స్‌డ్, సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్లు ప్రారంభించడానికి మైనర్లను గతంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. వారి తల్లులు గార్డియన్లుగా ఈ అకౌంట్లు ఉండేవి. ఈ మార్గదర్శకాలను ప్రస్తుతం సవరించారు. సహజ సంరక్షకులు లేదా చట్టబద్ధంగా నియమితులైన వ్యక్తి గార్డియన్‌గా సేవింగ్స్, ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్లను మైనర్లు ఇపుడు ప్రారంభించవచ్చు.
భద్రతా కారణాల దృష్ట్యా డిపాజిట్ అకౌంట్ల స్వతంత్ర నిర్వహణకు బాలల వయోపరిమితిని, డిపాజిట్ మొత్తాన్ని నిర్ణయించే సౌలభ్యం బ్యాంకులకు ఉంటుంది. అకౌంటు తెరవడానికి అవసరమైన కనీస డాక్యుమెంట్ల విషయంలోనూ బ్యాం కులు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/ డెబిట్ కార్డు, చెక్‌బుక్ తదితర అదనపు సౌకర్యాలను మైనర్లకు కల్పించే విషయంలోనూ బ్యాంకులకు స్వేచ్ఛ ఉంటుంది.