Savings Bank accounts
-
జనవరి నుంచి నెఫ్ట్ చార్జీలకు చెల్లు
ముంబై: వచ్చే జనవరి నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్’ (నెఫ్ట్) లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల మధ్య ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించి నెఫ్ట్, ఆర్టీజీఎస్ అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను ఆర్బీఐ నిర్వహిస్తుంటుంది. నెఫ్ట్ లావాదేవీలను బ్యాచ్‌ల వారీగా అరగంటకోసారి సెటిల్ చేస్తున్నారు. అదే ఆర్టీజీఎస్ అయితే ప్రతీ లావాదేవీ అప్పటికప్పుడే, విడిగా పూర్తి అవుతుంది. ‘‘దేశ పౌరులకు అసాధారణ చెల్లింపుల అనుభవాన్ని కలి్పంచేందుకు సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల నుంచి నెఫ్ట్ చార్జీలను 2020 జనవరి నుంచి వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశిస్తున్నాం’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పార్కింగ్ ఫీజు, ఇంధనం నింపుకునే వద్ద చెల్లింపులకు సైతం ఫాస్టాగ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికతో ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. డీమోనిటైజేషన్ జరిగి మూడేళ్లయిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతానికి రూ.10,000 విలువ వర కు నెఫ్ట్ లావాదేవీలపై రూ.2 చార్జీని, అదనంగా జీఎస్టీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. రూ. 2లక్షల పైన ఉన్న లావాదేవీలపై ఎస్బీఐ రూ.20 చార్జీని, దీనిపై జీఎస్టీని వసూలు చేస్తోంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు మరో ఊరట
ముంబై : ఇటీవలే మినిమమ్ బ్యాలెన్స్(కనీస నిల్వ) పెనాల్టీలపై కొంత ఊరట ఇచ్చిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు మరో ఉపశమనం కల్పించింది. ఏడాదికి పైగా అమల్లో ఉన్న అకౌంట్ క్లోజింగ్ ఛార్జీలను సేవింగ్స్ బ్యాంకు కస్టమర్లందరికీ రద్దు చేస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఉపశమనం కల్పించిన అనంతరం బ్యాంకు ఈ మేర ఊరట కల్పించడం ఇది రెండోసారి. ఇప్పటి వరకు అకౌంట్లను క్లోజ్ చేయడానికి బ్యాంకు రూ.500ను ప్లస్ సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది. 14 రోజుల ఫ్రీ-లాక్ పిరియడ్‌లో మూసేవారికి మినహాయించి మిగతా వారందరికీ ఈ ఛార్జీలను విధిస్తోంది. అయితే వీటిని ప్రస్తుతం రద్దు చేస్తున్నట్టు, ఈ నెల నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. మినిమమ్ బ్యాలెన్స్‌లు నిర్వహించలేని పెనాల్టీ కస్టమర్లు తమ అకౌంట్లను మూసివేస్తున్న క్రమంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు సీనియర్ అధికారులు చెప్పారు. అంతేకాక మినిమ్ బ్యాలెన్స్ పెనాల్టీలు పడుతున్న సాధారణ బ్యాంకు అకౌంట్ కస్టమర్లు బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్(బీఎస్బీఏ)కు మారుతున్నారు. బీఎస్బీఏ సాధారణ అకౌంట్ మాదిరే అయినప్పటికీ, చెక్‌బుక్ సౌకర్యముండదు. బీఎస్బీఏ అకౌంట్లకు ఉచితంగా రూపే డెబిట్ కార్డును బ్యాంకు అందిస్తోంది. అంతేకాక వాటిని ఆన్లైన్ లావాదేవీలకు వాడుకోవచ్చు. తప్పనిసరిగా నిర్వహించవలసిన మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో, దిగొచ్చిన బ్యాంకు ఇటీవలే ఈ పరిమితిని రూ.5000 నుంచి రూ.3000కు తగ్గించింది. విద్యార్థులు, పెన్షనర్లు కూడా సాధారణ పొదుపు ఖాతాల కిందకు రావడంతో, వారిపై కూడా బ్యాంకు ఛార్జీలు వేసింది. ఇటీవల తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, సీనియర్ సిటిజన్లను మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయించబడ్డారు. ఎస్బీఐలో 42 కోట్ల మంది సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉంటే, వాటిలో 13 కోట్ల అకౌంట్లు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన లేదా బీఎస్బీఏ అకౌంట్లకు చెందినవి కాగా, మిగతా 29 కోట్లు సేవింగ్స్ అకౌంట్లు. వీటిలో 6 శాతం అకౌంట్లు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన పాటించలేదు. ప్రస్తుతం ఈ కస్టమర్లు బీఎస్బీఏ అకౌంట్లలోకి మారడమో, మినిమమ్ బ్యాలెన్స్‌లు నిర్వహించడమో చేయాల్సి ఉంది. -
పొదుపు వడ్డీ రేటు తగ్గించిన యస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ‘యస్ బ్యాంక్’ తాజాగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ (పొదుపు ఖాతాలు) పై వడ్డీ రేటును 1 శాతం వరకు తగ్గించింది. దీంతో రూ.లక్ష లోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 5 శాతానికి దిగివచ్చింది. ఇక బ్యాంక్ రూ.లక్షకు పైన, రూ.కోటి లోపు ఉన్న డిపాజిట్లకు ఎప్పటిలాగే 6 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. రూ.కోటి పైన ఉన్న డిపాజిట్ల విషయానికి వస్తే వడ్డీ రేటును 6.5% నుంచి 6.25%కి తగ్గించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. కాగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకులు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించడం తెలిసిందే. -
పదేళ్లు దాటితే బ్యాంక్ ఖాతా నిర్వహణకు అర్హులే
న్యూఢిల్లీ: పది సంవత్సరాలు నిండిన బాలబాలికలు ఇకనుంచి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను తెరవవచ్చు. లావాదేవీలను సొంతంగా నిర్వహించవచ్చు. ఏటీఎం, చెక్‌బుక్ వంటి సౌకర్యాలను కూడా వినియోగించుకోవచ్చు. స్వతంత్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణకు మైనర్లను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ మంగళవారం మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. ఫిక్స్డ్, సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్లు ప్రారంభించడానికి మైనర్లను గతంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. వారి తల్లులు గార్డియన్లుగా ఈ అకౌంట్లు ఉండేవి. ఈ మార్గదర్శకాలను ప్రస్తుతం సవరించారు. సహజ సంరక్షకులు లేదా చట్టబద్ధంగా నియమితులైన వ్యక్తి గార్డియన్‌గా సేవింగ్స్, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్లను మైనర్లు ఇపుడు ప్రారంభించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా డిపాజిట్ అకౌంట్ల స్వతంత్ర నిర్వహణకు బాలల వయోపరిమితిని, డిపాజిట్ మొత్తాన్ని నిర్ణయించే సౌలభ్యం బ్యాంకులకు ఉంటుంది. అకౌంటు తెరవడానికి అవసరమైన కనీస డాక్యుమెంట్ల విషయంలోనూ బ్యాం కులు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/ డెబిట్ కార్డు, చెక్‌బుక్ తదితర అదనపు సౌకర్యాలను మైనర్లకు కల్పించే విషయంలోనూ బ్యాంకులకు స్వేచ్ఛ ఉంటుంది.